ఈ జనవరి 29 వేటూరి గారి పుట్టినరోజు సందర్భంగా మా వేటూరి గ్రూప్ సభ్యులం కొందరం Google Meet ద్వారా కలిసి ఆయన పాటలని చర్చించుకుని ఆనందించాము. ఆయన పాటలు ఎప్పుడూ విననివి కొన్ని, ముందు విన్నా ఇప్పుడు ఎవరో ఆ పాటలో సౌందర్యాన్ని వివరిస్తే మళ్ళీ విన్నవి కొన్ని, ఎప్పుడూ వింటున్నా మళ్ళీ మళ్ళీ ఆనందం పంచేవి మరికొన్ని…ఇలా ఎన్నో పాటలని స్మరించుకోవడం జరిగింది ఈ రోజు. వాటిల్లో కొన్నిటిని నా గుర్తు కోసం ఇక్కడ పొందుపరుచుకుంటున్నాను.
వేటూరి గారు మెచ్చిన మూడు పాటలు
పాటల రచయిత మనసుకి నచ్చిన పాటలు కొన్నుంటాయి. అవి హిట్ అయినా కాకున్నా తన మనసులో మాత్రం మెరిసే పాటలు. ఇలాంటి ప్రాచుర్యం పొందని ఓ మూడు పాటల గురించి వేటూరి గారు తరచూ చెబుతూ ఉండేవారని మా గ్రూపులో వెంకట్రావు గారు చెప్పారు. ఆ మూడు పాటలూ ఇవి.
- సువర్ణ సుందరి చిత్రంలో గొబ్బిళ్ళ పాట ముందు వచ్చే వసంత వర్ణన (వీడియోలో సందర్భం 54:41 నుంచి)
2. గయ్యాళి గంగమ్మ చిత్రంలో “రాధ నా రాధ” పాట. ఇదో అందమైన ప్రేమ గీతం.
3. అయ్యప్పపై రాసిన అద్భుతమైన సంస్కృత దండకం – ఇది గీతాంజలి పేరిట వేటూరి వారు సమర్పించిన కొన్ని భక్తి గీతాల కేసెట్లలో ఒకటైన “స్వామియే శరణం అయ్యప్ప” లోనిది.
అభిమానులు మెచ్చిన పాటలు!
వేటూరి గారి పుట్టినరోజున ఆయన పాటలు వింటూ గడపడం అలవాటు. అలా నేను విన్న పాటల్లో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇందులో కొన్ని పాటలను మా గ్రూప్ డిస్కషన్ లో సభ్యులు ప్రస్తావించగా వినడం జరిగింది.
- గణపతి సచ్చిదానంద గారిపై రాసిన “మనిషికిన్న మహిమలా ఘనసిద్ధుల గరిమలా” పాట. ఇది కొమ్మకొమ్మకో సన్నాయిలో వేటూరి ప్రస్తావించారు. “శ్రీ గురుదత్త మణిమాల” అనే ఆల్బంలోనిది ఈ పాట. ఈ ఆల్బంని కిరణ్ అన్న తలుచుకున్నాడు. మరికొన్ని పాటలు ఇక్కడ.
2. “ప్రేమ పుస్తకం” చిత్రంలోని “పూర్ణమదః పూర్ణమిదం పులకిత వేదం, పూర్ణిమా సంగమమే!” అన్న శృంగార గీతం నాకు చాలా ఇష్టమైనది. పాట ట్యూన్ + ఫీల్ చాలా బావుంటాయి. వేటూరి అందించిన సాహిత్యం గొప్పగా ఉంటుంది.
3. “గోదావరి పొంగింది” చిత్రంలోని “చిరంజీవి గోదావరి” పాటని విశాలి గారు తలుచుకున్నారు. గోదావరి గొప్పదనాన్ని చాలా గొప్పగా వేటూరి వర్ణించిన పాట ఇది. నాకూ చాలా ఇష్టమైన పాట. బాలూ గారు ఈ పాట గురించి మర్చిపోగా ఒక అభిమాని గుర్తు చేస్తే ఈ పాటని పాడిన వీడియో (సినిమాలో బాలూ పాడిన పాట ఇక్కడ) –
4. “ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా” అనే పాపులర్ గీతం నేను అంతక ముందు విన్నాను కానీ సాహిత్యాన్ని అంతగా పట్టి చూడలేదు. మా గ్రూపులో దత్తాత్రేయ గారు ఈ పాటలోని ప్రయోగాలు తనని పద్యాలు రాయడానికి ప్రేరేపించాయి అని చెప్పినప్పుడు పాటని మళ్ళీ శ్రద్ధగా విన్నాను. చాలా అందమైన ప్రయోగాలు కనిపించాయి. ఈ పాటని కొత్తగా “వాల్మీకి” అనే సినిమాలో వాడారనీ తెలిసింది!
5. వేటూరి పాటల్లో నాకు నచ్చే గుణం – playfulness. ఆయనంత స్వేచ్ఛగా ఇంకే సినిమా కవీ రాయలేదు అనిపిస్తుంది. ఇది ముఖ్యంగా సరసమైన గీతాల్లో ఎక్కువగా తెలుస్తుంది. ఆయన పుట్టినరోజున నేను చాలా సార్లు విన్న పాట – “సంధ్యారాగపు సరిగమలో”. ఇళయరాజా సొంపైన బాణికి వేటూరి అద్దిన హొయలు ఎన్నో! నాకు చాలా చాలా ఇష్టమైన పాటిది.
చక్కటి పాటలని మాలగా చేశారు. అభినందనలు ఫణిగారు.
Chaalaa baavundi. Abhinandanalu