నిప్పు: వేటూరి దహన సంస్కారాలు జరిగేటప్పుడు బంధువులు,అభిమానులు,భక్తులు,శిష్యులు,స్నేహితులు అందరూ దగ్గరున్నారు…శేఖర్ కమ్ముల మాత్రం వెళ్ళలేదు!!!
నేల: తెలుగు అక్షరం బూడిదైపోతుంటే చూడలేక శ్మశానం చుట్టూ కారులో ప్రదక్షిణలు చేస్తూ ఉండిపోయాడు!!!
నీరు: సంస్కారం ఉన్న వ్యక్తిగా అందరిముందూ కన్నీళ్ళు కార్చలేక జ్ఞాపకాల సుడిగుండంలో నిస్సహాయంగా కొట్టుకుపోయాడు!!!
గాలి: ఇప్పుదే కద సార్ పరిచయమయ్యింది,ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయారు అంటూ గుండెలో ఊపిరి తడబడింది!!!
నింగి: సంతోషంగా పెదవి తిప్పి,చెయ్యెత్తి వేటూరి చూపిన ఆకాశమంతా శేఖర్ దే!!!
పరవశించే ఆనందంతో,ప్రవహించే గోదావరిలా,
పలకరించే హ్యాపీడేస్ లో,ప్రోత్సాహాన్నిచే లీడర్ లా,
అన్నింటిలో వేటూరి ఉన్నారు.
పంచభూతాల సాక్షిగా అదే శేఖర్ కి రీచార్జ్.
అది 2004.. నెలేదో గుర్తులేదు! ఆల్‌మోస్ట్ మొదటి సినిమా డైరెక్టర్‌గా.. డబ్బులు ఎక్కువగా లేని నిర్మాతగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ (రాధాకృష్ణ)తో మొదటిసారి వేటూరిగారిని కలవడానికెళ్లాను. కొంచెం సిగ్గు – కొంచెం బెరుకుతో.. ఒక డైరెక్టర్ లిరిసిస్ట్‌ని కలిసే పద్ధతి ఏంటో తెలియదేమోనన్న భయంతో… ఏదైనా స్వీట్ డబ్బాలాంటిది తీసుకెళ్లాలేమో అన్న డౌట్‌తో.. ‘ ఒంట్లో బాగాలేదు’ అని చెప్పినా చొరవ తీసుకుని వెళ్తున్నామన్న మొహమాటంతో!
వెళ్లగానే ఆయనకి నిజంగానే ఒంట్లో బాగాలేదన్న విషయం అర్థమైంది. మోకాళ్ల నొప్పితో కదల్లేని పరిస్థితి ఆయనది! పక్కనే ఆయన కుడి – ఎడమ భుజమైన ధర్మతేజ నిలబడి ఉన్నారు. కథ చెప్పడానికి కొంచెం మొహమాటపడ్డాను. స్వతహాగా రాదు.. అందులో అసిస్టెంట్ ముందు చెపితే ఈయన రాయకుండా ఘోస్ట్ రైటర్‌లా ఆయనతో రాయించేస్తారేమోన న్న భయం! కానీ అతన్ని ‘ వెళ్లిపో’ అని చెప్పేంత ధైర్యం లేక గ్రామ్‌ఫోన్ రికార్డు సీన్ నుంచి మెల్లగా ‘ ఆనంద్’ కథ చెప్పడం మొదలెట్టాను.
టీలు.. కాఫీలు.. ఆవులింతలు.. అటూఇటూ చూడ్డాలు.. ‘ ఇంత అవసరమా?’ గురుశిష్యుల కంటిభాషల మధ్యలో, కథ రెండు గంటల్లో పూర్తి చేసేశాను! చెప్పగానే ‘ అందరూ లేచి చప్పట్లు కొట్టాలి’ అనుకునే వయసు నాది. ‘ అబ్బా.. ఆపావు!’ అన్న ఎక్స్‌ప్రెషన్ వేటూరిగారిది! ఆయన లుక్ చూడగానే నాకు కొంచెం గాలి తీసేసిన ఫీలింగ్! ఆయన మాత్రం చాలా కూల్‌గా ‘ ఇంకో టీ తాగుతారా?’ అన్నారు. ‘ లేదండీ, మంచినీళ్లు చాలు’ అన్నాను.
‘చూడండి శేఖర్‌గారూ, ఇలా కాదుగానీ, పాట సిచ్యుయేషన్ రాయండి. ముందు మొదటి పాటది రాసిస్తే నాకు హెల్ప్ అవుతుంది. మీ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఆ ట్యూన్ టేప్‌లో రికార్డ్ చేయించి తీసుకుని రండి. అది మా ధర్మతేజకి ఇస్తే సరిపోతుంది’ అన్నారు. ఆ మాట వినగానే కన్ఫర్మేషన్‌కి వచ్చేశాను – ‘ఈయన మమ్మల్ని సీరియస్‌గా తీసుకోలేదని, ఈయనకి డెఫినిట్‌గా రాసే ఉద్దేశ్యం లేదని.. ధర్మతేజ ఖచ్చితంగా ఘోస్ట్‌రైటర్’ అని!
‘చిన్న రిక్వెస్ట్ సర్.. మేం చిన్న నిర్మాతలం. పాటకి 20 వేలు ఇవ్వగలం’ అన్నాను. ఆయన ఫేస్ మళ్లీ మారింది.. మళ్ళీ ఇదోటా అన్నట్టు! జస్ట్ తలూపారు! మేం బయటికొచ్చేశాం… ‘డెఫినిట్‌గా వేటూరిగారు మాకు రాయరు’ అన్న నమ్మకంతో.
అంతలోనే ధర్మతేజగారు బయటికి వచ్చి ‘పాటకి 25 వేలు ఇవ్వండి. ఎక్కడా అనకండి.. ఇప్పుడే ఇంకో ప్రొడ్యూసర్ లక్ష ఇచ్చి వెళ్ళారు. ఏదో మీ కథ నచ్చి ఒప్పుకునారు’ అన్నారు. ఇమ్మీడియట్‌గా ‘ఓకే’ చెప్పి నేను, ఆర్‌కె (రాధాకృష్ణ) బయల్దేరాం. మా ఇంట్లో ‘వేటూరిగారు రాస్తున్నారు’ అనగానే ఓ చిన్న సెలబ్రేషన్!
మర్నాడు ఓ ఐదు పేజీల డిస్క్రిప్షన్ రాశాను. తల్లిదండ్రులను పోగొట్టుకుని స్వతంత్రంగా పెరిగిన హీరోయిన్, బాగా రిస్ట్రిక్షన్స్ ఉన్న ఒక గొప్పింటి నార్త్ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం.. తన ఆప్తమిత్రులని వదిలి వెళ్లిపోవల్సిన సమయం… ఒకవైపు ఆనందం, మరోవైపు భయం – ఇది మొదటి సిచ్యుయేషన్! సినిమా చివరిలో తన మనసుకు నచ్చిన అబ్బాయి (ఆనంద్)తో కలిసి (అదే ట్యూన్‌కి) పాడుకోవడం రెండో సిచ్యుయేషన్! నేను, ఆర్‌కె వెళ్లి ఇచ్చేసి వచ్చాం. మూడు రోజుల తర్వాత అనుకుంటా ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది. అంతే.. రెక్కలు కట్టుకుని వాలిపోయాం!
