తెలుగు ప్రేక్షకుల హృదయాకాశంలోకి పాటల పావురాలను ఎగరేసిన సాహితీ సార్వభౌముడు వేటూరి సుందర రామ్మూర్తి. కాలంతో పాటు కలాన్ని పరిగెత్తించి, పదాలను పదునుగా ప్రయోగించిన ప్రతిభాశాలి ఆయన. 1936 జనవరి 29 న కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించిన వేటూరి, తెలుగు సాహిత్యాన్నిబాగా వంటబట్టించుకుని చెన్నైకి చేరుకున్నారు. తెలుగు సినిమా పాట పలచబడిపోకుండా, పరిమళాన్ని కోల్పోకుండా ఆయన కలం పట్టారు…తెలుగు ప్రేక్షక హృదయాలకు పాటాభిషేకం చేసారు. ‘ఓ సీత కథ ‘ సినిమా వేటూరి కలాన్నిపరిచేయం చేయగా, ఆ పదాల్లోని మెరుపులు …విరుపులు చూసి మరెన్నో అవకాశాలు ఆయన్ని వెదుక్కుంటూ వచ్చాయి. 70 వ దశకంలో వచ్చిన ‘ అడవిరాముడు’లో… ”కృషివుంటే మనుషులు ఋషులౌతారు..’, ‘పంతులమ్మ’లో…” మానస వీణా మధు గీతం ..”, ‘సిరిసిరి మువ్వ’లో..”ఝుమ్మంది నాదం..” ‘ శంకరాభరణం’లో ”దొరకునా ఇటువంటిసేవా” వంటి పాటల బాణాలను సంధించిన వేటూరి, అశేష ప్రేక్షకుల అంతరంగాలను అమాంతంగా గెలుచుకున్నారు. పడుచు పాటకు పైట వేయించి హృదయ తీరాలవెంట పరుగులు తీయించారు.
సందర్భం …పాత్రల స్వరూప స్వభావాల్ని అర్ధం చేసుకుని ప్రేక్షకుల మనసుకి దగ్గరగా పాట రాయడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. అరుదైన ఆ విద్యలో వేటూరి ఆరితేరారు – పాటల కోటలో రారాజుగా వెలిగి పోయారు. ‘శుభలేఖ’లో ” రాగాలా పల్లకిలో …”, ‘మేఘ సందేశం’లో ”ఆకాశ దేశాన…”, ‘ప్రతిఘటన’లో ”ఈ దుర్యోధన దుశ్శాసన …”, ‘ సితార’ లో ”కిన్నెరసాని వచ్చిందమ్మ …”, ‘గీతాంజలి’లో ” ఆమని పాడవే”… ఇలా 80 వ దశకంలో వచ్చిన ఎన్నో పాటల ద్వారా ఇటు క్లాస్ ఆడియన్స్ నీ , అటు మాస్ ఆడియన్స్ ని కంబైన్డుగా కట్టిపడేయడం ఒక్క వేటూరికే సాధ్యమైంది. పాటలందు వేటూరి పాటలు వేరయా… అని నిస్సందేహంగా చెప్పొచ్చు. శంకరాభరణం, సాగర సంగమం, సప్తపది వంటి కళాత్మకమైన చిత్రాల్లోని పాటల్లో వేటూరి వెదజల్లిన సాహితీ సౌరభాలు మధురమైనవి -మరణం వరకు మరచిపోలేనివి. 90 వ దశకంలోనూ ఆయన చూపిన భావ వైభవం అంతా ఇంతా కాదు. దాదాపు మూడు దశాబ్దాలకి పైగా నవరసాలు ఆయన కలానికి దాసోహం అన్నాయి- అక్షరాలన్నీ ఆ కలం కనుసన్నల్లో మెలిగాయి. ఆయన మార్గం అనితరసాధ్యమని చాటి చెప్పాయి.
వేటూరి పాటలను కేవలం సినిమా సాహిత్యంగానే చూడలేము. తరచి తరచి వింటే ఆ పాటల్లోని అర్ధాల వెనుక పరమార్ధాలు ప్రతిధ్వనిస్తాయి. ” తార… తారకీ నడుమ ఆకాశం ఎందుకో…, ”ఝుమ్మంది నాదం… సైయ్యంది పాదం…, “అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి గానమె సోపానము.., ” నరుడి బ్రతుకు నటన – ఈశ్వరుడి తలపు ఘటన.., ” మారేడు (మా రాజు ) నీవని…ఏరేరి తేనా ‘మారేడు’ దళములు నీ పూజకు.., ” రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే… వంటి పదనిర్మాణాలు వేటూరిలోని ఓ సాహితీమూర్తినీ… ఓ తాత్వికుడి విశ్వరూపాన్ని అనంతంగా ఆవిష్కరిస్తాయి. వేల పాటల వేటూరి …జోల పాటలు మొదలుకుని అన్నిరకాల సాహితీ ప్రక్రియలను స్పృశించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వేటూరి పాటలెప్పుడూ వెలుగు రేఖలే ! పదే పదే మనసు దోచే పారిజాత మాలికలే!! పాటని ధ్యాసగా…శ్వాసగా చేసుకున్న ఆ బహుదూరపు ‘పాటసారి’ని మనసారా స్మరించుకోవడమే మనమిచ్చే నీరాజనం.
————————
గోపీకృష్ణ గారికి కృతజ్ఞతలతో…వేటూరి.ఇన్
గోపీకృష్ణ గారి అసలు వ్యాసం ఈ కింద లింక్ లో చూడవచ్చు
http://ap7am.com/film-news-1-4100-special-article-on-liricist-veturi.html