వేటూరి ఒక అచ్చతెలుగు కవి. ఆయనకు తెలుగు అంటే ఉన్న మమకారం మనందరికీ తెలుసును. ఆయన పాటల్లో తెలుగుదనాన్ని, తెలుగు చరిత్రను, తెలుగు సంపదను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా మనం ఇదివరకు చర్చిన్చుకున్నదే. వీటికి తోడు వేటూరి పాటల్లో నాకు నచ్చే మరొక అంశం ఏమిటి అంటే, ఆయన వాడే సంస్కృత సమాసాలు. కొన్ని గంభీరంగా ఉంటాయి, కొన్ని ముద్దుగా ఉంటాయి, కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి, కొన్ని తప్పులు కూడా. ఏది ఏమైనా ఆయన ధారగా సంస్కృత పదాలను వాడి తెలుగు పాటలకు మరింత అందాన్ని చేకూర్చారు. ఆయన సౌరమానజన్మదినం సందర్భంగా అలాంటి కొన్ని ఉదాహరణలు గుర్తు చేసుకుందాము.
తొలుత ఆయన సంపూర్ణంగా సంస్కృతంలో వ్రాసిన ఒక పాటను గమనిద్దాము. అది సప్తపది చిత్రంలో “అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి” అనే పాట. అందులో మూడు చరణాలలో ముగురమ్మలను వర్ణిస్తూ వ్రాసారు. ఈ మధ్యనే ఈ పాటను “పాడుతా తీయగా“లో ఎవరో పాడితే బాలసుబ్రహ్మణ్యం గారు “(ఇది వ్రాసింది ఎవరు అన్నది) నాకు అనుమానం ఉంది. ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చిన పాట. ఇది చిత్రంలో వినియోగించడం జరిగింది (అనుకుంటున్నాను).” అన్నారు. వెంటనే న్యాయనిర్ణేతగా వచ్చిన సామవేదం షణ్ముఖ శర్మ గారు “కొన్ని శబ్దాలు చూస్తుంటే వేటూరి మాత్రమె చెయ్యగలరు అనిపిస్తోంది. ఉదాహరణకు శర్వార్ధగాత్రి, సర్వార్థ సంధాత్రి — ఈ అందం, పైగా శిల్పరచన అంతా చూస్తుంటే వేటూరి గారిదే అనిపిస్తోంది. అలాగే మొదటి చరణంలో పార్వతి, రెండవ చరణంలో మహాలక్ష్మి, మూడవ చరణంలో సరస్వతి గురించి చెప్పి నాలుగవ చరణంలో సమన్వయం చేస్తూ తీసుకురావడంలో ముగురమ్మల మూలపుటమ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ చేసిన అద్భుతమైన రచన ఇది (ఇది వేటూరి శైలే.)“, అన్నారు. ఆయన అంతగా పొగడటం వేటూరి పండిత-పామర జనరంజకంగా పాటలు వ్రాస్తారు అని అందరికీ తెలిసిన విషయానికి మరొక రుజువు.
ఈ పాటలో అందమైన సమాసాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు సామవేదం గారు చెప్పినవి: శర్వార్ధగాత్రి అంటే శర్వుడి (శివుడి) శరీరంలో సగభాగం అని, సర్వార్థ సంధాత్రి అంటే అన్ని పనులనూ నేరవేర్చే శక్తి అని. పార్వతీ దేవికి ఇది ఎంత అందమైన వర్ణన? సరస్వతీ దేవిని వర్ణిస్తూ సరససాహిత్య, స్వరస సంగీత స్తనయుగళే అన్నారు. అంటే సంగీతం సాహిత్యం రెండు వక్షోజాలుగా కలిగింది అని చెప్తున్నారు. బిడ్డలకు కలిగే కళాపిపాసను తీర్చగలిగిన తల్లి ఆవిడే కదా, మరి. నాకు ఇంకా నచ్చినది శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని గణ పూజిత శుభచరణే అనడం. సమాసం కాలవ్యతిరేకక్రమంలో ఉన్నా భాగవతం చెప్పిన శుకుడి దగ్గర నుండి రామాయణం వ్రాసిన ఆదికవి వాల్మీకి దాక అందరూ ఆవిడ పాదాలను పూజించారు అనడంలో మన సాహిత్యం మొత్తానికి ఆవిడే ఆధారభూతం అని వ్యక్తం అవుతోంది. చక్కని మాట. అలాగే వింధ్యాటవీవాసినే కి ప్రాస కుదిరేలాగా యోగ సంధ్యా సముద్భాసినే అనడం చక్కగా ఉంది. యోగాభ్యాసం పూర్తీ కావస్తుంటే అమ్మ ఉద్భాసిస్తుంది (వెలుగుతూ కనిపిస్తుంది) అని లోతైన భావాన్ని చెప్పారు!
అదొక్కటే కదా సంస్కృతంలో వ్రాసిన పాట అనుకుంటున్నారా? ఆలాపన చిత్రంలో ఆరు ఋతువులు అనే పాటలో రెండో చరణాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అని నేను ఇక్కడ వ్రాయట్లేదు అంతే. అది ఒక సారి విని చూడండి. మీకు పూర్తిగా అర్థమైతే నాకు చెప్పండి. మరొక చక్కని పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో జై చిరంజీవా జగదేక వీర. చిన్న చిన్న పదాలతో చక్కగా సాగే భక్తీగీతం.
తరువాత అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలో ఆయన వ్రాసిన పాట ఒకటి చూద్దాము.
ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగ శబరీ గిరి శృంగ, నిత్య నిస్సంగ, మంగళాంగ, పంపాతరంగ, పుణ్యానుషంగ, మునిహృదయ జలజ భృంగ
ఇందులో గమనిస్తే ” అంగ” తో వృత్త్యనుప్రాస నడిపించారు. అయ్యప్ప స్వామిని ఎత్తైన శబరిమల అంచుగా, సర్వసంగ పరిత్యాగిగా (ఆయన పెళ్లి చేసుకోలేదు, భక్తులు ఆయనకు తప్పితే వేరే పనీ లేదు), మంగళ కరమైన విగ్రహం కలిగిన వాడిగా, పంపానది తరంగంగా, పుణ్యాత్ములను ప్రేమించేవాడిగా, మునుల హృదయాలు అనే తామర పూవులలోని భక్తి అనే తేనెను త్రాగే భ్రమరంగా పోల్చారు. ఎంత లోతైన వర్ణన, ఎంత అందమైన పదాల గమనం?
మరొక పాట భైరవద్వీపంలో శ్రీ తుంబుర నారద నాదామృతం. పాట పల్లవిలో
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం
సంగీతామృత పానం,
ఇది స్వరసురజగతీ సోపానం
గమనిస్తే ఒక్క “ఇది” అనే మాట తప్ప మిగతాది అంతా సంస్కృతమే. ఒకటి రెండు పదాలు పునరుక్తిలాగా అనిపించినా భావం చక్కగా ఉంది. పదాల అల్లిక శ్రావ్యంగా ఉంది. ముఖ్యంగా భక్తిపాటలలో ఇలాంటి ప్రయోగాలు వేటూరి చాలా చేసారు.
వేటూరిలో ఉన్న ఒక విశేషం ఏమిటి అంటే — మనం ఆయన్ని గురించి ఒక మాట చెప్పగానే, దానికి వ్యతిరేకమైన మాట కూడా నిజమేనని గుర్తు చేస్తారు. ఇప్పుడే భక్తీ పాటలు అన్నానా? వెంటనే “నాయనా, భక్తికి సంస్కృతానికి సంబంధం ఏమిటి?” అన్నట్టు మరొక పాట గుర్తొచ్చింది. వినేవాళ్ళకు ఆశ్చర్యంగానో, వెటకారం గానో, అసభ్యంగానో అనిపించినా వేటూరి వ్రాసిన ఒక mass పాటలో మరొక అందమైన ప్రయోగం ఉంది.
ఇందువదన, కుందరదన, మందగమన, మధురవచన, సొగసులలన, గగనజఘునవే
చంద్రుడిలాంటి ముఖం కలదానా, మల్లెపూల వంటి పలువరుస కలిగిన దాన, నెమ్మదిగా నడిచేదానా (నెమ్మదిగా నడవడంలో అందం కూడా ఉంటుంది అని కవులు ఇలాగ అంటారు), చక్కగా మాట్లాడేదాన, అందమైన దాన అంటూ నాయికను పొగిడి మళ్ళీ “ఆకాశం వాలే విశాలమైన వంటి కటిప్రదేశం కలిగినది” అంటూ తమదైన శైలిలో కొంచెం సంస్కృతం సమాసాల-మసాలా కూడా దట్టించారు.
ఇక చిటిపొటి సమాసాలను చూద్దాము. అంటే ఇవి పాటకి సందర్భానికి/బాణీకి సరిపోగా వేటూరి అల్లిన సరదాసమాసాలన్న మాట. చూడాలని ఉంది చిత్రంలో యమహానగరి పాటలో ఒక చోట శరన్నవలాభిషేకం అన్నారు. నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు చిరంజీవి పిచ్చితో ఆ మాట అర్థం కాకుండానే పాడుతుంటే మా అక్క చెప్పింది అది “శరత్ నవల అభిషేకం” (అంటే శరత్ చంద్ర నవలల వెల్లువ) అని. నిజానికి నాకు తెలిసి నవల అనేది సంస్కృత శబ్దం కాదు, అది ఆంగ్ల “novel” నుండి గ్రహించబడిన వ్యావహారికశబ్దం. (తెలుగులో నవల అంటే స్త్రీ అని అనుకోండి. అది ఇక్కడ అనవసరం.) కానీ సందర్భానికి కుదిరంది కదా అని వేటూరి కొంచెం చొరవ చేసి ఈ పదాలను కలిపారు. నిజానికి ఇది సమాసం అనడం కంటే అనునాసిక, సవర్ణదీర్ఘ సంధులు అనడం సబబు అనుకుంటున్నాను. అదే పాటలో జనగణ మనముల స్వరపదవనముల హృదయపు లయలను శృతిపరిచిన ప్రియ శుక పీక ముఖ సుఖ రవళులతో అని కూడా అన్నారు.
స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రంలో వేటూరి కొన్ని గమ్మత్తైన ప్రయోగాలు చేసారు. బహుశా దానికి కారణం ఆ చిత్రదర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ కూడా సాహిత్యాభిలాషి అవ్వడం కావచ్చును. చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం అనే శృంగారరసభరితగీతంలో పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు అని అన్నారు. పిపీలికాదిబ్రహ్మ అనడం సాధారణమే కానీ దానికి యతిని, ప్రాసను కూడా కలిపి పిపాసను పక్కన పెట్టడం వేటూరి చిలిపి గాంభీర్యం.
ఇక ఊహించని తరుణంలో కొన్ని సంస్కృతపదాలను చేరుస్తూ కూడా ఉంటారు. గీతాంజలి చిత్రంలో ఆమనీ పాడవే తీయగా పాటలో ఒక చోట వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక అన్నారు. ఆ భావం ఎంత లోతైనదో మరీచిక అనే పదానికి అర్థం ఎండమావి అని తెలిస్తే బోధపడుతుంది. అదిగో భావం లోతు అన్నాను. ఇప్పుడు వేటూరి భావం లోటుని కూడా గుర్తు చేసారు. అదీ చూద్దాము. హిట్లర్ చిత్రంలో నడక కలిసిన నవరాత్రి అనే పాటలో ఒక చోట మరాళి అన్నారు. అంటే హంస అని అర్థం. ఆ మాట చుట్టూ ఎంత ముతక మసాలా ఉన్నా అక్కడ ఈయనకు ఎలాగో ఈ పదం తోచింది. ఇలాంటి ఉదాహరణలు చిరంజీవి చిత్రాలలో చాలానే ఉన్నాయిలెండి.
చివరిగా వేటూరి దుష్టసమాసాలను కూడా ఒక సారి చెప్పాలి. ఎందుకంటే ఆయన వాటితో కూడా అందంగా కవిత్వం చెప్పగలరు. దుష్టసమాసం అంటే సమాసం పొసగని పదాలకు సమాసం కలపడం. ఉదాహరణకు తెలుగు పదాలను, సంస్కృత పదాలను నియమాలకు వ్యతిరేకంగా కలిపెయ్యడం. ఆయన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో గంగోత్రి చిత్రంలోని జీవనవాహిని పాటను చర్చిస్తూ జలదీవెన అన్నది దుష్టసమాసమే కానీ, “మనం భక్తిపాటలు అనట్లేదు? మరి అదీ దుష్టసమాసమే” అని సమర్థించారు. సమాసాల గురించి చదువుకున్న మనమే భక్తిపాటలు అనగా లేని తప్పు చిత్రంలో ఎక్కువగా చదువు అబ్బని వాడు జలదీవెన అని భక్తితో అనడంలో తప్పేముంది, అది అతని భక్తి — అందులోనూ అందం ఉంది.
అదిగో నేను భక్తి అన్నాను. ఇప్పుడు కేసెట్ రెండో వైపును గుర్తు చేసారు వేటూరి. ఒక ముద్దొచ్చే చిలిపి దుష్టసమాసం దేవరాగం అనే మళయాళ చిత్రానువాదంలో యా యా యా నెమలి కన్నుల కలయా అనే పాటలో కృష్ణుణ్ణి కౌగిళ్ళనిలయా అనడం. నిజమే మరి ఎంతో మంది గోపికలు ఆయనే సర్వస్వం అనుకుని వారి కౌగిలిలో బంధించే ప్రయత్నం చేసారు. ఎవరికి వారే యమునా తీరే అని ఊరేకేనే అన్నారా? మరి అన్ని కౌగిళ్ళలో ఒకే సారి నివసించినవాడు కృష్ణుడే కదా? అందుచేత సబబేను. తప్పొప్పులు పక్కన పెడితే ఈ ప్రయోగం ముద్దుగా లేదు? కవిత్వం అంటే అదే కదా — చక్కని భావాన్ని తీయని పదాలతో పండితులకు, పామరులకు నచ్చేలాగా చెప్పడం. వేటూరికి వచ్చింది, ఆయన మనకు ఇచ్చింది, మనకు నచ్చింది అదే కదా!
ఈ పదాలలోనే ఆయనను చూసుకుంటూ, తలుచుకుంటూ సాగుదాము.
—————————————————-
పిపీలికాది బ్రహ్మ అంటే ఏమిటండి?
“పిపీలికాదిబ్రహ్మ”పర్యంతం సర్వం ఈశ్వరమయం.సృష్టిలోని ప్రతీ వ్యక్తీ ఆ పరమాత్ముని ప్రతిరూపాలే.
సోదరా, చాలా చక్కని వ్యాసం. చాలా మంచి వివరాలు తెలియజేసావు. ధన్యుడవు!
శ్రీనివాస కంచిభొట్ల గారు ఒక వ్యాసంలో “తెలుగు సినీ గీతరచయితల్లో తమలోని కవిత్వాంశని సంపూర్ణంగా ప్రదర్శించిన వారు ఇద్దరే – వేటూరి, దేవులపల్లి. వీళ్ళు పండితులుగా, తాత్త్వికులుగా కన్నా, కేవలం కవులగా ఎక్కువ కనిపిస్తారు” అన్నారు. ఇది నిజమే అనిపిస్తుంది నాకు. వేటూరి చాలా సార్లు ఆలోచనని పక్కన పెట్టి తన అనుభూతిని ప్రదర్శించారు. అందుకే ఈయన పాటల్లో దుష్టసమాసాలు, అర్థం కాని పదాలు భావాలు ఎక్కువ చోటుచేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది.
వేటూరి చాలా పాటల్లో గాంభీర్యం కనిపించినా, ఆయన తేలిక పదాలతో రాసిన పాటలు నాకు చాలా నచ్చుతాయి. “పదే పదే పాడుతున్నా” (సీతామాలక్ష్మి), “మనసెరిగినవాడు మా దేవుడు” (పంతులమ్మ చిత్రం, ఈ మధ్యే ఈ పాట విన్నాను. వినకపోతే విను!) మొదలైనవి.
గొప్ప వ్యాసం అందించినందుకు పునః కృతజ్ఞతలు.
పిపీలికం అంటే చీమ, బ్రహ్మ అంటే తెలిసినదే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ (అన్నిటికంటే చిన్న జీవిని) మొదలుకొని బ్రహ్మ (అన్నిటికంటే పెద్ద జీవి) వరకు అని అర్థం.
మంచి వ్యాసం, సందీప్ గారు! చాలా బాగుంది. అభినందనలు!
పప్పు గారు, మార్జాలమంటే బిడాలమని చెప్తే ఎలా చెప్పండి. 🙂 చెప్పేదేదో ఇంకాస్త సొష్టంగా చెప్పాల్సింది కదండీ.
రాజు గారు, పిపీలికమంటే చీమ. పిపీలికాదిబ్రహ్మలో అంటే చీమ నుండి బ్రహ్మదాకా అని.
చాలా బావుంది వ్యాసం! సవిస్తరంగా వివరించారు…
Dear Sandeep Garu,
Good Artical. Keep writing
సందీప్ గారూ! చాలా చక్కగా వుంది మీ వ్యాసం. కుదిరితే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రాస్తూ మాకు కొత్త కొత్త విషయాలు తెలియజేయండి. అభినందనలు.
*..ఈ సందర్భంగా నాదొక చిన్న విన్నపం. వేటూరి గారు రచించిన పాటలన్నీ (కనీసం కొన్ని) ఒక పుస్తకంగా దొరికే అవకాశం వుందా? ఉంటే అలాంటి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది. ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి.
మీకు కావాల్సిన పుస్తకం ఇక్కడుంది చూడండి బాలు గారూ
http://veturi.in/article/422
సందీప్ గారు, ఒక చిన్న సందేహం..
“గగనజఘున” : ఎక్కడో విన్నాను.. గగనం అంటే “0” (శూన్యం) అన్న అర్థం కూడా ఉంది కదా , కాబట్టి గగనజఘన అంటే zero size అని అర్థం వస్తుంది అని… వేటూరి ఈ ఉద్దేశం తో రాసారో కాని నాకు ఎందుకో ఈ zero size concept కూడా బాగుందనిపిస్తుంది 😀
వేటూరి గారి పాటల సంకలన వివరాలు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు…
పైన తెలిపిన లింక్ పనిచెయ్యడం లేదు.
పవన్ గారు,
ఈ కింద లింక్ లో చూడండి, ఫైల్ ఉంటుంది పాప్ అప్ విండో లో చూస్తే వస్తుంది
http://veturi.in/422
అమోగం….అద్వితీయం……..తెలుగు పదానికి వన్నె తెచ్చిన వైతాళికుడా…………తెలుగోడిని పాటల పల్లకిలో ఊరేగించిన ఘనుడా……తెలుగుపదపూదోటలో వికసించి….విరబూసిన ..విరంచి…….వేటూరి గారి గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే ……..వ్యాసం వ్రాసిన వారికీ …..ఈ పోస్ట్ పెట్టిన వారికీ …సర్వదా ..సహస్రదా …కృతజ్ఞతాభినందనలు
మీ దుర్గా లక్ష్మి నారాయణ
శుక పీక ముఖ సుఖ రవళులతో….అర్థం తెలియజేయగలరని వ్యసకర్త గారికి మనవి
Krishna
జనగణము = జనుల సమూహం (చాలా మంది), మనముల = మనసులలో, స్వర = సంగీత స్వరము, పద = సాహిత్యము, వనముల = తోట(లో), హృదయపు = మనసుల, లయలను = తాళాన్ని, శ్రుతి పరచిన = సరి చేసిన, ప్రియ = ఇష్టమైన, శుకము = చిలుక, పికము = కోకిల, ముఖ = నోటినుండి, సుఖము = హాయిని కలిగించే, రవళులతో = శబ్దము
సాహిత్యం అనే చిలుక, సంగీతం అనే కోకిల ఉన్న వనంలో వాటి నోట వెలువడే ఇష్టమైన, హాయిని కలిగించే శబ్దాలు అందరి మనసులలో ఉండే (జీవన) తాళాన్ని (కళను కలిపి) సరి చేసిన మహానగరి కలకత్తా పురి.
విశేషం: చరణంలో ముందుగా వందేమాతరం (జాతీయ గీతం), SD బర్మన్ (సంగీత దర్శకుడు) గురించి ప్రస్తావించారు. స్వర – పద, శుక – పిక, ప్రియ – సుఖ అంటూ సంగీతాన్ని, సాహిత్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
విమర్శ: జనగణమన అని “మనసులను” ప్రస్తావించాక మళ్ళీ “హృదయపు లయలను” అనడం వలన ద్విరుక్తి ఐంది. బహుశా “మనముల” అనడంలో “మనలని” అనే శ్లేష/ధ్వని కలగాలని కవి ప్రయత్నించారేమో – ఆయనకే తెలియాలి.
గగనజఘన సొగసులలనవే .. అంటే అది… గగనజఘన … అంటే .. గగనం అంటే శూన్యం అనీ .. జఘనం అంటే నడుము అనీ … మొత్తంమీద కనిపించని నడుముగల సొగసులలనవే అని అర్థమా …. లేక
గగనజ ఘనసొగసులలనవే .. అంటే .. గగనజ కు అర్థం … మెరుపు అనీ ఘనసొగసులలన అంటే గొప్ప సొగసుగలభామ అనీ.. ఏతావాతా … మెరుపువంటిగొప్ప సొగసుగలభామ అనీ అర్థమా…
నాకు ఇంతవరకూ బోధపడలేదు…
వేటూరి గారి అద్భుతమైన అనితర సాధ్యమైన సాహిత్యాన్ని సంబంధించిన విషయాలనెన్నో చక్కగా వివరించారు. ధన్యవాదములు. (చిన్న సవరణ: ఆలాపన చిత్రం లోని “ఆరు ఋతువులు…” పాట రాసిన వారు సినారె గారు).
మీ అంత సినీ పరిజ్ఞానమ్ నాకు లేకున్నా..వేటురి సుందర రామమూర్తి గారి అభిమానినే. క్షమించాలి..ఇంటి పేరు ఒకటి అనికాదు..నిజంగానే ఆయన అభిమానిని.
వేటూరి వెంకట రమణ మూర్తి.
సందీప్ గారి విశ్లేషణ అద్భుతంగా ఉంది. వేటూరి అఖిలాండేశ్వరి పాటలో వారి పద ప్రయోగాలు ఎంత అద్భుతంగా కలసి పోయాయి అంటే వాటిని గుర్తుపట్టటం కష్టం. సందీప్ గారికి నా అభినందనలు, అభివాదాలు.