ఈయన ఊరికే వుండలేడు. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన! ఆ జుట్టంతా అలాగే ఊడివుంటుంది. చిన్నతనాన మనందరం నిత్యమూ పారాయణ చేసిన ‘భక్తకన్నప్ప’ చిత్రంలోని కిరాతార్జునీయాన్ని మళ్ళీ గుర్తుచేసిన కిరాతకుడీయన!
సినిమాపాట…అని వెక్కిరించే మూకను మూకాసురవధ చెయ్యాలని నొక్కివక్కాణించిన వీరుకూడా మరో శివరూపుడే!
వత్తి కొరికి పడేశాడీయన! నాకిక్కడ పేలింది. రాయాలన్న మంట పుట్టింది.
అసలంతా వేటూరివారే రాశారు. మనదంతా ఉస్సూ బుస్సూ అంటూ ఊకదంపుడే! అయినా ఆపం! అదే మీకూ, నాకూ శాపం! చిత్తగించండి!
సందర్భం:
భక్తకన్నప్ప చిత్రాన్ని అలంకరించిన కిరాతార్జునీయం పాటపై స్పందన
అసందర్భం:
వేటూరాయన పుట్టినరోజూ కాదు, వర్ధంతీ కాదు.
అవసరం, అగత్యం, ఆమాటకొస్తే విధాయకం:
ఏదో ఒకరోజు అయితీరాలా? నిత్యమూ నెమరువేసుకునే ఆపాటల్లానే.. ఆయనను గుర్తుచేసుకోవడానికి ఏరోజైతేనేం?
ఇక చదవండి…..
***********************
అర్ధనారీశ్వర తత్త్వాన్ని అన్నివేళలా అవలంబించే ఆదిదంపతులకు భావాలు కూడా కలిసిమెలిసే వుంటాయా?
ఆ దంపతులిరువురూ కైలాసాన కమనీయమైన నృత్యాన్ని అత్యంత పరవశులై అభినయిస్తూ వుండగా సకలలోక భయంకర తపశ్శక్తితో మంచుకొండలనే కరిగించగలిగాడు అర్జునుడు.
ఆతని ఆకాంక్ష పాశుపతం. పశుపతిని పొంగించి పబ్బం గడుపుకోవడం ఈ భక్తకోటికి పరిపాటే కదా? ‘నీవుదక్క దేవుడెవరు?’ అంటూ నిష్ఠగా నిలిచి కొలిస్తే అంతటి మహాశివుడికీ మూడుకళ్లూ అర్ధనిమీలితాలైపోతాయి. మనసు కరుణమేఘావృతమవుతుంది. ఆనక వరాలజల్లై కురుస్తుంది. అది నిష్కల్మషమైన వాన.
రాయీరప్పా, కొండాకోనా, చేనూమానూ..అని చూడదు. అవసరమా, అపాత్రమా ఎంచదు. మళ్లీ తనకు కావలసిన తిండికోసం అడుక్కుతినేవాడే అయినా ఇంతటి వరాల వర్షమూ కురిపించడంలో మనసున్న మారాజు మహేశ్వరుడు!
ఆ బలహీనతే భక్తుల బలం. రాక్షసులంటూ ఎవరున్నారు ఈలోకంలో? నీ మనసు వశంతప్పి నియమోల్లంఘన చేసినప్పుడు పదిమందీ నిన్నసహ్యించుకుంటారు. నీతి తప్పి నికృష్టంగా నడిచినపుడు నీ చావు కోరతారు.
కోరికలే కొమ్ములు. కుటిలబుద్ధులే కోరలు. అటువంటి అసురులను సైతం అనుగ్రహించడం అమరేశ్వరుడికి ఆనవాయితీ.
అటువంటిది పాండవ మధ్యముడే పట్టుబట్టి ప్రాణాయామమొనరిస్తోంటే ఆ ఓంకారధ్వనికి బూడిద పూసిన ఒడలంతా పులకరించి చిరునగవే మోమున నిలుస్తుంది.
ఇదేమీ ఎరుగని ఆ జగన్మాతకు ‘ఆ ప్రకంపనల కారణమేమా?’ అన్న సందేహం సగము దేహాన మొలకెత్తుతుంది.
ఇదీ సందర్భం. కలం వేటూరిది. స్వరం బాలుడిది. అదృష్టం మనది.
చిత్తగించండి….
“జగమునేలినవాని సగము నివ్వెరబోయె…
సగము మిగిలినవాని మొగము నగవైపోయె…”
ఇంత క్లుప్తంగా అర్ధనారీశ్వర తత్త్వాన్ని రెండు వాక్యాలలో ఒలకబోస్తాడు.ఆశ్చర్యం ఆమెది. ఆనందమయమైన అవలోకన అతనిది. బయలుదేరాల్సిన అవసరాన్ని అమ్మకు అవగతమొనరించిన పిమ్మట తక్షణం భూలోకానికి పయనమవుతారు.
మరి ముస్తాబో? ఫణిభూషణుడు భక్తసులభుడేగానీ వచ్చినవాడు ఫల్గుణుడు! అతగాడి ప్రతాపమెంతో పరీక్షించిగాని అంతటి అస్త్రాన్ని అనాయాసంగా ఇచ్చెయ్యరాదు. అందుకే….
“ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా…
తల్లిపార్వతి మారె తాను ఎరుకతగా…”
అన్నీ తెలిసిన అమ్మహామహితాత్ముడు కూడా మారువేషాన్నే మార్గమని భావించాడు. ఆవిడా సైయంది.
“నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె…
తలలోని గంగమ్మ తలపులోనికి జారె…
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె…
బూదిపూతకు మారు పులితోలు వలువాయె…”
వేటూరాయనే అక్కడుండి ముస్తాబంతా నిర్వహించాట్ట!
ఆకాడికి అంతా చూసొచ్చినట్టు ఎలా రాశాడో చూడండి!!
నిరతమూ నిదరోయే నివురుగప్పిన నిప్పులాంటి నేత్రం కాస్తా నిటలాక్షుని నుదుట బొట్టై మెరిసిందట!
నెలవంకనేమో నెమలీకగ మార్చేశాడు!
మనం ఊహించుకునేదే రూపం. నిజానికి నిరాకార నిరామయుడాయన! ఒడలంతా బూదిపూసుకున్నా అందరూ కనులారా వీక్షించే కమనీయ రూపమతనిది. శంఖుచక్రగదాసంహిత శ్రీమహావిష్ణువల్లే ధగద్ధగాయమానమైన మెరుపులుండవు. అందమైన నగలకు బదులు నాగులుంటాయి.
అయినా మనోహరుడే! కరుణరసాత్మక హృదయమే కనువిందైన రూపం. హిమవన్నగమే ఆ వ్యక్తిత్వం!
పులితోలును ఆచ్ఛాదనగా కప్పుకుని పుడమికేతెంచాడు పురుషోత్తముడు!
పందినడ్డం పెట్టుకుని పార్థుడితో పోరాటానికి దిగాడు!
“గాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించె అర్జునుడు
కానీ
అపుడతడు వేయిచేతుల కార్తవీర్యార్జునుడు… ”
ఎంత పరాక్రమవంతుడైనా అర్జునుడు ఆ క్షణాన కార్తవీర్యార్జునుడే అయ్యాడట!
వేయిచేతులున్న అత్యంత ధీశాలి కార్తవీర్యార్జునుడు. అహంభావంతో జమదగ్ని మహర్షిని అంతమొందిస్తాడు. పరమశివుని అంశయైన పరశురాముని గొడ్డలికి తన వేయిచేతులూ పోగొట్టుకుని విగతజీవుడవుతాడు.
శివాంశతో ఢీకొన్న కార్తవీర్యుణ్ణీ…
సాక్షాత్తూ శివుడితోనే సైయన్న అర్జునుణ్ణీ…పోల్చటం… సుందరరాముడి ఆలోచనామృతం!
శంకరునెదుర్కొనలేక మూర్ఛిల్లుతాడు అర్జునుడు. అపుడు పార్వతీసమేతుడై సాక్షాత్కరించి వరప్రసాదమొనరిస్తాడు. పాశుపతాన్నివ్వమని కిరీటి కోరగా మంత్రధ్యాన జపహోమ పూర్వకంగా పాశుపతాన్ని అర్జునునికిస్తాడు.
కథ మనందరికీ తెలిసినదే అయినా ’బాపు’రే అనిపించగల దర్శకుడి చేతిలో పడిందది! అగ్నికి వాయువల్లే ఆయన కలకు వేటూరివారి కలం తోడయ్యింది.
డబ్బుపెట్టి తీసే సినిమాలో మనసుపెట్టి పాటరాస్తే పాటొక్కటే మిగులుతుంది.
మనసూ డబ్బూ పెట్టి తీసే సినిమాలో మాటాపాటా కూడా మమకారంతో రాస్తే ముందు డబ్బులపెట్టి నిండుతుంది.
ఆనక ఆ మనుషులు మనుగడ వున్నంతవరకూ కీర్తిమంతులుగానూ, మరణానంతరం కీర్తిశేషులుగానూ మిగులుతారు!
సినీ వినీలాకాశంలో నిత్యం వెలిగే మెరుపులన్నీ వేటూరి కలానివే!
సమాజాన్ని ప్రశ్నించడంలో సుందరరాముడు వేసే అక్షరబాణాలు ఇప్పటికీ ఆ గాయాల్ని కెలుకుతూనే వుంటాయి!
మరికొన్ని గీతాలు సకలజనావళీ సర్వకాల సర్వావస్థలందూ దీపావళి చేసుకోవడానికి మూర్తిగారు సమకూర్చిన అక్షరబాణాసంచా కూడా!
అందులో జ్ఞానంతో మెరిసేవీ…(మధురమధురతర మీనాక్షి),
విస్పోటనం సృష్టించేవీ…(ఈ దుర్యోధన దుశ్శాసన),
జగమంతటికీ వెలుగును ప్రసాదించేవీ…(కృషివుంటే మనుషులు),
నిన్ను దహించివేసేవీ…(రగులుతోంది మొగలిపొద),
మనసుని జువ్వల్లే రివ్వుమని ఎగరేసేసేవీ…(ఝుమ్మందినాదం సైయంది పాదం),
భూచక్రంలా నిలబడ్డచోటే తిప్పిపడేసేవీ…(నవ్వింది మల్లెచెండూ),……
ఇలా అనేక పాటలున్నాయి.
ఆయన నడయాడిన నేలపై మనమూ కాళ్లూనడమే మనభాగ్యం. ఆ పాట వింటూ చెవికోసుకోవడం కూడా మహాభాగ్యమే!
–———————————————————–
డా.జగదీశ్ కొచ్చెర్లకోట గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీమ్
అంత అతి పొగడ్తలు అవసరం లేదు. వేటూరి అప్పుడప్పుడు కొన్ని మంచి పాటలు వ్రాశాడు. 90 శాతం బూతు చెత్త పాటలు రాశాడు. అర్థం పర్థంలేని వ్యర్థ పదాలతో ఎన్నో దరిద్రం పాట్లు రాశాడు.