సినిమా – ఆనందభైరవి
రచన – వేటూరి
చైత్రము కుసుమాంజలి
బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు
దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు
భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి
నృత్యాంజలి నాట్య కోవిద వరులకు
శుభము శుభము సాహిత్య పరులకు
శుభము శుభము సంగీత విదులకు
శుభము శుభము నాట్యానుమోదులకు
శుభము శుభము సర్వ జనాళికి
చైత్రము కుసుమాంజలి, (2)
పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి
వేసవిలో అగ్నిపత్రాలు రాసే
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
వార్షుక జలగంగలా తేలిఆడే ………… నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికి
శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతుకావేరి లా తీగ సాగి
హిమజల పాతాల, సుమశర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి
చలి ఋతువే, సరిగమలౌ నాద సుధా మధువనికీ
సంప్రదాయ సాహిత్యాన్ని కాచివడబోసిన వేటూరి, పూర్వ కవుల మార్గాన్ని అనుసరిస్తూ ఋతువర్ణన చేసిన అద్భుతమైన పాట ఇది.నవ్వులకు మారుపేరైన జంధ్యాల తనకు అత్యంత ఇష్టమైన పాట అని చెప్పిన పాట ఇది.
సన్నివేశం ఊరు వెలివేసిన నాట్యకారుడు తన శిష్యురాలైన దొమ్మరి పిల్లకి పాఠం నేర్పటం.
మొదట ప్రార్ధన:
“బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు” – తాండవానికి ఆద్యుడైన పరమేశ్వరుడికి బ్రహ్మాంజలి.
నిరంతరమూ లాస్యంలో మునిగితేలే పార్వతీ దేవికి దివ్యమైన నమస్కారం “దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు”
నాట్యం కేవలం కళ కాదు , అది పార్వతీపరమేశ్వరుల ప్రతిరూపం. తాండవ నృత్య స్రష్టకు అనటం లో
ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాగ్మయం
ఆహార్యం చంద్ర తారాది, తమ్ వందే “సాత్వికం శివం” అన్న శ్లోకస్ఫురణ ఉంది.
ఇదే భావాన్ని వేటూరి సాగరసంగమంలో “చంద్రకళాధర, సహృదయా, సాంద్రకళాపూర్ణోదయా ” అని వర్ణించారు.
కళోపాసన ఈశ్వరస్వరూపం అని మన పూర్వుల అభిమతం.
ఈ నృత్య కళకు (కూచిపూడికి) ఆద్యుడైన సిద్ధేంద్రయోగికి నమస్కారం – “భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి”
కళని ప్రదర్శించే వారుంటే, యుక్తాయుక్తాలు గ్రహించి మెచ్చుకునే రసికులు ఉంటారు – “నృత్యాంజలి నాట్య కోవిద వరులకు ”
విచ్చేసి ఆస్వాదించే కళాప్రియులందరికీ శుభము శుభము కలుగు గాక “శుభము శుభము సర్వ జనాళికి” అని ఆశీస్సులు అందించిన ఆ ఆచార్యుడు, ఈ ప్రకృతిలోని నృత్యరీతుల్ని తెలుపుతూ
“చైత్రము కుసుమాంజలి ” – చైత్రఋతువు పువ్వుల దోసిలి నమస్కారమట. ఏమందం !!! ఏం చమత్కారం !!! ఋతువుని ఒక అభినయ ముద్రగా, ఒక expression కి symbolisation గా అభివర్ణించిన వారున్నారా వేటూరి తప్ప ?
ఆ చైత్రము ఎలాంటిదిట? “పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు పలికే మరందాల అమృత వర్షిణి” జాణలైన కోకిలలు విలాసంగా పంచమస్వరం లో తేనెలు అమృతాలు చిలకరించి పాడే అమృతవర్షిణి అట. చైత్రమాసంలో కోకిలలు కూయటం సహజం, ఆ సహజత్వo భావుకత ఉన్న వాడిలో ఇంత అందమైన రూపుకడుతుంది.
ఇంతకీ ఈ చైత్రం ఎవరికి కుసుమాంజలి ? అదే చెబుతున్నాడు
వేసవి లో కార్చిచ్చులో పడిన పత్రాల్లా (అగ్నిపత్రాల్లా) మండిపోయే
విరహతాపంతో ఉన్న నెచ్చెలి నిట్టూర్పులా సంచరిస్తూ,
జలదుని (మేఘుని ) నినాదాలు మృదంగతాళ గతులలో ఎగయగా,
వర్ష సమాగమంలో పులకరించే జలగంగ లా ఆడే
కళాభారతికి చైత్రము కుసుమాంజలిట. అంటే అటు విరహము, ఇటు సంభోగము రెండిటిలోనూ పరిపూర్ణత్వం, తాదాత్మ్యతా ప్రదర్శించే కళారూపానికీ, కళాకారుడికీ, ఇన్ని shades తనలో ఒద్దికగా దాచుకున్న ఈ ప్రకృతి అంతటా నిండిన ఈశ్వరవిభూతికి చైత్రo పూల దోసిలి పట్టిందట.
ఆహా !!! తనలో ఇన్ని కళలు నింపినవానికి కృతజ్ఞతయే ఋతువులు అన్న భావం ఎంత గొప్పది !!!
శరత్కాలంలో బురదతగ్గి “ఆకర్దమం” గా ఉన్నప్పుడు, ఒంపుసోంపు నడకల అందగత్తె లా కావేరి తుళ్ళుతూ ఉంటే, చలిలో మంచు బిందువులు మన్మధబాణాల్లా తగులుతూ ఉంటే, అతిధిగా వచ్చిన మరునికి ప్రీతిపూర్వకంగా స్వాగతమందజేసి, ఆ ఆనందంలో, తమకంలో ఆలాపనలతో నిండిన నాదసుధావనికి చైత్రము నమస్కారమందిట
తనను చూసి పులకించి రమించే రసికులకు ప్రక్రుతి తిరిగి నమస్కరిస్తుందట, ఆహా ప్రకృతికి ఎంత కృతజ్ఞత ?
కళని నేర్చుకునే వేళలో ఇంత రమణీయంగా పాఠం చెబితే మనసు ఆర్ద్రమవదా?
కాళిదాస మహాకవి ఋతుసంహారం ప్రతిబింబించేలా అన్ని ఋతువుల్లోనూ శృంగారాది నవరసాలను దర్శించిన వేటూరి ఇదే హృదయాంజలి
—————————————-
నళినీకాంత్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం