ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది!

(వేటూరి “హాసం” అనే ఒక పత్రికలో కొమ్మ కొమ్మకో సన్నాయి అనే శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలలో కొన్ని తర్వాత ఇదే పేరు గల ఒక పుస్తకంగా కూడ వెలువడ్డాయి. ఆ పుస్తకంలో కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చేస్తున్న ప్రయత్నం ఇది.)

ముందుగా వేటూరి స్మృతిగీతంగా తోచే ఈ పాట. దీనికి ఇక్కడ వినొచ్చు: ఏరెల్లి పోతున్నా

ప్రముఖ దర్శకుడు శ్రీ తాతినేని ప్రకాశరావు తీసిన “ఆశా జ్యోతి” చిత్రానికి పడవ పాట ఒకటి కావలసి వచ్చింది. సన్నివేశం చాలా ఉదాత్తమైనది. తన ప్రియుడు పడవలో గోదావరి దాటి వెళ్ళిపోతుంటే తన మనసు అతనికి చెప్పాలని పరుగు పరుగున వచ్చిన కన్నెపిల్ల. మాటకందని దూరంలో వెళ్ళిపోతున్న పడవలో ప్రియుడు. ఇదీ సన్నివేశం. ఇక్కడ పడవవాడు ఆ సన్నివేశంలో తను పాడుకునే ఓ పడవపాట. ఆ సన్నివేశానికీ, ఆ కన్నెపడుచు మనోభావానికి అద్దం పట్టే పాటగా ఉండాలి.

ఒకరిద్దరి చేత దర్శకుడు రాయించి రమేష్ నాయుడు గారికి ఇచ్చారు. కానీ నాయుడు గారికి ప్రేరణ కలగలేదు. కంపోజింగు ఆగిపోయింది. “ఏం చేద్దాం?” అన్నారు దర్శకులు. వెంటనే నాయుడుగారు విజయా గార్డెన్సుకు వచ్చి – “నాకో పాట కావాలి. సన్నివేశం నేను చెబుతాను. రాసి పెట్టండి” అన్నారు. ఆ తరువాత నేను చెబుతుంటే ఆయనే రాసుకున్నారు.

ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది
కోటిపల్లి రేవుకాడ సిలకమ్మ గొడవ
కోరంగి దాటింది గోరింక పడవ

ఇదీ పల్లవి! ఈ పల్లవి నేను చెప్పగానే ఆయన – “చరణాలు రాసి పంపండి. మనిషిని పంపుతాను. నా మటుకు నాకు పాట వచ్చేసింది” అని హుటాహుటిని వెళ్ళిపోయారు. ఆ పాట రికార్డింగుకి కూడా నేను వెళ్ళలేదు. అది వినిపించడానికి నాయుడు గారూ, ప్రకాశరావు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. చాలా ఆనందంతో ప్రకాశరావు గారు నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ పాట వింటే రమేష్ స్వరకల్పనా శిల్పం రేఖామాత్రంగా శ్రోతలకు దర్శనమిస్తుంది.

— “నాయుడు గారూ, నవమి నాటి వెన్నెల మీరు – దశమి నాటి జాబిలి నేను” వ్యాసం, పే: 104-105.

…ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది –

ఏటిపాప శాపమ్మ ఎగిసి తాను సూసింది
ఏడినావోడంటే ఏటిలోన మునిగింది
శాపమునిగినా కాడ శతకోటి సున్నాలు
శాపమైన గుండెలోన సెప్పలేని సుడిగుండాలు…
ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది
నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది!!

— పే: 113

4 thoughts on “ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది!”

  1. శాప మునిగినా కాడ శతకోటి సున్నాలు
    శాపమైన గుండెలోన సెప్పలేని సుడిగుండాలు

    — అబ్బా – ఎంత గొప్ప expression. ఇలాగ అసలు ఎలాగ ఆలోచిస్తారు? ఇందులో “శాప”తో యమకం, “శ,ప,మ,న,గ” – ఐదక్షరాలతో రెండు వాక్యాలకూ ఆదిప్రాస (లాగా) కలిపారు. మొదటి వాక్యంలో “శాప” కి “శత”కి యతిమైత్రి. వాక్యాలకు అంత్యప్రాస. ఈయన జానపదం వ్రాసినా చేప క్రింద నీరులాగా ఛందస్సు సంచరిస్తూనే ఉంటుంది. అదే కదా వేటూరి గొప్పదనం?

    మంచిపాట గురించి చెప్పావు. నీ ప్రయత్నానికి నా అభినందనలు.

  2. Marvelous expression. I havent heard about this song earlier. I read this post 10 times to feel veturi. I am bit surprised to feel tears in my eyes by reading those lyrics for the situation. What a fantastic work? veturi garu malli vaste bavundu. We miss him. 🙁

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top