“పిల్ల సిగ్గు చచ్చినా మల్లె మొగ్గ విచ్చినా కదలడూ మెదలడూ కలికి పురుషుడూ…”
కారణాలేంటో తెలీదు కానీ, బాపూ-రమణలు వేటూరి చేత రాయించుకున్న పాటలు బహు తక్కువ. ఆ తక్కువలో ఎక్కువ పాటలు ఆణిముత్యాలే, సాహిత్య పరంగానూ సంగీత పరంగానూ కూడా. ఇక, బాపూ మార్కు చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అందునా, సన్నివేశంలోనూ, సాహిత్యంలోనూ కూసింత రొమాన్స్ ఉన్నట్టయితే తెరమీదకి వచ్చేసరికి అది కాసంత అవుతుంది. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ‘రాంబంటు’ (1996) సినిమా కోసం వేటూరి రాసిన ఈ రొమాంటిక్ గీతం బాపూ-రమణలకి ఎంతగా నచ్చేసిందంటే, రమణ తన ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’ లో ప్రత్యేకంగా ప్రస్తావించేంత!
బాలూ చిత్రా పాడిన ఈ పాట యుగళగీతం కాదు. ఎందుకంటే, చిత్ర పాట పాడితే, బాలూ పోర్షన్ కి చరణాల మధ్యలో డైలాగులు ఉంటాయి. ఓ జమీందారు మీద జరిగే కుట్రలో భాగంగా ఆయనగారమ్మాయి కావేరి (ఈ సినిమాలో కావేరి స్క్రీన్ నేమ్ తో పరిచయమై, ఇప్పుడు ఈశ్వరి రావు పేరుతో నటిస్తోంది) ని పెళ్లి చేసుకున్న వాడు అల్పాయుష్కుడౌతాడని జాతకం చెప్పిస్తారు. జమీందారు గారి నమ్మినబంటు రాంబంటు (రాజేంద్రప్రసాద్) అమ్మాయిగారి మెడలో తాళికట్టేసి, నేడో రేపో తను పోయాక ఆమె గండం గడిచిపోతుందని, అప్పుడు నిజమైన పెళ్లి జరుగుతుందన్న ఆలోచనలతో ఉంటాడు. అమ్మాయిగారు రాంబంటుతో ప్రేమలో పడిపోయి, అతనే తన భర్తని మనసా వాచా నమ్ముతూ ఉంటుంది. బ్రహ్మచర్యం అతని దీక్ష, దానిని భగ్నం చేయడం ఆమె కర్తవ్యం. ఈ సందర్భంలో వచ్చే పాట ఇది.
సందమామ కంచవెట్టి సన్నజాజి బువ్వపెట్టి సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు అరిటిపువ్వు తెస్తాడు అడవి పురుషుడు
అవును, ‘రాంబంటు’ అడవిపురుషుడే. చిన్న బాలుడిగా అడవి నుంచి దివాణం చేరి, అక్కడే పెరిగి పెద్దయినా, అడవి అలవాట్లు విడిచి పెట్టడు. పెళ్లయింది కదా, కొత్త అలవాట్లు చేసుకోవాలి కదా అని ఆమె ఫిర్యాదు.
భద్రాద్రిరామన్న పెళ్లికొడుకవ్వాల సీతలాంటి నిన్ను మనువాడుకోవాల బెజవాడ కనకదుర్గ బాసికాలు తేవాల బాసరలో సరస్వతి పసుపు కుంకుమలివ్వాల
ఆమె ఏమంటోందో అస్సలు పట్టించుకోకుండా, అమ్మాయిగారికి జరగాల్సిన పెళ్లి కోసం దేవతలకి ప్రార్ధనలు చేస్తున్నాడు రాంబంటు.
విన్నపాలు వినమంటే విసుగంటాడు మురిపాల విందంటే ముసుగెడతాడు బుగ్గపండు కొరకడు పక్కపాలు అడగడు పలకడు ఉలకడు పంచదార చిలకడు కౌగిలింతలిమ్మంటే కరుణించడు ఆవులింతలంటాడు అవకతవకడు
సందర్భానుసారం అవసరమైన పండు, పాలుని బుగ్గపండు, పక్కపాలుగా మార్చిన చమత్కారం వేటూరిది. ‘పంచదార చిలక’ అని అమ్మాయిలని అనడం కద్దు. ఆమె ముద్దుగా అతన్ని ‘పంచదార చిలకడు’ అంటోందా, లేక ‘పంచదార’ ‘చిలకడు’ అని ఫిర్యాదు చేస్తోందా? వేటూరికే తెలియాలి. డైలాగుల్లో మాటల్ని విరిచేసి కామెడీ చేసేసే ముళ్ళపూడి రమణ డంగై పోయిన పదప్రయోగం ‘అవకతవకడు.’
ఏడుకొండలసామి ఏదాలు సదవాల చెవిటి మల్లన్నేమో సన్నాయి ఊదాల అన్నవరం సత్తెన్న అన్ని వరాలివ్వాల సింహాద్రి అప్పన్న సిరిసేసలివ్వాల
ఆమె ఘోష అతనికి అస్సలు పట్టడం లేదు. ప్రార్ధనలు కొనసాగాయి, మరికొంచం గట్టిగా..
పెదవి తేనెలందిస్తే పెడమోములు తెల్లారిపోతున్న చెలి నోములు పిల్ల సిగ్గు చచ్చినా మల్లె మొగ్గ విచ్చినా కదలడూ మెదలడూ కలికి పురుషుడూ అందమంత నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురుబెండడు
అతిమామూలు వాడుకమాట ‘తెల్లారిపోడం’ పాటలో ఎంత చక్కగా అమరిపోయిందో అసలు! ‘పిల్ల సిగ్గు చచ్చినా మల్లెమొగ్గ విచ్చినా..’ రైమింగ్ మాత్రమేనా, ఆ అమ్మాయి విసుగుని ఎంత చక్కగానూ, ముద్దుగానూ చెప్పిందో. ఇక, ‘కలికి పురుషుడు,’ ‘అవతారుడు,’ ‘ముదురు బెండడు’ పూర్తిగా వేటూరి మార్కు పదప్రయోగాలు. చిత్ర చాలా చక్కగా పాడినప్పటికీ, ఈ పాటలో ఎక్స్ ప్రెషన్స్ జానకి గొంతులో అయితే ఇంకెలా పలికి ఉండేవో అనిపిస్తూ ఉంటుంది విన్నప్పుడల్లా. నిజానికి జానకి యాక్టివ్ ఇయర్స్ లోనే ఈ సినిమా వచ్చింది. కానీ, సంగీత దర్శకుడు కీరవాణి జానకి చేత ఏ పాటా పాడించినట్టు లేడు. ఈ పాటలో ఫ్లూట్ ని చాలా బాగా ఉపయోగించారు, అలాగే మొదట్లోనూ, మధ్యలోనూ వచ్చే చిత్ర హమ్మింగ్ కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
‘నెమలికన్ను’ మురళి గారు వ్రాసిన అసలు పోస్ట్ ఈ కింద లింక్ లో చూడవచ్చు
https://nemalikannu.blogspot.com/2020/03/blog-post_16.html
‘నెమలికన్ను’ మురళి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం