వేటూరి సినీ సాహిత్యంలో ఒక లక్షణం ఉంటుంది.(అనిపిస్తుంది నా వరకూ)! మొదటి సారి విన్నపుడు “బాగుంది”
అనిపించి, ఆ తర్వాత అదొక వ్యామోహం లాగా పట్టుకుని వదలదు. తరచి చూసే కొద్దీ అద్భుత సౌందర్యాలు రత్న మాణిక్యాల్లా దొరుకుతూనే ఉంటాయి.
అలాటి పాటల్లో ఈ మధ్య వచ్చిన వాటిలో ఒకటి యమహా నగరి అయితే మరోటి అర్జున్ సినిమాలో “మధుర మధుర తర మీనాక్షీ “కంచి పట్టు” న కామాక్షి!
వింటున్న కొద్దీ మరిన్ని సౌందర్యాలు తోచి,శోభిల్లే పాటలు ఇవి.
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది
నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాటే సాగనా
పరుగులో పరుగు తీసింది పట్నం
బ్రతుకు తో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం
కదలి పోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుకులలో
బెంగాలీ కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల
మానినీ సరోజినీ
రోజంతా సూర్యుడి కింద రాంత్రంతా రజనీ గంథ సాగనీ
పద గురూ ,ప్రేమలే లేని లోకం దేవదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిథుల గొడవట
కలకట నగరపు కిట కిటలో
వందే మాతరమే అన్న వంగ భూతలమే మిన్న
జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయా చౌరంఘీ రంగుల దునియా నీదిరా
విను గురూ, సత్య జిత్ రే సితారా, ఎస్ డి బర్మన్ కి థారా
థెరిసా కీ కుమారా కదలి రారా
జనగణమనముల స్వర పద రవముల హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ శుక పిక ముఖ సుఖ రవళులలో
ఎంత గొప్పసాహిత్యం!!
బెంగాల్ తో ప్రతి భారతీయుడికి ఉండే అనుబంధమంతా ఈ పాటలో ప్రతిఫలిస్తుంది. ఆ వాతావరణమంతా కళ్ళ ముందు కదలాడుతుంది ఈ పాట వింటున్నపుడు
బెంగాలీ కోకిల తెలుగింటి కోడలని గుర్తు చేయడం,వందేమాతరం అక్కడ పుట్టింది కాబట్టి వంగ దేశం జాతికే గీతి అనడం, “జనగణమన” ముల అనడం జనగణమన కూడా అక్కడే పుట్టిందని తల్చుకోడం..
ఎంత సౌందర్య భరితం!!
శరన్నవలాభిషేకం__________అనే మాట ఎక్కడైనా విన్నామా అసలు ఇంతకు ముందు? గుండె ఝల్లుమనే ప్రయోగం కదా!
దేవదా మార్కు మైకం, చౌరంగీ రంగుల దునియా, ఎస్.డి బర్మన్ కి ధారా…థెరిసా కీ కుమారా…!
ఈ పాట ఇంకెవరూ రాయలేరు! అంతే ! ఇది శిలా శాసనం!
హరి హరన్ పాటలో(అది రాక్ అయినా,సినిమా పాట అయినా , ఘజల్ అయినా) “సోల్” ఉంటుంది. అది మనకు వినిపిస్తుంది.ఈ పాటకు హరి హరన్ ని ఎంచుకోవడం గొప్ప ఎన్నిక!
ఈ పాటలో తళుక్కున మెరిసే గిటార్,సాక్సో ఫోన్, వయొలిన్ లో ఎంత అందమో!
తబలాతో కల్సి ఆడుకునే Rythm pads లో ఎంత మాధుర్యమో
రఘు వంశ సుధాంబుధి కీర్తనలో స్వరాలు పడాల్సిన చోట్లో రాసిన పదాలో…!
“చిరు” త్యాగరాజు నీ కృతినె పలికెను మది…!
వేటురి పాటల్లో అసంఖ్యాకమైన పాటలు ఇష్టమైనవే అయినా ఈ పాట సాహిత్యం మాత్రం అనితర సాధ్యం,అద్భుత సౌందర్యం,అనన్య సామాన్యం!
ఎన్ని సార్లు విన్నా, అప్పుడే మొదటి సారి వింటున్నంత సంతోషం, సంభ్రమం ఈ పాటలో నాకు!
మీకో?
——————————
“సుజాత-మనసులో మాట” గారు వ్రాసిన ఈ టపా ఈ కింద లింక్ లో చూడవచ్చు
http://manishi-manasulomaata.blogspot.in/2012/01/blog-post_29.html