“సమయానికి తగుపాట పాడెనే..”

చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగా..

కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ…”

నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. అవును, ‘నవ్వినా కన్నీళ్లే’ నవల ఆధారంగా తీసిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా ఎప్పుడు చూసినా ఏదో ఒక సన్నివేశంలో కళ్ళు చెమ్మగిల్లక మానవు. ఒకవేళ చాలా సన్నివేశాలకి మినహాయింపు ఇచ్చుకున్నా, “సమయానికి తగుపాట పాడెనే..” పాటని సినిమాలో భాగంగా చూస్తున్నప్పుడు మాత్రం మనకి తెలియకుండానే ఓ పల్చటి నీటిపొర కళ్ళకి అడ్డం పడుతుంది.

త్యాగరాజ కీర్తన నుంచి కొంత సాహిత్యం తీసుకుని, సినిమా కథకి తగ్గట్టుగా మిగిలిన భాగం తాను పూరించిన వేటూరి, టైటిల్స్ లో మాత్రం మొదట ‘త్యాగరాజ కృతి (సమయానికి)’ అనీ, ఆ తర్వాతే తనపేరూ వేయించుకున్నారు. త్యాగరాజ స్వామి మీద వేటూరికి ఉన్న గౌరవం అది!! చాలా మంది సినీ సంగీతాభిమానులు సైతం ఈ పాట సాహిత్యం మొత్తం సద్గురు త్యాగరాజుదే అని పొరబడుతూ ఉంటారు.

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా.. పరవళ్లు తొక్కింది గోదారి గంగ..

పాపికొండలకున్న పాపాలు కరగంగా.. పరుగుల్లు తీసింది భూదారి గంగ..”

జానపదులు పాడే ఈ పదంతో పాట ప్రారంభమవుతుంది.. గోదారి భద్రాచలంలో ఉన్న రాముడి పాదాలు కడిగేందుకు పరవళ్లు తొక్కుతోందనీ, పాపి కొండలకి ఉన్న పాపాలు కరిగేందుకు భూదారి వైపు పరుగులు పెడుతోందనీ భావం..

“సమయానికి తగు పాటపాడెనే..” తో పల్లవి ఆరంభమవుతుంది. త్యాగరాజ పంచరత్నాల్లో ఒకటైన ‘సాధించెనే ఓ మనసా’ అనే కీర్తనలో భాగంగా వస్తుంది. కాగా సినిమా పాటలో ఆ వెంటనే వచ్చే “త్యాగరాజును లీలగా స్మరించునటు..” మాత్రం ఈ కీర్తనలో ఎక్కడా కనిపించదు. “దేవకీ వసుదేవుల నేఁగించినటు” ని “త్యాగరాజును లీలగా స్మరించునటు..” గా మార్చి, తన గీతం త్యాగరాజ కీర్తనకి అనుసరణ అని చెప్పకనే చెప్పారు.

కీర్తనలో తర్వాత వచ్చే సాహిత్యం “రంగేశుడు సద్గంగా జనకుడు, సంగీత సంప్రదాయకుడు..” దీన్ని “ధీమంతుడు ఈ సీతారాముడు, సంగీత సంప్రదాయకుడు” అని మార్చి, కథానాయకుడు సీతారామయ్యని పాటలో ప్రవేశపెట్టారు. త్యాగరాజ సాహిత్యంలో తర్వాత వచ్చే “గోపీజన మనోరథ మొసంగలేకనే, గేలియు జేసేవాడు..” ని కూడా కథకి తగ్గట్టుగా “రారా పలుకరా యని కుమారునే ఇలా పిలువగ నోచని వాడు” అని మార్పు చేశారు వేటూరి. సీతారామయ్య గారికి కొడుకుతో మాటల్లేవు కదా మరి.

చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చు

చిలకంటి మనవరాలు

సదాగ లయల తేల్చి సుతుండు చనుదెంచునంచు ఆడిపాడు

శుభ సమయానికి తగు పాట పాడెనే…

ఈ చరణం కూడా వేటూరి రాసిందే. తాతయ్యకి మనవరాలు ముద్దు. పైగా చిలకలాంటి మనవరాలు. రాక రాక వచ్చింది. ఆట పాటలతో పాటుగా, కొడుకు వస్తున్నాడనే శుభవార్త కూడా పట్టుకొచ్చింది. మరి, ఆ శుభ సమయానికి తగిన పాట పాడుకోవాలి కదా.

సద్భక్తుల నడతలిట్లనెనే

అమరిక గా నాపూజ కొనెనే, అలుగవద్దనెనే

విముఖులతో చేరబోకుమనెనే, వెతగల్గిన తాళు కొమ్మనెనే

దమశమాది సుఖదాయకుడగు

శ్రీ త్యాగరాజ సుతుడు చెంతరాకనే…

పాట చివరి చరణానికి మాత్రం త్యాగరాజ సాహిత్యాన్ని యధాతథంగా ఉంచేశారు. ఈ సాహిత్యం సందర్భానికి అతికినట్టు సరిపోతోంది కనుక, మార్చాల్సిన అవసరం పడలేదు. త్యాగరాజస్వామి వారు ఇంకో అర్ధంతో పాడితే, సీతారామయ్యగారు కొడుకు మీద కినుకని ప్రదర్శించారు. ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన తన తండ్రి మీద, ఆయన తండ్రికి ఇంకా కోపం మిగిలి ఉండడాన్ని జీర్ణించుకోలేక పోయింది ఆ మనవరాలు. అందుకే, పాడడం ఆపేసి, మోకాళ్ళ మీద తల పెట్టుకుని వెక్కిళ్లు పెట్టి ఏడ్చింది. తాతయ్య ఓదార్చబోతే, అవి కన్నీళ్లు కాదు, ఆనంద భాష్పాలని అబద్ధం చెప్పింది.

సాధారణంగా పాటంటే ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. ఈ పాట జానపదులు పాడుకునే పదంతో మొదలైంది. మరి అక్కడే ముగియాలి కదా.

బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగా.. పరవళ్లు తొక్కింది గోదారి గంగ..

చూపుల్లో ప్రాణాల శబరమ్మ గంగా..కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగ..”

గోదారి పాటలోకి ‘శబరి’ ఎందుకు వచ్చిందన్న సందేహం సహజం. శబరి, గోదావరి నదికి ఉప నది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. కానీ, శబరి మాత్రం గోదారిలో కలుస్తుంది. అప్పటికి ఆయనకి తెలియకపోయినా, సీతారామయ్య గారి జీవితంలో ఓ విపర్యయం జరిగింది. తాను కొడుకు చేతిలో వెళ్లిపోవాల్సి ఉండగా, ఆ కొడుకే తనకన్నా ముందుగా వెళ్ళిపోయాడు. ఆ విషాదం ఆ మనవరాలికి తెలుసు.. కాబట్టే ఆమె కళ్ళల్లో కన్నీటి గంగ పొంగింది. నిజం తెలియని సీతారామయ్య మాత్రం, అలనాడు రాముడికోసం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకుని ఎదురు చూసిన భక్త శబరిలా కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఆరభి రాగం, ఆది తాళంలో త్యాగరాజ స్వామి స్వరపరిచిన కీర్తన ఆధారంగా తయారు చేసిన ఈ పాట స్వరకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కీరవాణి. సంగీతజ్ఞుల నుంచి అభ్యంతరాలు రానివిధంగా స్వరం చేస్తూనే, సినిమా ప్రేక్షకులని దృష్టిలో ఉంచుకుని ముందూ వెనుకా జానపదుల పదాన్ని చేర్చారు. ముఖ్యంగా వాయులీనంతో మరోమారు అద్భుతం చేశారు.

సినిమా కథ మొత్తాన్ని ఆవాహన చేసుకున్న వేటూరి పాత్రల్లో లీనమై ఒక్క పాటతో సగం కథ చెప్పేసే విధంగా సాహిత్యం అందించారు. కోరస్ తో కలిసి బాలు, చిత్ర హృద్యంగా ఆలపించారు. అభిరుచిగల చిత్రాన్ని నిర్మించిన వి. దొరస్వామి రాజుని, దర్శకుడు క్రాంతికుమార్ నీ కూడా అభినందించాలి. ఇక నాగేశ్వర రావు, మీనా అయితే నిజంగా తాత, మనవరాలు అనిపించేలా చేశారు.

ప్రముఖ కవుల కవిత్వంతో పాటను నింపేసి, సొంతపేరుతో చలామణి చేసుకునే కవులున్న సినిమా ప్రపంచంలో వేటూరి లాంటి కవులు అరుదు. వేటూరి పాటలనుంచి చాలా నేర్చుకున్నాం అని చెప్పేవారందరూ, త్యాగరాజస్వామికి వేటూరి ఇచ్చిన గౌరవాన్ని కొంచమైనా గమనిస్తే బాగుండును.

నెమలికన్ను మురళి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

అసలు వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు

http://nemalikannu.blogspot.com/2019/01/blog-post_28.html

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top