దక్షిణాంధ్ర సంస్కృతికి వేటూరి పెట్టిన నగ – మధుర మధురతర మీనాక్షి

భాగ్యనగరపు కవల పిల్లలు – అర్జున్‌, మీనాక్షిల్లో మీనాక్షి ఓ మదురై తమిళబ్బాయితో ప్రేమలో పడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు అర్జున్ తన అక్కని పరిచయం చేసేప్పటి సందర్భంలోది ఈ పాట. ఇప్పటి తమిళనాట తెలుగు సంస్కృతిని, మదురై నగరాన్ని, మీనాక్షి అమ్మవారిని, మీనాక్షినీ వర్ణించే ఇంతటి చక్కని సందర్భాన్ని అభిరుచి కలిగిన దర్శకుడు గుణశేఖర్ అర్జున్‌ సినిమాలో ఇవ్వడంతో తెలుగు సినీ సాహిత్యం లో అనితరసాధ్యుడైన వేటూరి సుందర్రామ్మూర్తి అత్యద్భుతమైన ఈ పాట రాశారు. అర్థాల ద్వారా చమత్కారం చేస్తే అర్థాలంకారమనీ, శబ్దం ద్వారా చేస్తే శబ్దాలంకారమనీ చాలా సాధారణంగా వాటికి అర్థం చెప్పుకుంటే – ఈ పాటంతా శబ్దాలంకారాలు, అర్థాలంకారాల పుట్ట. ఈ పని ఊరికే చెయ్యలేదు వేటూరి, ఒకేసారి అమ్మవారిని, అమ్మాయిని, మదురైనీ, దాక్షిణాత్య తెలుగు సంస్కృతిని వర్ణించేందుకు వేర్వేరు అర్థాలు వచ్చే పదాలతో చమక్కులు చేశారు. ఇంకా లోతుకు వెళ్తే శబ్దాలంకారాలు,అర్థాలంకారాలను ధరించి శృంగారాన్ని సిగలో తురుముకున్న నాయకరాజుల కాలపు తెలుగు సాహిత్య సుందరికి ముక్కుపుడక పెట్టేందుకు ఈ చమక్కులు చేశారు – అభినవ శ్రీనాధుడైన వేటూరి.

మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షి 
మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షి ||2||
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ 
లేత సిగ్గుల సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి 
వరములు చిలక స్వరములు చిలక 
కరమున చిలక కలదానా 
హిమగిరి చిలక శివగిరి చిలక 
మమతలు చిలక దిగిరావా ||మధుర మధురతర||

మధుర మధురతర అంటే మధురాని కన్నా మధురమైనది, ఐతే చమత్కారమేంటంటే ఇక్కడ మధుర అన్న ప్రతీ పదానికి మధురై నగరం, తియ్యదనం అనే రెండు అర్థాలు వస్తాయి. కంచిపట్టున అన్న పదానికి కంచిలో అన్న అర్థమూ, కంచిపట్టు అన్న అర్థం కూడా వస్తున్నాయి. ఆపైన మా మీనాక్షి ఇదమ్మా అని చెప్పేందుకు, అక్కని జాజిమల్లెల ఘుమఘుమల జావళీ అనీ, లేతసిగ్గుల సరిగమల జాబిలీ అనీ వర్ణిస్తున్నాడు. జావళీలు శృంగార రసానికి ప్రసిద్ధికెక్కిన సంగీత ప్రక్రియ. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస అయ్యంగార్ లాంటి తమిళులు ఇదే ప్రదేశంలో ఒకప్పుడు తెలుగు జావళీలు రాశారు, పాట రాస్తే తెలుగులోనే రాయాలని. తెలుగు పలుకుబడి అంతటిది. పాటలో మల్లెల్ని చల్లడానికి ఇంకో కారణం.

చిలక అన్న పదానికి ఉన్న రెండర్థాలూ చిలికించేసారు వేటూరి. వరములు చిలక అంటే వరాలను భక్తుల మీద చల్లేది. స్వరములు చిలక అంటే అసలు మీనాక్షీ అమ్మవారు విశ్వంలోని శబ్దాన్నంతటి నుంచీ అక్షరాలను మనకి ఇచ్చిన రూపం ఆవిడ అందుకు స్వరాలను మనమీద చిలికే అమ్మ. కరమున చిలక కలదానా, శబ్దాలనే జామపళ్ళు కొరికి చూసి ఆ మధుర ఫలాలు మనకిచ్చే ఓ చిలక,జ్ఞానానికి ప్రతీక దాన్ని చేతిలో పట్టుకుంది. అసలు ఆవిడే చిలక, శుక శ్యామల అని ఆవిడ అంశ. శుకమంటే పక్షి, ఇక్కడ చిలక. ఈ మదురైలో ఉన్న అమ్మ హిమగిరికీ, శివగిరికీ చెందిన చిలక అని అంటూ, అక్కడ నుంచి తన చెల్లెలి జీవితంలో మమతలు చిలకడానికి రమ్మంటున్నాడు.

శృంగారం వాగైనదీ ఆ వాగే వైదైనదీ 
ముడిపెట్టే ఏరైనదీ విడిపోతే నీరైనదీ 
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడినో తకథిమితోం 
విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కదా 
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి 
ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి || వరములు చిలక||

శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది. వాగైనదికీ, వైగైనదికీ ఉన్న తేడా ఏమిటీ అంటే ఓ ఐత్వం. శబ్దాన్ని మురిపెంగా మడిచి తాంబూలం కట్టే శబ్దాలంకారాల చరిత్రలో ఇంత అద్భుతమైన ప్రయోగం ఇంకోటి దొరుకుతుందా అంటే సంశయమే. వేటూరి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని కాచి వడబోసి సినిమా పాటలుగా మలిచేశారు, మన అదృష్టం.

మథురై, వైగై నదిని ఆనుకుని ఉంది. ఈ కథను గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ నది పుట్టుకకు కారణమని చెప్పబడుతూ, మధురానగరిని సేవించి ఉన్న మీనాక్షి, సుందరేశ్వరుల వివాహానికి సంబంధించి ఒక కథ ఉంది. ఆమె పాండ్య రాజు కొమరిత, పార్వతీదేవి అవతారము. ఆమె పుట్టిన నాటి నుండి లోకనాయకుడును, ఆదిభిక్షువును అయిన ఆ సుందరేశ్వరునే వరించి యున్నది. ఆమె బుద్ధి మరలించుటకు శక్యము గాక, రాజు కూడా ఆమెను సుందరేశ్వరునకు ఇచ్చుటకు సమ్మతించెను. ఆమె యన్నగారికిష్టము లేదు. వివాహమునకు శ్రీ సుందరేశ్వరుల వారు తరలి వచ్చినారు. పరివారము లేదు, బందుగులు లేరు, ఆదిభిక్షువు తానొక్కడే వచ్చినాడు. తనకు తగినట్లుగా ఎంతయో పెద్దగా వివాహ ప్రయత్నములు చేసిన పాండ్యరాజు నిస్సారపడిపోయెను. చేసిన ప్రయత్నములు చూపి, తెచ్చిన పదార్ధములు చూపి ఇవి అన్నియు ఏమి కావలెనని యల్లుని నిందించెను. పరమేశ్వరుడు నవ్వి, తన వెంట గొని వచ్చిన ఒక కుఱ్రవానిని చూపి, ఆ పదార్ధములన్నియు ఆ కుఱ్రడు భుజించునన్నాడు. అతనొక రాక్షసుడు. అతని పేరు కుండోదరుడు. అతనిలో భగవంతుడు క్షుధాగ్ని సహస్ర ముఖంబులుగా ప్రజ్వలింపజేసినాడు. కుండోదరుడు సకల పదార్ధముల నరగించి దాహమని యరువ మధురలోని బావులు చెఱువులు చాలలేదు. కుండోదరుని చేయి పట్టుమని పరమేశ్వరుడు తన శిరోభాగమున భాగీరథీ ప్రవాహము నడ్డగించు జటాసమూహములో నొక జట సడలించెను. ఆ రీతిగా పరమేశ్వర జటావివరాగ్రవినిస్స్రుతయగు  గంగానది మధురా సమీపమున వైగై నదియై ప్రవహించినది. పర్వతాగ్రముల నుండి ప్రవహించు సెలయేటివలె వైగై మిగుల తొందరగత్తె. ఆ శుందరేశ్వరుడు, మీనాక్షిల మధ్య ప్రేమ ఉదయించి, పొంగిందట. (వాగైనది). దాని ఫలితంగానూ, తదనంతర కారణాల వల్లానూ, ఆ ప్రేమే, వైఘై నది రూపం తీసుకుంది. అదే ముడిపెట్టింది. విడిపోతే, నీరవుతుంది ఇదే నది (కన్నీరు), పుట్టడంతోనే అమ్మవారిని, అయ్యవారిని కలిపింది కాబట్టే శృంగారం వాగైనది అంటున్నారు.

