సినీ కవి పాండిత్యం పాటలో వెలువడాలంటే ఆ పాట సన్నివేశం ముఖ్యపాత్ర వహిస్తుంది. “ఊటీలో పాడుకోడానికి ఓ డ్యూయట్ రాసివ్వండి” అని అడిగితే ఆ దర్శకుడిమీదా, ఇచ్చిన సన్నివేశంమీదా గౌరవభావం ఎలా కలుగుతుంది? రాయడానికి కవికి ఏం ప్రేరణ కలుగుతుంది?
వేటూరి విశ్వనాథ్ కీ, వంశీకీ, జంధ్యాలకీ ఎక్కువ మంచి పాటలు రాశారంటే కారణం ఆ దర్శకులు చెప్పే సన్నివేశాలు కలిగించే ప్రేరణ!
ఏవో కారణాలవలన వేటూరి, విశ్వనాథ్ మధ్య కొంత మనస్తాపాలొచ్చి కొన్ని ఏళ్ళు కలిసిపనిచెయ్యలేదు. వీరు విడిపోవడంవల్ల జరగిన పెద్ద నష్టాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి ద్వారా తెలుగు చిత్రసీమ సరిపెట్టుకుందని చెప్పాలి. విడిపోయిన వారు కలిశాక వచ్చిన తొలి చిత్రంలోని పాటగూర్చిన విశ్లేషణే ఈ సమీక్ష!
కవినీ, దర్శకుణ్ణీ కలపాలని ఓ పెద్దమనిషి కంకణం కట్టుకున్నాడు. అందుకని స్వయంగా సినిమా నిర్మించి వేటూరినీ, విశ్వనాథ్ నీ కలిపారు ఆ పెద్దమనిషి. ఆ సినిమా “శుభసంకల్పం”. మహా నటుడు కమల్‌హాసన్ కథానాయకుడు, విశ్వనాథ్ గారిని కూడా ఓ గొప్పపాత్రలో నటనావతారమెత్తించింది ఈ సినిమా. ఇంతటి శుభసంకల్పానికి పూనుకున్న ఆ పెద్ద మనిషి గానగాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు.
ఇక పాట గురించి చూద్దాం…
ఈ సినిమాలో నాయికా నాయకులు పల్లెటూరి ప్రేమికులు.వాళ్ళకు పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయ్యాక పాడుకునే యుగళగీతం. ఆ గీతంలో వాళ్ళ యాస వినిపించాలి, పూర్వం వాళ్ళు ప్రేమికులన్న విషయం వినేవారికి అర్థమవ్వాలి, కొత్తజంట ముచ్చట్లూ, సరసాలూ వినిపించాలి, పాటలోనే కథను కొన్ని నెలలు ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పైన అమ్మాయి నెలతప్పిందన్న విషయంకూడా సూచించాలి. ఐదు నిముషాల పాటలో ఇన్ని చెప్పాలి! ఇటువంటి సన్నివేశానికి చెలరేగిపోయి వేటూరి రాసిన పాట ఇది. ట్యూన్ చేశాక పాట రాశారో, పాట రాశాక ట్యూన్ చేశారోకానీ అద్భుతమైన సంగీతమందించారు కీరవాణి గారు. బాలు గారూ, శైలజ గారూ తమ గళంతో ప్రాణం పోశారు ఈ పాటకి.
పాటంతా స్వచ్ఛమైన తెలుగు పదాలే వినబడతాయి.
పల్లవి
ఆమె : మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు గూటిబైటే గుట్టులాట
అతడు : ఏడు అంగలేసినాక ఎన్నిలింట కాలుబెట్టి పాడుకుంట ఎంకిపాట
ప్రేమించుకునే రోజుల్లోలాగా ఎవరికంటాపడకుండా చెట్టాపట్టాలేసుకుని తిరగనక్కర్లేదు. మనకి మూడుముళ్ళు పడిపోయాయి, ఇక చాటుమాటులేకుండ గూటిబైటే కబుర్లాడుకోవచ్చండుంది నాయిక. ఏడడుగులు కలిసి నడిచాము, ఏ దిగులూ భయమూ లేకుండ ఎన్నెట్లో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చంటున్నాడు నాయకుడు.
భాష గమనించండి! అంగలేయడం(త్వరత్వరగా నడవడం) అన్న పదాన్ని భలే ఉపయోగించారు కవి. ఎంకిపాట – ఈ పదం వినగానే పాట మనగుండెలకు అతిచేరువైపోతుంది; తెలుగుతనమంతా ఈ పదంలోనే ఉందేమో అనిపిస్తుంది.
