ఆత్రేయ తీపి గురుతులు (వేటూరి)

‘జనవరి 29’న వేటూరి గారి జయంతి. ఆ సందర్భంగా వేటూరి గారు తనకు ప్రీతిపాత్రులయిన గొప్ప రచయిత, మనసుకవి ఆచార్య ఆత్రేయ గారి గురించి వ్రాసిన వ్యాసం మీకోసం:

acharya athreya photos (2)

 

ఆత్రేయ నా సొంత మనిషివింత మనీషిఋషి.
ఆయన జీవిత ధోరణి అందరికీ అర్థం కాదు.
ఆయన పాట ఎందరికో అర్థమయ్యేది.
ఆత్రేయ కవిగా జీవించాడు . మనిషిగా రాశాడు.
ఒక జీవితకాలం పాటు తన గుండె గుట్టుగా చేసిన చప్పుళ్ళే ఆత్రేయ పాటలు.
తలుపు మూసిన ప్రేయసి తలవాకిట నిలబడి
పిలిచి పిలిచీ బదులే రాక అలసి తిరిగి వెళ్ళిపోయిన
తీరని దాహార్తి ఆత్రేయ మానవతామూర్తి.

 

 

 

చలించడం, కనులు చెమరించేటట్లు గుండె ద్రవించడం నిజమైన కవికి జీవలక్షణం. ఏ పాట విన్నా అది ఎవరు రాసినా అందులో ఆర్ద్రత వుంటే దానికి దాస్యం చేశాడు ఆత్రేయ. ఎక్కడో విజయాగార్దెన్స్ లో రికార్డింగు జరుగుతోంది. అది ‘పండంటి జీవితం’ చిత్రానికి సంబంధించిన పాట. ఎందుకో అటు వెళ్ళాడు ఆత్రేయ. పల్లవి విన్నాడు. అంతే ఎక్కడో జెమిని రికార్డింగ్ థియేటర్ లో వున్న ఆ రచయితను వెతుక్కుంటూ వచ్చి జుట్టు పట్టుకుని తలవంచి నెత్తిని ముద్దు పెట్టుకుంటూ ‘ఎంత చక్కని పల్లవి రాశావురా…. ఎంత బాగుందిరా’ అని చటుక్కున తిరిగి కారెక్కి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ పల్లవిలో పెద్ద విశేషం ఏమీ లేదు. అయినా ఆత్రేయకి నచ్చింది కనుక ఆ పల్లవి గొప్పది.

‘అంతులేని అనురాగం అన్నగా
చెల్లిపోని మమకారం చెల్లిగా
దీవించనీ నిన్ను అమ్మగా నాన్నగా
వెరసి మీ అన్నగా’

ఇదే ఆ పల్లవి. ఈ పల్లవి ఆత్రేయకి చాలా రోజులు జ్ఞాపకం ఉండిపోయింది. ఎందుకంటే అనేకసార్లు మళ్ళీ అదే ప్రస్తావన తెచ్చి ‘వెరసి’ అన్నావు చూడు… ఆ మాట అక్కడ వెయ్యడం మాత్రం నీకే చెల్లిందిరా అనేవాడు.

ఒకసారి రాజమండ్రిలో రాఘవేంద్రరావుగారు ‘త్రిశూలం’ షూటింగులో వుండి అక్కడకు వేరే పనిమీద వెళ్ళిన నాకు ఆ చిత్రంలో ఆత్రేయ రాసిన పాటలు పెట్టి వినిపించారు. వింటుంటే నాలో కలుగుతున్న స్పందన ఆయన గమనించి ‘ఇమోషనల్’ అవ్వకండి గురువుగారూ అన్నారు. ఆనాడు నేను ఆత్రేయ ‘మహాజ్ఞాని’ అనీ ‘ద్రష్ట’ అనీ తెలుసుకున్నాను. ‘నా నృషి కురుతే కావ్యం’ అని లాక్షణికులు ఎందుకన్నారో తెలిసివచ్చింది.

నేను సినిమా రచనా రంగంలోకి రాకముందు ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సబ్-ఎడిటర్ గా ఉండేవాడిని. ఆ రోజుల్లో అంటే 1962 ప్రాంతాలలో ప్రతీ సాయంత్రం గురుదేవులు శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి వద్ద అనేకమంది పెద్దలతో పాటు నేనూ కూర్చుని ఆశువుగా ఆయన నోట వెలువడే సాహితీ మర్మాలనీ, సాంఘిక సాంప్రదాయిక సత్యాలనీ, ఈ రెంటి సమన్వయం సాహిత్యంలో ఆధునిక యుగంలో ఎలా ప్రతిబింబించిందీ (సినీ సాహిత్యంతో సహా) వింటూ వుండేవాడిని. అటువంటి అనేక సందర్భాలలో ఆయన ఆనాడే ఆత్రేయ ప్రస్తావన తెచ్చేవారు. అర్ధాంగి చిత్రంలో ‘వద్దురా కన్నయ్యా పొద్దు ఇలువిడిచి పోవద్దురా‘ అనే పాటని ఆయన ముద్దులాడుతూ మురిసిపోయేవారు. ‘పట్టు పీతాంబరము మట్టి పడి మాసేను పాలుగారే మోము గాలికే వాడేను ఇత్యాది తేనె తెనుగు మాటలకు శాస్త్రిగారు అబ్బురపడేవారు కూడా. ప్రతిభాశాస్త్రిగారు ‘జయభేరి’ చిత్రం తీస్తున్న రోజులవి. తనను అందులో ఒక పాట రాయమని అడగవచ్చిన నిర్మాతను ‘ఇది ఆత్రేయ చేత రాయించండి…. బాగుంటుంది’ అని చెప్పడం నాకు గుర్తు. ఒకసారి ఆత్రేయ ఏదో చిత్రానికి (బహుశా తన చిత్రమే కాబోలు) మల్లాది వారిచేత పాట రాయించి డబ్బు యివ్వబోతే  ‘తరువాత నాకే ఖర్చు చేద్దువుగాని నీ దగ్గరే ఉంచు’ అనడం జరిగిందట. శాస్త్రిగారు దేహాన్ని చాలించిన రోజున దుఃఖ విహ్వలుడై ఆత్రేయ పసిపిల్లవాడిలా విలపించిన సంఘటన మరపురానిది.

ఆ రోజుల్లోనే రామారావు, దేవిక నటించిన ‘పెండ్లి పిలుపు’ చిత్రం షూటింగు జరుగుతూ వుండేది. నిర్మాత డి.బి. నారాయణ మాకు దూరపు బంధువు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమంచర్ల శేషగిరిరావు నాకు ఆప్తమిత్రుడు. రచయితలు చాలామంది మారి డైలాగులు, కథ కూడా ‘నానా గోత్రేభ్యః’ గా తయారయింది. నాచేత కొంతవరకు చేయించారు. కొన్ని సన్నివేశాలు రాయడం అంతకుముందు ఏమాత్రం అనుభవం లేని నాకు ఇబ్బందికరంగా తోచింది. ఆత్రేయను పిలిపించి నేను రాసిన డైలాగులు చూపించారు. కొన్నిటిని ఆత్రేయ మార్చి రాశాడు. అందులో ఒకటి ‘మనసివ్వలేని మగడితో కన్నీటి కాపురం చేయడం ఎంత అబలకైనా అసాధ్యమే’ యతిప్రాసలు డైలాగులకూ అవసరమే. అదే డ్రామా – అన్నాడు ఆత్రేయ ఆ సందర్భంలో.

విశాల లోకపు సర్కస్ చూడడానికి టికెట్ లాగా డబ్బు మనిషికి ఈ లోకంలో అవసరం. ఆ టికెట్ లేనిదే ఏమీ చూడలేము. చెయ్యలేము. అనుభవించలేము. అంతెందుకు బ్రతకనూ లేము. చచ్చిపోనూ లేము. ప్రాణవాయువును కూడా సిలిండర్ పంజరాలలో బిగించి అమ్ముకునే ఆస్పత్రులలో డబ్బున్న వాడికే బ్రతికే హక్కు, అవకాశం వున్న రోజులివి. తెలుగు పాటకీ, మాటకీ, నాటకానికీ తన ప్రాణాన్ని ధారపోసిన ఆత్రేయకీ చివరికి ఆక్సిజన్ అవసరమైంది. అది లభించే సమయానికి ఆత్రేయకు విరక్తి కలిగింది. ఈ ధనపంజరం నుంచి ఆత్రేయ కవితా విహంగమై విముక్తుడై ఆంధ్ర వాఙ్మయాకాశంలోకి ఎగిరివెళ్లిపోయాడు. గ్రహణాలూ, అమావాస్యలూ ఎన్నో అనుభవించి అవి రెండూ లేని తారగా మిగిలిపోయాడు.

పుట్టుక, చావు అనే ‘ రాకపోకల సందున వున్నది రంజైన ఒక నాటకము…. అది అంతా ఎందుకుగానీ అనుభవించి పోనీ జీవిని అనుభవించి పోనీ‘ అని ఎన్నడో ‘అర్ధాంగి’ చిత్రంలో ఆత్రేయ రాసిన పాట. లోకాన్ని డోంట్ కేర్ అని నాకింకా లోకంతో పని ఏముందిఅని విసిరేసిన నిలువెత్తు పొగరు ఆత్రేయది.

‘మనసు గతి యింతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే’

అని రాసినప్పుడు దర్శకుడు శ్రీ కె.ఎస్. ప్రకాశరావు (ఆత్రేయను పాటల రచయితను చేసిన విజ్ఞుడు) ఆ చివరన అంతే ఎందుకు? ప్రాసకోసమాఅని అడిగారట. దానికి ఆత్రేయ ‘అదంతే’ అని ఖండితంగా చెప్పి ‘అదంతే’ అని నిరూపించాడు. దృఢాభిప్రాయం, ధృతి గల రచయిత ఆత్రేయ.

పంచరంగుల ప్రపంచానికీ, సప్తవర్ణాల జీవితాకాశానికి, నవరసాల జీవితానికి వ్యాఖ్యాత ఆత్రేయ – ఏ శ్రీశ్రీ వ్రాశాడో ఈ పాట అనుకునే గీతాలు రాసింది ఆత్రేయ. ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దానబుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా‘  ఈ పాట చాలదా ఉదాహరణకి – అజరామరమైన అనేక గీతాలు, లక్షల రూపాయలు నిర్మాతలకు ఆర్జించి పెట్టిన ఖజానా గీతాలు, వేదాంత గీతాలు, సిద్ధాంత ప్రాతిపదికలైన గీతాలు ఎన్నో రాసిన ఆచార్యుడు, మాకు గీతాచార్యుడు ఆత్రేయ. ‘హర్తుర్యాతి నగోచరం’ ఆయన గీతాక్షరం.

ఆత్రేయ మాటలు, పాటలు ఎన్నో రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపించాడు. నేను సినీ రంగంలో ప్రవేశించిన తొలినాళ్ళలో నన్నూ మాటలు అన్నాడు. ఏం తొందరొచ్చిందని వచ్చావయ్యా… ఇంకా ముందు భవిష్యత్తు పెట్టుకుని.. ఎడాపెడా రాసి పారేస్తున్నావట. చాలా స్పీడుగా రాస్తున్నావట.. ఇత్యాదిగా ఆ కవికుల గురువు ప్రచ్ఛన్నంగా దీవిస్తుంటే అనలేక అనలేక ఒకనాడు ‘గురువుగారూ మీ అంత గొప్పగా ఎలాగూ వ్రాయలేను – మీ కన్నా తొందరగా నైనా రాయకపోతే నా బ్రతుకు తెరువు ఎలాగండీ? అన్నాను. ఆయన మనసు కరిగి కళ్ళలో మెరిసింది.

అటు తరువాత తిరుపతిలో ఒక కవి పండిత సభలో ప్రసంగం మధ్యలో నా వైపు తిరిగి ‘నీ ఆరోగ్యం గీత, తెలుగు సినిమా పాట ఆయుష్యం గీత నీ చేతిలో వున్నాయి. నిన్ను మందలించే అధికారం, అవసరం నాకున్నాయి’ అని గంభీరంగా తర్జని నా వైపు ఎక్కుపెట్టి హెచ్చరించిన పెద్దదిక్కు ఆనాడు నాకు ఆత్రేయ.

