వేణువై వచ్చాను …
“రాయినై ఉన్నాను ఈ నాటికీ…
రామ పాదము రాక ఏనాటికీ…”
నిరుపమాన కవి, సినీ గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తికి తాను రాసిన వేలాది పాటల్లో బాగా ఇష్టమైన పాట – బహుశా – “వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి.. ” అయి ఉంటుంది. 1993 లో వచ్చిన ‘మాతృదేవోభవ’ సినిమా కోసం రాసిన ఈపాటని ఆ తర్వాత అనేక సందర్భాలలో తల్చుకోవడంతో పాటు, ‘వేణువై వచ్చాను’ పేరిట ఆత్మకథ రాయాలని ఒక దశలో సంకల్పించారు కూడా. ఇదే సినిమా కోసం తానే రాసిన “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..” పాటకి జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు కూడా “వేణువై వచ్చాను పాటకి అవార్డు వస్తుందనుకున్నా..” అన్నారు వేటూరి.
“వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి.. మమతలన్నీ మౌనగానం.. వాంఛలన్నీ వాయులీనం..” ఇది పల్లవి, వెనుకే రెండు చరణాలు. తరచి చూస్తే పల్లవిలోనే ఒక జీవితం మొత్తం కనిపిస్తుంది. రావడానికీ, పోడానికీ మధ్య కొన్ని మమతలు, మరికొన్ని వాంఛలు.. అవేవీ శాశ్వతాలు కావు. ఆ మాటకొస్తే, రావడం, పోవడం కూడా ఎవరి చేతుల్లోనూ ఉన్నది కాదు కదా. మమతలు మనసులో దాగేవి, అవి మౌనరాగాలే. వాయులీన స్వరాల సరళికీ వాంఛలకీ మధ్య అన్వయం ఎవరికి వారు చేసుకోవల్సిందే.
“ఏడు కొండలకైన బండ తానొక్కటే.. ఏడు జన్మల తీపి ఈ బంధమే..” కొండలు ఏడయినా వాటన్నింటి బండ (రాయి) ఒక్కటే. ఆ కొండల మీద ఉన్న దేవుడు బండగా మారాడన్న నిందార్ధమూ గోచరిస్తుందిక్కడ. ఒకటి కాదు, రెండు కాదు, వెనుకటివి ఏడు జన్మల తాలూకు వాసనలు ప్రస్తుత జన్మలో అనుభవానికి వస్తాయంటారు. అలాగే, ఏడు జన్మలు ఎత్తితే తప్ప మానవ జన్మ రాదన్న మరో వాదమూ ఉంది. మొత్తం మీద “ఏడు జన్మల తీపి” ఈ జీవితం. “నీ కంటిలో నలక లోవెలుగు నే కనక నేను మేననుకుంటె ఎద చీకటి… హరీ…” నా స్థితికి నీ కంట్లో కూడా బాధ ఉంది, కానీ ఆ లోపలి వెలుగు నాకు కనిపించదు. అలా కనిపించక పోవడంతో నిన్ను విస్మరించి ‘నేను నా శరీరం’ అనుకుంటే నా ఎద చీకటి మయమవుతుంది ప్రభూ.. మొదట నింద, ఆ వెనుకే స్తుతి!!
“రాయినై ఉన్నాను ఈ నాటికీ.. రామపాదము రాక ఏనాటికీ..” నువ్వు రాయివి కాదు. కానీ, నేను మాత్రం రాయిగా పడి ఉన్నాను. ఎన్నాళ్ళకీ ఆ రామపాదం నా దగ్గరకి రానప్పుడు మరి వేరే దారేముంది? కేవలం రామపాదం సోకడంతోనే రాయి అహల్యగా మారిపోవడం ఒక అద్భుతం. అలాంటి అద్భుతం ఏదీ జరగనప్పుడు, రాయిగా మిగిలిపోవడం తప్ప చేయగలిగింది ఏముంది? జీవన పోరాటంలో రాళ్లుగా మారిపోయిన అందరినీ తాకాలంటే ఎన్ని రామపాదాలు కావాలో కదా. జన్మనీ, జన్మ తాలూకు కష్ట సుఖాలనీ తాత్వికంగా చెబుతూ మొదటి చరణం ముగుస్తుంది. ఇక, రెండో చరణం వచ్చేసరికి కథలో నాయిక జీవితం ఊహించని విధంగా తల్లకిందులైపోతుంది.
“నీరు కన్నీరాయె.. ఊపిరి బరువాయే.. నిప్పు నిప్పుగ మారె నా గుండెలో..” అనారోగ్యంతో శుష్కించిన నాయిక మరణం అంచులో ఉంది. భవబంధాలని ఒక్కొక్కటిగా వదిలించుకునే సందర్భంలో వచ్చే ఈ చరణంలో శరీరంలో ఉన్న పంచ భూతాలూ ఒక్కొక్కటిగా దేహాన్ని విడిచి వెళ్లడాన్ని చెప్పారు వేటూరి. నీరు కన్నీటి రూపంలో బయటికి వెళ్తోంది. తేలికగా ఉండాల్సిన ఊపిరి (గాలి) బరువుగా మారుతోంది. నిప్పు (అగ్ని) గుండెల్లో నిప్పుగా మారిపోయింది.”ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు.. పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు.. హరీ…” వచ్చేటప్పటి లాగే వెళ్లేప్పుడూ శూన్యమైపోయాయి బంధాలు. అవి నింగికి (ఆకాశం) చేరుకున్నాయి. మట్టిలో పుట్టిన ప్రాణాలు మట్టిలోనే కలుస్తున్నాయి. ఆమె కథ ముగిసిపోయింది కాబట్టి, పాట అయిపోయినట్టేనా? ఉహు.. లేదు.. అలా ముగిస్తే ఆ కవి వేటూరి కానే కాదు.
“రెప్పనై ఉన్నాను మీ కంటికీ.. పాపనై వస్తాను మీ ఇంటికి..” మరణంతో జీవితం ముగిసినంటే కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు. పుట్టిన ప్రతి ఒక్కరూ పోవాల్సిందే. పోయినవాళ్లు మళ్ళీ ఎక్కడో, ఎప్పుడో పుట్టాల్సిందే. మరణం అంచున ఉన్న వారికీ, వారి సన్నిహితులకీ కూడా ఈ మళ్ళీ పుట్టడం అన్న భావన నిజానికి పెద్ద ఉపశమనం. నేనెక్కడికీ వెళ్లడం లేదు, మీ కంటికి రెప్పలా ఉన్నాను, మళ్ళీ మీ పాపగా మీ ఇంటికివస్తాను అని వెళ్తూ వెళ్తూ తన పిల్లలకి చెబుతోందా తల్లి. అనివార్యాల తాలూకు బాధని కొంచమైనా తగ్గించుకోడానికి ఊతమిచ్చే గొప్ప ఆలోచన ఈ పునర్జన్మ. “వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోయాను గగనానికి..” అంటూ ముగుస్తుందీపాట.
వేటూరితో పాటు ఈ పాటకి ప్రాణం పోసిన మరో ఇద్దరినీ ప్రస్తావించుకోవాలి. స్వరకల్పన చేసిన కీరవాణి, నాయిక పాత్రలో మమేకమై ఆలపించిన చిత్ర. వాయులీనాన్ని గొప్పగా ఉపయోగించే సినీ సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. సెంటిమెంట్ ని హృద్యంగా పలికించదానికి వయోలిన్ ని మించిన వాయిద్యం లేదేమో. ఆడియో విడుదలైన కొత్తలో చాలామంది శ్రోతలు ఈ పాటని ఇళయరాజా స్వరకల్పనగా పొరబడ్డారు! ఇక, ఈ పాట వింటూ చిత్ర ని పరభాషా గాయని అని అస్సలు అనుకోలేం. వేటూరి గాయకుడు కూడా అయితే చిత్ర పాడినట్టే పాడేవారేమో అనిపిస్తుంది విన్నప్పుడల్లా. ఈ పాట ఔచిత్యాన్ని కాపాడిన మరో ఇద్దరినీ తల్చుకోవాల్సిందే. దర్శకుడు అజయ్ కుమార్, కథానాయిక మాధవి. ముఖ్యంగా, రెండో చరణం చిత్రీకరణ, మాధవి నటన వెంటాడుతూనే ఉంటాయి.
జాతీయ అవార్డు ఈ పాటకి వచ్చి ఉంటుందని వేటూరి అనుకున్నారంటే, అనుకోరా మరి! గత శతాబ్దపు ఎనభయ్యో దశకంలో వేటూరి రాసిన రెండర్ధాల పాటల్ని, అర్ధం లేని పాటల్ని తెగ తెగిడిన వాళ్ళు, ఇప్పటికీ విమర్శిస్తున్న వాళ్ళూ ఉన్నారు. అలాంటి పాటలు రాయడం కన్నా, గీత రచయితగా నిష్క్రమించి ఉంటే గౌరవంగా ఉండేది అన్నవాళ్లకూ కొదవ లేదు. అలా నిష్క్రమించడం పెద్ద విషయం కాదు. ఇంకెవరో వచ్చే వారు, రాసేవారు. కానీ, ఆ తర్వాత కాలంలో వేటూరి రాసిన పాటలు – మరీ ముఖ్యంగా ఈ పాట లాంటివి – మాత్రం మనకి దొరికేవి కావు. ‘రామపాదం’ లాంటి అద్భుతం ఏదో జరిగి వేటూరి మళ్ళీ పుడితే ఎంత బాగుండు!!
నెమలికన్ను మురళి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం
అసలు పోస్ట్ ఈ కింద లింక్ లో చూడవచ్చు