మహా శివరాత్రి సంధర్భంగా “కిరాతార్జునీయం” మీకోసం.
ఈ పాటలో వేటూరి తన పదాల గారడితో విశ్వరూపం చూపించారు. లయకారుడు శివుడు కైలాసగిరిలో నాట్యమాడుతుంటే ఒక్కసారిగా కైలాసం కంపించింది. అదిచూసి…
జగమునేలినవాని సగం నివ్వెరబోయే….
సగం మిగిలినవాని మొగం నగవైపోయే..
ఎంత చక్కటి వర్ణన.. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం ఈ రెండు వాక్యాలు..
జగమునేలినవాని సగం (పార్వతి దేవి) నివ్వెరబోయే
సగం మిగిలినవాని ( శివుడు) నగవైపోయే..
ఎంత సొగసైన వర్ణన ఇది..
ఆ తరువాత అర్జునిడిని తపోదీక్షలో చూపించి “అతడే అతడే అర్జునుడు” అని మొదలుపెట్టి “అనితర సాధ్యం పాశుపతాస్త్రం” అంటూ ఆతని పాశుపతాస్త్రం గొప్పదనాన్ని.. వర్ణిస్తూ పాటని పరుగులెత్తిస్తారు.
ఆ తరువాత శివుడు ఎఱుకల వానిగా మారి కైలాసాన్ని వీడిన ఆ ప్రహసనం వేటూరిగారి పాటలో ఎలా వినవించారో చూడండి.
నెలవంక తలపాగ నెమలియీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి పారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె…
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా …
తల్లిపార్వతి మారె తాను ఎఱుకతగా…
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము..
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు…
ఎఱుక అంటే జ్ఞానం. సర్వజ్ఞుడైన శివుడు ఎఱుకలవానిగా మారాడు!
తరువాత మూకాసురుడనే రాక్షసుడు వరాహరూపం దాల్చి రావడం, అర్జునుడు రెచ్చిన కోపంతో దానిని కొట్టడం.. వరాహం అసువులు వీడడం అప్పుడు కిరాతార్జునుల వాదులాట, తాడియెత్తున ఉన్న గాండీవంతో ముత్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు పవిత్రమైన శివుని తలని మోదడం.. శివుడు ప్రత్యక్షమవడం.. అర్జునుని స్థుతి.. కిరాతార్జునీయమంతా కళ్ళకి కట్టినట్లుగా పాట రూపేణా మనముందుంచారు వేటూరిగారు.
పూర్తి పాట మీకోసం చదువుతూ, చూస్తూ వింటూ తరించండి..
తకిటతక తకతకిట చటిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా
హరిహరాంచిత కళా కలిత నిలగళా
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా
జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా
అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయజ్వాల
జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు
అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి యింద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు
నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు
శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడూ
వరాహరూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా
చిచ్చరపిడుగై
వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి
చూసినంతనే, వేసినంతనే
తలలు రెండుగా విలవిలలాడుచు
తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ
కొట్టితి నేనని అర్జునుడూ, పడ
గొట్టితి నేనని శివుడూ,
పట్టినపట్టును వదలకనే తొడ
గొట్టిన వీరముతో నపుడు
వేట నాది, వేటు నాది
వేటాడే చోటు నాది,
ఏటి తగవు పొమ్మని విలు
మీటి పలికె శివుడూ
చేవ నాది, చేత నాది
చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కను
సైగ చేసె అర్జునుడు
గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు కానీ, అపుడతడు
వేయిచేతుల కార్తవీర్యార్జునుడూ
ఓంకార ఘనధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసె హరుడూ, అయినా
నరునికాతడు మనోహరుడూ
చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధి విలాసమేమో పెట్టిన గుఱి వట్టిదాయె
అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడియెడమై సంధించుట మఱచిపోయె!
జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల
గంగకు నెలవై, కళ కాదరువై
రిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై, అఘ లవిత్రమై
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా, సృష్టి చెదరగా,
తాడి యెత్తు గాండీవముతో ము
త్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు
చండకోపమున కొట్టినంతనే
తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు
కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధే, శ్రీ మహాదేవ శంభో!
నమస్తే, నమస్తే, నమస్తే నమః!
(రమణి రాచపూడి)
చక్కని వివరణ 🙏