ఈ సంవత్సరం ‘ఉత్తమ సినిమా గేయ రచయిత’గా జాతీయ అవార్డు తెలుగు కవి శ్రీ వేటూరి సుందరరామమూర్తికి లభించింది. తెలుగు పాటల రచయితకు ఈ జాతీయ అవార్డు రావడం ఇది రెండవసారి మాత్రమే. 1975లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ‘తెలుగు వీరలేవరా’ పాట రాసిన శ్రీశ్రీ ఈ పురస్కారాన్నందుకున్న మొదటి తెలుగు రచయిత. ‘ఓ సీతకథ’ తో 1974లో రంగప్రవేశం చేసిన వేటూరి ‘శంకరా, నాదశరీరాపరా, వేదవిహారా హరా’ వంటి అద్భుతమైన భావనా పటిమగల గీతాలనుండి ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ వంటి ద్వంద్వార్థపు పాటలవరకు అన్ని రకాల పాటలు రాసి, గత ఇరవయ్యేళ్ళుగా తెలుగు సినీగేయకవితారంగాన్ని ఏకచ్ఛత్త్రధిపత్యంగా ఏలుతున్నాడు. తెలుగు సాహిత్యానికి శ్రీనాథుడెంతటివాడో, తెలుగు సినిమాపాటకు వేటూరి అంతటివాడు అని ‘తెలుగు సినిమా పాట’ అనే సిద్ధాంతగ్రంథంలో శ్రీ పైడిపాల వర్ణించారు. నా దృష్టిలో రాశిలోను, వాసిలోను అన్నమయ్యను తలపించే వేటూరి “ఆథునిక అన్నమయ్య”లా అనిపిస్తాడు. ఏది ఏమైనా తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కలిగించే కొన్ని విశిష్టమైన పాటలను రచించిన వేటూరికి ఈ అవార్డు లభించడం ఆయనకు సముచిత సత్కారమే.
ఇక అవార్డు విషయానికి వస్తే, ‘మాతృదేవో భవ’ అన్న చిత్రానికి వేటూరి రాసిన ‘రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే’ అన్న గీతానికి ఈ అవార్డు వచ్చింది. ‘మాతృదేవోభవ’ విథి వక్రించిన ఒక మాతృమూర్తి గాథ. బ్లడ్‌క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ, తన భర్త చనిపోయినా ఆత్మస్తైర్యంతో తన పిల్లల జీవితాలను సరిదిద్ది తుదిశ్వాస వదలడం – స్థూలంగా ఈ సినిమా కథ. ‘రాలిపోయే పువ్వా’ పాట భర్త కోల్పోయిన క్షణంలో ఆ స్త్రీ మనోవేదనకు భాషారూపం.
సన్నిహితుల మరణం కలిగించే హృదయ సంచలనాన్ని వర్ణించే పాటలెన్నో ఇదివరకు వచ్చాయి. ఈ పాటల్లో తరచూ వాడే కవితా సామాగ్రి ‘చితిమంటలు’ ‘వల్లకాడు’, ‘గుండేకోత’ మొదలైన పదాలు. ఆ పాటలన్నికీ భిన్నంగా విలక్షణమైన శిల్పంతో సున్నితమైన సరళమైన పదాలతో లలితంగా నియమం తప్పని మాత్రఛందస్సులతో సాగుతుంది ఈ పాట. ఈ పాట పాడిందీ, రాగాన్ని కూర్చిందీ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి.
యథాతతంగా ఆ పాట:
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మ కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం || రాలిపోయే||
చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై ||రాలిపోయే||
అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశము నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై || రాలిపోయే||
ఈ చిన్ని పాటలో కవి తన కౌశల్యాన్ని, చాతుర్యాన్ని ఎలా ప్రదర్శించాడో గమనించండి. ఆమెకు తీరని జబ్బు. ఆమె రాలిపోయే పువ్వు; వాలిపోయే పొద్దు. పువ్వు తోటమాలి కోసం పూస్తే, పొద్దు పొడవటం లోకం కోసం. తోటమాలి లేదనడం ఆమె భర్త మరణానికీ, లోకమెన్నడో చీకటవటం ఆమె నైరాశ్యతకి చిహ్నం. రాలిపోయే పువ్వుకూ, వాలిపోయే పొద్దుకూ రంగులెందుకూ అంటూ ఆమె హృదయంలో ప్రాపంచిక విషయాలపై నిరాసక్తతనూ, విరక్తినీ తెలుపుతూనే నీకిది తెలవారని రేయమ్మా అంటూ మనసులోని నిర్వేదాన్ని, నైరాశ్యాన్ని మన కళ్ళముందు స్పష్టంగా నిలుపుతాడు.
