నిన్నటి(జనవరి’ 29) వేటూరి వారి జయంతిని పురస్కరించుకుని మిత్రులు ‘చంద్ర రెంటచింతల’ గారు ఆ సరస్వతీ పుత్రునికి కందపద్యమాల సమర్పించారు, ఆ గుభాళింపు ఇదిగో మీకోసం:
పాటలకవు లేపాటని
గాటను గట్టంగజూడు గానపుగతులన్
తేటతెలుగాటమాటల
బాటన వేటూరియొచ్చి బాసట నిలిచెన్!
భావపుదారుల వాల్చిన
భావపు మనసుగరిగించు భావకుల గనన్!
చేవగు భాషను బట్టుకు
తేవగనొచ్చి పదయోగి తేనెలనిచ్చెన్!
రాముని బంటే తానై
గోముగ సీతమ్మ చెంత గోధూళనుచున్
పాముకు బోయిన వర్ణము
జామున దొలగించినారు జానపదంబున్!
భక్తిని రాసిన వారలు
రక్తిని రాసిరి కలమున, రక్తము మరగన్
శక్తిని జూపిరి మహిళకు
యుక్తినెరిగి రాయగలరు యుద్ధము మదిలోన్!
శంకర నాదశరీరా
యంకపు జేయే యడిగిన యంతనె రాసెన్
వంకల బోయే చెలి గొర
వంకకు ప్రేమదెలుప తనవంతుగ లేఖల్!
ఇందువదన కుందరదన
మందగమన మధురవచన మంతయు దానే
నాదవినోదపు నాట్యము
వేదపు యణువణువు నాదవేదన తనదేన్!
వందలపాటలు యందున
చిందుల జీవులకు రాసె చింతలనొదిలిన్!
సందడి మధ్యన పదముల
నందము విడవకనురాయ నందము గాదే!
గోదావరి బిలిచినదని
పూదారుల వెతికి రాసి పూజలనిడెన్!
రాదారుల బాడంగన
లేదా వేటూరి పదును లేదనగలరే!
‘చంద్ర రెంటచింతల’ గారికి ధన్యవాదాలతో ‘వేటూరి.ఇన్’ టీమ్