ఈ రోజు (జనవరి 29) వేటూరి గారి 85 వ జయంతి. ఆయన పాటల్ని తలచుకుంటూ, ఆయన ప్రతిభకి అక్షర నీరజనాలు అర్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు, వ్యాసాలు రావడం చూసి ఆనందం కలిగింది. ఎప్పుడూ వినే సినిమా పాటలు కాక వినని పాటలు ఏమైనా విందామని వేటూరి గారి అబ్బాయి రవిప్రకాష్ గారు నడుపుతున్న “మీ వేటూరి” చానల్ లో దివిసీమ గురించి, తుంగభద్ర గురించి రాసిన పాటలూ, వినాయకునిపై రాసిన వినాయక ప్రశస్తి పద్యాలు విన్నాను. అద్భుతం అనిపించాయి. మన తెలుగింటి నదులని, క్షేత్రాలని, సంస్కృతీ విషయాలని, కవులూ కావ్యాలని, మనం ఎన్నడో మరిచిపోయిన తెలుగు నుడికారాలని, పదప్రయోగాలని వేటూరి గారు ఎన్నెన్నో పాటల్లో ప్రస్తావించారు. ఆ మాటకొస్తే తెలుగుతనమే కాక భారత సంస్కృతీ విశేషాలూ, అధ్యాత్మికత ఆయన పాటల్లో పరుచుకుని ఉంటాయి. వేటూరి సినిమా పాటల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూనే ఆయన పాటల్లో మెరిసే ఈ విషయాలని కూడా వెలికి తియ్యాల్సిన అవసరం ఉంది. ఆయన సినిమాలకు బయట రాసిన సాహిత్యంలోని విలువలని కూడా తెలుగు జనాలకు అందించి వేటూరి గారి సంపూర్ణ సుందర మూర్తిని ఆవిష్కరిస్తే ఆయనకి ఘననివాళి అర్పించినవాళ్లమవుతాం!
తుంగభద్ర పుష్కరాలకు రాసిన పాటల్లో ఆ నది చుట్టూ ఉన్న క్షేత్రాలను, ఆ ప్రాంత చరిత్రను, సాహితీవేత్తలను, ప్రముఖులను ఇలా ఆ నదికి సంబంధించిన ఎన్నో విశేషాలను మనకు అందించారు వేటూరి. ఈ పాటల్లో పేర్కొన్న చాలా వాటి గురించి నాకేమీ తెలియకపోవడం నా అజ్ఞానాన్ని తెలుపుతూనే, ఇలాంటి ఘన వారసత్వ సంపదను ఈ తరానికి, ముందు తరాలకీ అందించాల్సిన అవసరాన్నీ చూపెడుతోంది.
మచ్చుకి కోటి స్వరకల్పనలో బాలూ పాడిన ఒక పాట చూడండి. చరణాల్లో ప్రతి వాక్యం వెనుకా ఎంతో చరిత్ర కనిపిస్తుంది. ఇలా తుంగభద్రపై పది పాటలు వరకూ రాశారు వేటూరి. ఈ పాటల్లోని సంగతులను విప్పి చెప్పే వాళ్లు కావాలిప్పుడు!
ఏమని ఎంతని పాడను నీ చరిత్ర
రంగత్తుంగత్తరంగ తుంగభద్ర!
కృష్ణాతరంగ పరిష్వంగ ముద్ర
కృష్ణరాయ కవితాంతరంగ భద్ర
అద్వైతామృత వాహిని శృంగేరివా
ద్వైతానందలహరి మంత్రాలయ నగరివా
శివకవితా సరస్వతీ బసవన గుడివా
అలతాపున శిలలు కళలుగా మారిన హంపివా
విరుపాక్ష జటాజూట జని గంగాభవానీ
రామచరిత మానస పంపా సరోజనీ
రాళ్లన్నీ రమణులైన రామపాద తీర్థమా
హనుమభక్తి మహిమ తెలుపు రసగంగా తీరమా
నరవానర సంగతికే చిత్రకూటమా
మాననీయ కిష్కింధకు మాల్యవంతమా
రుద్రజటలు వినిపించే ఋష్యమూకమా
విజయసింహ గర్జనకే శ్రీవిద్యారణ్యమా
మనుచరిత్రగా మారిన మనుసంభవ ప్రబంధమా
నిగమశర్మ అక్కనే నింగి చుక్కగా చేసిన పాండురంగ మహాత్మ్యమా
విరజానదిలా రాయల విశిష్ట ఘంటాన పొంగు విష్ణుచిత్తీయమా
కృష్ణరాయ గేయమా! మా కృష్ణరాయ గేయమా!