సాంగ్: మొదటి సిచ్యుయేషన్:
‘ఎదలో గానం.. పెదవే మౌనం..
సెలవన్నాయి కలలు.. సెలయేరైన కనులలో..
కట్టుకథలా ఈ మమతే కలవరింత..
కాలమొకటే కలలకైనా పులకరింత..
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో.. మనసు కథ!’
రెండో సిచ్యుయేషన్:
‘యమునా తీరం.. సంధ్యారాగం..
నిజమైనాయి కలలు.. నీలా రెండు కనులలో..
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగ..
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా..
ఆనందమానందమానందమాయేటి మనసు కథ!’
అంటూ చివర్లో సినిమా పేరు ‘ఆనంద్’ తో ఆ పాటని ఎండ్ చేశారు!
ఆర్‌కె ట్యూన్‌కి మేటర్ సరిపోయిందా? లేదా? అని చూసుకుంటున్నాడు. వేటూరిగారు తన వాక్‌మన్‌లో ట్యూన్ మళ్లీ మళ్లీ రివైండ్ చేసి వినే కార్యక్రమంలో ఉన్నారు. ఆ క్షణమే నాకు అర్థమైంది… శంకరాభరణమూ కాదు, మేఘసందేశమూ కాదు, అడవి రాముడూ కాదు.. వేటూరిగారు ఆనంద్ కోసం మరో అవతారం ఎత్తారని.
రెండు గంటలపాటు నేను చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుని, నాకు కావల్సినట్టు, ‘ఆనంద్’కి సరిపోయేటట్టు ‘యమునా తీరం సంధ్యారాగం’ లాంటి సంప్రదాయ పదాలని ‘ప్రాప్తం, చిరునవ్వులు, నిట్టూర్పులు’ లాంటి జీవిత సత్యాలతో మేళవించి అత్యద్భుతంగా రాశారని!
ఆర్‌కె ‘మేటర్ పర్‌ఫెక్ట్‌గా ఉంది’ అన్నాడు! సరిపోకుండా ఎప్పుడూ రాయరని తరువాత మాకు అర్థమైంది! ఆర్‌కె పాట పాడుతుంటే కొంచెం విశ్లేషణలోకి దిగాను – ‘ఎదలో గానం.. పెదవే మౌనం..’ – రూప ఆనందం, దుఃఖం కలిపి ఏం చెప్పారు సర్..! ‘సెలవన్నాయి కలలు.. సెలయేరైన కనులలో’ – కన్యగా తను గడిపిన చిలిపి క్షణాలు పోతూ ఉంటే, ఫ్రెండ్స్‌కి దూరం అవుతుంటే.. ఆ ఎక్స్‌ప్రెషన్.. ఎంత పర్‌ఫెక్ట్ సర్..! అనుకున్నా మనసులో.
కానీ.. ఈ ‘యమునాతీరం’.. రూప ఆనంద్‌తో కలిసి వెన్నెల రాత్రి కారులో షికారు లాంటిది చేస్తుంది కానీ, మాక్సిమమ్ ఏ ట్యాంక్‌బండ్ మీదో, నెక్లెస్‌రోడ్‌లోనో! యమునాతీరం కొంచెం ఓల్డ్ ఫ్యాషనేమో అనిపించింది!
అదేమాట ఆయనతో అనగానే, “నాయనా, ‘యమునా తీరం’ తో రాసిన ప్రతి పాట సూపర్‌హిట్! దానికి కొత్త పుంతలు ఉండవు. కవులు, ఆడియన్స్ ఉన్నంత కాలం ‘యమునా తీరం’ ఉంటుంది.. ‘రాసక్రీడ’ ఉంటుంది. నా మాట విని అలా ఉండనీయండి.. సూపర్‌హిట్ అవుతుంది!” అన్నారు. అప్పుడు పెద్దాయన చెప్పారని తల ఊపానే కానీ, తర్వాత అర్థమైంది ఆయన ఎంత కరెక్టో! ఈ రోజుకీ ఎవరు ‘ఆనంద్’ గురించి మాట్లాడినా వాళ్లనే మొదటి మాట ‘ఆనంద్ మ్యూజిక్ సూపరండీ.. ఆ ‘యమునా తీరం’ పాట…’ అని. మరి పెద్దాయనలోని సరస్వతి ఊరికే పలకలేదు!
అదే పాటలో – ‘ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగ.. పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా..’
ఈ లైన్ నేను ప్రతి సిచ్యుయేషన్‌లోనూ పాడుకుంటా. పనులు జరక్కపోయినా, డబ్బులు రాకపోయినా, ఎవరైనా తిట్టినా, బాధ వేసినా, నవ్వొచ్చినా! అది మా గురువుగారు నాకిచ్చిన మొదటి కానుక
బ్యాక్‌గ్రౌండ్ సాంగ్: అందంలో ఊర్వశి..
‘సర్.. రూపకి కొంచెం తిక్క సర్. అప్పుడప్పుడు తిడుతుంది.. అప్పుడప్పుడు ప్రేమిస్తుంది.. అది ఆనంద్‌కి అర్థం కాదు’ అంటూ, ఈసారి మూడు పేజీల డిస్క్రిప్షన్ ఇచ్చాను! అప్పటికే ఆయనకు నా మీద కొంచెం నమ్మకం ఏర్పడింది! “నాయనా, ‘ ప్యాసా’ లో ఒక పాట ఉంది… ‘జానే క్యా తూనే కహీ’ అని. ఆ పాట తెలుగులో ట్యూన్ చేస్తే బాగుంటుంది… ట్రై చేయండి” అన్నారు. ‘ప్యాసా అంటే మా గురుదత్ సార్’ అని ఎగ్జైటెడ్‌గా అన్నాను! ‘ఓ, నీకు తెలుసా?’ అని ఆశ్చర్యపోయారాయన! ‘సా….ర్’ (గురుదత్ తెలియకపోవడమా!) అన్నాను. వినగానే ఆర్‌కె కూడా ఎక్సైట్ అయ్యాడు. ఇమ్మీడియట్‌గా అదే రాగాన్ని బేస్ చేసుకుని ట్యూన్ చెప్పాడు….
‘అందంలో ఊర్వశి… అయితేనేమి రాక్షసి…
అవుతుందో లేదో మరి ఈమె నా ప్రేయసి…
పుండుపై కారం చల్లి… పువ్వులా నవ్వుతుంది.
