గతించి దశాబ్దాలు దాటినా వారి శరీరం మాత్రం అజరామరమై శతాబ్దాలు జీవిస్తుంది. కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలతోపాటు తెలుగు వారికి మరొక సంగీతం ఉంది. ఆ సంగీతమే ఘంటసాల సంగీతం. పద్యపఠనంలో లలితగీతాల గానంలో భావకవితల ఆలాపనలో ప్రణయగీతాల ప్రస్తారంలో కొత్తపుంతలు త్రొక్కి తెలుగు జాతికి మరపురాని మధురిమలను సరిగమలుగ అందించిన అమర గాయకుడు ఘంటసాల.
నా చిన్నతనంలో ఆయన మా ఊర్లో సుసర్ల కృష్ణబ్రహ్మశాస్త్రిగారి వద్ద సంగీతం అభ్యసించటం నాకు బాగా గుర్తు. ఆయన స్వస్థలం మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో అడ్డదారిని వెళితే వస్తుంది. మాది సంగీత సాహిత్యాలకు పేరెన్నికగన్న పెదకళ్ళేపల్లి గ్రామం. చాలా మంది ఆయన స్వంత ఊరు గుడివాడ దగ్గర చౌటుపల్లి అనుకుంటారు. అది ఆయన జన్మస్థలం. తల్లిగారు పుట్టిన ఊరు. తండ్రి సూరయ్యగారిది ఘంటసాల వంశీకులది, టేకుపల్లి. మా రెండు గ్రామాలూ దివిసీమలోనివి. అక్కడ కృష్ణ ఉత్తరవాహిని.
అప్పుడప్పుడు నా బాల్యంలో ఘంటసాలగారు అడివి శివరామకృష్ణయ్య అనే తన సహాధ్యాయితో పాటలు, పద్యాలు పాడటం, అవి అందరూ ఆసక్తితో వినటం జరిగేది. అటు తర్వాత నేను ఆయనను చూసింది 1951లో మద్రాసులో విద్యార్థిగా ఉన్న రోజులలో. అప్పటికి “పాతాళభైరవి” ‘చంద్రహారం’ చిత్రాలు రిలీజ్ అవ్వటం, దేశం అంతా ఘంటసాల గాత్రంతో ప్రతిధ్వనించటం జరుగుతుండేది. సెలవులలో ఇంటికి వెడదామని మద్రాసు సెంట్రల్ స్టేషనులో జి.టి.ఎక్స్‌ప్రెస్‌కి వచ్చి ఇంటర్ క్లాసు ఎక్కాను. అప్పడు జి.టి. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరేది. నేను ఎక్కేసరికే ముగ్గురు పెద్దలు అందులో కూర్చుని సంగీత గోష్టి జరుపుతున్నారు. మాటలధోరణి చూస్తే వీరెవరో సినిమావారు అన్పించింది. ఉన్నట్టుండి అందులో ఒకరు మరొకరి కోరికపై ‘స్వప్నసుందరి’ సినిమాలో “నిజమాయె.కల నిజమాయెు.” అనే పాట పాడారు. వినగానే ఈ గొంతు ఎక్కడో విన్నానే అనిపించింది. పాడిన వ్యక్తి కొంచెం స్థూలంగా, సిల్కు లాల్చీ, మల్లు పంచెతో ఉన్నారు. నన్ను చూసే మధ్యమధ్య నవ్వుతున్నారు. ఎదురు సీట్లో కూర్చున్నాయన ఎడతెరిపి లేకుండా తమలపాకులు చిలకలు చుట్టినములుతూ ఆ తాంబూల గంధo విరజిమ్ముతూ మాట్లాడుతున్నారు. రైలు పోతూనే ఉంది. ఉండబట్టలేక ముందుకు వంగి ఆ తాంబూల కుడి చెవిలో ‘ఎవ్వరండీ ఆయన?’ అని అడిగాను. ఆయునా రహస్యంగానే నోరు నా చెవి దగ్గర పెట్టి రహస్యంగా ‘ఘంటసాల’ అన్నారు. ఒక్కసారి వెనకటి సంఘటనలు గుర్తుకొచ్చాయి. కాని ‘ఆయనేనా? అనే సందేహం ముసురుకుంది. ఆశ్చర్యంతో ఆయన వైపుచూశాను. ఆయన నవ్వుతూ జరిగిందంతా గ్రహించి మీదేవూరు?” అని అడిగారు, ‘మాది పెదకళ్ళేపల్లి’ అని చెప్పాను. అనగానే ఆయన మొహం విప్పారింది. “మీ ఇంటి పేరేమిటి?’ అని అడిగారు. చెప్పాను. అప్పుడు దూరంగా కూర్చున్న – నన్ను పైనచెయ్యివేసి ‘మనం చాలా దగ్గరి వాళ్ళం. దగ్గరకు రావయ్యా’ అన్నారు. నాకు ఏనుగు ఎక్కినంత ఆనంద మయ్యింది. నా చిన్నప్పటి విషయాలు ఆయనకు చెప్పాను. ‘అన్నీ గుర్తున్నాయి. మనం ఇప్పటి వాళ్లం కాదులే’ అన్నారు. కాలం గడిచిన కొద్దీ ఆ మాట నాకు పాటగా వినిపించసాగింది.
అటు తర్వాత మద్రాసులో వారిని చాలా సందర్భాలలో కలిసాను, పత్రికా విలేఖరిగా. పాటల రచయిత అయిన తర్వాత నా పాట ఆయన గాత్రంలో వినే అదృష్టం నాకు భగవంతుడు ఇవ్వలేదు.
ఎక్కడో శ్రీకాకుళంలో ఘంటసాలకు గుడి కట్టించారట అభిమానులు. నిత్యపూజాభిషేకాలు నిర్వహిస్తున్నారట. తిరువయ్యారులో త్యాగయ్యగారి సమాధిపై ఆలయం కట్టి ఎందరో సంగీత రసపిపాసులైనవారు నిత్య పూజలు, అభిషేకాలు చేసి తరిస్తున్నారు. ఈ మహానుభావులిద్దరికి ఈ సేవ దొరికింది. ఇది తెలుగు వారి అదృష్టం.
కాని ఆయన పాడక నా పాట మూగబోయింది. ఆయన వారసత్వం బాలగంధర్వుడి స్వరమై నాపాల ఇన్నాళ్లుగా పలకనేర్చింది. నాకలం, బాలూ గళం, ఇలా శ్రుతిలయలుగా అద్వైత సిద్ధిని పొందటం వెనుక ఘంటసాల గారి ఆశీర్వచనం వుందనుకుంటాను.
చాలా మంచి విషయాన్ని షేర్ చేశారండి.