నమ్మిన నా మది మంత్రాలయమేగా!

ఈ మధ్యే ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలోని నమ్మిన నా మదిపాట విన్నాను. అంతక ముందు చాలా సార్లు విన్నాను. విన్న ప్రతిసారీ గొప్పగా అనిపించింది. “వేటూరి ఎంత బాగా రాశాడో” అనుకోగానే వేటూరి పుట్టినరోజు  దగ్గరలోనే ఉందని గుర్తొచ్చింది. అందుకే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో ఈ వ్యాఖ్యానం.

ఈ పాట మంత్రాలయ రాఘవేంద్రస్వామిని స్తుతిస్తూ సాగినా ఒక భక్తుడు భగవంతునికి తనను తాను ఆర్తిగా నివేదించుకోవడమే నాకు కనిపిస్తుంది. అందుకే ఈ పాటని ఎవరికి వారు తమ అనుభవాలతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెయ్యబోయే వ్యాఖ్యానం కూడా ఈ కోణంలోనే సాగుతుంది.

ముందుగా పాట సాహిత్యం:

నమ్మిన నా మది మంత్రాలయమేగా

నమ్మని వారికి తాపత్రయమేగా

శ్రీగురుబోధలు అమృతమయమేగా

చల్లని చూపులు సూర్యోదయమేగా

గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా

హనుమంత శక్తిసాంద్రా

హరినామ గానగీతా

నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

చరణం : 1

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా

నీ భజనే మా బ్రతుకైపోనీవా

పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ

నీ చరణం మా శరణం కానీవా

మనసు చల్లని హిమవంతా

భవము తీర్చరా భగవంతా

మహిని దాల్చిన మహిమంతా

మరల చూపుమా హనుమంతా

నీ వీణతీగలో యోగాలే పలుకంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

చరణం : 2

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన

నీ పిలుపే మా మరుపై పోతుంటే

వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా

నీ తలపే మా తలుపే మూస్తుంటే

వెలుగు చూపరా గురునాథా

వెతలు తీర్చరా యతిరాజా

ఇహము బాపి నీ హితబోధ

పరము చూపె నీ ప్రియగాథ

నీ నామగానమే ప్రాణాలై పలుకంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

నమ్మిన నా మది మంత్రాలయమేగా

నమ్మని వారికి తాపత్రయమేగా

మొత్తం పాటలో విషయాన్ని రెండు వాక్యాల్లో గొప్పగా చెప్పారు వేటూరి. మంత్రాలయ రాఘవేంద్రస్వామిని నమ్మిన వారికి ముక్తి, నమ్మని నాస్తికులకి ఏ ప్రాప్తమూ లేదని చెప్పడం వేటూరి ఉద్దేశ్యం కాదు. ఇక్కడ నమ్మకం అంటే కేవలం belief కాదు. నీలోని అహాన్ని పక్కన పెట్టి నిన్ను నీవు సమర్పించుకోవడం. సమర్పణం అన్నది ముఖ్యమైన విషయం, ఎవరికి సమర్పించుకుంటున్నావు అన్నది కాదు. ఇది అంత సులువైనది ఏమీ కాదు. ఓ ఘడియో, ఐదు నిమిషాలో ఆ స్థితిలో ఉండగలిగితే గొప్ప విషయమే. ఆ కొద్దిసేపైనా మనసు భగవంతుని నిలయంగా,  మంత్రాలయంగా మారుతుంది.  నదిలో ఈదే చేపకి నీటి గురించి తెలుస్తుంది తప్ప ఒడ్డున కూర్చుని తర్కించే మేథావులకి కాదు. అలాగే భగవంతుడిని కేవలం కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భావించి పూజించే భక్తులకి నిజమైన భక్తిభావం అంటే తెలియదు. మన తాపత్రయంలో మనమున్నప్పుడు భగవంతుడు మన చెంతకి ఎందుకు రావాలట అసలు?

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో 

పాటలో “తుంగాదళాల” సేవ అని తప్పుగా వినిపిస్తుంది, కానీ అది “తుంగాజలాల సేవ”. మంత్రాలయ బృందావన క్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో ఉంది కాబట్టి వేటూరి తుంగభద్రని ప్రస్తావించారు.  పాట మొత్తంలో శ్రీ రాఘవేంద్రస్వామికి సంబంధించిన ఎన్నో విశేషాలని వేటూరి ప్రస్తుతిస్తారు. వాటి గురించి బాగా తెలిసిన వారెవరైనా వ్యాఖ్యానిస్తే బాగుంటుంది.

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా నీ భజనే మా బ్రతుకైపోనీవా

శోకంలో కూరుకుపోయిన వాళ్ళకి భగవంతుడు గుర్తుకు రావడం సహజం. అయితే నిరాశ తోడైతే మాత్రం భగవంతుడూ గుర్తుకు రాడు. నిరాశలో ఉన్న వాడికి దైవసహాయంపైన కూడా ఆసక్తి ఉండదు. అలాగే ఏదైనా కానిది/తగనిది/అనవసరమైనది పొందలానే దురాశ పుట్టినప్పుడు కూడా మన అహంలో, అహంకారంలో, అజ్ఞానంలో మనముంటాం తప్ప దేవుడు గుర్తుకు రాడు. ఈ రెండు స్థితుల్లోనూ చేజారిపోనీక మమ్ము పట్టుకు నడిపించు ప్రభూ అని వేడుకోవడం.

పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ

నీ చరణం మా శరణం కానీవా 

గుడికి వెళ్తే దేవుని పాదాలపై వాలి మొక్కుకుంటాం. పాటలు (పదాలు) పాడతాం.  తలవంచి నమస్కరించినప్పుడు కాసేపైనా మన అహంకారం తలవంచిందా? పాట పాడినప్పుడు నిమగ్నమయ్యామా లేక పొగడ్తలకోసమో, ప్రశంసల కోసమో పాకులాడేమా? అందుకే నీ చరణాలే నాకు శరణమనే శరణాగతి ప్రసాదించమని ప్రార్థన.

భవము తీర్చరా భగవంతా 

భవము అంటే పుట్టుక అని అర్థం తీసుకుంటే, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యమని వేడుకోవడం కనిపిస్తుంది. ఆశానిరాశలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలన్నీ మనసు చేసే కల్పనలే. ఇవే బంధనాలై, రుణాలై, ఇంధనాలై “రేపుని” సృష్టిస్తాయి. ఈ “కర్మ” తప్పాలంటే ద్వంద్వాలకి అతీతమైన స్థితిని పొందాల్సి ఉంటుంది. అంటే మనసు పరిధిని దాటి అనంతంలోకి దూకడం అన్నమాట. “మరుజన్మ” లేకపోవడం అంటే ఇదే!

మహిని దాల్చిన మహిమంతా

మరల చూపుమా హనుమంతా

మహిమలు చూపడంలో ఉద్దేశ్యం తన గొప్పతనాన్ని చాటుకోవడం కాదు, మనలోని అల్పత్వాన్ని తెలియపరచడం.   అందుకే నీ మహిమలన్నీ మళ్ళీ చూపి మాలోని అల్పత్వాన్ని ఎరుకజెయ్యి స్వామీ అని ప్రార్థన.

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన

నీ పిలుపే మా మరుపై పోతుంటే

వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా

నీ తలపే మా తలుపే మూస్తుంటే 

ఇక్కడ రెండు ప్రలోభాలని ప్రస్తావిస్తున్నారు. ఒకటి కాంక్ష, రెండవది వయసు. ఈ రెండూ తోడు స్నేహితులు కూడా! ఒక తీవ్రమైన వాంఛ, అది ధనం మీద కావొచ్చు, కీర్తి మీద కావొచ్చు లేక మరి దేనిమేదైనా కావొచ్చు, అది “నీలోని నిన్ను” వృద్ధి చేస్తున్నంత వరకూ అది వినాశహేతువే. అలాగే వయసూ, వేగం, శక్తీ ఉన్నప్పుడు ఆ మత్తులో మనం చేసే ప్రతీదీ గొప్పగానే కనిపిస్తుంది. ఈ రెండు స్థితుల్లోనూ వినమ్రత, ఎరుక కలిగి ఉండడం కష్టమే. అందుకే మము కాచి వెలుగు చూపమని ప్రార్థించడం. మనకి తెలిసిన ఈ “ఇహము” కొన్ని సార్లు ప్రియమైనా, కొన్ని సార్లు అప్రియమైనా మనం దాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. ఈ జంజాటం నుంచి విడిపించి పరతత్త్వాన్ని ప్రసాదించమని వినతి.

ఈ పాట నిండా పరుచుకున్న భక్తితత్త్వం మైమరపింపజేస్తుంది. మణిశర్మ చాలా చక్కటి బాణీ అందించాడు (పాటని ఇక్కడ వినొచ్చు – http://www.raaga.com/play/?id=9132). ఈ బాణీలోని శక్తి వేటూరికి గొప్ప ప్రేరణని ఇచ్చిందని చెప్పడానికి ఆయన ఈ పాటలో చేసిన శబ్దార్థ ప్రయోగాలే నిదర్శనం. లీనమైన కొద్దీ లోతు తెలిసే పాట ఇది. వేటూరి లేని లోటుని తెలిపే పాట కూడా.

4 thoughts on “నమ్మిన నా మది మంత్రాలయమేగా!”

  1. తాపత్రయం లేదా త్రివిధ తాపాలు అనగా మూడు రకాలైన తాపాలు అనగా బాధలు అని అర్ధం. ఇవి 1. ఆధ్యాత్మిక తాపం, 2. అధిభౌతిక తాపం మరియు 3. అధిధైవిక తాపం అని మూడు రకాలు.
    ఆత్మ అనే దానికి శరీరం, మనస్సు, బుద్ధి , జీవాత్మ , పరమాత్మ అని వివిధ అర్ధాలున్నాయి. మనస్సు, శరీరం ఇత్యాదుల కారణంగా కలిగే శోకం, మోహం, జ్వరాది రోగాలు మున్నగు బాధలు ఆధ్యాత్మిక తాపాలు.
    భూతములనగా ప్రాణులు. మనుష్యులు, పశువులు, పక్షులు, పాములు మొదలైన ప్రాణుల ద్వారా సంభవించే బాధలు అధిభౌతిక తాపాలు.
    యక్షరాక్షసుల చేత, గ్రహావేశాల చేత, దైవబలముతో కలిగేవి అధిదైవిక తాపాలు. భూకంపం, సునామీ, అతివృష్టి, అనావృష్టి మొదలైనవి ఇందులో చేరతాయి.
    మానవులమైన మనకు కలిగే నానావిధాలైన బాధలు ఈ త్రివిధతాపాలలో చేరిపోతాయి. వీటికి గురైనవారు “తాపత్రయ పీడితులు” అనబడతారు.

    1. @sravan: తాపత్రయం అంటే అసలు అర్థాన్ని వివరించినందుకు thanks. నేను వ్యవహారార్థం తీసుకుని నా వివరణ రాశాను.

  2. ఫణీంద్ర గారు చాలా బాగా రాసారండి. పాట అర్థం చాలా బాగా వివరించారు … Excellent

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top