అలంకారాల ‘కలం’ కారి వేటూరి

తెలుగు సినీ సంగీతాన్ని నవ్యపథంలో, దివ్యపథంలో, భవ్యపథంలో నడిపించిన ఆకుపచ్చ సిరాసిరి శ్రీ వేటూరి. విలక్షణ పద రచనల బాణీలకు చిలకపచ్చ ఓణీలను వేసిన నవ్యపథ సంచారి. పలుకుందల్లిని అక్షర చాంపేయకుసుమ మాలలతో అర్చించిన ‘యశశ్శౌరి’. వేలాది పాటలను అలవోకగా వెలయించి, అలసి సొలసిన ‘పాటసారి’ శ్రీ వేటూరి. తెలుగు సినీవనంలో అంకురించిన వేటూరి సుందరరామమూర్తి పాట, ‘సీతాలు సింగారం… మాలచ్చీ బంగారం’ అంటూ శృంగారవీధిలో చివురించింది. ”కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ.. కొమ్మకొమ్మకో సన్నాయీ..” అంటూ రుతువులలో మొగ్గ తొడిగింది. ”మల్లికా.. నవ మల్లికా, బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే..” అంటూ పాటల పూదోటలో, ఎన్నెన్నో పూలను గుబాళింపజేసింది. ”శివశివ శంకరా భక్తవశంకరా…” అన్నా, ”శంకరా, నాద శరీరా పరా..” అన్నా, శంకరాద్వైతాన్ని, ”అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము” అంటూ హరితత్వాన్ని ప్రబోధించినా, ”మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ..” అని మానవత్వ ఔన్నత్యాన్ని చైతన్యవంతం చేసినా, వేటూరి పలుకు పలుకూ ఓ మంత్రాక్షరి, రసఝరి. వేటూరి సాహిత్యంలో ఒకసారి తేనెల సోనలు కురిస్తే, ఒకచోట పంచమ స్వరాలు వినిపిస్తాయి. ఇంకోచోట ప్రాజ్ఞండల విద్యుల్లతా ధ్వానాలు ప్రకటిస్తాయి. ”తకిట తథిమి, తకిట తథిమి తందానా..” అంటూ, వియద్వాహినీ తుంగ తరంగ నాట్య భంగిమలు వెలయిస్తాయి. రసావిష్కారానికి ఆటపట్టు, సాహితీ సరస్వతి నుదుట సిందూరపుబొట్టు. రమణీయ, కమనీయ చమత్కృతులతో, యతులతో, జతులతో, సంగతులతో జట్టు. రసజ్ఞతకు హద్దు లేదనీ, పాండిత్యానికి పాదం లేదనీ, ప్రౌఢిమకు పరిమాణం లేదని, ప్రతిభకు మేర లేదని నిరూపించిన కవి వేటూరి.

అయితే, ప్రతిభకు మేర లేకున్నా, హద్దు మీరితే పండితునికైనా, పామరుడికైనా ఇబ్బంది తప్పదని అనుభవ పూర్వకంగా వేటూరి గ్రహించిన సందర్భాల్నీ విస్మరించలేం. కలకండ గుళికల మధ్య అలాంటి పలుకురాళ్ళను ఏరి పక్కన పెడితే శ్రుతి మనోహర గీతాలంకార ప్రవీణులు ఆయన. కళాసౌందర్య సృజనకు ‘పాటపట్టు’ వేటూరి రచనలు. కొన్ని పాటలు జీవిత సమరానికి ప్రతిబింబాలు. కొన్ని పాటలు అగ్ని గుండాలై, మండే గుండెలనుండి వెలువడే అఖండ జ్వాలామండలాలు. కొన్ని సంప్రదాయ మార్గంలో కన్నులు మిరుమిట్లు గొలిపే తటిల్లతలు. మరికొన్ని తూరుపుదిక్కున ఉదయించే వెలుగురేకలు.

కళా సౌందర్య సృజనతో పాటు, నిలువెత్తు సామాజిక స్పృహతో పాటలు తూటాల్లా పేల్చిన మా’నవతా’ మూర్తి వేటూరి సుందరరామమూర్తి. ‘నువు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా.. ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ…’ అంటూ పట్టుపురుగు జన్మగురించి ఆలోచించిన సున్నిత, సునిశిత మనస్కులు వేటూరి. పూలత్యాగాన్ని పుష్పవిలాసంలో కరుణశ్రీ కరుణరసాత్మకంగా చెబితే, అనేకానేక స్త్రీలు ఇష్టపడి ధరించే పట్టుచీరలు అసంఖ్యాకమైన పట్టుపురుగుల ఆత్మార్పణ నుంచి వచ్చేవే అనే సత్యాన్ని భావస్ఫోరకంగా చెప్పారు వేటూరి.

లయ, పద గాంభీర్యం, శబ్దరహస్యం తెలిసిన అక్షర బ్రహ్మ ఆయన. అలంకారాల కలంకారీ వేటూరి. అల్లూరి సీతారామరాజు చిత్రంలో ‘తెలుగువీర లేవరా.. ‘ పాటతో, నేషనల్‌ అవార్డు శ్రీశ్రీ దక్కించుకుంటే, ఆ తర్వాత తెలుగులో అంతటి గౌరవాన్ని పొందిన కవి వేటూరి. అయితే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ, జాతీయ అవార్డుని తిరస్కరించి, తెలుగు పౌరుషాన్ని చాటారు. ”రాలిపోయే పూవులకు” రాగాలద్దిన తాత్వికుడు వేటూరికి రచనల్లో కృత్యాద్యవస్థ లేదు. నిలువెల్లా రసజ్ఞతను నింపుకొని, సమాజంలోని ప్రతి అంశాన్నీ వివిధ కోణాల్లో పరిశీలించి ఆకళించుకొన్న సాహితీ స్రష్ట ఆయన. అందుకే ఏ రచన అయినా అలవోకగా అందించేవారు.

ప్రముఖ సంస్కృత కవి వేటూరి ప్రభాకర శాస్త్రి సోదరుడి కుమారుడైన వేటూరి సుందర రామమూర్తిమీద శాస్త్రిగారి ప్రభావం ఉంది. చిన్నప్పటినుంచే సాహిత్యాంశాలను సునిశితంగా అధ్యయనం చేసిన వేటూరి, తిరుపతి వెంకట కవులు, ద్వైతా గోపాలం, మల్లాది వంటి సాహితీ స్రష్టలు తనకు స్ఫూర్తి ప్రదాతలని చెప్పేవారు. విశ్వనాథ సత్యన్నారాయణ గారు విజయవాడ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా చేస్తున్నప్పుడు, వేటూరి ఆయన ప్రియశిష్యులు. ఆ గురుభక్తితోనే వేటూరి జర్నలిస్టుగా విశ్వనాథవారిని ఇంటర్వ్యూ చేశారు. పత్రికల్లో ఇంటర్వ్యూల ధోరణిని విశ్వనాథ చమత్కారంగా చెప్పకనే చెబుతూ, ‘ప్రశ్నలు నేనే వేసి, జవాబులు నేనే చెప్పేదా? ప్రశ్నలు నువ్వు వేస్తావా?’ అని అడిగారట. ఆ తర్వాత వేటూరి వేసిన ప్రశ్నలకు ఆయనే ముగ్ధులై వేటూరిని ప్రశంసించారు. ఆంధ్రపత్రికలో ఆతర్వాత ఆంధ్రప్రభలో సబ్‌ ఎడిటర్‌గా, రిపోర్టర్‌గా తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన వేటూరి పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూను ఇంటర్వ్యూ చేయడం మరపురాని అనుభూతి అన్నారు.

ఏ వ్యక్తి అయినా ఉన్నత సోపానాలు అధిరోహించినపుడు అందుకు కారకులైన వారిని గుర్తుపెట్టు కోవడం బహు అరుదు అయిపోతున్న రోజు లలో, వేటూరి తన అభ్యున్నతికి చేయూత నిచ్చిన వారినీ, తనతో కలిసి పనిచేసిన వారిని ఎవరినీ మరచిపోలేదు. పత్రికారంగంలో ప్రవేశానికీ, సినీరంగంతో పరిచయం కావడానికీ, రచనాభిలాషను ప్రోత్సహించడానికీ కారకులైన సాహితీమూర్తి శ్రీ రాజావాసిరెడ్డి శ్రీరామ గోపాలకృష్ణ మహేశ్వరప్రసాద్‌ (ముక్త్యాలరాజా) వారిని సందర్భం వచ్చినప్పుడల్లా స్మరించేవారు. అలాగే సినీరంగంలో తనకు చేయూతనిచ్చిన ఎన్టీ రామారావు, విశ్వనాథ్‌, రాఘవేంద్రరావుల పేర్లు వివిధ సందర్భాలలో ఉపయోగించేవారు. ‘పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు’ అనే గీతం కవి గుండెగుండెలో గుడిసుళ్ళు తిరిగే ఆర్థ్రతకు ప్రతీక. 1969లో ‘సిరికాకొలను చిన్నది’ అనే రేడియో నాటికతో వేటూరి తన సాహితీ ప్రక్రియకు పదును పెట్టడం ఆరంభించారు. ఆయన తొలిపాటకు సరిగమలు దిద్దింది పెండ్యాల గారు అనీ, తొలి సినిమా పాటకు స్వరాలు దిద్దింది మామ కెవి మహదేవన్‌ గారనీ, ఆ తర్వాత మహదేవన్‌, ఆయన మానసపుత్రుడు (అసిస్టెంట్‌) పుగళేందితో తన ప్రయాణం 25 వసంతాలు అని వేటూరి వారు ప్రకటించారు.

తను ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి రావడానికి మూలకారణమైన తెలుగు సినీ పరిశ్రమ అంటే వేటూరికి అపారమైన గౌరవం. ‘కవి జనమంతా దేన్ని ఆశ్రయించి తమ మధుర కవితల్ని వెదజల్లుతూ వచ్చారో, ఏ చెట్టు నీడన, ఏ కొమ్మ చాటున వాళ్ళు తమ కవితాలాపన చేసిన రసికలోకాన్ని మైమరిపించారో, రసజ్ఞలోకాన్ని మైమరపింపచేసి, చిరకాలం జ్ఞాపకం ఉండేలా తమ తమ కవితా వైభవాన్ని చాటారో, ఆ సినీ కామధేనువు, కళా కల్పతరువుని ఆశ్రయించి, ఆ చెట్టు నీడలో కాలక్షేపం చేస్తున్నా’ అంటూ సినీరంగానికి నీరాజనాలందించారు. చందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి వంటి కవుల రచనారీతులు, తిరుపతి వేంకటకవుల పద్యసౌరభం దగ్గర్నుంచి పరిశీలించానని చెప్పుకున్నారు వేటూరి.

ఇచ్చిన ట్యూన్‌కి భావాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ పాట రాయడం గొప్ప విషయమనీ అలా రాసిన వారిలో సముద్రాల రాఘవాచారి ప్రథములన్నారు వేటూరి. ఒక సందర్భంలో ‘వైన్‌ అండ్‌ వుమెన్‌’కు తెలుగు ఏమిటని వేటూరి అడిగితే ‘ఏముందిరా! మదిరా, మదవతి’ అన్నారట. అలాగే సముద్రాల చిలిపిచిలిపిగా దుష్ట సమాసాలూ వాడేవారట. అవి నాకు ఇష్టం అంటూ వేటూరి కూడా ఆ ప్రయోగాలు చేశారు.

అలా సినీసంగీత రంగంలో మెళకువల్ని ఒడిసిపట్టుకుని, తిరుగులేని గీత రచయితగా, మూడు దశాబ్దాలు రాణించిన వేటూరి సినీరంగం సర్వవిధాలుగా భ్రష్టత్వం పొందిందని వాపోయారు. కవిత్వాన్ని పట్టుకొని దేహీ అనాల్సిన పరిస్థితులు దాపురించాయని మధనపడ్డారు. స్వయంసృష్టికర్త అయిన కవి, ఆ సృష్టిలో జరగవలసిన ప్రసవాలకు సిజేరియన్స్‌ చేయించుకుంటున్నాడని కుమిలి పోయారు. ”ఆధిపత్యాలూ, అక్రమ సమీకరణల శూన్యం నేపథ్యంలో పాట రాయడానికి ఏం ఉంటుంది? కథంటూ ఉంటే సందర్భం ఉంటుంది. కథకే గతి లేనపుడు ఇంకా సన్నివేశం ఎక్కడుంటుంది? సన్నివేశం లేందే పాట ఎక్కడుంటుంది? సన్నివేశం లేకుండా పాట రాస్తే ఆ గీతం, అకవిత్వం అవుతుందే గానీ కవిత్వం ఎలా అవుతుందీ?” అంటూ తన గోడు వెళ్ళబోసుకున్న వేటూరి అక్షరకృతులు అర్ద్ర స్మృతులుగా మనకు వదలి, గాయపడిన గుండెతో తెర మరుగు అయ్యారు.

వేటూరి ఇంట అష్టనందులు

వేటూరి కలం నుండి జాలువారిన ప్రతిఅక్షరం విలువైనదే. ఆయన రాసిన ప్రతిపాట గుర్తుంచుకోదగినదే. మూడు దశాబ్దాల కెరిర్‌లో ఎనిమిది నందులు వేటూరికి దక్కాయి.

మొదటి నంది ‘పంతులమ్మ’ (1977) చిత్రంలో ‘మానస వీణా… మధుగీతం’ గీతానికి లభించింది. ఆతర్వాత ‘శంకరాభరణం’ (1979) సినిమాలో ‘శంకరా…’ పాటకి, మూడవ నంది ‘కాంచనగంగ’ (1984)లో రాసిన ‘బృందావని ఉంది’ గీతానికి, నాలువ నంది ‘ప్రతిఘటన’ (1985) చిత్రంలో ‘ఈ దుర్యోధన దుశ్శాసన…’ పల్లవితో రాసిన పాటకి లభించాయి. ‘చంటి’ (1991)లో రాసిన ‘పావురానికి పంజరానికి’ పాటకి ఐదవ నంది, ఆరవసారి ‘సుందరకాండ’ (1992)లో ‘ఆకాశాన సూర్యుడండడు తెల్లవారితే’ పాటకి, ఏడవ నంది ‘రాజేశ్వరికల్యాణం’ (1993)లో రాసిన ‘ఓడను జరిపే…’ పాటకి, ఎనిమిదవ నంది పురస్కారం (2000) సంవత్సరంలో వచ్చిన ‘గోదావరి’ చిత్రంలో రాసిన ‘ఉప్పొంగెలే గోదావరి..’ పాటకి లభించాయి.

కృష్ణా తీరాన వేటూరి

వేటూరి సుందరరామమూర్తి 29 జనవరి 1936లో జన్మించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లాలోని పెదకళ్లేపల్లి గ్రామం. చంద్రశేఖరశాస్త్రి, కమలాంబ తల్లిదండ్రులు. విజయవాడ మున్సిపల్‌ స్కూల్లో నాలుగవ తరగతి వరకు చదివి, ఆ తర్వాత అమ్మమ్మ సొంతఊరు గుంటూరు జిల్లా కొల్లూరుకు చేరుకున్న అక్కడ విద్యాభ్యాసం చేశారు. తండ్రి ఉద్యోగరీత్య జగ్గయ్యపేటకు వెళ్లడంతో వేటూరి అక్కడే సంస్కృత విద్యార్థిగా శబ్దమంజరి, ధాతు మంజరి, వేంకటాధ్వరి, లీలాశుకలు శ్లోకాలు, ఇంకా నారాయణ తీర్ధుని కృష్ణలీలా తరంగాలు అధ్యాయనం చేశారు. ఇప్పటి చెన్నై, అప్పటి మద్రాసులో ఇంటర్మీడియట్‌ చదివి, మళ్ళీ విజయవాడ చేరుకుని అక్కడ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజ్‌లో బిఏ ఎకనామిక్స్‌ చదివారు. న్యాయశాస్త్రం అభ్యసించడం కోసం తిరిగి మద్రాసు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నపుడే అనారోగ్య కారణంగా చదువు మధ్యలో ఆగిపోయింది. దాంతో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలో పాత్రికేయునిగా కొంతకాలం పనిచేశారు.

———————–

ఆంధ్ర ప్రభ సౌజన్యంతో…

ఆంధ్ర ప్రభ లో ప్రచురితమయిన ఈ వ్యాసం కింద లింక్ లో చూడవచ్చు.

http://www.prabhanews.com/editorial/article-112859

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top