వేటూరి సుందర్రామ్మూర్తి గారు గొప్ప కవి మాత్రమే కాదు, గొప్ప భక్తి ఉన్నవారు కూడా. ఈ “భక్తి” ఆయన సినిమాలకి రాసిన అనేక భక్తిపాటల్లో కనిపిస్తుంది. అయితే ఈ భక్తి సినిమాలను దాటి కూడా ప్రవహించిందనీ, ఆయన సొంత డబ్బులతో కొన్ని భక్తి కేసెట్లు “గీతాంజలి” శీర్షికన తీసుకువచ్చారని చాలా మందికి తెలియదు. ఈ సంగతిని “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకంలో ప్రస్తావిస్తూ ఇలా అన్నారాయన –
“సినీగీతరచనకు దూరంగా, “నేనూ, నాదీ, నా కోసం” అనే స్పృహ నా తీరంగా రాసుకున్న పాటలు కొన్ని గీతాంజలి పేర కాసెట్లుగా వచ్చాయి. వాటిల్లో “శ్రీ వేంకటేశ్వర పదములు” అని నేను రాసిన గీతాలు స్వరబ్రహ్మ అమృత హస్తాలతో పులకించి పూజా కుసుమాలు అయినాయి. అలాగే “భద్రాచల శ్రీరామ పట్టాభిషేకం” చక్రవర్తి స్వరకల్పనలోను, “స్వామియే శరణం అయ్యప్ప” రాజుకోటి సంగీతంతోను వెలువడ్డాయి. “కబీర్ వాణి” కూడా చక్రవర్తి స్వరకల్పనలోనే వినిపించడం జరిగింది”.
ఈ ప్రవైటు గీతాలలో వేటూరి గారి మనసు, ఆ మనసులోని భక్తి భావం మనకి స్పష్టంగా కనిపిస్తాయి. వారి పాటలలో కనిపించే నిజాయితీ, వేదనా, అర్పణా మననీ తాకి పులకింపజేస్తాయి. సంసార ఝంఝాటంలో పడిన మన మనసులని ఆ సర్వేశ్వరునిపైకి మరలిస్తాయి ఈ గీతాలు. ఈ వ్యాసంలో “కబీర్ వాణి” పాటల గురించి ముచ్చటించుకుందాం.
“కబీర్ దాస్” సినిమాలో – “గ్రహమేలా, విగ్రహమేలా, రామానుగ్రహమే ఉంటే, నీ నిగ్రహమే నీకుంటే!” అంటూ అద్భుతంగా కబీర్ బోధని వివరించిన వేటూరికి కబీర్ అంటే ప్రత్యేకమైన అభిమానమేదో ఉండి ఉంటుంది. అందుకే కబీర్ బోధని పది పాటలుగా “కబీర్ వాణి” లో అందించారు. ఈ పాటల్లో రామభక్తుడైన కబీర్ బోధనలని అతి తేలిక మాటలతో వేటూరి అందిస్తే ఆ మాటలను పంచదార గుళికల్లా మధురంగా చక్రవర్తి స్వరపరిచారు. ఈ భక్తి ప్రబోధ గీతికలను బాలూ ఎంతో హృద్యంగా ఆలపించారు. వెరసి ఈ ఆల్బం లోని పాటలన్నీ ఆణిముత్యాలే.
ఈ పాటలలో వినిపించే చాలా భావాలు భక్త కబీరువే అని, వేటూరివి కావని, మనం గుర్తుంచుకోవాలి. వేటూరి ఎంతవరకూ కబీర్ ని పూర్తిగా అనువదించారు, ఎక్కడెక్కడ అనుసృజించారు అన్నది కబీర్ సాహిత్యాన్ని బాగా తెలిసిన వాళ్ళు చెప్పాలి! వేటూరి కబీర్ పై భక్తిభావంతో, ఆయన పదాలను, పాదాలను కళ్ళకద్దుకుని, తనదైన శైలిలో అందంగా రాశారని మాత్రం ఈ పాటలు విన్న అందరూ ఒప్పుకుని తీరతారు!
“వినుమా రామనామ మహిమా!” అనే పాటతో ఆల్బం మొదలవుతుంది. ఇది చాలా చిన్న పాట, కానీ అంత చిన్నపాటలోనే రామతత్త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు వేటూరి. “వినుమా రామనామ మహిమా, విషయవలయమున విహరించు మృగమా!” అంటూ విషయవాంఛలలో మునిగితేలుతూ ఉంటే, ఉదాత్తమైన మానవ జీవితం కూడా పశుపక్ష్యాదుల వలె మిగిలిపోతుందని గుర్తు చేస్తారు. తీరని కోరికలతో మరిగే హృదయానికి చల్లదనమూ, సంసారంలో పడి రాటుదేలిన హృదయానికి సౌకుమార్యమూ ఇచ్చి ఇహం నుంచి పరం చేర్చే వారధిగా రామనామాన్ని గొప్పగా వర్ణించిన పాట ఇది –
హిమశీతలము సుమపేశలము
ఇహపరములకే సేతుబంధనము
వినుమా రామనామ మహిమా!
మనుషులందరూ ఒకటే, పేరు అల్లా అయినా, రాముడు అయినా దైవస్వరూపం ఒకటే అని ప్రబోధిస్తూ సాగే “వెలిగించరా రామజ్యోతి” పాట పల్లవిలో రంజాన్ వంటి పండుగలలో మహమ్మదీయులకి ఎంతో ముఖ్యమైన “నెలవంక” కీ, శివుని తలలో నెలవంకకీ పోలిక పెట్టడం, హృదయంలో దైవాన్ని దర్శించడం ముఖ్యం గానీ పేర్లు “అలా అన్నా ఇలా అన్నా” (ఇక్కడ అలా బదులు “అల్లా” వాడి వేటూరి రెండర్థాలు స్ఫురింపజేస్తారు) అనడం చాలా బావుంది!
వెలిగించరా రామజ్యోతి
కరిగించరా జన్మా జాతి!
చెప్పకు మాదని నెలవంక
చూడరా శివుని తలవంక!
అల్లా అన్నా ఇల్లా అన్నా
ఆత్మారాముని వంక!
మనుషులందరూ పీల్చే గాలీ, తాగే నీరూ ఒకటే, మనషుల్లోని కామక్రోధాదులు ఒకటే, పుట్టే కడుపూ, చేరే కాడూ ఒకటే అని మొదటి చరణంలో చెబుతూ చివరలో – “ఆ ఒకటి విడిస్తే చీకటే, అంతా చీకటే!” అంటూ అద్భుతంగా ముగించడం వేటూరి ప్రతిభే!
“రామ విభో రహీము విభో, మతిలేని మతమేలరా ప్రభో” అనే పాట చదువులేని పామరులు, చదువుకున్న వాళ్ళూ కూడా కులవాదాలతో, మతభేదాలతో కొట్టిమిట్టాడుతుండడాన్ని నిరసిస్తూ సాగే పాట. మొదటి చరణంలో “ఏ మతము చెప్పినా మానరుగా!” అనడంలో “అన్ని మతాలు చెప్పే సారం ఒకటే” అన్న అర్థంతో పాటూ “ఎంత హితవు చెప్పినా వినరు” అనే అర్థమూ ఉంది! నీ లోపలి వెలుగు చూడకపోతే, ఈ వాద వివాద వైరుధ్యాల పాత కథ మారకపోతే, నీ మనిషితనమే వ్యర్థం అన్న గొప్ప సందేశంతో పాట ముగుస్తుంది –
ఆ వెలుగొకటే అది చూడకపోతే
నీ పాతకథే ఇక మారకపోతే
నీ మానవత్వమే వ్యర్థమురా
నీ మనసేరా నీ మతమంటే
నరుడా, కబీరే సాక్షిరా!
“నేను” అనే అహంకారమే అన్ని సమస్యలకీ మూలమనీ, అది మనిషిని వెలుగు చూడనివ్వక అంధకారంలోకి తోసేస్తుందనీ ఎందరో గురువులు మనకి బోధించారు. ఈ అహంకారాన్ని కాశీలో వదిలెయ్యమనీ, గంగలో కలిపెయ్యమనీ చెప్పే “నేననే అధికారము” పాట పల్లవి ఆకట్టుకుంటుంది –
నేననే అధికారము
నాదనే మమకారము
కాశిలో వదిలెయ్యరా, గంగలో కలిపెయ్యరా!
మనవి అనుకున్న సిరిసంపదలూ, బాంధవ్యాలూ ఏవీ మన సొంతము కావు. ఇవన్నీ పోయేటప్పుడు వదిలేసుకుని పోవలసిందే. మరి నీవైన సంపదలు ఏవీ అంటే అవి “త్యాగము, జ్ఞానము” మాత్రమే. ఇది కబీర్ గురువైన స్వామి రామానందుడు చెప్పిన మోక్షమార్గం. మనందరికీ అనుసరణీయం –
కాదులే లోకం ఏనాడు సొంతం
దేహం కూడా కొన్నాళ్ళే సొంతం
బాకీ వసూలు చేసే వేళకు
చెల్లించుకోవాలి నీ జన్మ వడ్డీలు!
త్యాగం ఒకటే నీకున్న ధనము
జ్ఞానం ఒకటే తీర్చేను రుణం
రామానందుడు బోధించెరా మోక్షమార్గం!
“దేహమే ఒక గ్రామము” అనే పాటలో కబీర్ దేహాన్ని ఒక గ్రామంగా ఊహించి, ఆ గ్రామానికి అధికారిగా జీవుడిని రాముడే నియమించాడనీ, నిజమైన రారాజు రాముడేనని గుర్తించాలని బోధ చేస్తాడు –
దేహమే ఒక గ్రామము
గ్రామాధికారే జీవుడు
ఆలనాపాలనా చూసుకుంటాడురా రాముడు!
ఈ పాటలో చాలా వేదాంత సూక్ష్మాలు దాగి ఉన్నాయి. చాలా వివరణ అవసరమైన పాట ఇది. కోరుకోవడం – కోరుకున్నది దక్కినా ఆశ తీరకపోవడం లేక దక్కకపోతే నిరాశ చెందడం – తిరిగి ఏదో కోరుకోవడం ఈ ఛట్రం దాటని సంసార చక్రాన్ని “చేయక తప్పని వ్యవసాయం” గా మొదటి చరణం వర్ణిస్తుంది. పంచభూతాలు – ఆ గ్రామానికి రైతులు, హృదయం – వ్యవసాయ క్షేత్రం, ఆశ – నాగలి. “ఎంత ఫలసాయం అందినా” ఈ వ్యవసాయం ఆగేది కాదు, ఆశ తీరేది కాదు!
గాలీ నీరూ నిప్పూ మట్టీ ఆకాశం
ఈ గ్రామానికి కర్షకులు
హృదయం కేదారం
ఆశే ఆధారం
ఎంత అందినా ఫలసాయం
చేయక తప్పదు వ్యవసాయం
“వెలుగు చూడ తరమా…నీలో నాలో వెలిగే రాముని వెలుగు చూడ తరమా” అంటూ మొదలయ్యే పాట ఆ రాముని వెలుగుని ఎలా చూడాలో చెబుతుంది. రెండో చరణంలో పైపై వేషభాషలు, పాండిత్య ప్రకర్షలూ కాక ప్రతి పువ్వులోనూ రాముని నవ్వునీ, రాత్రి తారల్లో రాముని చూపులనీ, ఇలా పైకి కనిపించే వస్తువులన్నిటిలోనూ రాముని చూడగలిగిన వాడే లోన వెలుగునూ చూడగలడు అన్న భావం చాలా బావుంది.
ఈ పువ్వులు ఆ రాముని నవ్వులే
ఆ తారలు నీ దేవుని చూపులే
విమలాచారం, విప్రవినోదం
వేదం, వాదం, వేసే వేషం
ఆ రాముడెన్నడూ కోరడురా
తెలిసిన మనిషిని నన్ను తెలియరా!
“ఎన్నాళ్ళు సాగేను ఈ గోల రామా, ఈ పంచభూతాల లీల!” అన్న పాట జీవుని వేదనకు అద్దం పట్టేది. ఎంత ప్రయత్నించినా, ఎన్ని సాధనలు చేసినా, చర్మముతో కప్పబడిన దేహాము అనే వలలో చిక్కిన చిలకలా (శుకము) జీవుడు అలమటిస్తూనే ఉన్నాడు. ఈ దేహాన్నీ, మనసునూ దాటి ఆత్మసాక్షాత్కారం పొంది ఆనందసాగరము చేరేదెన్నడో అని ఓ భక్తుడు పడే వేదనే ఈ గీతం.
చర్మనాడుల వలను తెంచజాలని వేళ
అస్థిపంజరపు శుకము అలమటించే వేళ
ఆనంద సాగరము చేరుకోలేని
నా ఆత్మహంస హింస పాలగు వేళ
రామా! రామా! రామా! రామాభిరామా!
ఎన్నాళ్ళు సాగేను ఈ గోల …
భగవంతుని కరుణ పొందాలటే స్వచ్చమైన మనసుండాలి కానీ గంగాస్నానాలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. కబీర్ శుష్కమైన ఆచారాలని, మతిలేని మూఢనమ్మకాలనీ నిరసించాడు. భక్తీ, మతము అన్నవి మనం పైన చూపించే ఆచరణలో లేవు, మన అంతఃకరణ పరిశుద్ధతలో ఉన్నాయి అని తెలియజెప్పే రెండు పాటలు “రామ్ కహో భాయీ”, “పలుకకు యాభై ఆరక్షరాలు” అన్నవి. “రామ్ కహో భాయీ” పాట రెండో చరణంలో “రామ రతనము” నీదైతే చాలు, దాని ముందు మణులైనా శిలలే అన్న భావం బావుంది –
కాశీ యాత్రకు కదలకు భాయీ
కరుణాహృదయం కాశీ భాయీ!
గంగ మట్టిలో పుట్టిన ఉల్లి
మల్లిగ మారదులేరా భాయీ!
రామరతనమే నీదైతే
సిరులూ మణులూ మెరిసే శిలలోయీ!
ఆ రాముడొక్కడే హితుడోయీ!
“పలుకకు యాభై ఆరక్షరాలు” పాట పల్లవిలో రాముని బీజాక్షరాలే చాలు, ఇంకేమీ అక్కరలేదు అన్న భావం చాలా అందంగా ఒదిగింది –
పలుకకు యాభై ఆరక్షరాలు
పలికిన చాలు రెండక్షరాలు
రామా! రామా! రామా! రామా!
“రామా” అన్నవి ప్రేమాస్పదులకు
తెలిసిన రెండే బీజాక్షరాలు!
ఈ పాట రెండో చరణంలో మహమ్మదీయులకి సుతిమెత్తగా బోధించే కబీర్ దర్శనమిస్తాడు –
“అల్లా” అని ఆ ముల్లా అరుచును
చెవిటివాడనా తన దైవం!
తన అణువు అణువునా అల్లా ఉంటే
ఎందుకు అల్లాడాలీ లోకం?
చివరిపాటైన “పగిలిపోయేది ఘటము” పాట పల్లవిలో “ఘటాకాశ” సిద్ధాంతాన్ని రాముని పరంగా ఎంతో అందంగా చెప్పడంలో వేటూరి ప్రతిభ తెలుస్తుంది –
పగిలిపోయేది ఘటము
మిగిలి ఉండేది గగనము
గగనంలో తార రాముడు
గ్రహణమే లేని చంద్రుడు
తెలుసుకో వెర్రి మనసా!
ఇది కబీరు వేదపనస!
చివరిగా వెళుతూ వెళుతూ ఇచ్చిన సందేశం మహత్తరమైనది! దేహాన్ని కుండతో పోలుస్తూ, ఆ కుండలో నిండుగా కామక్రోధాదులు ఎందుకున్నాయని ప్రశ్నిస్తూ, రాముని శరణు వేడుకుని ఆ రామభక్తినే కుదురుగా చేసుకుంటూ, నీ కడవని నిలుపుకో అని చెప్పే భక్తీ వేదాంతం కలబోసిన సందేశం మనకి శిరోధార్యం. ఈ చరణం “ఎందుకురా గొడవ!” అని ముగుస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే కబీర్ సందేశ సారాంశం. ఇక్కడ “గొడవ” అన్నది మన తాపత్రయాలనీ, అహంకార ప్రకటనలనీ, భక్తిలేని ఆచారాలనీ, తర్జనభర్జనలనీ, వాదవివాదాలనీ సూచిస్తోంది. ఈ గొడవేమీ పట్టక, రామభక్తిలో లీనమై, రాముణ్ణే నమ్ముకున్నవాడు సులభంగా తీరాన్ని చేరతాడు!
కుండ పగిలితే అతకదు మళ్ళీ
కులుకు మానరా మనసా
కుండ నిండుగా కామం క్రోధం
లోభమేలరా మనసా
రామభక్తినే కుదురుగ చేసి
నిలుపుకోర నీ కడవ
భక్తిగంగలో మోక్షతీరమే
చేరనీర నీ పడవ!
ఎందుకురా గొడవ!
“పదాల పోహళింపుతోనూ స్వరాల మేళవింపుతోనూ పుట్టుకొచ్చే పాటలు మానసోల్లాసం కలిగిస్తాయి – ఆత్మదాహం తీర్చలేవు” అని వేటూరి రాసుకున్నారు. ఈ ఆత్మదాహాన్ని తీర్చుకునే పాటలే ఈ “కబీర్ వాణి” లాంటి పాటలు. కమర్షియల్ పాటలు రాస్తూనే ఇలా ఆర్తికోసం, ఆత్మదాహం కోసం పాటుపడ్డారు కనుకనే వేటూరి కేవలం సినిమా కవిగా కాక నిజమైన కవిగా గుర్తింపు పొందారు. వేటూరి “శృంగార కవి” మాత్రమే కాదు, గొప్ప “భక్త కవి” కూడా. అందుకు ఈ గీతాంజలి భక్తిపాటలే తిరుగులేని సాక్ష్యాలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇదే నా చిరునివాళి.
వేటూరి సాహిత్యంతో పాటూ చక్రవర్తి బాణీల కోసమూ, బాలూ గానం కోసమూ ఈ పాటలు విని తీరాలి. పాటలు వింటూ పాటల సాహిత్యాన్ని ఇక్కడ చదువుకోవచ్చు.