“ఉరికే చిలకా” – (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

అనువాదాలు ఎలా చెయ్యాలి అన్నదానికి ప్రతి రచయితకీ తనదైన నియమాలూ, శైలీ ఉంటాయి. వేటూరి అనువాద గీతాలు పరిశీలిస్తే ఆయన పద్ధతి ఇదీ అని స్పష్టంగా తెలుస్తుంది –

సాధ్యమైనంత వరకూ మూలకవి భావాలనే తెలుగులో పలికించడం. తనదైన గొంతు వినిపించాలన్న తాపత్రయం ఆయన అనువాదాల్లో కనిపించదు.
మూలభావం యథాతథంగా ట్యూనులో కుదరక పోతే కొంత అనుసృజించడం.
మూలభావం అస్సలు ట్యూనులో పలికించలేము అనుకున్నప్పుడు మాత్రమే తనదైన సొంత భావాలు రాయడం.
మూలంలో భావం కవితాత్మకంగా ఉంటే తెలుగులోనూ కవిత్వం ఉంచేందుకే ప్రయత్నించడం.
భాష కూడా మూలానికి దగ్గరగా ఉండేటట్టు, లిప్ సింక్ కుదిరేటట్టు చూసుకోవడం.
ఒక్క మాటలో చెప్పాలంటే వేటూరి అనువాదాలు మూలానికి సాధ్యమైనంత దగ్గరగా, మూలకవికి గౌరవమిస్తూ వినమ్రంగా చేశారని చెప్పొచ్చు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే – “అనువాదగీతాన్ని వీలైనంత వరకు మాతృకలోని భావాలకు దగ్గరగా రాయడానికే నేను ప్రయత్నిస్తాను. వీలుకాని సందర్భంలో మాత్రమే ఒరిజినల్ కవి ఆత్మను కచ్చితంగా ఆవిష్కరించలేక పోతాను.” ఈ వ్యాసంలో ఆయన రాసిన “ఉరికే చిలకా” పాటను తీసుకుని ఆయన అనువాద శైలిని పరిశీలిద్దాం!

“ఉరికే చిలకా” పాటని ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది రెహ్మాన్ పాట కావడం, చాలా పాప్యులర్ పాట కావడం, తమిళ సాహిత్యానికి గొప్పగా ప్రశంస ఉండడం ఇలా కొన్ని. ఇలాంటి “గొప్ప పాటలనే” వేటూరి తన అనువాదంలో చెడగొట్టాడు అన్న విమర్శ ఉంది కాబట్టి ఆ విమర్శలో ఎంత నిజం ఉందో పరిశీలించొచ్చు. “ఈ పాట సాహిత్యం నాకు చాలా ఇష్టం!” అన్నవాళ్ళతో పాటూ “ఈ పాట తెలుగులో నాకు అస్సలు నచ్చదు!” అన్నవాళ్ళూ ఉన్నారు. ఈ “మిక్స్డ్ ఒపీనియన్” వల్ల కూడా ఈ పాటని ఎంచుకోవడం జరిగింది.

ఈ పాట గురించి కొందరు సాహితీ మిత్రులతో వేటూరికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూపులో చర్చించడం జరిగింది. ఆ చర్చలో చాలా విమర్శలే బయటకి వచ్చాయి. ఒకే పాటను ప్రతి ఒకరూ ఎంత వేరుగా అర్థం చేసుకుంటారో, ఎంత వేరుగా ఆస్వాదిస్తారో తెలిసొచ్చింది! ఆ మిత్రులందరి విమర్శలనీ స్వీకరించి, “crowd sourcing” చెయ్యడం ద్వారా ఈ విశ్లేషణ రాయడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారెవరంటే –

తమిళ గీతానికి సాధికార అనువాదం చేసిన భాస్కర్ అవినేని
తనూ ఒక అనువాదం చెయ్యడమే కాక ఈ పాటని సమగ్రంగా విశ్లేషించి విమర్శించిన యశ్వంత్ ఆలూరు
చర్చలో పాల్గొన్న కిరణ్ చక్రవర్తుల, విజయసారధి జీడిగుంట, సరోజ నిమ్మగడ్డ
ఈ మిత్రులందరితోనూ చర్చించిన విషయాలపై ఆలోచించి నాకు తోచిన అర్థాన్ని నేనీ వ్యాసంలో వివరిస్తున్నాను. “ఈ పాటకి ఇదే ఆర్థం! ఇంక తిరుగులేదు!” అని నేను అనుకోవట్లేదు. ఇంకా ఈ పాటపై విమర్శలు చేస్తూనే పోవచ్చు, కానీ ఎక్కడో అక్కడ ఆపాలి కదా! కాబట్టి ఈ వ్యాసం నా అవగాహన, నా అన్వయం మాత్రమే! దీనితో మీరు ఖచ్చితంగా విభేదించొచ్చు, ఈ పాటపై మీదైన అభిప్రాయంతోనే మీరు కొనసాగొచ్చు! ఈ పాట గొప్పతనాన్ని చాటడానికో, వేటూరిని ఆకాశానికెత్తడానికో, లోకాన్నంతటినీ కన్విన్స్ చెయ్యడానికో ఈ వ్యాసం రాయబడలేదు. నా ఆస్వాదనని నేను మీతో చెప్పుకుంటున్నాను అంతే! ఇది అందరూ గమనించ ప్రార్థన (ముఖ్యంగా వేటూరి విమర్శకులు!).

పాట నేపథ్యం

సినిమాలో హిందువు అయిన కథానాయకుడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా అతనంటే ఇష్టపడుతుంది. ఒక రోజు అబ్బాయి ఆ అమ్మాయితో “నేను నీ కోసం అన్నీ వదులుకుని వస్తాను, నువ్వు వస్తావా? నేను నీ కోసం ఎదురుచూస్తాను” అని చెప్పి సముద్రం దగ్గర వేచి ఉంటాడు. ఆ అమ్మాయి రాకపోయేసరికి శోకంలో కూరుకుపోయి ఈ పాటని అందుకోవడం, ఈలోపు అమ్మాయి అతని కోసం పరిగెత్తుకుని వచ్చి తనూ పాటందుకోవడం, ఇద్దరూ పాట మధ్యలో ఒకరినొకరు చూసుకోవడం, పాట చివరలో కలవడం జరుగుతుంది.

తమిళ గీత రచయిత వైరముత్తు ఈ పాటను రాశారు. నవాబ్ తమిళ సినిమా ఆడియో లాంచ్ లో ఆయనని “మీరు మణిరత్నంకి వ్రాసిన బెస్టు సాంగ్ ఏది?” అని అడిగితే ఆయన వెంటనే ఈ పాటని చెప్పారని యశ్వంత్ పేర్కొన్నాడు. ఆయనకు అత్యంత తృప్తిని, గర్వాన్నీ ఇచ్చిన పాటిది! మరి ఇంతటి గొప్ప సాహిత్యానికి వేటూరి ఎంత వరకూ న్యాయం చేశారో చూద్దాం!

పాట పల్లవి

వైరముత్తు పల్లవి భావం –

ప్రాణమా ప్రాణమా వచ్చి నాలో కలిసిపో
తలపా తలపా నా మనసులో లీనమైపో
వెన్నెలా వెన్నెలా ఈ గగనంతో మమేకమైపో
ప్రేమ ఉన్నట్టయితే నా కళ్ళల్లో కలిసిపో
కాలం ఆపుతున్నట్టయితే నన్ను ఈ మట్టిలో కలిపిపో