అలాగే దివిసీమపై రాసిన “దివిసీమ జాతీయ గీతం” దివిసీమకి మకుటాయమానంగా ఉంది. గంగాధర శాస్త్రి గారు స్వీయ సంగీతం గానం చేసిన ఈ పాటలోని ఓ రెండు చరణాలు –
ఆంధ్రజాతికి మూల పురుషుడై విష్ణువే అవతరించెను మా శ్రీకాకుళాన
కృష్ణా తరంగాల సారంగ రాగాలు మువ్వగోపాలా అన్నవిచ్చోట
కదళీపురస్వామి కరుణతో కవితాది కళలెల్ల వర్ధిల్లె మా సీమలోన
కళలకే కళ నేర్పె మా కూచిపూడి, ఇచటనే రేగె బుద్ధుని పాదధూళి
త్యాగరాజస్వామి రాగరంజనకళా స్థాపనాచార్యుడే మా ఆకుమళ్ల
సంగీత సద్గురువు దక్షిణామూర్తి, తెలుగు పాటల తేట మా పారుపల్లి
మధుర స్వరవారసుడు మంగళంపల్లి, నాదసుధలే తెలుగునాడెల్ల జల్లి
మనజాతికొక పతాకమునిచ్చె పింగళి, అన్నమయ్యకు వెలుగునిచ్చె మన వేటూరి!
ఇక్కడ “అన్నమయ్యకు వెలుగునిచ్చె మన వేటూరి” అన్నది వేటూరి గారి పెదనాన్న గారు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గురించైతే, “తెలుగుపదానికి జన్మదినం” అనే అద్భుత గీతంతో అన్నమయ్య సినిమాకు వెలుగునిచ్చిన వారు వేటూరి సుందర్రామ్మూర్తి!
ఆ పాట పల్లవిలో వినిపించే “దివిసీమ గీతం దివ్య సంగీతం, వినిపించనా మీకు తెలుగు సందేశం” అన్నది స్వర్గం (దివిసీమ!) నుంచి పల్కిన వేటూరి మాటలా అనిపిస్తుంది!
వేటూరి గారు పద్యాలు రాయడంలో నేర్పరి. వినాయకుని స్తుతిస్తూ రాసిన ఈ అందమైన ఉత్పలమాల పద్యం భగవంతునితో భక్తుడు తన అంతరంగాన్ని విప్పి చెప్పుకున్నట్టు ఉంటుంది, ఏ దేవుడికైనా వర్తిస్తుంది. వృధా ప్రయాసలు మాని, భగవంతుని ధ్యానమే మేలంటుంది. సత్, చిత్, ఆనందం అనబడే అద్వైత తత్త్వానికి సాకారం కనిపిస్తుందిక్కడ. వేటూరి గారి భక్తి రచనల ద్వారా ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చు. ఈ పద్యాన్ని భావం ఉట్టిపడేలా స్వరపరిచి గానం చేసిన వారు పార్థు.
ముత్తెపు చిప్ప చిన్కువడి ముత్తెములైనటు, నిన్ను గూర్చి నా
చిత్తము చేయు భావన విచిత్రముగా నొక దివ్య తత్త్వమై,
సత్తుల చిత్తులన్ తెలియజాలు, మహాప్రభయై వెలుంగు, వే
రిత్త తలంపులేల? అపరిష్కృత జీవిత భావనా గతిన్!
ఓలేటి శ్రీనివాస భాను గారు అందించిన భావం – “ఓ గణనాథా! ముత్యపు చిప్పలో పడ్డ స్వాతి చినుకులు ముత్యాలుగా మారినట్టు, నీ గురించి ధ్యానించే నా హృదయం విచిత్రంగా దివ్యతత్త్వమైపోతుంది. సత్తు, చిత్తులను గుర్తెరిగే మహాకాంతితో వెలిగిపోతుంది. పరిష్కరాలు లభించని భావాలతో సాగిపోతున్న ఈ బ్రతుకులో ఇక పనికిరాని ఆలోచనలు దేనికి చెప్పు?”
ఇలా ఎన్నని చెప్పాలి? “మీ వేటూరి” చానల్ లో ఇంకా చాలా అరుదైన ఆణిముత్యాలు ఉన్నాయి. ఇవి కాక మరుగున పడిన వేటూరి రత్నాలు ఇంకెన్నో! ఈ పాటలన్నీ సమగ్రంగా పరిశీలిస్తే వేటూరి తెలుగువాడైనందుకు మనం గర్వపడి తీరతాం! ఆయన సినిమా కవి కూడా అవ్వడం మన అదృష్టం. అందువల్ల మన తెలుగుకీ, భారతీయ సంస్కృతికీ సంబంధించిన విషయాలెన్నో సాహితీవేత్తలకే కాక సామాన్యులకి కూడా అందాయి. ఆయన పాటల్లోని లోతులు అందరికీ అర్థం కాకున్నా, అందరూ పట్టించుకోకున్నా, ఏ కొందరికో ప్రేరణ కలిగిస్తే అదే పదివేలు! నేనూ అలా ప్రేరణ పొంది వేటూరి వారి చలువ వల్ల ఎన్నో తెలుసుకున్నవాడినే. ఆయన జయంతి సందర్భంగా ఆయనకి మరోసారి నా వినమ్ర ప్రణామాలు సమర్పించుకుంటున్నాను.
తెలుగు పాటకు కొత్త ఒరవడి దిద్దిన వాడు
తెలుగు మాటల్ని ఏరుకొచ్చి తెరకద్దిన వాడు
తెలుగైన వాడు, ఘనమైన వాడు, ఒకే ఒక్కడు
చిక్కినా దొరకడు, దొరికితే వదలడు
మరువనీయడు, మనవాడు, మనసైన వాడు
వేణువై వచ్చిన వాడు, వేల పాటల వేటూరి వరుడు
వెలుగులే పంచినవాడు, అస్తమించని సాహిత్య ప్రభాకరుడు