భర్త మరణిస్తే రంగురంగుల అలంకారాలు, నుదుట బొట్టు తొలగించి తెల్లచీర కట్టడం సాంప్రదాయం. పువ్వుకు రాగాలెందుకు, పొద్దుకు వర్ణాలెందుకు అని ప్రశ్నించడంలోనూ, సింధూర వర్ణాలు తెల్లారాయి అనడంలో ఉన్న భావానికి ఈ సంప్రదాయాన్ని అన్వయిస్తే రచయిత భావనలోని లోతు సుస్పష్టం అవుతుంది. రాగం అన్న పదానికి ఉన్న అనేకార్థాల్లో రంగు అనే అర్థం కూడా ఉంది. సంధ్యారాగం, పుష్యరాగం అనే పదబంధాలలో ‘రాగం’ రంగు అన్న అర్థంలోనే వాడబడుతున్నది. అలాగే సింధూరవర్ణాలు తెల్లబడి చల్లారడంలో ఇంకో శ్లేషార్థం: చితిమంటలు ఆరిపోయి వెలిబూడిద మిగలడం.
తోడు లేకపోవడంతో గూడు గాలిగా చెదరింది. మాంగల్యంతో పాటు మనసూ (దిగ)జారింది. భర్త మరణానంతర శోకం ఈ గీతంలో ప్రధానాంశం. అయినా, ఆ విషయాన్ని ‘తనవాడు తారల్లో చేరగా’ అని ఒక్క వాక్యంలో అతిసున్నితంగా ప్రస్తావిస్తాడు కవి.
ఆ దుఃఖ సమయంలో ఆమె పిల్లలు ‘కన్నీటి దీపాలు’. వారికోసం ఆమె ‘తిరిగే భూమాత’. అయినా ఆరోగ్య రీత్యా ఆమె ‘వేకువజాము వెన్నెల’, ‘కరిగే కర్పూరం’. ఆమె నిజంగా ఆశల హారతి. చిన్న చిన్న మాటలు చాలు ఈ రచయితకు ఈ పాత్ర మనోభావాలు మనకు తెలుపడానికి. రక్తం రంగు మారినా ఆమె ఋణానుబంధం తీర్చుకోకతప్పదు. అందుకే అనుబంధం అప్పువంటిది. కానీ ఈ బంధాలన్ని కరిగి ఆమె హేమంతంలో చేమంతిలాగా వాడిపోక తప్పదు. ఆమె పరిస్థితిని వ్యక్తం చేసే ఒక్కొక్క వాక్యం, ఒక్కో రసగుళిక. జాబిలికి ఆకాశం ఆధారం. ఆకాశమే పగిలిపోతే జారిపడే జాబిలిగా, తీగ తెగిన వీణియగా, ఆ వీణ మిగిల్చిన ఆలాపనగా ఆమెను పోల్చడం వేటూరి కవితాపటిమకు, భావవైచిత్రికి మచ్చుతునకలు.
ఏ భాషా పటాటోపం లేకుండా, అందరికి అర్థమయ్యే సామాన్యపదాలతో అసామాన్యమైన భావాలను తెల్పుతూ గుండెలను స్పృశించడం ఈ పాట గొప్పతనం. ఇలాటి పాట రాయడం వేటూరికి ఇది మొదటిసారి కాదు. పంతులమ్మ చిత్రంలో ‘ఎడారిలో కోయిలా, తెల్లారనీ రేయిలా’ దాదాపు ఇటువంటి సన్నివేశానికి రాసిన పాటే. ఈ పాటతో సరితూగగల పాటలు, ఇంతకన్నా గొప్ప పాటలు ఎన్నో వ్రాసిన వేటూరికి ఈ జాతీయ పురస్కారం ఈ ఒక్క పాటకోసం కాకుండా, ఆయన సాహితీ విశారదతకూ, భావ విస్తృతికి, వైవిధ్యానికి గుర్తింపుగా పరిగణించాలని నా అభిప్రాయం.
ఈ వ్యాసం ఆగస్ట్ 1994 “తానా”పత్రిక లో ప్రచురించబడినది.
సురేశ్ కొలిచాల గారికి ధన్యవాదాలతో
ఆడియో .
సంగీతం:M.M కీరవాణి , గానం:M.M కీరవాణి, రచన:వేటూరి , చిత్రం:మాతృదేవోభవ