వెన్నెల్లో వేధిస్తుంది… వేధించి చంపేస్తుంది.’
ఇది ‘ఆనంద్’లో బ్యాక్‌గ్రౌండ్ సాంగ్!
సాంగ్: వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా…
వానపాట! ఈసారి ఒక్క పేజీ డిస్క్రిప్షనే! “కష్టాల్లో ఉన రూపకి సేద దీరుస్తున్నట్టుండాలి… అందులో ‘పకోడీలు’, ‘పడవలు’ కూడా ఉండాలి” అన్నాను. ట్యూన్ విని ‘ఎంత హైపిచ్‌లో అనర్గళంగా ఉన్నా, ట్యూన్‌కి పకోడీలు ఏంటి బాబూ?’ అని నవ్వారు.
కాస్త చొరవ పెరిగి.. ‘మీరనుకోండి సర్. వచ్చేస్తుంది’ అన్నాను! ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తుంది… ఆయన వయసుకి, అప్పట్లో కాలు కదపలేని ఆయన పరిస్థితికి – మేము ఇచ్చిన సిచ్యువేషన్స్‌కి పొంతన ఆ దేవుడికీ, వేటూరిగారికే తెలియాలి! ఈ పాట వింటున్నప్పుడు హ్యాపీగా ఉంటే గంతులేయొచ్చు, బాధగా ఉంటే ఊరట పొందవచ్చు. అదే వేటూరి మాయ! విన్న రోజు మాత్రం ఆయన కాళ్లకి దణ్ణం పెట్టేశాం!
‘కళ్లలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్…
గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్…
తీరుస్తారా బాధ తీరుస్తారా.. గాలివానా లాలి పాడేస్తారా..’
హ్యాట్సాఫ్ టు యు సార్!
సాంగ్: నువ్వేనా… నా నువ్వేనా…
‘సార్, మంచి ట్యూన్ వచ్చింది సర్’…. అని ట్యూన్ వినిపించగానే, ఆయన తన కుడి చేయి పైకెత్తి దేవుడికేసి చూపి… ‘ఆహా’ అన్నట్టు పెదాలని మడిచారు! అదీ ఆయన ప్రశంస! అయితే, రాశాక మాత్రం రెండు చేతులూ ఎత్తడం మా వంతు అయ్యింది!
‘సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభాతమేనా…
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా…’
‘మసక ఎన్నెలల్లే నీవు ఇసక తిన్నె చేరుతావు…
గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు…’
వినగానే డౌట్… అసలు ‘గసగసాల కౌగిలింత’ ఏంటి? చదివేటప్పుడు ఆవాలని గసగసాలుగా తప్పుగా అనేసుకుని (తిండీ, వంటా – రెండూ సరిగా రావు), ఆవాలు అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అలా వాడారేమో అని సరిపెట్టుకున్నా! ఓ మూడు నెలల తర్వాత అనుకుంటా, డౌట్ క్లియర్ చేసుకున్నా! “ఏమీ లేదు. ప్రయోగం చేశా… ‘సగం సగం’ని తిప్పా. ‘గసం గసం’ అయ్యింది… అది కాస్తా ‘గసగసాలు’ అయ్యింది” అన్నారు. మళ్లీ ఓ దణ్ణం!
సాంగ్: చారుమతీ ఐ లవ్ యూ…
‘చారుమతీ ఐ లవ్ యూ’ అన్న పాట అరగంటలో రాసేసి ‘ఆనంద్’ని పూర్తి చేశారు! ఆ పాటకి అక్షరాలా లక్ష రూపాయలు ఖర్చుపెట్టి లక్కీ అలీతో పాడించాం. పాడించాక గానీ తెలీలేదు… ఎంత తప్పు చేశామో!
ఇదంతా జరిగిన ఆరు నెలలకి రికార్డింగ్ పూర్తయింది. సీడీ చేసి ఆయన దగ్గరికి తీసుకెళ్లాం. ప్రతి పాటకీ ఆయన చెయ్యెత్తడం… ‘భేష్’ అని లిప్ మూవ్‌మెంట్ ఇవ్వడం..! ‘నువ్వేనా…’, ‘యమునా తీరం…’ పాటలైతే రెండుమూడుసార్లు విన్నారు!
మరో మూడు నెలల తరువాత అనుకుంటా… ఆనంద్ ఆడియో ఫంక్షన్‌కి ఆయన్ని పిలవడానికి వెళ్లాం. ‘వైస్‌రాయ్ కన్వెన్షన్ సెంటర్‌లో చాలా ఖర్చుపెట్టి చేస్తున్నాం… సినిమాకి ఫస్ట్ పబ్లిసిటీ ఈవెంట్ ఇదే… మీరూ, ఆర్‌కె – ఇద్దరూ కలిసి ప్రాణం పోశారు… దానికి మీరే చీఫ్ గెస్ట్…’ అనగానే ‘వస్తాను’ అన్నారు!
ఫంక్షన్‌రోజు… అరగంట… గంట… వెయిటింగ్!
చివరికి మా పీఆర్‌ఓ – ‘సర్… వేటూరిగారు ఫంక్షన్స్‌కి రారు’ అన్నాడు! ‘ఆరోగ్యరీత్యా అయినా అయినా రారు’ అని ఇంకో జర్నలిస్ట్! ‘ఇంక స్టార్ట్ చేసేద్దాం’ అని టీవీవాళ్లు..! ఆయన రాకుండా మొదలెట్టడమా – ‘నో వే’ అనుకున్నా!
మెల్లగా… వాకింగ్ సపోర్ట్ తీసుకుని, సాదా సీదాగా నడుచుకుంటూ వచ్చారు వేటూరి! స్టేజ్ ఎక్కలేక గట్టు మీదే నిలబడి మాట్లాడారు… ఆ ఆశీస్సులే ‘ఆనంద్’ని నిలబెట్టాయేమో! నేను… ఆర్‌కె… ‘ఆనంద్’ ధన్యులం సర్..! వేటూరిగారూ… నాకు మీ పరిచయం ‘ఆనంద’మయం!
‘ఆనంద్’ ఇచ్చిన ఉత్సాహం… ‘గోదావరి’ కథ నేపథ్యం… డెఫినెట్‌గా వేటూరిగారు సంబరపడిపోతారు అని… నేను, ఆర్‌కె మళ్లీ వేటూరి దగ్గర వాలిపోయాం.
