తెలుగు సినీ సాహిత్యంలో నాకు అత్యంత ఇష్టమైన రచయిత స్వర్గీయ వేటూరి సుందరరామమూర్తి. వారినిస్మరించుకుంటూ కొన్ని వేటూరి పాటలను ఎంచుకుని వాటిలో ఉన్న అలంకారవైభవాన్ని క్లుప్తంగా ప్రస్తావిస్తాను.
అలంకారములు రెండు రకాలు: శబ్దాలంకారములు,అర్ధాలంకారములు
ఎ: శబ్దాలంకారములు:
శబ్దానికి ప్రాధాన్యతనిచ్చేవి శబ్దాలంకారములు.అంటే శబ్దం వల్ల కవిత్వానికి అందం చేకూర్చడం.అవి ముఖ్యంగా నాలుగు రకములు.
1) అనుప్రాసాలంకారము, 2) యమకాలంకారము, 3)ముక్తపదగ్రస్తాలంకారము, 4)చిత్రాలంకారము.
1) అనుప్రాసాలంకారము: –
a) వృత్యనుప్రాసాలంకారము,
b) లాటానుప్రాసాలంకారము,
c) అంత్యానుప్రాసాలంకారము,
d) చేకానుప్రాసాలంకారము.
1a) వృత్యనుప్రాసాలంకారము: వృత్తం-తిరగడం, ప్రాస-వచ్చిందే మళ్ళీ రావడం
ఒకే హల్లు అనేక పర్యాయములు మరల మరల వచ్చిన అదే వృత్యానుపాసం
ఉదా:
1. ఇందువదన కుందరదన మందగమన=బిందు పూర్వక “ద” కారం
2. నల్లనీ కాటుకలెట్టీ గాజులుపెట్టీ గజ్జే కట్టీ గుట్టుగా సెంటే కొట్టీ, వడ్డాణాలే వంటికి చుట్టీ = “ట్టి”
లాటానుప్రాసాలంకారము:
ఒకే అర్ధం కల పదం పాటలో పలుమార్లు తాత్పర్య బేధంతో వచ్చిన అది లాటానుప్రాసం.
ఉదా: రేపని మాపని క్షణమాపని మా పని, ఆ పని ఇపుడే తెలుపని వలపని (అస్మదీయ మగటిమి-అన్నమయ్య సినిమాలోని పాట)
అంత్యానుప్రాసాలంకారము:
ఉదా:
ఏకాంతవేళ కౌగిట్లో
ఏకాంతసేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లే ఉండు నిద్దట్లో
2. కుశుమించు అందాలు కుశలమా?
వికసించే పరువాలు పదిలమా?
చేకానుప్రాసాలంకారము.
అర్ధబేధములో రెండక్షరాల పదాలు వెంట వెంటనే వచ్చిన అది చేకానుప్రాసం
ముక్తపదగ్రస్తాలంకారం:ముక్తం-విడిచిపెట్టిన పదం, గ్రస్తం-తిరిగి స్వీకరించడం
ఉదా:
– గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది
– పున్నాగ తోటల్లో సన్నాయి పాడింది, ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది
– నిద్దుర లేచిన పొద్దులలో, పొద్దులు మరిచిన పొందులలో (చంద్రోదయం)
3. యమకాలంకారము: ఒకే రకమయిన శబ్దాలకి భిన్నార్ధాలు రావడం. అర్ధ బేధం ఉన్న అక్షరసముదాయాన్ని మరల మరల ప్రయోగించడం.
వేటూరికి యమకగమకాలంటే ప్రాణం.
ఆది యమకాలంకారము:
-దొరలనీకు కంటనీరు దొరలదీలోకం మగదొరలదీలోకం
-మైనా క్షణమైనా పలికిందేపాట
-మా ఱేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు
-అటో అందమూ ఇటో అందమూ, అసలే అందమంటుండగా
-కలయిక కల ఇక మనకిక లేదులే
-ఓ చుక్కా నవ్వవే, నావకు చుక్కానవ్వవే
-ముద్దముద్దగా తడిసి, ముద్దు ముద్దుగా కలిసి
-వేలునిచ్చి తన వేలును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు
-ఆబాలగోపాల మా బాల గోపాలుని,
-అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులచూడ
-ఆరాధ ఆరాధనాగీతి పలికించి
-ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
-ధరణీపతియే ధరకు అల్లుడై(రామదాసు)
-ఈడొచ్చి నీకోసం ఈడొచ్చి కూర్చుంటే
-ఆకళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మా నువ్వూ
-ఇన్నికలలిక ఎందుకో, కన్నె కలయిక కోరుకో
-పొగడలేని ప్రేమకి,పొన్నచెట్టు నీడకి పొగడ దండలల్లుకోనా?
