మల్లాది రామకృష్ణశాస్త్రి గారు చనిపోలేదు
వారి సాహిత్యం చిరంజీవి
వారి సాహిత్యం అనంతం
చావుకే చావు వారి మధురస్మృతి
ఇంతకన్నా వారులేని లోపాన్ని వర్ణించడం చేతకాదు
కప్పిపుచ్చుకొనడమూ కలిసిరాదు
ఆమని పోయిన తర్వాత కోయిల గతేమిటి?
వారు వెళ్ళిపోయిన తర్వాత వారి మిత్రుల గతి అది
అంతకన్నా చెప్పడం కష్టం
ఇంతకుమించి చెప్పడం ఇష్టంలేదు
నదులెన్ని కలిసినా క్షార సముద్రం క్షీర సముద్రం కాలేదు
మల్లాది వారిని చప్పరించినా మరణం మధురం కాలేదు
అదే చివరకు తేలింది
ఆయన మధురిమ ఇక్కడే వదిలేసి వెళ్ళారు
చావులో చేదును స్వాహా చేసి స్వాదువుగా చెయ్యాలని వెళ్ళారు
అందుకే మృతుదేవత ముందుకొస్తే నవ్వమన్నారు, ముంచుకొస్తే నవ్వి చూపించారు, అదీ నవ్వింది, వారూ నవ్వారు, నవ్వులేకమైనాయి.
వారు లేకుండా పోయారు, వారి నవ్వు మిగిలింది.
నవ్వు వారిని మిగిల్చింది, ఇంతకూ మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ఆరని చిరునవ్వు.
అది పున:పునర్నవం వారు నిత్యనూతనులు
వారి స్మృతి కృతి నవనవాభ్యుదయం
అంతకంటే చెప్పలేము.
చింతకంటే చింత ఏదో అది ఇన్నిమాటలుగా వచ్చింది.చింత చిగురు వేసింది, కాయ కాసింది, పండు పండింది, ఆ చింతపండుతోనే మసకబారిన మానవహృదయ పాత్రను తోముకుని కళకళలాడించుకుంటున్నారు వారి మిత్రులు, పుత్రులు.
వారు రచించిన మహాకావ్యం మానవత్వం
శుష్క ఆదర్శా సూత్రప్రాయం కాని జగధర్మం యుగధర్మం పాటించే మానవత అది.
మనిషిని ఓడిపోనీని వాడిపోనీని మానవత, అదే మంచితనం.
మంచితనం అంటే అసమర్ధత కాదని తెలియచెప్పిన వారు ఆయన, మనిషితనమే మంచితనం.
నేను ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో 1960 లో జనవరి కావచ్చు ఒక ఉపసంపాదకుడిగా ఉన్న రోజులవి. హరి నాగభూషణం అనే మహద్గాన స్రవంతి చిరకాలం వహించి పండించి పండిపట్టిపోయింది.ఆ వార్తను వారపత్రికలో వచ్చీరాని మాటల్తో వ్యాఖ్యానించాను.
అది శ్రీ శాస్త్రి గారు చూసారు.
మిత్రులు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు నాకు సహాధ్యాయి, తర్వాత వారి సహాధ్యాయి అయినారు.ఈ వ్రాసింది ఎవరు అని అడిగారట, ఈయన చెప్పారట, ఒక్కసారి నా దగ్గరకు తీసుకురండి అని అడిగారట.
అటుతర్వాత తొలిసారి నన్ను శ్రీ శాస్త్రి గారి దగ్గరకు వెంకటరమణగారే తీసుకువెళ్ళారు.ఎవరికయినా వారి మాటమీద గౌరవం అట్టిది.
అమృతవర్షం ఎలా ఉంటుందో ఎవడు చూసాడు? బ్రతికున్నవాడు,బ్రతకదల్చినవాడు ఎవరూ చూడలేదు.బ్రతికిస్తుందనే అడ్వర్‌టైజుమెంట్ ఎంతగా చేసినా చూసినవాడు లేడు.కానీ శ్రీ శాస్త్రి గారి ఆ దరహాసం అమృతపు జల్లులా కురిసింది.ఆ జల్లుకు వెనక హృదయ రవితేజం పక్వకాంతితో పరిణవిల్లింది.ఈ రెంటినించీ ఒక ప్రేమాభిమానాల ఇంద్రధనుస్సు రేకు విరిసింది.అందులో సప్తవర్ణాలు, మౌలికంగా వారి స్వఛ్ఛ ప్రేమవర్ణమే సితసుందరమై ఇంతగా ఇన్నిగా రంగుదేలింది.