తమిళ పల్లవి అబ్బాయి మనస్థితిని సున్నితమైన భావాలతో కవితాత్మకంగా ఆవిష్కరించి, ఓ భావకవితలా సాగింది. శబ్దపరంగా చూసినా కూడా “కలందువిడు” (mixup) అనే పదాన్ని వేర్వేరు భావాల వ్యక్తీకరణ కోసం వైరముత్తు వాడిన విధానం చాలా బావుందని యశ్వంత్ అన్నాడు. పల్లవి చివరలో అబ్బాయి అమ్మాయిని “ప్రేమ ఉంటే నా కళ్ళల్లో కలిసిపో” అన్న తర్వాత, “కాలం” ఆపితే నన్ను మట్టిలో కలిపిపో అనడం గమనార్హం. “ప్రేమ లేకపోతే” అనలేదు, “కాలం ఆపితే” అన్నాడు. ఎందుకంటే అమ్మాయికీ అబ్బాయి పట్ల ప్రేమ ఉందని సినిమాలో అప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇక ఆ అమ్మాయికి కావలసిందల్లా అన్నీ వదులుకునే ధైర్యం, అబ్బాయి పట్ల నమ్మకం. ఒకవేళ అమ్మాయి సామాజిక ఒత్తిళ్ళకి తలొగ్గి రాకపోతే తాను బ్రతకనని “మట్టిలో కలిపిపో” అనడం ద్వారా అబ్బాయి స్పష్టంగానే చెబుతున్నాడు.

వేటూరి పల్లవి –

ఉరికే చిలకా! వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా! ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుక కళ్ళతో కాటువేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు

తెలుగు పల్లవి తమిళం కన్నా వేరుగా ఉందన్నది స్పష్టం. వేటూరి మొత్తంగా తన సొంత భావాలే రాశారు. ముందు చెప్పినట్టు ఇది తమిళ భావం ట్యూనులో కుదరకే చేసి ఉంటారు. ఇక్కడ అమ్మాయిని “ఉరికే చిలక” గాను, “కురిసే చినుకు” గాను వేటూరి వర్ణించారు. అమ్మాయి వస్తోందో లేదో అబ్బాయికి ఇంకా తెలీదు. ఆమె తన కోసం పరిగెత్తుకుని వస్తూ అయినా ఉండాలి లేదా ప్రేమని చంపుకుని తన నుంచి దూరంగా పారిపోతూ (సింబాలిక్ గా!) ఉండాలి. ఈ రెండు విధాలుగానూ ఆమె “ఉరికే చిలక”. “నువ్వు వస్తున్నా, రాకున్నా నేను నీ కోసం చివరి వరకూ ఎదురు చూస్తూ ఉంటాను” అన్న సూచన ఇక్కడ ఉంది. “నా మనసు నిండా కురిసిన వాన నువ్వు” అన్న అర్థంలో “కురిసే చినుకా, వెల్లువైనావు ఎద వరకు” అనడం బావుంది. తరువాత “రెండు హృదయాల కథలు”, “నిండు విరహాల కబురు” అన్నవి వేటూరి మార్కు ప్రయోగాలు. ఇక్కడ “రెండు హృదయాలు” అంటే తనదీ, ఆ అమ్మాయిదీ. ఇద్దరి మనసుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని అప్పటికే సినిమాలో ఎస్టాబ్లిష్ అయ్యిందని చెప్పుకున్నాం. అయితే అబ్బాయి ఆమె కోసం అన్నీ వదులుకోవడానికి సిద్దంగా ఉన్నాడు, అమ్మాయి ఇంకా సంకోచిస్తోంది. కాబట్టి – “నా మనసులో ప్రేమ నీకు తెలుసు, నీ మనసులోనూ ప్రేముందని నాకు తెలుసు. ఆ ప్రేమ ఏమంటోందో విని, దానిపై నమ్మకం ఉంచి నాతో రా” అన్న అర్థంలో “రెండు హృదయాల కథలూ విను” అన్నారు. ప్రేమ ఉన్న చోట విరహాలూ ఉండి తీరుతాయి. పైగా ఇవి “నిండైన విరహాలు”. ఇంకా బ్రతుకులోకి “ప్రేమ బరువును” మోసుకొచ్చిన విరహాలు! ఆ విరహాల కబురునీ విని ప్రేమని నిస్సందేహంగా తెలుసుకోమంటున్నాడు. వాళ్లిద్దరి ప్రేమా తొలిచూపుతో మొదలైనది. అబ్బాయి తొలిచూపులోనే కాటుక కళ్ళతో కనిపించిన ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక్కడ “కాటు వేశావు” అన్నప్పుడు నిందార్థంలో కాక “నువ్వు నాలో బలంగా నాటుకున్నావు” అన్న అర్థమూ తీసుకోవచ్చు (నింద లేకుండా). అలాంటి స్వచ్ఛమైన మన ప్రేమ కథ ఇక ఇంతటితో ముగిసింది అని నువ్వు అనుకుంటే, ఓ కన్నీటి చుక్క రాల్చి మన ప్రేమకి శ్రద్ధాంజలి ఘటించు అంటున్నాడు (చనిపోయిన వారిని పాతిపెట్టేటప్పుడు వారికి అంజలిగా బంధుమిత్రులు చుట్టూ చేరి మట్టి వెయ్యడం ఇస్లాం, క్రిష్టియానిటీ మొదలైన మతాలలో ఓ సంప్రదాయం). ఆఖరి రెండు లైన్లకీ – “ఎలాగు నీ చూపుతో నన్ను ఇదివరకే చంపేశావు (నిందార్థం). కాలం కూడా నన్ను భౌతికంగా చంపేస్తే వచ్చి మన్నేసి వెళ్ళు” అన్నది యశ్వంత్ చేసిన అన్వయం. నేనూ మొదట ఇలాగే అర్థం చేసుకున్నాను కానీ ఆలోచించిన మీదట ఈ అన్వయం అంత సమంజసంగా లేదనిపిస్తుంది. “కాలం చెల్లింది” అన్న వాడుక వ్యక్తులు చనిపోయినప్పుడు వాడేది కాదు. “ఆయన కాలం చేశారు” అంటారు కానీ “ఆయనకి కాలం చెల్లింది” అనరు. కానీ “మన ప్రేమకు కాలం చెల్లింది” అనొచ్చు. పైగా మొదటి చరణంలో అతను గుండె నిండా బాధున్నా ఎందుకు చనిపోవట్లేదో స్పష్టంగా చెప్తాడు. కాబట్టి పల్లవిలో చనిపోతాను అనడం పొసగదు. ఒకవేళ అబ్బాయి చనిపోయినా అతను హిందువు కనుక కాల్చడం ఆచారం, పాతిపెట్టడం కాదు. కనుక “మన్నేసిపో” అన్నది కుదరదు. ఇంకా ఈ అన్వయం ప్రకారం అబ్బాయి అమ్మాయిని నిందిస్తున్నట్టు అవుతుంది. పల్లవితో సహా మొత్తం పాటలో అబ్బాయి ఎక్కడా ఆ అమ్మాయిని నిందించడు. ప్రాధేయపడతాడు, తనలోని ప్రేమనీ బాధనీ చెప్పుకుంటాడు. కాబట్టి “కాలం చెల్లడం” ఆ అబ్బాయికి కాక, ప్రేమకి అన్వయించడమే సరైనది అవుతుందని నా అభిప్రాయం. ఇది తమిళ పాటకీ, తెలుగు పాటకీ కనిపించే ప్రధానమైన తేడా – తమిళ పాటలో అబ్బాయి నువ్వు రాకుంటే నేను మరణిస్తానని ఖచ్చితంగా చెబుతాడు, తెలుగులో పాటలో ఈ చావు ప్రస్తావన ఉండదు. ఈ తేడాని మొదటి చరణంలో కూడా చూస్తాం!