-ఏ వంకలేని వంకజాబిల్లి, నా వంక రావే నడిచే జాజిమల్లి
-ఆ విందా, ఈ విందా, నా ముద్దూ గోవిందా
-ఆగాలి ఆగాలి ఈగాలి జోరు
-ఏకులమూ నీదంటే గోకులమూ నవ్విందీ
-కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ దరఖాస్తందుకో
ఆది యమకాలంకారము:
-మమతలు వేయిగ పెనవేయు నన్ను తీయగా
-బజ్జోర నా కన్నా లాలిజో, ఎవరయ్యా నీకన్నా
-ప్రేమలేఖ రాసా నీకంది ఉంటంది,పూలబాణమేసా ఎద కంది ఉంటది
-పాలల్లో పెరుగల్లే తోడుకావాలే,నీతోడు కావాలే (చల్లపల్లిలో)
-అడుగులోన అడుగెయ్యనా,అనుకున్నది అడిగెయ్యనా
-శంకర గళ నిగళము
-ఎరిగిన ఎదలో ఉన్నాడు, ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
-మరులన్నీ మనవి అన్న మనవి చేసుకోనా?
-విరుల తెరలు తెరచిరావె
-బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట
అంత్య యమకాలంకారము:
-పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా?
-నిజమేమో తెలుపు, నీ మనసు తెలుపు (ఒడుపున్న పిలుపు)
-నా గుండియని అందియగా, నా గుండెను నీకే అందియగా
-కులూమనాలి, వరించుకోమనాలి (అల్లరిప్రేమికుడు)
-జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తనకంటిలో పొంగ మనసు కరగంగ
-ఈ కోవెల, నాకోవెల
-ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా
-అనువుకానీ ఏకాంతానా, ఏకాంతకైనా
అర్ధాలంకారములు:
– అర్ధానికి ప్రాధాన్యతనిచ్చేది
– అర్ధాల వల్ల భాషకు రమణీయత చేకూర్చడం
ఉపమాలంకారము:ఉపమాన(పోలిక),ఉపమేయా(పోల్చబడేది)లకు గల పోలికను మనోహరంగా వర్ణించడం
అంటే రెండు విభిన్న వస్తువులను తీసుకుని ఒకదానితో ఒకదానిని అందంగా పోల్చడం
ఉదా:
– త్యాగరాయ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మా
– మల్లెపూవులో మధువుపొంగులా వెల్లువయిన కవితా
– మంచుకొండల్లోన ఎండకాచినట్టు మల్లెపూలు చల్లె వెన్నెలా
రూపకాలంకారము:ఉపమాన(పోలిక),ఉపమేయా(పోల్చబడేది)లకు బేధమున్ననూ అబేధంగా చెప్పబడం
ఉదా:
– కైలాసాన కార్తీకాన శివరూపం,ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం
– చిరునవ్వులు అభినవ మల్లికలూ,సిరిమువ్వలు అభినయ దీపకలూ
ఉత్ప్రేక్షాలంకారము:
ఉపమేయాన్ని ఉపమానంగా అందంగా సొగసుగా ఊహించి చెప్పడం
ఉదా:
– మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
అపహ్నత్యలంకారం:
అపహ్నతి అంటే కప్పిపుచ్చడం
ప్రధాన వస్తువుయొక్క స్వధర్మాన్ని కప్పిపుచ్చి అన్యవస్తువు ధర్మాన్ని నిలపడం
ఉదా:
– కన్నెపిల్లా కాదు కళళ కాణాచి
– కంచిలో ఉన్నది బొమ్మా, అది బొమ్మ కాదు ముద్దుగుమ్మా
– మల్లెపువ్వా కాదు, మరుల మారాణి
కారకామాలాలంకారము:
-పూర్వ వస్తువులు ఉత్తరోత్తర వస్తువులకి కారణభూతాలవడం,అంటే పదాలను మాలలోని ప్సుహ్పాలగా వరుస క్రమంలో గుచ్చడం
ఉదా:
– గజ్జె ఘల్లుమంటుంటే,గుండె ఝల్లుమంటుంది,గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది
6. భ్రాంతిమదాలంకారము:
భ్రాంతి చేత ఒక వస్తువును వేరే వస్తువుగా ఊహించి చెప్పడం
ఉదా:
– ఆషాఢమాసాన మిలమిలమన్న మెరుపే చూసి నీవనుకున్నా (ప్రకృతిలోని ఆకృతులను చూసి తన ప్రియురాలని భ్రమపడడం)
7. పరిణామాలంకారము:
– పొద్దుపొడుపులో అరుణిమలే చెలి దిద్దు తిలకమై చివురించే (పొద్దుపొడుపులోని ఎర్రదనం తన ప్రియురాలి కుంకుమగా పరిణామం చెందిందని ప్రియుని భావన)
-నీ వయసే వసంత ఋతువై
8. దృష్టాంతాలంకారము:
ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావం (అంటే పరస్పరమూ భిన్నంగా ఉండడం)ఉండునట్లు చెప్పుట
ఉదా:
– చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా(బింబము)
చేదు మింగి తీపి నీకై పంచ మరిచేనా?(ప్రతిబింబము)
ఈ రెండూ పరస్పరం భిన్నంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా వాటిమధ్య ఉన్న భావసాదృశ్యం
వల్ల ఇది దృష్టాంతాలంకారము.
9. ప్రతీపాలంకారము:
ఉపమానాన్ని ఉపమేయంగా చెప్పడం
ఉదా:
– నెమలికి నేర్పిన నడకలివీ(నెమలి నడకతో అమ్మాయి అడుగులను పోల్చడం),
మురళికి అందని పలుకులివీ (మురళీరవంతో అమ్మాయి మాటల్ని పోల్చడం)
10. అతిశయోక్తాలంకారము:
వర్ణనను అతిశయంగా చెప్పడం, ఉపమాన ఉపమేయాల్లో ఉపమానాన్ని చెప్పి రెండోదాన్ని ఊహకి వదిలెయ్యడం ఈ అలంకార లక్షణం
ఉదా:
– ఏ గగనమో కురులజారీ నీలిమపోయే, ఏ ఉదయమో నుదుటచేరి కుంకుమైపోయే !!
– చుక్కలకే కునుకొచ్చిందంట, సూర్యుడికే ఉలుకొచ్చిందంట !!
11. సారాలంకారము:
ఉత్తరోత్తర వస్తువులకు పూర్వ వస్తువులకన్నా ఎక్కువ ఆధిక్యతను ఆపాదించడం
ఉదా:
– వాన కురిసి కలిసేది వాగులో,వాగు వంక కలిసేది నదిలో, కదిలి కదిలి నదులన్నీ కలిసేదీ కడలిలో !!
– చినుకులా రాలి, నదులుగా పారి, వరదలైపోయి, కడలిలా పొంగు..
12. అప్రస్తుతప్రశంసాలంకారము:
ప్రకృతిలోని వస్తువులని వంకగా పెట్టుకుని ప్రియురాలిపై తన ప్రేమను ప్రకటించుకోవడం
ఉదా:
– బంతీ చేమంతీ ముద్దాడుకున్నాయిలే, మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
– కొమ్మెక్కి కూసింది కోయిలమ్మా, కొండెక్కి చూసింది చందమామ
13. ఉల్లేభాలంకారము:
ఒకే వస్తువును అనేక రీతుల్లో ఇష్టంగా వర్ణించడం
ఉదా:
– .ముద్దిచ్చీ ఓ చినుకూ ముత్యమై పోతుంటే
చిగురాకు పాదాలు సిరిమువ్వలవుతుంటే
ఓ చినుకూ నిను తాకీ తడి ఆరిపోతుంటే
ఓ చినుకూ నీ మెడలో నగలాగా నవ్వుతుంటే
14. సందేహాలంకారము:
వర్ణా వర్ణ వస్తువుల విషయంలో సమానధర్మ సారూప్యం చేత ఇదా అదా అనే సందేహం కలగటం
ఉదా:
– కులుకులమ్మ కన్నకూతురా, మెరుపులమ్మ మేనకోడలా
– వెన్నెలకే విభావరివో, జాబిలికే సహోదరివో
– సుందరమో సుమధురమో, చందురుడందిన సుమధురశీతలమో
15. ఉత్తరాలంకారము:
ముందు ప్రశ్న,దానికి తగ్గట్టుగా ఉత్తరం(సమాధానం)
ఉదా:
– నీ చెక్కిలి వెల ఎంత? నీ చక్కెర ముద్దంత, నీ కౌగిలి వెల ఎంత? నీ వెచ్చని గిలిగింత
ఇంకాస్వభావోక్త్యలంకారము, అర్ధాంతరన్యాసము, శ్లేషాలంకారము, దీపకాలంకారము, ఉపమేయోపమాలంకారము, స్మృత్యలంకారము, క్రమకాలంకారము ఉన్నాయి. వాటి గురించి తర్వాత వ్యాసంలో ప్రస్తావిస్తాను.
ఇట్లు – చిమట శ్రీనివాసరావు
————————————–
చిమట శ్రీనివాసరావు గారికి ధన్యవాదములతో వేటూరి.ఇన్ టీం
వేటూరి పాటల్లోని అలంకారాల గురించి చక్కగా వివరించారండీ. ధన్యవాదములు.
Soooooooper andi
we want to meet Chimata Srinivasa Rao Garu,please provide contact number
మీరు ఆయనని ఫేస్‌బుక్ లో కలవచ్చండి