సన్నజాజుల మాలలల్లినట్లు అలతి అలతి తెలుగు పదాలతో పాటలు రాసిన ఆత్రేయలో నాకు కవితా ప్రపంచరవి తిక్కన దర్శనమిస్తాడు. ఆ శైలి ప్రాక్తన వాసనాజన్యమైన కవితాశక్తికి అభివ్యక్తి తప్ప మరొకటి కాదు. తమిళంలో కణ్ణదాసన్, హిందీలో శైలేంద్ర అటువంటి మహాగురువులు. ఆత్రేయ వంటి మహాకవి సరసన, చరణ సన్నిధానాన, సమకాలీన సహజీవితాన పాతికేళ్ళపాటు ప్రాణవాయువులు పీల్చుకున్న నా జన్మ చరితార్థం.

ఆత్రేయ మాత్రమే అనగలిగిన మాటలు అనేకం పాటలలోను, ఆయన రాసిన మాటలలోనూ కనిపించి గుండెను పిండేస్తాయి. ఆయన రాసిన మాటలు వినగానే ఆయన హృదయ పరిపాకానికి తలవంచి నమస్కరిస్తాము. ‘కన్నీళ్ళే మనిషిని బ్రతికించగలిగితే అవి కూడా అమృతం లాగే కరువయ్యేవి‘ – అన్నాడు ఒక చిత్రంలో ఆత్రేయ. ఆయనలో బడీ దీదీ, దేవదాసు నవలలు రచించిన తాత్వికుడు శరత్ చంద్ర ఛటర్జీ మనకు కనిపిస్తాడు. ఆత్రేయ మంచి మాటకారి. చమత్కారం ఆయన తోబుట్టువు. కథా రచనలో ట్విస్ట్ అనే ప్రయోగానికి ప్రాణ ప్రతిష్ట చేసిన ఓ హెన్రీని తలపిస్తాయి ఆత్రేయ మాటలు, పాటలూ కూడా. ‘నీవొస్తావని దారి పొడుగునా ఎడదను పరిచాను, నీవు రాకేఅడుగు పడకే నలిగిపోయాను‘ హృదయం నలగడం అంటే అంతకన్నా ఏముంటుంది ! కానీ ఆ లోతైన అనుభూతిని గీతస్థం చేయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. కవిత్వాంశకు పరమావధి ఆత్మానుభూతిని వెల్లడించడం కాదా! అందుకే ఆత్రేయ మహాకవి.