తెలుగు పల్లవిపై కొన్ని విమర్శలు పరిశీలిద్దాం –

“ఉరికే చిలకా” అన్న ప్రయోగాన్ని చూసి “చిలక ఉరకడం ఏమిటి, ఎగరాలి కానీ?” అని కొందరు విమర్శించారని పైడిపాల గారు రాశారు. దీనికి సినిమా సందర్భం పరంగా తేలిగ్గానే సమాధానం దొరుకుతుంది పైన చెప్పుకున్నట్టు.
ఉరకడం అన్న పదానికి “పరిగెత్తడం” అన్న అర్థమూ కనిపిస్తున్నా “గెంతడం” అన్న అర్థమూ ఉంది. “ఉరకలు పరుగులు” అన్న జంట పదాలలో ఈ అర్థంలోనే వాడారు అనుకుంటాను. కాబట్టి ఉరకడం అంటే పరిగెత్తడం కాదనీ వాదించొచ్చు! నా మటుకు “ఉరికే చిలకా” అన్న ప్రయోగాన్ని ఇంత లాగీ పీకడం అనవసరం అనిపిస్తుంది.
“ఒకే లైనులో చెలి, సఖి అనే పర్యాయపదాలు ఎందుకు వ్రాశారనేది నాకు అర్థంకాలేదు” అని యశ్వంత్ అన్నాడు. “సఖీ చెలీ” అన్నవి జంట పదాలుగా (వీటి అర్థాలు ఒకటే అయినా) చాలా తెలుగు పాటల్లోనే కనిపిస్తాయి. కాబట్టి “చెలివై సఖివై” అనడం లోపమేమీ కాదని నాకనిపించింది.
విరహాలు అని బహువచనం ఎందుకు వాడారో కూడా అర్థంకాలేదు. నిజానికి, అక్కడున్నది ఏకవచన విరహం మాత్రమే.” అనీ యశ్వంత్ అన్నాడు. ఇలా యశ్వంత్ కి ఎందుకు అనిపించిందో కానీ “నాలో విరహం రేగింది”, “నాలో విరహాలు రేగాయి” అన్న ఏకవచన బహువచన రూపాల్లోనూ విరహం వాడబడడం చాలా పాటల్లో చూశాం.
“రెండు హృదయాల కథలు”, “నిండు విరహాల కబురు” – ఈ ప్రయోగాలకి, ఆ లైన్లకీ నేను చేసిన అన్వయం సరిగ్గా లేదనీ, సినిమా సందర్భానికీ సరిపోదనీ కూడా యశ్వంత్ అన్నాడు. పైన నేను వివరించినట్టు నాకైతే ఆ అన్వయం చక్కగానే సరిపోతోంది. మేమిద్దరం అర్థం చేసుకున్న విధానంలో ఏదో తేడా ఉండడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నాను! వేటూరి పాటల అన్వయాల్లో ఇది తరచూ జరిగేదే!
మొత్తంగా చూస్తే తమిళ పల్లవిలో సౌందర్యం దానిలో ఉన్న చక్కని కవితా భావం. తెలుగు పల్లవిలో ఇంకో రకమైన అందం ఉంది – అది సినిమా సందర్భాన్ని చక్కగా పొదగగలగడం.

మొదటి చరణం

వైరముత్తు భావం –

నా శ్వాసవాయువు వచ్చే దిశకేసి చూస్తూ ప్రాణం నిలుపుకని ఉంటాను
పూవంటి మగువ రాకపోతే ఈ కొండమీదే ఆత్మాహుతి చేసుకుంటాను
నా ప్రాణం పోతుందేమో, పోయినా నాకేం దిగుల్లేదు – దానికోసం విలపించట్లేదు
భవిష్యత్తులో అందరూ నీ మీద నింద వేస్తారు, అందుకోసం దుఃఖిస్తున్నాను
ఇది మొదలా, తుదా?
అది నీ చేతిలో పెట్టేశాను.

