ఈరోజు వేటూరి గారి వర్ధంతి.ఆ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆయన వ్రాసిన ఒక పాట సాహిత్య విశ్లేషణ మీకోసం – వేటూరి.ఇన్ టీం
కీచురాళ్ళు చిత్రానికి ఇళయరాజా రాక్ స్టైల్ లో చేసిన ట్యున్ కి వేటూరి తెలుగు, సంస్కృత, హిందీ పదాలతో రాసిన పాట వినూత్నంగా ఉంటుంది. పగలూ, ద్వేషాలూ మాని కళలనీ, మానవత్వాన్ని మనసుల్లో నింపుకోమని యువతకి ప్రబోధించే సాహిత్యం. ఈ పాత సందేశాన్నే కొత్తగా, హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో వేటూరి గేయరచనా ప్రతిభ తెలుస్తుంది. విపరీత ధోరణిలూ, వ్యతిరేక భావనలూ, తీవ్రమైన ప్రతిస్పందనలూ ప్రబలుతున్న ఈ రోజుల్లో ఈ పాటలోని బోధ సమాజానికి అత్యావశ్యకం!
పల్లవి
కంసం ధ్వంసం హింసం జానేదో
చిత్రం శిల్పం నాట్యం ఆనేదో
జగతిలో కళలనే జీనేదో
ఏవి వదిలేయాలి? ఏవి తెచ్చుకోవాలి? వేటిని పోషించాలి? అని పల్లవిలో చెప్పాడు కవి. హింసనీ, విధ్వంసాన్ని రచించే కర్కశత్వాన్నీ, కంసుడి లాంటి దుర్మార్గపు మనస్తత్వాన్నీ వదులుకుని, మనసుకి ఆహ్లాదమిచ్చే చిత్రం, శిల్పం, నాట్యం వంటి కళలని జీవితాల్లోకి తెచ్చుకుని కళలను పోషించే సున్నితమైన మనుషులుగా మారాలి! మనసు సుందరమైతే లోకం నందనమవుతుంది కదా!
చరణం 1
నీలో కళలే పలకక ఇక నీవో కలవే
నీ మానవతా నవయువతా అన్నీ కథలే
చంద్రోదయ సంధ్యా శుభసమయే రక్తారుణ రాగాలొదిలెయ్!
గానాంబర తారామణి నిలయే కర్కోటక భావాలొదిలెయ్!
వద్దీ హత్యాక్రోధం ముద్దీ నృత్యావేశం సద్యోజాతం శాంతం నీదే
స్వర్గమంటి జీవితం… రుద్రభూమికంకితం… చేసుకోకు ఇల్లు వల్లకాడు ఈ దినం
కళలను సృష్టించినవాళ్ళే ఈ ప్రపంచపు చరిత్రపుటల్లో స్థిరపడతారు. మిగిలిన వాళ్ళు జీవితం ముగిశాక నిద్రలేచాక చెదిరిపోయే కలగా మాయమైపోతారు. నీలోని కళాకారుణ్ణి పైకి తీయకపోతే, నువ్వొక కలగా మిగులుతావు! మనిషిలోని ఆవేశానికి సున్నితత్వాన్ని జోడించి, నలుగురు స్పందించేలాగ చెయ్యగలిగేది కళ. ఆ కళని ఆదరించలేని మనసులోని మానవతా, అభ్యుదయ భావాలు సార్థకం కాలేవు.
తర్వాత పంక్తి లో, చంద్రోదయాన్ని కక్షలు, ద్వేషాలూ లేని చల్లని మనసుకి సంకేతంగా చూపిస్తున్నాడు కవి. చంద్రోదయానికి ముందు సంధ్య వస్తుంది, ఈ సంధ్యలో ఎరుపుని “రక్తంతో తడిసిన ఎరుపుగా” వర్ణిస్తున్నాడు. ఇది దాటితేనే వెన్నెల వెలుగులు! గానమనే ఆకాశంలో (గానాంబరం) స్వరసంగతులెన్నో తారల్లా మణికాంతులు వెదజల్లినట్టు నీ మనసులో మానవత్వమూ తళుక్కుమనాలి, “కర్కోటక భావాలు” వదిలెయ్యాలి. హింసా, క్రోధం వద్దనీ, ఎదలోని ఆవేశాన్ని నృత్యంగా మలుచుకోమనీ, అలా చేస్తే చిగురించే (సద్యోజాతం) శాంతస్వరూపానివి అవుతావని హితబోధ చేస్తున్నాడు. స్వర్గంలాంటి జీవితాన్ని పగలూ, ద్వేషాలూ పెంచుకుని వల్లకాడు చేసుకోకు అన్నది సారాంశం. ఎంత మంచి సందేశం!
చరణం 2
తకతై తత్తోం ప్రియలయలకు నీవే గుడివై
పానిని పమప స్వరపదముల దాగే ఒడివై
విశ్వాంతర వింధ్యాచల శిఖరే ఉత్తిష్ఠో నరశార్దూలా!
ప్రాక్ పశ్చిమ సత్సంగమ హృదయే ఊగించర కళ ఉయ్యాల
రానీరా ప్రత్యూషం పోనీరా కావేషం… నిత్యోత్సాహం నీలో ఉంటే
త్యాగరాజ కీర్తనం బీథోవెన్ లవ్‌స్వరం పాడుకుంటు నిన్ను దిద్దుకోర ఈ క్షణం
మొదటి చరణంలో స్పృశించిన సంగీత నృత్యాలనే హృదయవికాస సోపానాలుగా ఎలా మలుచుకోవాలో రెండో చరణంలో కవి చెప్తున్నాడు. ఎలా అంటే, ప్రేమని పెంచే నర్తనకి నీవే గుడి అవ్వాలి. మనసుని అలరించే సంగీత స్వరాలు సేదతీరే స్థానమవ్వాలి. అంటే కళలు ఎదలో కొలువవ్వాలి, జీవితం కళారాధనమవ్వాలి. అప్పుడే మనసు పరిపక్వత చెంది జీవితం పండుతుంది.
భారతదేశంలో ఉత్తరదక్షిణాలకు మధ్యన ప్రహరీ వంటిది వింధ్య పర్వతం. విశ్వానికి ఉత్తరదక్షిణాలను వేరు చేసేటి వింధ్య పర్వతం ఏమైనా ఉంటే దాని మీద నరసింహంలాగా (నిర్భయంగా) నిలబడాలి. ఎదురుబొదురు దిక్కులు అభిప్రాయ, సాంస్కృతిక భేదాలకు చిహ్నం. అటువంటి భేదాలని దాటుకుని మనుషులను కలపాలి. భారతీయ (తూర్పు), ఐరోప్య (పడమర) సంస్కృతులు చక్కగా మేళవించి, హృదయంలో కళలను ఆరాధించాలి. మనసు పలు రకాల పువ్వులు విరిసే పూదోట కావాలి! ఈ జీవితం అందరినీ కలుపుకుంటూ, వారధులు కడుతూ సాగాలి కానీ “వార్” లు చేస్తూ కాదు! సంకుచిత తత్త్వాన్ని వీడి, విశాల దృక్పథంతో మొత్తం ప్రపంచాన్నీ ఐక్యం చెయ్యాలి. ఆ దిశగా నీ కళాప్రయాణాన్ని సాగనివ్వమంటున్నాడు. నిత్యం ఉత్సాహంగా కొత్తవెలుగులను రానిచ్చి, పాత పగలను (కావేషం) తరిమేయ్. త్యాగరాజ కీర్తనల్నీ (మన సంస్కృతికి ప్రతీక), బీథోవెన్ స్వరాలనూ (ఇతర సంస్కృతులకి ప్రతీక) రెండిట్లో ఉన్న మంచినీ సమదృష్టితో భావించి మనసుని మెరుగుపెట్టుకుంటూ సాగిపో!
ఇళయరాజా అందించిన హుషారైన బాణీకి ధీటుగా వేటూరి పలు భాషల పదాలతో అల్లిన ఈ గీతమాల, సుందరం సుమధురం! పాటలో ఇచ్చిన సందేశం మహత్తరం! ఎవరికీ తెలియకుండా పోయిన వేటూరి మంచి పాటల్లో ఇది కచ్చితంగా ఒకటి. తప్పక విని ఆస్వాదించండి!