ఆమె :
ఆకుపచ్చ కొండల్లో గోరువెచ్చ గుండెల్లో
ముక్కుపచ్చలారబెట్టి ముద్దులంట
చరణం 1
అతడు : హే పుష్యమాస మొచ్చింది భోగిమంటలేసింది కొత్తవేడి పుట్టింది గుండెలోన
ఆమె : రేగుమంటపూలకే రెచ్చిపోకే తుమ్మెద
అతడు : కాచుకున్న ఈడునేదోచుకుంటే తుమ్మెదా
ఆమె : మంచుదేవతొచ్చిందా మంచమెక్కికూకుందా
ఆహా అహా ఆహా ఆహా వణుకులమ్మ తిరణాళ్ళే ఓరి నాయనా
అతను :
సీతమ్మోరి సిటికన ఏలు సిలకతొడిగితే సిగ్గులెర్రన
రాములోరు ఆ సిలక కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రన
ధనుర్మాసాన్ని అంధంగా పుష్యమాసం అనడం బాగుంది. భోగిపండుగ ఈ నెల ఆఖరిరోజు వస్తుంది. పుష్యమాసం చలెక్కువకదా? భోగిమంటలను కొత్తజంటల కోరికలతోనూ, కోరికలను పువ్వులతోనూ, ఆ కోరికల పువ్వులకై ఒకరినొకరు తుమ్మెదల్లా ఆశ్రయించారనీ; వారి కలయికను వణుకులమ్మ తిరణాళ్ళుగా ఎంతబాగా పోల్చారో కవి!
ఆకుని చిలక చుట్టి ఒకరికొకరు తినిపించుకుంటూ సరసాలాడే సీతమ్మ రాములోరి ప్రణయాన్ని ఉపమానంగా చెప్పడం వేటూరికే చెల్లు.
చరణం 2
బృందం : లులులు హాయి దాయి దాయి దాయి
ఆమె :
వయసుచేదు తెలిసింది మనసు పులుపుకోరింది
చింతచెట్టు వెదికింది చీకటింట
రెండో చరణానికొచ్చేసరికి కాలం కొంత ముందుకు నడిచింది. పాట భావం మారింది. ఆ నాయిక తను గర్భిణినని చెప్పకనే చెప్పేసింది. ఇదివరకు రుచించిన సరసాలాటలు చేదుగా అనిపిస్తున్నాయట ఆమెకి. మనసేమో పుల్లగా తినాలని కోరుకుంటుందట. పగటివేళ వెళ్ళి చింతచిగురూ, చింతకాయలూ కోసుకు తింటే అందరికీ తెలిసిపోతుందేమోనని సిగ్గుపడి చీకటిపడ్డాక చింతచిగురూ, చింతకాయలూకోసుకుతిందట! ఎంత నర్మగర్భంగా చెప్పారు వేటూరీ!
అతడు : కొత్తకోరికేమిటో చెప్పుకోవె కోయిలా
ఆమె : ఉత్తమాట లెందుకు తెచ్చుకోర ఊయల
నాయకుడికి ఆనందం. శుభవార్త చెప్పావు, ఇప్పుడు నీకు ఏంకావాలో కోరుకో తక్షణమే తెచ్చి పెడతానన్నాడు. నాయిక నవ్వి, “ఉత్త మాటలొద్దుగానీ, ఊయల తయారు చేయించు చాలు” అంటుంది.
అతడు :
ముద్దువాన వెలిసింది… పొద్దు పొడుపు తెలిసింది…
వయసు వరస మారింది ఓరి మన్మథా
నాయికలో చాలానే మార్పొచ్చిందని అర్థమైంది నాయకుడికి. ముద్దువాన వెలిసిపోయింది, ఇదివరకులా అల్లరీ, చిలిపియాటలూ సాగవు, వయసువరసంతా మారిపోయింది! కొత్త బాధ్యతలొచ్చేస్తున్నాయని గ్రహించాడు నాయకుడు.
బృందం : మూడుముళ్ళ జంటలోన ముగ్గురైన ఇంటిలోన జోరుకాస్త తగ్గనీరా జోజోజో
ఇంతలో బారసాలకొచ్చిన అమ్మలక్కలు, “అబ్బాయ్, మీరు ఇప్పుడు ఇద్దరు కాదు! ఇంట్లో ముగ్గురున్నారని గుర్తుపెట్టుకుని జోరుకాస్త తగ్గించి వ్యవహరించాలి” అని నాయకుడికి ఉపదేశాలు చెప్తున్నారు.
ఇంత చక్కని పాటని మనకందించిన వేటూరిని నిత్యం స్మరించుకుందాము.
పాటని ఇక్కడ వీక్షించండి!
ఈ పాట చాలాసార్లు విన్నాను కానీ…మీ పరిచయంతో పాటకే కొత్త అందం వచ్చినట్లుంది భాస్కర్ గారూ…
జ్యోతిర్మయి గారూ, మీకు టపా నచ్చినందుకు నెనర్లు.
ఎంత చక్కగా వర్ణించారండీ …. 🙂
నేను ఇంతకు ముందు ఈ పాట విన్నా …. అందులో ఉన్న భావాన్ని పట్టీంచుకోలేదు…. ఇప్పుడు ఆ పాట వింటుంటే ఎంత అద్భుతంగా ఉందో.