ఈసారి చాలా మార్పులు వచ్చాయి… మా మీటింగ్ ఆయన ఇంటి నుంచి ఆఫీస్‌కి మారింది! ఆరోగ్యం చాలా బెటర్ అయింది! ఈసారి రెండు గంటలూ చాలా హ్యాపీగా కథ విన్నారు – నో ఆవులింతలు… నో అటూ ఇటూ చూడ్డాలు! వినగానే నా ఫేవరెట్ పార్ట్… చెయ్యి లేచింది… ‘సూపర్’ అన్నట్టు! ‘ఈ పాటలు గోదావరి తీరాన కూర్చుని రాస్తే బాగుంటుంది’ అన్నారు. బడ్జెట్, ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెట్టడం లాంటివి తలచుకుని కంగారుపడ్డాను! ‘విశ్వనాథ్, బాపు, దాసరి, రాఘవేంద్రరావు, మణిరత్నం లాంటి దిగ్గజాలతో పాటు, జంధ్యాల, సాయినాథ్, యండమూరి లాంటి గొప్ప రచయితలను కూడా వెంటబెట్టుకెళ్లి, తనకు ఇష్టమైన చోట సిట్టింగ్ వేసేవారు వేటూరి’ – అని వినికూడా, ఆయన కోరికని చనువుతో ‘వీటో’ చేశాను! నన్ను ఇబ్బంది పెట్టకూడదని పాపం ఒప్పుకున్నారు! కానీ… జనారణ్యం లాంటి వాళ్ల అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో రాయలేక… మరీ చిన్నదైన మా ఆఫీస్‌లో ఇమడలేక… కార్‌లో నెక్లెస్‌రోడ్ మీద విహరిస్తూ రాశారు ఆ పాటలు! ఆయనెలా రాసినా ప్రతి పాటా ఆణిముత్యమే!
సాంగ్: ఉప్పొంగెలే గోదావరి…
కృష్ణ, గోదావరి, గంగ లాంటి కవితా వస్తువులంటే ఆయనకి చాలా ఇష్టం… అలవోకగా రాసేస్తారు.. కానీ, కష్టపడిందల్లా నేను ఇచ్చిన నోట్స్ మూలాన… చిలక జోస్యం, పడవ మీద బిజినెస్‌లు, ఎక్సెట్రా ఎక్సెట్రా!
ఆర్‌కె నుంచి వచ్చిన ఆణిముత్యం… బాలుగారు రికార్డింగ్ చేసేటప్పుడే ‘వేటూరిగారికి నేషనల్ అవార్డ్ వస్తుంది’ అన్న పాట… గోదావరి, పాపికొండలు, వరదలు, కరవు, వానలు, ఎండలు, పడవ ప్రయాణం, ఆఖరికి ఆంధ్రదేశం… ఇలా దేని గురించి ప్రస్తావన వచ్చినా, ఆల్‌మోస్ట్ రెండు రోజులకి ఓసారి ఏదో ఒక టీవీ ఛానల్‌లో విధిగా కనిపించే పాట… వేటూరిగారికి ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టిన పాట…
పడవ మీద రాముల వారి విగ్రహం ఉంటుందని నేను చెప్పిన డిస్క్రిప్షన్‌కి…
‘ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ…
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా…
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దు మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు…
(లంక పొగాకుని లంకేశ్వరుడితో పోల్చడం)
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా…
పడవ ప్రయాణాన్ని వర్ణించడానికి… ‘నేల మీద కాదు – నీళ్లలో కాదు’ అనడానికి – ‘లోకం కాని లోకం’ అన్నాడాయన! నో మోర్ క్వశ్చన్స్!!
సాంగ్: అందంగా లేనా….
ట్యూన్, సిచ్యుయేషన్ వినగానే… అక్కడికక్కడ రాశారు! ‘ఈ పాట సూపర్‌హిట్ అవుతుంది… ప్రతి తెలుగు అమ్మాయీ పాడుకునే పాట అవుతుంది… స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను’ అంటూ… ‘హీరోయిన్ ఎవర్ని అనుకుంటున్నారు?’ అన్నారు. (అప్పటికి కమలినీని సెలెక్ట్ చేయలేదు).. ‘చార్మి అయితే బాగుంటుంది’ అని తనే అనేసి, రాయడం మొదలెట్టారు! నేనూ, ఆర్‌కె మొఖమొఖాలు చూసుకున్నాం!
మర్నాడు ఇస్తానన్న పాట, సాయంత్రంకల్లా ఇచ్చేశారు! ఆ పాట సునీతతో రికార్డ్ చేసి ఆయనకి వినిపించాం… మళ్లీ చెయ్యి లేచింది – ‘సూపర్’ అనట్టు!
‘నీకు మనసు ఇచ్చా ఇచ్చినప్పుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకది
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు…
మహా తెలియనట్టు నటనలేలనే…’
‘చ-కారంతో అంత్యప్రాసలుగా ఉన్న పాటలు ఎక్కువగా లేవు… బాగుంటుంది నాయనా’ అన్నారు! ఆపాటికే నాకు ఆయన ‘బాగుంటుంది’ అంటే ఏమౌతుందో బాగా అర్థమైపోయింది… సునీతకి నంది వచ్చింది!
సాంగ్: విధిలేదు… తిథిలేదు… మనసా గెలుపు నీదేరా…
హీరో – హీరోయిన్ ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నప్పుడు వచ్చే మోటివేషనల్ సాంగ్ ఇది! పల్లవి విషయంలో ఆర్‌కెకి, వేటూరికి డిబేట్ వచ్చింది! ఎంతో ఎనర్జీతో హైపిచ్‌లో ఉన్న పాటకి… ‘విధి లేదు’ అన్న మొదటి పదం అడ్డుగా ఉంది. ఏదన్నా అ-కారంతో రాయమని ఆర్‌కె.. ‘లేదు అంతే…’ అని వేటూరి! చివరికి ఆయన ‘ఈ పదం వాడకపోతే నేను రాయను’ అనడంతో, కంగారు పడి వెంటనే కాళ్లబేరానికి వచ్చేశాం – నేను, ఆర్‌కె!
నాకు పల్లవి ఎలాగూ అంత నచ్చలేదు… సో, చరణాల మీద పడ్డా! మళ్లీ ఆణిముత్యాలే… ఎగిరి గంతేశా!
‘ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా…
ఆమె నీకై సాగివస్తే ప్రేమ రుతువే సదా…’
‘దేవుడైనా రాముడైనది ప్రేమకోసం కదా…’
‘కొమ్మ’ అంటే ‘చెట్టు కొమ్మ’ అని, ‘అమ్మాయి’ అని – రెండు అర్థాలు…
సాంగ్: మనసా వాచా…
గోదావరి మాధ్యమంలో… విరహగీతం!
“ఆర్‌కె, ఇది ‘వైష్ణవజనతో’ ట్యూన్… అందరికీ తెలిసిపోతుంది… తిడతారు” అన్నాను! ‘ఎవరికీ తెలియకుండా చేస్తాగా’ అన్నాడు. ఈ మాటలేవీ వేటూరిగారికి పట్టలేదు… మళ్లీ ‘చ’ కారంతో అంత్యప్రాస…
‘మనసా వాచా, నిన్నే వలచా, నిన్నే ప్రేమించా…
నిన్నే తలచా, నన్నే మరిచా, నీకే జీవించా…
ఆ మాట దాచా, కాలాలు వేచా, నడిచానే నీ నీడలా…’
‘కన్నీరైన గౌతమి కన్నా.. తెల్లారైన పున్నమి కన్నా..
మూగైపోయా నేనిలా…’
గుండె పిండేసేలా రాశారు!
సాంగ్: టప్పులు టిప్పులు…
ఈ పాటలో నాకు నచ్చిన ప్రయోగాలు…
‘టప్పులు టిప్పులు దుప్పటి చి్ల్లులు
గాలివాన హోరు జల్లులు…’;
‘యేటిలో చేపలు చేతిలో పాపలు
చెంగుమన్న నీటి జింకలు…’;
‘రాకడో పోకడో రాములోరికి ఎరుకలే…’;
‘యేరు నీరు ఓ దారైతే ఎదురీదాలిలే…’
ఆనంద్‌లో ‘వచ్చే వచ్చే’ పాటా, ఇదీ – రెండూ వానపాటలే అయినా, రెండిటికీ ఏమాత్రం పొంతన లేకుండా రాశారు వేటూరి!
సాంగ్: రామ చక్కని సీతకి…
చల్లని సాయంత్రంవేళ… గోదావరి నదిలో… పడవలో… పాపి కొండల నడుమ… హీరోయిన్ సీత గోరింటాకు పెట్టుకుని, దాన్ని హీరో రామ్‌కి చూపించాలనుకుంటుంది! అతని కోసం వెదుకుతుంది! కాని అతను ఎక్కడో పనిలో ఉంటాడు… సీత చూపులు అతని కోసం వెతుకుతున్నాయి… అన్న మా డిస్క్రిప్షన్‌కి…
‘ఎర్రజాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే…
చూడలేదని పెదవి చెప్పి… చెప్పలేమని కనులు చెప్పి…
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు…’
‘చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా…
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే…
చూసుకోమని మనసు తెలిపే…
మనసు మాటలు కాదుగా…’
‘మనసు మాటలు కాదుగా’ అన్న ఎక్స్‌ప్రెషన్ ఆయనకే ఎంత నచ్చేసిందంటే… పదేపదే అనేవారు… “ఏమనుకున్నావయ్యా… ‘మనసు.. మాటలు కాదు!’ – అన్నట్టు చదవాలి ఆ లైన్‌ని!” అని! ఈ పాటకు వేటూరిగారికి నాలుగైదుసార్లు పాదాభివందనం చేశాడు ఆర్‌కె!
అయితే, గోదావరి నన్ను కొంచెం నిరాశ పరిచింది… ఎక్కడో ఏదో లోటు… ఆడియన్స్‌కి కరెక్ట్‌గా రీచ్ కాలేదేమో అని డౌటు… అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు అనే చిన్న వెలితి… అందుకే ఫార్మాటే మార్చేద్దామనుకున్నా… లైటర్‌వీన్ సబ్జెక్ట్ తీసుకున్నా!
‘పొద్దున్న లెగాలి… స్నానం చెయ్యాలి… కాలేజ్‌కి వెళ్లాలి…’ అని లిరిక్ రాసేసి, దానితో మిక్కీని ట్యూన్ చెయ్యమన్నాను! ‘ఇలాంటి పాటకాని పాటకి వేటూరి సాహిత్యం ఏమిటి?’ అని నేను, మిక్కీ అసిస్టెంట్ వెంకట్ కలిసి పాటని పూర్తి చేసేశాం!
ఒక్క పాటయితే మేమే రాసేసుకున్నాం… ఇక వేటూరి దగ్గరికి వెళ్లాలి! కానీ ఆయనతో ‘సాహిత్యం ఆల్‌మోస్ట్ ఇలాగే ఉండాలి’ అని ఎలా చెప్పాలి? – అని అనుకుంటుండగా… మిక్కీ వనమాలికి ‘అరెరే’ ట్యూన్ ఇచ్చాడు.. ఊరికే టెస్ట్ చేద్దామని! నాకా లిరిక్ అద్భుతంగా అనిపించి, వెంటనే ఫిక్స్ చేసేశాను! షూటింగ్ మొదలుపెట్టాం! కానీ మనసు పీకుతోంది… ‘వేటూరిగారు లేకుండా నా సినిమానా?’ అని. తెలిస్తే తిడతారేమోనన్న భయమ! ధైర్యం చేసి ఓ రోజు కాల్ చేశాను… ‘ఎక్కడ ఉన్నావు?’ అన్నారు. ‘సిబిఐటీలో షూటింగ్’ అనగానే… ‘వస్తున్నాను’ అన్నారు! సాయంత్రం కూర్చోబెట్టి మెల్లగా సిచ్యుయేషన్ చెప్పాను! ‘హ్యాపీ డేస్ టైటిల్ సాంగ్ మీరే రాయాలి సర్’ అన్నాను. వెజ్ మంచూరియా తింటూ ‘సిచ్యుయేషన్ ఏంటి?’ అని అడిగారు. ‘ఫేర్‌వెల్ సాంగ్… మూడు సిచ్యుయేషన్స్ ఉన్న పాట సార్’ అన్నాను. ‘ఒక్కసారి ఆ పిల్లల ఫోటోలు చూపించు’ అన్నారు… సెలక్ట్ చేసిన అందరి యాక్టర్ల ఫోటోలు చూపించాను. ‘హిట్ అవుతుంది… సూపర్‌హిట్ అవుతుంది’ అన్నారు!
నెక్స్ట్ డే ఈవెనింగ్‌కల్లా రాసేశారు…
‘వీడుకోలే వేదికైన… వీడలేని స్నేహమైనా…’
‘పరిచయాల పరిమళాలల్లే… అనుభవాల అల్లికలు గిల్లే…’
‘తాను లేక నేను లేననుకున్నా…
స్నేహబంధం తెంచుకుని కాదన్నా…
ఎదురుగ నిజమున్నా… నివురై మిగిలున్నా…
హ్యాపీ డేస్… హ్యాపీ డేస్…’
‘అసలీయన స్టూడెంట్స్‌కి అర్థమయ్యేట్లు రాయగలరా?’ అన్న నా డౌట్ ఎంత తప్పో, విన్నాక అర్థమైంది! నాకు తెలిసి… ఆ సిచ్యుయేషన్‌కి మికీ ఇచ్చిన ఆ మూడు ముక్కల ట్యూన్‌కి వేటూరి తప్ప వేరెవరూ అలారాయలేరు..! హ్యాపీడేస్‌లో వేటూరిగారితో ఆ పాట ఒక్కటే రాయించాను… ఆ విషయంలో ఆయన నా మీద కొంచెం అలిగారేమోనని అనిపించింది. సినిమా 100 డేస్ ఫంక్షన్‌కి రాలేదు!