ఇక ఆయనతో నాకు గల అనుబంధంతో వృత్తిపరమైనవి ఒకటి రెండు సందర్భాలు చెప్పక తప్పదు. మాట తప్పడం నేరంగా పరిగణించే లోకంలో ఆత్రేయ ఆ నేరాన్ని ఎంత అందంగా ముద్దొచ్చేట్లు చేసేవాడో ఆయన సన్నిహితులకు బాగా అనుభవం. ఒకసారి అట్లూరి పూర్ణచంద్రరావుగారి చిత్రం… పేరు జ్ఞాపకం లేదు… మాటలు, పాటలు ఆత్రేయ అని ఖరారు చేసుకుని ముహూర్తం పెట్టుకున్నారు. పాటల రికార్డింగు విజయా డీలక్సు థియేటర్ లో – దర్శకుడు జి. రామమోహనరావు – పెద్దలందరినీ పిలిచారు. తెల్లవారితే ముహూర్తం – పాటలేదు. ఆత్రేయ రాసి ఇవ్వలేదు. విపరీతమైన టెన్షన్, ఉద్రేకాలు అణుచుకుంటూ దర్శకుడు, మిగతావారు నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ‘మేం పొరపాటు చేశాం… పెద్ద మనసుతో మీరు ఈ ముహూర్తం జరిపించాలి’ – సారాంశం యిది. నేను ఒక షరతు విధించాను. ‘ఈ ఒక్కపాట మాత్రమే నేను రాయడానికి ఆత్రేయ అంగీకరించాలి. ఆ విషయం నాకు ఆయన ఫోన్ చేసి చెప్పాలి. ఇందుకు మీరు నాకు ఇచ్చే పారితోషికం ఆయనకే ఇవ్వాలి. అది ఆయనకు ముట్టినట్లు నాకు చెప్పాలి. ఇది నేను గురువుగారు, ఆత్రేయగారి కోసం ఆయనపై భక్తితో చేస్తున్నదని మీరు గ్రహించాలి’ అన్నాను. పాట రికార్డింగు జరిగిపోయింది. ఆ రాత్రి నేను ఇంటికి వెళ్లేసరికి మా శ్రీమతి నాతో చెప్పిన విషయం ‘ఆత్రేయ గారు ఫోన్ చేశారు. అమ్మా చూశావటమ్మా మీ ఆయన ఎంత పని చేశాడో – నేను మనసు సరిగా లేక పాట రాయలేకపోతే ఆ పాట తను రాసి నా మాట దక్కించాడు. ఆ పాట తాలూకు డబ్బూ నాకే పంపించాడు. వాడు నా కన్నబిడ్డలాంటి వాడమ్మా. రేపు శుక్రవారం నీకు తండ్రిగా పట్టుచీర తెచ్చి ఇస్తాను. నీ చేత్తో పట్టెడన్నం తిని వెడతాను. అంతకన్నా ఏం చేయగలను – ఇదీ ఫోను’ అని చెప్పింది. ‘పట్టుచీర ప్రమేయం వద్దు. మీరు తప్పక భోజనానికి రండి. మా తండ్రిగారు వచ్చినంత సంతోషిస్తాను’ అని కూడా అన్నదట.

ఆ తరువాత ఆ శుక్రవారం వచ్చింది. వెళ్ళింది. పరంపరగా అనేక శుక్రవారాలు వచ్చాయి. కానీ ఆత్రేయ రాలేదు. ‘ఆత్రేయగారు అంతగా చెప్పారు రాలేదేమండీ’ అనే ప్రశ్న… ‘వస్తే ఆత్రేయ కాడు గనుక’ ఇదీ సమాధానం. నిలిచిపోయే మాటలు ఎన్నో రాసిన ఆత్రేయ తన మాటను నిలబెట్టుకున్న సందర్భాలు తక్కువ. జీవితం తనతో కలిసిరాక లేదా జీవితంతో రాజీ పడలేక ఆత్రేయ ఇతరుల విమర్శలకు గురి అయి వుంటాడన్నది నిజం.

ఆత్రేయ స్వగ్రామం మంగళంపాడు. మద్రాసు నుంచి కారులో వెడితే గంట కూడా పట్టదు. సినీ పూర్వ జీవనం చిత్తూరులో కిళాంబి నరసింహాచార్యులుగా – జీవిత చరిత్ర అంతవరకే ఆయనకు వర్తిస్తుంది. కానీ ఆత్రేయగా ఆయన జన్మస్థలం మనసు అనే మయసభ… విస్మయసభ… మాయామహల్ – ఆయన ఉద్యోగం తెలుగుతల్లికి గీత మాలికలతో అలంకారం చేయడం. మనసు అనే మాయ పంజరంలో కొట్టుమిట్టాడే మనిషి అనే విహంగానికి రెక్కలు నిమిరి విముక్తి ద్వారం తెరవాలని తాపత్రయపడడం.

ఎన్నో మమతా బంధాల నుంచీ బాధల నుంచీ బయట పడబోయి వాటిలో కూరుకుపోయి అలమటించడం ఆత్రేయ జీవితం – చెరలోనే విడుదల అనుభవించిన మమకారాల ముద్ద ఆత్రేయ. ఇవన్నీ విడమరచి చెప్పాలంటే తెలుపు నలుపుల్లో ఆత్రేయ జీవిత చిత్రం చూడకతప్పదు.

“ఎదమెత్త నౌటకై సొదగుందరా – నీ
మదిగల అహమ్మెల్ల మాసిపోవురా”

అన్న బసవరాజు అప్పారావు గీతం ఆత్రేయ జీవితానికి ఛాయాచిత్రం. రాయగలిగినవి, రాయలేనివి, పరిస్థితులను, పరిమితులను మన్నించి రాయకూడనివి ఎన్నో ఒక మహావ్యక్తితో వున్న అనుబంధంలో వుంటాయి. ఈ అన్నిటా మేరు శిఖరమై గోచరించే వ్యక్తిత్వం ఆత్రేయ మహర్షిది. ‘అభిలాష’ శతదినోత్సవ సభ మద్రాసు తాజ్ కోరమాండల్ హోటల్ లో ఘనంగా జరుగుతున్నప్పుడు నన్ను విడిగా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఆత్రేయ నాకు బోధించిన గీతా వాక్యాలు లక్ష్మణ గీతలుగా ఏనాడో గుర్తించాను.

అంతా మట్టేనని అదీ ఒక మాయేనని తెలిసి వలచి విలపించడం ఎంత తీయనో” ఈ నాలుగు అశ్రుకణాక్షరాలే మీకు విన్నవిస్తాయి.

ఆత్రేయ పోయిన రోజున నేను విశాఖపట్నంలో ‘చాలా అర్జెంటు.. రేపే రికార్డింగు’ బాపతు పాటలు రాస్తున్నాను. ఒక రోజు ఆత్రేయ పరమపదించినట్లు మా నిర్మాతలకు ఫోను వచ్చింది. అయితే ఆ వార్త నాకు చెప్పకుండా గుట్టుగా వుంచి సాయంత్రం 4 గంటలకు చెప్పారు. అప్పటికి వారి పాట పూర్తయింది. ముందుగా తెలిసివుంటే చివరి చూపుకైనా వెళ్లి వుండేవాడినే  అనే పల్లవితో మూగకన్నీటి పాట ఒకటి అలేఖ్యంగా వినిపించసాగింది. అందుకే ఆత్రేయ మెచ్చిన నా పాట

ఎవరికెవరు ఈ లోకంలో
ఎవరికి ఎరుక
ఏదారెటుపోతుందో
ఎవరినీ అడుగక

ఆయన నాతో యిప్పటికీ అంటున్న మాటగా వినిపిస్తూ వుంటుంది.

ప్రాచీన ఆంధ్ర సారస్వతరంగంలో శ్రీనాథుడు, అధునాతన భారత రాజకీయ రంగంలో ఆంధ్రకేసరి ఎటువంటి వారో సినీ నాటక సాహితీ రంగంలో ఆచార్య ఆత్రేయ అటువంటివారు.

ఎంత రాసినా రాయలేని రత్నగిరి రహస్యాల గని ఆత్రేయ జీవన వాహిని! ఈ వ్యాసం కూడా ఆయనకు స్మృత్యంజలి ఘటించడానికి వెలువడిన ‘అర్ధోక్తి’ మాత్రమే. ఇక మిగిలినవన్నీ ముద్దబంతి పూవులుమూగకళ్ళ ఊసులు, ఎదల ఎనక బాసలు – అంతే… అవి ఎప్పటికీ అంతే.

ఆంగ్ల మహాకవి లాంగ్ ఫెలో అన్నట్లు కాలమనే ఇసకదారిలో కాలి గురుతులెన్నో… అందులో ఈ కాలిగురుతు ఆత్రేయది అని తెలుసుకోగలిగిన మనసు నాకుంది. ఇది కూడా ఆయన ఆశీర్వచన ఫలితమే.

తెలుగు జాతికి మనసైన పాట ఆత్రేయ. మనసులా, మనసైన  పాటలా ఆత్రేయ శాశ్వతుడు.

కొమ్మకొమ్మకీ సన్నాయి ఉండవచ్చు. కానీ తెలుగుజాతి పట్టుగొమ్మ అయిన పాటలమ్మకి ఒక్కటే సన్నాయి సన్నాయి పేరే ఆచార్య ఆత్రేయ


ఈ వ్యాసం ప్రచురించుకోదానికి అనుమతించిన ‘వేటూరి రవిప్రకాష్’ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీమ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top