వేటూరి గారి గురించి ప్రఖ్యాత గాయకుడు, కవి, రచయిత అయిన ‘Dr. పి.బి.శ్రీనివాస్’ గారు వ్రాసిన పద్యమాలికలు మీకోసం
శుభాశయము
కం:
మేలగు( గావుత సుకవికి
పాలింపగ( గావ్యసీమ
బ్రతిభానిధియై
తేలుత జీవన జలధిని
కాలావధిరహితకీర్తి
కాంతాధవుడై
జైత్రయాత్ర
వేటూరిది నవలేఖిని
స్వేచ్చాకవితా వాహిని
బహుసుందరరామమూర్తి
ప్రబల దిశావ్యాప్తకీర్తి
నవరసమయమగు బాణి
‘కవిరవి ‘వేటూరి రాణి
వారికి వారొకరె సాటి
వారు గీతరచనలో మేటి
పదునైనది వారి శైలి
భావమధురసాల గ్రోలి
రసికవరుల మనసు తేలి
రంజిల్లును తూగు తూలి
ఆశ్లీలతలో శ్లీలత
ఆర్జించును అనుకూలత
చిత్రగీత చిత్ర రచన
జైత్రయాత్ర వారి కతన
సాగించును కలకాలం
సాధించును ఘనయోగం
ప్రతి మాటా చవుల ఊట
ప్రతి తలపూ విరుల తోట
తీయని వేటూరి పాట
హాయినొసగు సుధల తేట
అజరము వేటూరి కలము
ఆనందమె వరము బలము
గంభీరము వారి గతము
గంగ భంగి అనర్గళము
తెలుగువెలుగు వారి నుడి
స్థిరమగు గుడి పలుకుబడి
దేవీత్రయ శక్తి గొన్న
తెలుగు కవులలో మిన్న
మనసు మెత్తదనము గన్న
మదిని సిగ్గుపడును వెన్న
సరస్వతికి ప్రియపుత్రులు
సర్వజన ప్రియమిత్రులు
సమతా ధ్రుక్పధ నేత్రులు
స్థైర్యల సిత ధృడగాత్రులు
లయబద్ధము వారి నడక
భయరహితులు వారుకనుక
నయసురచన శంకగొనక
పయనించును వారివెనుక
కం:
వేటూరికి సురచనలో
సాటియె కనరాడు భువిని
సాహసియగు పలన్
నాటిరి స్వీయధ్వజమును
మేటి చలనచిత్ర గగన
మిత్రులు తామై!!
కం:
సుందరరాముని సుకతా
మందిరమున వెలుగు జ్యోతి
మధుమయ కవితా
నందనవన శోభాయిత
వందనయోగ్యార్ధ భావ
వైభవమందున్!!
కం:
సురుచిరమూర్తికి, కీర్తిని
వరలేఖిని కవిత వ్రాసి
వరముగ నొసగెన్
స్వరరచనకు ద్రగురచనల
సరముల సమకూర్చగలదు
క్షణమాత్రమునన్!!
‘వేటూరి రవి ప్రకాష్’ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం