సినిమా – మల్లెపూవు
రచన – వేటూరి
వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం
మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం
ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితి మంటల చిటపటలే నా లో పలికే కవితలనీ
ఎవరికి తెలుసు…
మనసుకి మనసే కరువైతే
మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ
నీడైనా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదనీ ఈ జగతికి హృదయం లేదనీ
నా జన్మకి ఉదయం లేనే లేదనీ
ఎవరికి తెలుసు…
గుండెలు పగిలే ఆవేదనలో
శ్రుతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో
నిట్టూరుపులే సంగీతం
ప్రేమకు మరణం లేదనీ నా ప్రేమకు మరణం లేదనీ
నా తోటకు మల్లిక లేనే లేదనీ
ఎవరికి తెలుసు…
“ఎందుకు ఎప్పుడూ దిగులుగా ఉంటావు? ఏదో భావావేశం తో ఉద్విగ్నతతో ఏదో ఆలాపిస్తూ ఉంటావ్?” అని అందరూ అడుగుతారు. కానీ ఎవరికి తెలుసు ? ఎవరికి తెలుసు ? చితికిన మనసు చితిగా రగిలిపోతుందని, ఆ మంటల చిటపటల శబ్దాలే నా కవితలనీ ఎవరికి తెలుసు ?
నిరాశకీ, నిర్వేదంకీ నిర్వచనం ఈ గీతం. ఎందుకు నిర్వేదం ? తోడుగా నిలిచిన మనిషి మన దగ్గర నించీ విడిపోతే ? బాధే , కానీ ఆ బాధ లో కూడా ఎదుటి మనిషి మనల్ని వంచించి సుఖంగా ఉన్నారని అనిపిస్తే మనసు ఎంత రగిలిపోతుంది ?
నీ జీవితం హాయిగా శోభాయమానంగా ఉంది. వలపు కోయిలలు పాడే వసంతం లా నీ జీవితం అమిరింది, మండుతున్న గ్రీష్మం నా గీతం, నీది వెన్నెల, నాది ప్రేమ అనే వెన్నెల వలన దహించుకుపోతున్న తాపం.
ఇది ఎవరికి తెలుసు?
ఆశించి ప్రేమించి స్పందించే మనసుకి ఆలంబన మనసే, ఆ మనసే విడిచివెళ్ళిపోతే ఆ మనస్వికి బ్రతుకెంత భారంగా ఉంటుంది ? అయినా చీకటి పడిన తరువాత నీడ కూడా మనల్ని విడిచివెళ్ళిపోతుంది, మనుషులూ, వారి మనసులూ అంతే, ఇప్పుడిది చీకటని తోడు ఎవరూ లేరని ఎవరికి తెలుసు?
ఈ మనుషులకీ, ఈ ప్రపంచానికి కూడా, నా పట్ల మనసు లేదు , ఇంక నా బ్రతుకుకి ఉదయం లేనే లేదు.
ఈ బాధ ఎవరికి తెలుసు?
నా కవితకి తాళమూ శ్రుతీ ఉన్నాయేమో కానీ, నా జీవితం శ్రుతి తప్పింది, నా గుండె ఆవేదనతో పగిలి లయ తప్పింది, నిప్పులు చెరుగుతున్నంత వేదన లో నిట్టూర్పులే నా సంగీతం, ఈ కవిత్వం సహజం , దీనికొక ఆకృతి లేదు, నా బాధే నా గీతం.
ప్రేమకి మరణం లేదంటారు నిజమే, అది చావకుండా నన్ను చంపుతోంది, ఇది ఎవరికి తెలుసు ? నా మనస్స్థితి ఎవరికి తెలుసు?
సరస శృంగార గీతాలు, అల్లరి చిల్లరి ఆకతాయి పాటలు, సంస్కృత సమాసాలతో గీతాలు రాయగల్గిన వేటూరి
మృదువైన పదాలతో ఆత్రేయ ని గుర్తుకు తెచ్చే పదబంధాలతో కరుణరసాత్మకమైన పాట రాసి తన కలానికి అన్ని వైపులా పదునే అని నిరూపించారు.
సున్నితమైన సందర్భానికి తన సునిశితమైన ప్రజ్ఞతో ఆ పాత్ర మీద empathy create చేసారు.
ఇది వేటూరి మనసు….
——————————————
నళినీకాంత్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం