సినిమా – స్వరాభిషేకం
రచన – వేటూరి
ఇది నాదనీ, అది నీదనీ, ఇది నాదనీ, అది నీదనీ,
చెప్పలేనిది ఒక్కటి ఈ ఒక్కటి , ఏమది ?
అది ఇది అని చెప్పలేనిది , ఆ చెప్పలేనిది ఏమది?
అది మనసున పుట్టి మమతల పెరిగి మధువై పూచేది
అది ఇది అని చెప్పలేనిది, అది ఇది అని చెప్పలేనిది
వెన్నెలమ్మ రాతిరిదా, వేకువమ్మ పొద్దుటిదా
కోకిలమ్మ ఆమనిదా?
ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత
ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత
ఈ జన్మకు చాలనంత పరవశమంతా
మనదే మన ఇద్దరిదే, పదే పదే వినిపించే ప్రియదేవుడి అష్టపది, అది ఇది అని చెప్పలేనిది
మొగ్గిన వలపుల ముంగిటా, వయసు ముగ్గు వేయనా
నిగ్గులు పొంగిన చెక్కిటా, సిగ్గుల ఎరుపులు తాకనా
వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతీ
ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై మురిసే
పరవశమంతా మనదే మన “ఒక్కరిదే”
ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపది
అది ఇది అని చెప్పలేనిది
కర్ణాటక సంగీతం ప్రధాన వస్తువుగా సినిమాలు తీసే కే.విశ్వనాథ్ గంభీరమైన సన్నివేశాలు మాత్రమే కాదు, సున్నితమైన శృంగారం కూడా పండించగలరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎత్తుగడలోనే piano తో పాశ్చాత్య బాణీలో melody తో మొదలెట్టారు సంగీత దర్శకులు విద్యాసాగర్.
కొత్తగా పెళ్ళైన జంట ఒకరితో ఒకరు చెప్పుకునే ఊసులు ఇలా ఉంటాయి
అది నీదనీ, ఇది నాదనీ విడదీసి చెప్పలేనిది ఒకటి ఉన్నది. అది ఏమిటి?
అది ఎలా ఉంటుందో తెలియదు , కానీ అది మనసులో పుడ్తుంది, మమతల అల్లికలో పెరుగుతుంది, తేనె పువ్వులో పుట్టినట్టు జన్మరహస్యం తెలియకపోయినా తీయగా సహజంగా ఉన్నది ఒకటి ఉంది, అదేమిటి అని అడిగితే, ఏమో అది ఇది అని చెప్పలేని అవ్యక్త అనుభూతి అది. ప్రేమను గురించి ఎంత చక్కని వర్ణన ?
ఆ ప్రేమ ఎవరిదీ? ఆ ప్రేమ గొప్పతనం ప్రేమించిన వాడిదా? ప్రేమ పొందిన వారిదా?
రాత్రిలో వెలిగినందుకు వెన్నెల రాత్రిదంటావా, వెన్నెలే రాత్రికి విలువంటావా ?
వేకువ లో విరిసిన పొద్దు వల్ల పగలు అందమైనదా ? పగలు వల్లే సూర్యుడు నిలబడ్డాడoటావా?
కోకిలకీ వసంతానికీ ఉన్న సంబంధం ?
అది పరస్పరమైన అనురాగంతో విరిసిన కలయిక, అక్కడ ఎంచి చూడడానికి తావు లేదు, అది ప్రేమ. ఎంత గొప్ప నిర్వచనం !!!
ఈ పువ్వు పులకరించి, ఈ పడక పలకరించి, ఈ జన్మకు చాలనంత పరవశమిచ్చింది,
ఆ పరవశమంతా మనదే, కేవలం మనిద్దరిదే, అది మన స్వార్జితం, exclusive గా మనదే
అంతకంతకు ఊరి, పదే పదే వినిపించే రసభరితమైన అష్టపది లాంటిది ప్రేమ, అది ఇది అని చెప్పలేనిది ప్రేమ
కలయికకి పరమాద్భుతమైన ఉదాహరణ పార్వతీ పరమేశ్వరులు, ఒకరిలో ఒకరి కలిసిపోయి ఉండే అద్వైతం వారిది.
శైలజ వయ్యారంగా, శైలపతి ఐన శివుడు శృంగారంగా దరికి వచ్చి, అద్వైత మూలమైన ఓంకారరూపంగా సంగమించిన ఆ దివ్య పరవశమంతా (divine ecstasy) మనదే, ఈ దశలో ఇద్దరం లేము , ఒక్కరిమే
రెండు ఎద సవ్వడులు ఒకటిగా కొట్టుకునే ఇహ పరాలకి సరిపోయేటoత రసానుభూతి ఏది? ఏది? అది ఇది అని చెప్పలేనిది
శారీరక ఐక్యానికి, మానసిక సాంగత్యానికి, శివపార్వతుల సంగమాన్ని ఉపమించి అతి సుందరమైన, లలితమైన, మృదువైన, సొంపైన పాట ఇది.
ఇంత మంచి పాటని రాసిన వేటూరి రసస్ఫూర్తికి నమస్సులు.
————————————-
నళినీకాంత్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం