(కీ.శే. వేటూరి సుందరరామమూర్తి ప్రసిద్ధ సంగీత నాటిక ‘సిరికాకొలను చిన్నది‘ కి రజనీకాంతరావు రాసిన ముందు మాట)
అది 1971-73 ప్రాంతం. నేను ఆకాశవాణి విజయవాడ కేంద్ర నిర్దేశకుణ్ణై కార్యనిర్వహణ చేస్తున్న కాలం. బేలగా ఒక యువ కవి నా కార్యాలయపు గది దగ్గరకు వచ్చి లోపలికి చీటీ పంపాడు. ఆయన ఇంటి పేరు వేటూరి. పేరు సుందరరామమూర్తి. పాటల, నాటకాల రచయిత.
కొన్ని మాసాలుగా ఆయన పంపిన పాటలు-మాటల నాటకం ఒకటి మా కార్యాలయంలో నిర్ణయానికై ఎదురుచూస్తూ వుండిపోయింది. ప్రొడ్యూసర్ వోలేటి వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం ఎక్జిక్యుటివ్ శంకరమంచి సత్యం గార్లను నా గదికి పిలిచి సమాచారం సేకరించాను. శంకరమంచి సత్యం దగ్గరో, వోలేటి దగ్గరో సిరికాకొలను చిన్నది అనే పాటల నాటకం, కొన్ని పాటల నోట్‌బుక్కు ఒక అయిదారు నెలలుగా వుండిపోయినట్లు తేలింది. అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలోని వర్ణనలకి ప్రోత్సాహమైన పాత్రగా ‘సిరికాకొలను చిన్నది’ కనిపించింది.
చెప్పలేం! పెద్దన గారి వరూధిని సిరికాకొలను చిన్నదానికి మూలపాత్ర అయ్యుండొచ్చు. లేదా ఇట్నించి అటైనా మలుపు తిరిగుండొచ్చు.
శంకరమంచి సత్యం గారూ, వోలేటి వెంకటేశ్వర్లు గారూ పాటలు, నాటకం చాలా బాగున్నాయని అభినందిస్తూ, ఈ నాటకానికి సంగీతం పెట్టడానికి ప్రథమశ్రేణి సంగీత దర్శకుణ్ణెవర్నయినా పిలిపిస్తే బాగుంటుందని రికమెండ్ చేశారు. నేను సమ్మతిస్తూ, సినీక్షేత్రంలో నాడు సహవ్రతీ, సహ సంగీత దర్శకుడూ (సారథి వారి గృహప్రవేశం సినెమాకి) అయిన పెండ్యాల నాగేశ్వరరావుకి నాటకంలోని మొదటి ఒకటిన్నర గంటలకూ ఒక తేదీ నిర్ణయించి, దాన్ని మూడు నెల్ల తర్వాత మొదటి తేదీని రెండో భాగం ఒకటిన్నర గంట షెడ్యూల్ చేయడానికి నిర్ణయించాం. ఆ రెండిటికీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర్రావే!
కృష్ణా జిల్లా అవనిగడ్డకు దగ్గరగా వున్న శ్రీకాకుళం ఆంధ్రవిష్ణువు వెలసిన మహాక్షేత్రం కావడమే కాకుండా నారాయణ తీర్థులు, క్షేత్రయ్య వలే అక్కడ సంగీత నృత్యాలకు నెలవులైన వెలయాండ్రు వెలసినట్టుగా రాసినవారిని వెతకాలి. అటువంటి వారిలో వేటూరి సుందరరామమూర్తిగారు మొదటివారు. ఆ విషయాన్ని గుర్తించి ఆయన సంగీత నృత్య నాటకానికి రేడియోలో అనువైన స్థానం ఇవ్వగల్గినందుకు ఎంతో గర్విస్తాను.
ఈ నాటకంలోని పాటలు, ఛందాలు, సంగీత నృత్య సంప్రదాయాలకు అలివేణి వంటి పాత్రల అనుభవాలకూ అభినయాలకూ అన్ని అవకాశాలు కల్పించే రాగ సంపదకూ త్రోవ చూపగలదని ఆశించాను. అలాగే జరిగింది.
నేనూ, ఆయన అభిమానులైన ప్రేక్షకాంధ్ర జనులూ ఎంతో సంతోషించడానికి వీలుగా సినిమా క్షేత్రంలో వేటూరికి ఒక మరచిపోవడానికి వీల్లేని స్వాగత ద్వారం తెరుచుకుంది.
ఆయన కార్యక్షేత్రం విస్తరించింది. విజృంభించింది.
ఇట్లు
బాలాంత్రపు రజనీకాంతరావు
(ఆకాశావాణి విజయవాడ కేంద్రం మాజీ నిర్దేశకుడు)
—————————-
ఇ-మాట వారి సౌజన్యంతో (అసలు పోస్ట్ ఈ కింద లింక్ లో చూడవచ్చు)
http://www.eemaata.com/em/printerfriendly/?id=1588