పార్క్‌లాండ్స్ హోటల్లో కాఫీ, పానగల్ పార్కు ముందు పేవుమెంటు వారి పార్లమెంటు అని తెలుసుకున్నాను.స్పీకర్ వారు,అలాగని వారే స్పీకరు, వారికంటే వారి కంటిచూపు, దానికంటే వారి చిరునవ్వు, రెంటికంటే వారి మధ్యేమౌనం ఇంకా బాగా మాట్లాడేవి.కొంచం వద్దన్నా గోల్డ్‌ఫ్లేక్ సిగరెట్టు అందించేవారు.ఆయన బ్రాహ్మణీకానికి గోల్డ్‌ఫ్లేక్ టిన్ను గుండుచెంబు.
చేరువైతే రసం, దూరమైతే నీరసం, ఇదే శ్రీ శాస్త్రిగారితో వచ్చిన అవస్థ.అయితే నీరసం లో కూడా రసం ఉన్నట్టు చేరువతనం చేపినరసం చిత్తాన చేర్చుక్కగా మిగిలి స్మృతిగా ఉండనే ఉంటుంది.
ముఖ్యంగా ఆయన జీవితం ఒక రసచర్చ.షష్టికి ధృవాన్ని పిలిచి ఇక రసచర్చను ఆయన ముగించివేసారు.చర్చిండం ముగించారు.చర్చ ఆయనకు భౌతికం భౌతికంలోంచి రెండోది ఏదో అందులోకి తెగించారు.
రసచర్చ నిరవధికంగా ఎక్కువగా జరపడం బ్రతికుండగానూ ఆయన ఇచ్చగించలేదు.కాఫీలనే కామాలు, సెలవు అనే ఫుల్‌స్టాపులూ ఉండేవి.
నేను ఆ రోజుల్లోనే ‘జీవనరాగం’ అని ఒక కధ వ్రాసాను.అందులో ముఖ్యంగా గిరిజన బాలిక పెళ్ళి తతంగం ఒకటి ఉంది.అడగటానికి పురోహితుడు ఎవ్వడూ లేడు, ఇది ఎలా జరపాలి? కావాల్సిన సామాగ్రి సంభారమూ ఏమిటి? ఆయన దగ్గరకి పరిగెత్తాను.హితుడైనా పురోహితుడైనా ఆయనే. “నీ కధ చదువుతున్నాను బాబూ ఎలాగూ పెద్దవాడ్ని నన్నడగనిదే చెయ్యరు అని అనుకుంటూనే ఉన్నాను.ఇంతవరకూ కధ మహాపట్టుగా వచ్చినది, పెళ్ళికూడా ఘనంగానే చేయించండి” అంటూ కొండగోగుపూలు, వావాలిపూవులు అంటూ ఒక జాబితా చెప్పారు.అందులో కొమ్ముబూరలున్నాయి, రండోళ్ళున్నాయ్, తప్పెట్ల గంతులు, చిందులు ఇంకెన్నెన్నో, మరి పెళ్ళి వారే చేయించారు.
అసలన్నిటికంటే ముందు పరిచయం అయిన మరు రోజునించే కధలు వ్రాయమని నన్ను కదిలించింది వారే.కధ నేనెలా వ్రాయను? వారే చెప్పారు.ఓనమాల దగ్గర్నించి ఓహెన్రీ కధలనించి మొపాసా, డాస్టవిస్కీల వరకూ కొన్ని కధలు వారే వినిపించారు.
ఓహెన్రీ పుస్తకం స్వయంగా నాకిచ్చి చదవమన్నారు.అవన్నీ చదివి నేను కధ వ్రాయలేను అనుకున్నాను, వారు “ఖామోష్” అని ఒక కధ వారపత్రికలో వ్రాసారు.ఆ ఒక్క కధ నాకు దాదాపు భగవద్గీత అనిపించింది.గీత కర్మకు ఉన్ముఖుడ్ని చేసినట్టు వారి “ఖామోష్” నన్ను కధారచనకు పురికొల్పింది.అయితే అప్పటికే కొన్ని కధలు వ్రాసాను.అందులో ‘పప్పణ్ణం ఎప్పుడు ‘ అనే కధను వారు మెచ్చుకున్నారు, ‘విపర్యయాలు ‘అనే కధను నొచ్చుకున్నారు.
అనకూడదు కానీ ఆయనతో పరిచయం ఒక వ్యసనం లాటిది, వారి ఆదరానికి, చమత్కారానికి, కాలక్షేపానికి, వారు వడ్డించే విజ్ఞానానికీ అలవాటు పడ్డామా బయటపడటం కష్టం.అవి మరిగి అన్నీ మరిచిపోతాము.ఆయన దగ్గరకు అలానే ఎంతోమంచి వచ్చేవారు.అందులో మందీ ఉండేవారు, మందా ఉండేది.చాలాకాలం నేను ఎందులో వాడ్నో తెలీయకపోయినది.ఇప్పటికీ తెలిసినట్టులేదు.
ఒక సందర్భం-“బాబూ ఇదిగో ఈ కధ చదవండి,ఈ కధ చదవగానే ఒక గుల సన్నసన్నగా ఆరంభిస్తుంది.ఇది ప్రధమావస్థ, అటుతర్వాత ద్వితీయావస్థ, ఇది దానిని భరించలేక ఆపనయించుకోటం ఎలాగా అని తాపత్రయపడటం, పక్వం కావాలిగా.అప్పుడే బాబూ పక్వం అవుతుంది, అంటే కధ పుట్టిందన్నమాటే”.
ఈ మాటలు ఇలా అర్ధం కావడం కష్టం, ఏమంటే పూర్వాపరాలు, రామకృష్ణశాస్త్రి గారు అంటే ఏమిటో తెలియాలి కనుక.
పోయేముందు ఆయన పానగల్లు దర్బారులో కొన్నాళ్ళు గాలిబ్ లా గాలిగీతాలు పాడినవాడిని, దైవికంగా ఒక్క పనిచేసాను.”ఆనందవాణి” సంపాదకులు ఉప్పులూరి కాళిదాసు గారు వారి పత్రికలో ప్రచురణార్ధం “హరికధ” అనే కధను ఇస్తే అది తీసుకుపోయి శ్రీ శాస్త్రి గారికి ఇచ్చారట.అప్పటికి వారికి వారం రోజుల చమత్కారమే మిగిలియున్నది.ఆ కధను పుచ్చుకుని దీనిని రాత్రికి నాతో ఉండనీ, ఆమూలాగ్రం ఒక్కసారి చూస్తాను అన్నారట.వారి చమత్కారం ఇలాగే పొర్లువారేది.
అలాగే ఆ కధానిక ఆ రాత్రికి వారితోనే ఉన్నది, వారు ఆమూలాగ్రం చూసారు, మర్నాడు కాళిదాసు గారు వెళ్ళారు.ఎంత బాగా వ్రాసాడయ్యా, ఈ దస్తూరీని ఇలాగే కొనసాగించమని చెప్పు.పునశ్చ దీనిని శ్రీ కారం చేసి ‘శ్రీహరికధ’ అని మార్చమనిన్నీ చెప్పు అన్నార్ట.
నేను ధన్యుడను, వారికొక మానసపుత్రుడను.
ఆ మరునాడే జీవనబృందావనము నించి ఆయన మద్రాసు జనరల్ హాస్పటల్ అనే దండకారణ్యానికి వెళ్ళిపోయారు.జీవన్మరణాలకు సేతుబంధనం చేసి ఆవలి తీరాలకు హాయిగా వెళ్ళిపోయారు.వెనుక గో గోప గోపీ జనమై మిగిలిన అభాగ్యులు ఇలా అక్షరాలు రాసుకుని అఘోరిస్తున్నారు.