కానీ ఇంకొకటి కూడా ఉంది. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల వైగై నది ఒడ్డున ప్రారంభమై, వైగై నది ఒడ్డునే ముగుస్తూ నాయకరాజుల కాలం నాటి మదురై కేంద్రంగా ఉంటుంది. తను ప్రేమించిన మనిషి స్నేహితుడి భార్యై, స్నేహితుడు ప్రేమించిన అమ్మాయి తన భార్య అయి ఆ విషయం వారి నలువురికీ తెలియకుండా సాగిన నాలుగు స్తంభాలాట ఈ నవల. వైగై నదిని వారి ఎడబాటు, ప్రేమ, విషాదం వంటివాటిలో వర్ణిస్తారు విశ్వనాథ. ఆ నవలనే ఈ చరణం వర్ణిస్తోందన్నా అనొచ్చు. శృంగారం వైగైగా పారినది. ఆ ఏటి ఒడ్డునే జీవితాలు విచిత్రంగా ముడిపడ్డాయి, చివరకి ఆ ఒడ్డునే ఎడబాటుతో ముగిసిపోతే నీరైపోయిందా నది. అందులోనే కీలకమైన ఘట్టం కూచిపూడి భాగవతులు ఆడే నాటకంతో ముడిపడుతుంది, దాని ప్రస్తావన కూడా రావడంతో ఈ అన్వయానికి బలం వస్తోంది.

ఆ భరతనాట్యం నేర్చుకుని, ఆ నాట్యకళతో ఒప్పారే నర్తని, ఆంధ్రలో నాట్యమాడుతోంది అని ఈ పాదంలో చెబితే “విశ్వనాథుని ఏకవీర ఈ తమిళ మహిళల వలపు కథ” అనడంలో, తెలుగునాట విఖ్యాత కవీ, రచయితా అయిన మన విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ఏకవీర, మధురై పరిసర ప్రాంతాల్లోనే ఏకవీర నాయికగా ఉన్న జరిగిన ఒక ప్రేమకథను జ్ఞప్తికి తెస్తున్నది. మళ్ళీ, తెలుగు తమిళము కలబోసిన అందమైన అల్లిక ఇది వేటూరి  రాచముద్రతో.

ఇందులో చిన్న చమక్కు ఉంది. మొదటి రెండు పాదాల్లోనూ వ్రాసిన వైఘై నది ప్రస్తావనతోనే, ఏకవీర కథ మొదలవుతుంది. అదే నది ప్రస్తావనతో, ఆ కథ ఆఖరు వాక్యం ముగుస్తుంది.  ఏకవీర మొదటి పేజీలోనే, వైఘై నది చరిత్రను పరిచయం చేస్తూ, విశ్వనాథ వ్రాసిన మాటలివి

మనసే మధురై కొలువున్న తల్లి మా మీనాక్షి

ఎదలో యమునై పొంగేటి ప్రేమకి  నీ సాక్షి

మీనాక్షి తల్లి మనసులో మధురై కొలుఉంటుందే, (అంటే ఆ తల్లి మనసు మధురైలో ఉంటుందనీ, లేదా, ఆ తల్లి మధురైలో ఉంటుందనీ),  ఆ తల్లి హృదయంలో యమునలా పొంగే ప్రేమకి ఇదే సాక్షి అనీ భావం.

ఇంతే కాదు మరో లోతు కూడా ఉంది. తెలుగులో శృంగారభరితమైన కావ్యాలు, జావళీలు, వచన రచనలు పొంగి ప్రవహించిన దక్షిణాంధ్ర యుగంలో మదుర కీలకమైన కేంద్రం. అందుకు కూడా శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది. అయ్యవారి మనసే మధురా నగరమై కొలువైనది కాబట్టి మనసంతా నిండిన ప్రేమకి సరైన సాక్షి – ఆ మీనాక్షి.

అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది 
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నదీ
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో 
కట్టబొమ్మ తొడగొట్టి లేచినా తెలుగువీర ఘన చరితలలో 
తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి 
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి

అక్క అందాన్ని తమ్ముడు చెప్పాల్సి వస్తే ఎంత చక్కగా చెప్తాడో అంత చక్కని ఔచిత్యంతో మొదలెట్టారు చరణం. విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయాకా రెండువందల యేళ్లపాటు ప్రధానంగా మదురై రాజధానిగా తెలుగు వారైన నాయకరాజులు పరిపాలించారు. తంజావూరు, మదురై నాయకరాజుల కాలంలో తెలుగు సాహిత్యం దక్షిణాదిన విలసిల్లింది, దాన్నే ప్రస్తావిస్తున్నారు.తమిళనాట ప్రసిద్ధంగా చెప్పుకునే బ్రిటీష్‌ వ్యతిరేకి, వీరుడు వీరపాండ్య కట్టబ్రహ్మన తెలుగువాడు. ప్రస్తుతం తమిళనాడుగా పిలుచుకునే రాష్ట్రంలో తెలుగు మాతృభాషగా, ఇంటిభాషగా ఉన్నవాళ్ళెందరో. అందుకే తమిళం-తెలుగు ఎన్నడో జతకట్టాయంటున్నారు కవి. ఇక ఈ తమిళబ్బాయి-తెలుగమ్మాయి జంటనీ ఆశీర్వదించమంటూ ముగుస్తోంది.

దక్షిణాంధ్ర యుగంలో భారీ నగల్లాంటి శబ్దాలంకారాలను, శృంగారభరితమైన వర్ణనలనూ సింగారించుకున్న తెలుగు కావ్యకన్యకను గుర్తుకుతెచ్చేందుకా అన్నట్టు శబ్దాలంకార సంభరితంగా పాటను రాసి, చరిత్రను, సంస్కృతిని మనకు పాటగా అందించారు వేటూరి.

“బృందావని ఉంది.. యమునా నది ఉంది

మధురాపురి ఉంది… కాళింది ఉంది…

ఉన్నది మనందరి కోసమూ

వేటూరి పాటొక్కటి ఉంది..”

———————————————————————————–

వేటూరి రచనని ఇంత సర్వాంగ సుందరంగా మలిచి మనకు అందించిన మిత్రులు మానస చామర్తి గారికి, మీనాగాయత్రి గారికి, పవన్ సంతోష్ సూరంపూడి గారికి, వేటూరి.ఇన్ టీం తరపున కృతజ్ఞతలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.