కథ చెప్పడానికి పరిగెత్తాను. విన్న తరువాత – నా ఆరు నెలల పరిచయంలో మొదటిసారి ఆయనలో ఆవేశం చూశాను! అనర్గళంగా గంటసేపు బల్లగుద్ది మరీ మాట్లాడారు. గాంధీ గురించి, ఆయన చనిపోయినప్పుడు తాను కవర్ చేసిన ప్రజల రోదనల గురించి, గాడ్సే గురించి – ‘ఐ కిల్డ్ గాంధీ.. ట్రూ… బట్ ఇట్స్ నాట్ మై ఫాల్ట్… హి డజ్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్’ అన్న అతని ఆక్రందన గురించి, తాను చేసిన ఇంటర్వూ గురించి..! అన్నీ అయిన తరువాత సడెన్‌గా – ‘మీరు శాంతారాం లాంటివారు శేఖర్’ అన్నారు! అలా చూశాను..! అది నాకు ఆయన డైరెక్ట్‌గా ఇచ్చిన మొదటి కాంప్లిమెంట్! ‘ఈ జన్మకిది చాలు’ అనుకున్నాను!
మరీ ఫీలవ్వకుండా అడిగాను… ‘సార్, కథ ఎలా ఉంది..? దాని గురించి చెప్పనేలేదు?’ అని. అప్పుడు చెయ్యి ఎత్తారు ఆయన – తన యూజువల్ స్టైల్‌లో! ‘ఇది సామాన్యమైన సినిమా కాదు… ఒక విస్ఫోటనం అవుతుంది… నిజంగా ఎగ్జైట్ అయ్యాను… కానీ ఇది గోదావరి తీరాల్లో రాయకూడదు… ఇక్కడే రాయాలి’ అన్నారు!
‘గోదావరి’ టైమ్‌లో ‘నెక్స్ట్ సినిమాకి తప్పకుండా గోదావరి తీరంలోనే పాటలు రాయిద్దాం’ అనుకున్నాను కానీ, అది ‘హ్యాపీడేస్’ సబ్జెక్ట్‌కి వర్కవుటవ్వలేదు… ‘లీడర్’కి ఆయనే వద్దన్నారు. మొత్తానికి ఆయన కోరిక తీర్చలేకపోయాను! మై లాస్..!
సాంగ్: వందేమాతరం…
దగ్గర దగ్గర 10 మీటింగులు… అన్నిట్లో ఆయనలో ఆవేశం చూశాను! ఎన్నో వెర్షన్లు… ఎన్నో పదాలు… అన్నిట్లో ప్రేమే! ప్రజల పట్ల, దేశం పట్ల… తిట్టినా కూడా ప్రేమే! ‘ఇది కాదు మన పెద్దలు కోరుకుంది… వియ్ నీడ్ ఎ ఛేంజ్… ఫర్ ఎ బెటర్ సొసైటీ…’ అన్నారు!
‘ఏ శకునీ ఆడని జూదం… బ్రతుకే ఓ చదరంగం… ఇది ఆరని రావణకాష్టం… చితిలోనే సీమంతం…
ఇది మంచికి వంచన శిల్పం… ఇక ఆగని సమరంలో… ఈ నేరం ఇక దూరం… ఇది మా తరం… వందేమాతరం…’
సాంగ్: రాజశేఖరా నీపై…
“రేపు సీ.ఎం. అవ్వాల్సినవాడు – సెలబ్రేట్ చేసుకుంటున్నాడు! ఈ నేపథ్యంలో ‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’ పాటని రీమిక్స్ చేద్దాం సార్” అనగానే, ఆయన చాలా ఆనందించారు! ‘రాజశేఖర రెడ్డిగారు చాలా సంతోషిస్తారు’ అంటూ – ‘ఆయనకి తప్పకుండా ఈ సినిమా చూపిద్దాం’ అన్నారు!
‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా… రాజసాన ఏలరా…
పోరుకైన పొందుకైన నీవెగా… దేహమైన దేశమైన నీదెగా…’
మూడు నెలల తరువాత… రాజశేఖర్‌రెడ్డిగారు చనిపోయిన తరువాత… ‘మహానుభావుడు వెళ్లిపోయాడు… ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో?’ అన్నారు! నిజమే… ‘ఇది ఆరని రావణకాష్టం’!
సాంగ్: ఔననా కాదనా…
‘సార్, పదవి కోసం, ప్రజాధనం కాపాడడం కోసం హీరో ఆమెని మోసం చేస్తాడు! ఒకపక్క బాధ… మరోపక్క కర్తవ్యం..’ అని సిచ్యుయేషన్ చెప్పుకుంటూ వచ్చాను!
‘తార తార దూరమైన చోటనే ఆకాశాలు…
కంట నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు…’
‘పూలజడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగె…
రాసలీల రక్తధార గాథలైపోయేనా…’
ఇలా రాయడం ఒక్క వేటూరికే చెల్లు!
సాంగ్: శ్రీలు పొంగే జీవగడ్డ…
సుహాసిని చనిపోయే సీన్‌లో… వేటూరి ‘తల్లి’ మీద ఓ అద్భుతమైన పద్యం రాశారు! మచ్చుకకి రెండు లైన్లు…
‘బడి పెట్టి కడుపులో గుడి కట్టి ప్రేమకే
పాఠాలు నేర్పిన పంతులమ్మ‘
‘అనుభవాలను చెప్పి గుణగణాలను దిద్ది
అభ్యాస్తములిచ్చు, అమ్మ అమ్మ‘
దాని రికార్డింగ్ విందామని ఆయన చాలా ఆశపడ్డారు! కాని సినిమాలో టెంపో తగ్గుతుందేమో అన్న భయంతో నేనే ఆ పాట బదులు రాయప్రోలు రాసిన ‘శ్రీలు పొంగే..’ పాటను పెట్టాను. అది మేము ఆయనకి ఎడిటింగ్ రూమ్‌లో చూపించగానే… ‘రాయప్రోలు దేశాన్ని తల్లిగా భావించి రాశారు… ఇంతకంటే మనం రాయలేం… ఇదే ఉంచండి’ అన్నారు!
లీడర్ ఆడియో రిలీజ్ టైమ్‌లో ఆయన హాస్పిటల్‌లో ఉన్నారు. ఫంక్షన్‌కి రాలేకపోయారు కానీ ఆయన మనసంతా అక్కడే ఉంది! టీవీ పెట్టుకుని చూస్తూ… హాస్పిటల్‌లోంచే మాట్లాడారు! ఇండస్ట్రీ అతిరథ మహారథుల సమక్షంలో అదే వైస్రాయ్ వేదిక మీద ఆయన హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని మాట్లాడుతుంటే, నాకు ఆయన రాసిన – ‘చెమ్మగిల్లిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే… చూడలేనని మనసు తెలిపే… మనసు మాటలు కాదుగా…’ అన్న మాటలే గుర్తొచ్చాయి!
ఆ టైమ్‌లో ఆయన నాకు – ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు తీసుకున్న సత్యజిత్‌రేలాగా అనిపించారు!
టీవీలో స్క్రోలింగ్ చూసి అలా ఉండిపోయాను..! ‘పెద్దవారు… ఆరోగ్యం బాగాలేదు’ అని తెలిసినా, కోలుకుని మళ్లీ తన పాటల సామ్రాజ్యంలోకి వచ్చేస్తారనే అనుకున్నాంగానీ, ఇలా వెళ్లిపోతారని మాత్రం కలలో కూడా ఊహించలేదు! అచేతనంగా ఉండిపోయాను… ఆయన్ని చూసే ధైర్యం లేక!
అరే ఏమీ చెప్పకుండా అలా వెళ్లిపోయారే! గోదావరీ తీరంలో నాకింకా ఒక్క పాటైనా రాయనేలేదే… లీడర్ గురించి ఆయన్ని అడగలేదే… ఆయన కనీసం మా ఇల్లైనా చూడలేదే… ఆయనంటే నాకెంత అభిమానమో ఎప్పుడూ సరిగా చెప్పనైనా లేదే… ఎప్పుడూ స్థిమితంగా నుంచుని ఆయన కాళ్లకు దణ్ణం అయినా పెట్టలేదే… ఇలా… క్షణంలో ఎన్నో ఆలోచనలు!
ఆగని ఫోన్లు.. మెస్సేజ్‌లు.. ‘శేఖర్… వేటూరిగారు ఇక లేరు… వేటూరి పాస్డ్ ఎవే’ అని! మీడియా వాళ్లు.. స్నేహితులు… అసిస్టెంట్లు… చాలామంది నాతో మాట్లాడాలని! ఏం చెప్పను..? నాకాయన ఏమవుతారంటే ఏం చెప్పను..? తెలుగు సినిమాకి – పాటకి సంబంధం లాంటిది మాదని చెప్పనా? నా సినిమాల్లో సగభాగం ఆయనేనని చెప్పనా? ఏం చెప్పను..? సభ్యత మరిచి టీవీలో భోరున ఏడవడం తప్ప!
సార్.. ఎక్కడ ఉన్నారు సార్..
ఎందుకు వెళ్లిపోయారు సార్..
ఇంకొక్క పదేళ్లు… పోనీ ఐదేళ్లయినా ఉండుంటే,
ఇంకా ఎన్ని పాటలతో
ఇంకా ఎంతమందికి లాలి పాడేవారు సార్..!
యాక్చువల్లీ నాకు దిక్కు తోచడం లేదు… నాలాగే ఎందరో దర్శకులకు కూడా ఇంతేనేమో! అలాగే తెలుగు పాటకి… తెలుగు భాషకి కూడా! ‘నాకు ఆయన లేరు’ అన్నదానికంటే ‘తెలుగుకి ఆయన లేరు’ అన్న బాధే ఎక్కువగా ఉంది! బండి రా (ఱ) లు.. అళా (ళ) లు పోయినంతగా తెలుగు తల్లి ఏడుస్తుందేమో అనిపిస్తుంది!
తెలుగు కోసం ఆయన నేషనల్ అవార్డ్ వదులుకున్న రోజుల్లో… ఓసారి ఆయనతో – ‘సార్… ఎమ్‌సెట్‌లో ఓ పది మార్కులు తెలుగుకి కూడా పెడితే, చచ్చినట్టు ఈ నారాయణలూ, శ్రీచైతన్యలూ పిల్లలకి సుమతీ శతకాలు, వేమన శతకాలు చెబుతారు సార్.. అప్పుడు తెల్లవారుఝామున పిల్లలు తెలుగు పద్యాలు గట్టిగా బట్టీ పట్టడం వినిపిస్తుంది సార్’ అంటే… ఆయన ‘నిజమేనయ్యా, అలాగైనా తెలుగు బ్రతుకుతుందేమో… లేకపోతే ఇంకో పది సంవత్సరాల్లో మనం ఇంగ్లిష్ సినిమాలే తీయాల్సి వస్తుంది’ అంటూ ‘నేనీ విషయం రాజశేఖర్‌రెడ్డి గారితో చెప్తాను…’ అన్నాను. ‘సర్, నేనేదో సరదాగా అన్నాను…’ అనగానే ఆయన ‘నేను మాట్లాడతాగా… ఆయన తల్చుకుంటే జరిగిపోతుంది’ అన్నారు. అది ఆయనకు తెలుగు మీదుండే ప్రేమ!
ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన ‘మన తెలుగు భాషకి పీఆర్‌ఓలు లేరయ్యా’ అని బాధపడేవారు! దౌర్భాగ్యమేంటంటే… తెలుగు భాషకే కాదు, వేటూరిగారికి కూడా పీఆర్‌ఓలు లేరు! ఉండుంటే, ఆయన కూడా దర్జాగా ఫిల్మ్‌నగర్‌లో తన సొంత ఇంట్లో పాటలు రాసుండేవారు! అంతేకాదు, నా దృష్టిలో ‘ఉప్పొంగెలే గోదావరి’ పాటకు ఆయనకు నంది అవార్డు కానీ, నేషనల్ అవార్డు కానీ రాకపోవడానికి కూడా అదే కారణం! పోనీలేండి, ఆయనకేం నష్టం లేదు… వాటికే నష్టం!
నేనెప్పుడైనా ఆయనతో ‘మీరు కొత్త – పాత తరాలకి వారధి లాంటివారు సర్’ అంటే… ‘కాదు… భాషకి వారధి ఉండకూడదు… అది ఎప్పటికీ సజీవం… ఇట్ కాంట్ గో అవుటాఫ్ ఫ్యాషన్’ అంటూ ‘మాతృభాష తల్లి లాంటిది… అది తెలిస్తేనే పిల్లలు బాగా ఎదుగుతారు… సంస్కృతి నిలబడుతుంది… కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది…. చివరికి దేశం నిలబడుతుంది’ అనేవారు!
ఆయన లేకుండా కూడా లైఫ్ నడిచిపోతుంది… సినిమాలు తీసేస్తాం… పాటలూ రాయిస్తాం! కానీ, ఇలా పాటల మంచిచెడుల గురించి ఇక ఎవరినడుగుతాం..? ఎవరు చెబుతారు పక్కన కూర్చోబెట్టుకుని ఇవన్నీ? ఇంక నాకు మాటలు ఎక్కడ నుంచి వస్తాయి… ఆయన పాటలు తప్ప..! ప్రాప్తమనుకో ఆ క్షణాలే బ్రతుకులాగా…
ఈ మాటలు రాస్తుంటే నా కళ్లు చెమ్మగిల్లని క్షణం లేదు! నాకు, నా సినిమాలకీ వేటూరి లేని లోటుని కొలవలేను! ఆయన ప్రస్థానంలో కొన్ని రోజులైనా నడవడం నిజంగా నా అదృష్టం! మహానుభావా… దొరకునా ఇటువంటి సేవ… నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ… దొరకునా… దొరకునా….
కన్నీళ్లతో….
మీ
శేఖర్ కమ్ముల!
ఫామిలీ పత్రిక సౌజన్యంతో….
(యూనీకోడీకరించినది….చాణక్య)
వేటూరి గారు చనిపోయినప్పుడు నాకు ఆ న్యూస్ తెలీదు.. కానీ ఈ పోస్ట్ చదువుతుంటే మాత్రం.. ఏడుపొచ్చేసింది..
ఈ సైట్ నిర్వాహుకులకి వందనాలు. మెల్లిగా ఒక్కోలైనూ శ్రద్దగా చదువుకున్నాను.
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు…
(లంక పొగాకుని లంకేశ్వరుడితో పోల్చడం)>>>>
పడవ ప్రయాణాన్ని వర్ణించడానికి… ‘నేల మీద కాదు – నీళ్లలో కాదు’ అనడానికి – ‘లోకం కాని లోకం’ అన్నాడాయన! నో మోర్ క్వశ్చన్స్!!>>>
ఎన్ని సార్లు చదవినా ఇది చదివినప్పుడల్లా కంటి వెంట నీళ్లొస్తాయి.
ఆయన లేకుండా కూడా లైఫ్ నడిచిపోతుంది… సినిమాలు తీసేస్తాం… పాటలూ రాయిస్తాం! కానీ, ఇలా పాటల మంచిచెడుల గురించి ఇక ఎవరినడుగుతాం..? ఎవరు చెబుతారు పక్కన కూర్చోబెట్టుకుని ఇవన్నీ? …Well said Sekhar Kammula!
ఇలాటి మహానుభావుల్ని చూసే భాగ్యం కలిగినందుకు..వారి మాట..పాట వినటానికి ఈ కాలంలో పుట్టినందుకు మనమంతా ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది నాకు. తర్వాత తరాలకి ఇలాంటి అదృష్టాలు లేకపోయినా ఇలాంటి వెబ్ సైట్సు ద్వారా వాళ్ళకి ఈ మహనీయుల గురించి తెలియచెప్పటానికి మీరు చేస్తున్న కృషి ఎనలేనిది.
“బండి రా (ఱ) లు.. అళా (ళ) లు పోయినంతగా తెలుగు తల్లి ఏడుస్తుందేమో అనిపిస్తుంది!”
ఎంత నిజం!!
మీరిలా చదివించకపోతే ఈ వ్యాసాలేవీ చదివేవాళ్ళం కాదు పప్పు శ్రీనివాసరావు గారూ! మీరు ధన్యులు. మమ్మల్నీ ధన్యుల్ని చేస్తున్నారు. కోటికోట్ల ధన్యవాదాలు.
ఇది మొదటిసారి నేను సాక్షిలో అనుకుంటా చదివాను. సాధారణంగా నాకు వార్తాపత్రికల్లో చదివే ఏ విషయానికీ కళ్ళు తడి అవ్వడం అనేది జరగదు. వాటిలో నిజాయితీలు, నిజాలు ఏవీ అర్థమవవ్వవు కనుక.
కానీ ఈ వ్యాసం చదివినప్పుడు మాత్రం చాలా సేపు బాధ విడిచిపోలేదు. ఎవ్వరితోనూ చాలా సేపటి దాకా మాట్లాడాలనిపించలేదు. వేటూరి మీద నా ఇష్టం పెరిగింది గత పది సంవత్సరాల్లోనే. అంతకు మునుపు ఒక సినీ కవి సాహిత్యానికి సంబంధించి నాకే ఇష్టానిష్టాలూ ఉండేవి కావు.
ఆయన పాటలు తెలిసాక, పాండిత్యం కాస్త కాస్తగా అర్థమయ్యాక, ఆయన పాటల్లోని కవిత్వం, వేదాంతం, ఆశలు, శృగార భావాలూ, ప్రయోగాలూ చమత్కారాలూ రుచి తెలిసిన కొద్దీ మరింతగా ఆయన కలాన్ని ఆరాధించడం మొదలెట్టాను.
కొంతమందితో మనకు పరిచయాలుండవు; మనకి ఆ వ్యక్తి పట్ల అంత ఇష్టం ఉందని కూడా మనం గ్రహించలేం – ఒక్కోసారి అదెంత తీవ్రమైన ఇష్టంగా ఉంటుందంటే – వారిప్పుడు మన మధ్య లేరని కూడా అనుకోలేం, నమ్మలేం.
నా జీవితంలో వేటూరి, ముళ్ళపూడి రమణ అటువంటి వారు. వాళ్ళ గురించి చదివినా, తెలుసుకున్నా ఒక సంతోషం, ఒక బాధ. కొన్ని సార్లు ఈ రెంటికీ అతీతమైన, అనిర్వచనీయమైన భావనేదో…
Many thanks for sharing this article.
శేఖర్ గారి ఆర్టికల్ చదువ్ తుంటే …….మనుసులోని బావలు ఉవెత్తున లేచి పడ్డాయ్…ధన్యులు
పప్పు సార్ మరియు చాణక్య లకి అభినందనలు
ఆ పాటలు విన్న మేము కూడా అదృష్టవంతులమే అనిపిస్తుంటుంది
చదువుతుంటే ఏదో తెలియని బాధ! గోదావరిలో అందంగా లేనా పాట విన్నప్పుడల్లా ఈ వయసులో ఆయన ఆలోచన ఒక పడుచుపిల్ల మనసులా మారి ఎలా ఇంత అద్భుతమయిన పాట రాయించగలిగిందా అని అనిపిస్తుంది. ఏది వ్రాసినా అద్భుతం! దీనిని అందించిన శ్రీనివాస్ గారికీ, చాణక్య గారికీ కృతజ్ఞతలు!
శేఖర్ గారు వేటురిగారిగురించి ఇంతకంటే గొప్పగా ఏ తెలుగువాడు స్పందించలేడు.
మీ స్పందన చదివాక గుండె గోదారి అయింది.
నీటి తెరలను అడ్డు తొలగించుకుంటూ రాస్తున్నాను. ఎనిమిదేళ్ళ క్రితం గుంటూరు రైల్వే స్టేషన్‍లో వారి పాదాలకి నమస్కారం చేసుకున్నాను. వారు పోయిన రోజు వారి పార్ధివ దేహానికి నమస్కారం చేసుకున్నాను.
శ్రీనివాస్ గారు చెప్పినట్టు వేటూరి గారి గురించి వర్తమాన యువ దర్శకుల్లో ఎవరూ ఈ స్థాయిలో స్పందించలేరు.
చాల మంచి టపా. ధన్యవాదములు అందించినందుకు..