ఈ చరణం అంతా అబ్బాయిని బతకనివ్వని అతని బాధ చుట్టూ తిరుగుతుంది. మొదటి లైనులో తమిళ భావం కొంచెం ఆలోచిస్తే కానీ అర్థం కాదు. “నేను నువ్వు వస్తావని ఇంకా ఆశతో దారి వైపు చూస్తూ ఉన్నాను. ఈ ఎదురుచూపే నాకు శ్వాసై నా ప్రాణం నిలుపుతోంది” అన్నది కవి భావం. ఇది చాలా చక్కగా ఉంది. తరువాత అబ్బాయి – “పువ్వుంటి మగువా నువ్వు రాకపోతే ఈ కొండమీద నాకు చావే శరణ్యం” అంటాడు. “పూవంటి మగువ అంటే సున్నితమైన అమ్మాయి రాకపోతే ఆ కొండమీద ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు. పూవు – కొండ (సున్నితమైన అమ్మాయి ఒక కొండెక్కిరావడం కష్టం అనే భావంలో) ప్రస్తావన ఒకే లైనులో చేయడంలో హీరో మొండితనం కనిపించింది నాకు” అని యశ్వంత్ మెచ్చుకున్నాడు. తర్వాత ఒక వినూత్నమైన భావం కవి పలికిస్తాడు. “నాకు ప్రాణం పోతుందని బాధ లేదు, కానీ నేను పోతే నా చావుకి నువ్వే కారణమని లోకం నిందిస్తుంది. అదే నా బాధ!” అంటాడు అబ్బాయి. ఈ భావానికి ఇన్స్పిరేషన్ కంబరామాయనంలోని పద్యమేనని వైరముత్తు చాలా సార్లు చెప్పారని భాస్కర్ చెప్పాడు. కంబరామాయణంలోని ఒక పద్యానికి భావం ఇలా ఉంటుంది – “అశోకవనంలో సీత రాముని రాకకోసం చూస్తూ ఉంటుంది. తనకి సన్నిహితంగా ఉన్న ఒకానొక రాక్షస పరిచారికతో ఆమె ఇలా అంటుంది – నా శీలమనే శక్తితో అగ్నిని సృష్టించి లంకాపురిని బూడిద చేసి నన్ను నేను విడిపించుకుని రాముడి దగ్గరకు వెళ్ళిపోగలను. అలా చేస్తే నాకు కీర్తిగానీ, అది రాముడి వీరత్వానికేం గొప్ప? రాముడే వచ్చి తన బలంతో నన్ను చెరవిడిపించుకుని వెళ్తేనే అతని బలపరాక్రమానికి, వింటికీ కీర్తి. నాయంతట నేను విడిపించుకుని వెళ్తే అతనికి అపకీర్తి. చరిత్రలో రామునికటువంటి అపకీర్తి రాకూడదని గమ్మున ఉన్నాను.” చివరి వాక్యంలో అబ్బాయి – “ఇది మొదలో చివరో, అంతా నీ చేతిలో ఉంది!” అన్నప్పుడు అతని భావం “నువ్వు రాకుంటే నేను పోవడం ఖాయమని తెలుసుకో!” అన్నదే ఐతే ఇది అతనిలోని contradiction ని సూచిస్తోందనుకోవాలి. తాను పోతే లోకం అమ్మాయిని నిందిస్తుందన్న బాధున్నా కూడా, బతకలేని అతని నిస్సహాయత అనుకోవాలి. లేకపోతే అతను చావకూడదు అని నిశ్చయించుకుని, “నువ్వు రాకపోతే ఇక అంతా ముగిసినట్టే, నేను బతికినా చచ్చినట్టే” అన్నాడనుకోవాలి.

వేటూరి చరణం –

నీ రాక కోసం తొలిప్రాణమైనా దాచింది నా వలపే
మనసంటి మగువా ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అదికాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే యద కుంగిపోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

పల్లవిలో సొంత భావం రాసినా మొదటి చరణంలో వేటూరి తమిళ భావాన్నే అనుసృజించారు. తమిళ చరణం లోని అందమైన మొదటి లైనులో భావమే తెలుగు అనువాదంలోనూ ఉన్నా అక్కడ ఉన్న “నా శ్వాసవాయువు వచ్చే దిశకేసి చూస్తూ ప్రాణం నిలుపుకని ఉంటాను” అన్న సూచన పొదగడం కుదరలేదు. కానీ వేటూరి కూడా తనదైన ఒక ప్రత్యేకత చూపించారు. “నా తొలిప్రాణం నువ్వు. నా పంచప్రాణాలలో నాలుగు పోగా ఒక్క తొలి ప్రాణమైన నీ మీద ప్రేమ మాత్రం నిలిచి నన్ను సజీవంగా నిలుపుతోంది” అన్నారు. దీంతో తమిళ భావంలో ఉన్న సూచనకు దగ్గరైన ఇంకో సూచన చేశారు వేటూరి. తమిళంలో రెండో లైన్లో “పూవంటి ఓ మగువా, నువ్వు రాకపోతే నేనిక బ్రతకను!” అంటూ అబ్బాయి ఆమె లేకపోతే తాను మరణిస్తానని ఖచ్చితంగా చెబితే, తెలుగులో వేటూరి “ఓ మనసైన మగువా, నువ్వు రాకుండా నాలో చితిమంటలు రేపుతున్నావు” అంటూ వేరుగా చెప్పారు. “నీ వెలితి నన్ను చితిమంటలా దహిస్తోంది” అనడానికి “నువ్వు రాకుంటే ఆత్మహత్య తప్పదు” అనడానికి చాలా తేడా ఉంది! పల్లవిలో చెప్పుకున్నట్టు తెలుగులో అబ్బాయి తనకి ఆత్మహత్య తప్పదని ఎక్కడా చెప్పడు, ఆమె రాకుంటే తనకిక బ్రతుకు లేదు, తాను మరణించినట్టే అని మాత్రమే అంటాడు. తెలుగు భావం తర్వాత లైన్లతో చక్కగా అమరుతుంది కూడా. “నీకై వేచి వేచి, నిలుపుకున్న ఆ ఒక్క ప్రాణమూ పోయి నేను మరణిస్తే అది నాకు చింత కాదు! నేను చనిపోయినా మన ప్రేమ కథ మాసిపోయేది కాదు. కానీ నా చావు నీకు చెడ్డపేరు తెస్తుందేమో అన్న తలపుకే నా మనసు క్రుంగిపోతోంది! (అందుకే నా ప్రాణం పోకూడదు అని కోరుకుంటున్నాను!)” అన్నది తర్వాత తెలుగు లైన్ల భావం. కాబట్టి చివరలో “ఇది మొదలో చివరో నీకే వదిలేస్తున్నాను” అంటూ అమ్మాయికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కూడా “నువ్వు వస్తే నా జీవితంలో పండగ మొదలు, లేకుంటే ఆనందానికి ఆఖరు, జీవచ్చవంలా నేను” అన్న సూచనే ఉంది. తమిళంలో “ఆత్మహత్య చేసుకుంటాను” అంటూ అబ్బాయి చేసే subtle black-mailing తెలుగులో లేదు. ఇలా తెలుగులో అబ్బాయి ఆలోచన/వ్యక్తిత్వం తమిళంలో కన్నా ఉన్నతంగా కనిపిస్తుంది.

ఈ చరణంపై కొన్ని విమర్శలు చూద్దాం –

“మొదలో తుదలో” అన్నప్పుడు ఈ పదాలను “మొద – లోన, తుద – లోన” అని అర్థం చేసుకున్న వారికి “మొద” అన్న పదం తప్పుగా కనిపిస్తుంది. మొదలో అన్నరేంటి “మొదట్లో” అనకుండా అనిపిస్తుంది. ఇది పదాల్లోని విరుపుని అర్థం చేసుకోకపోవడం వలన జరిగేది.
“మొదలో తుదలో” ని “మొదలు + ఓ, తుదలు + ఓ” (అంటే మొదలా, తుదా అని అడగడం) అని సరిగ్గా అర్థం చేసుకున్న వారిలో సూక్ష్మదృష్టి గలవారికి అది “మొదలో తుదో” అనాలి కదా అన్న సందేహం వస్తుంది. “మొదలు” లో “లు” ఉన్నా అది ఏకవచనమే, బహువచనం “మొదళ్లు” అవుతుంది. తుది/తుద అన్న ఏకవచన రూపానికి బహువచన రూపం “తుదలు”. కాబట్టి “మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా” అన్నది వ్యాకరణ పరంగా తప్పవుతుంది. “మొదలో తుదో” లేక “మొదలో చివరో” అన్నది వ్యాకరణపరంగా సరైనది. యశ్వంత్ – “ఇక్కడే నాకు తెలుగు వెర్షన్ పై కాస్త ఏవగింపు మొదలైంది” అన్నాడు! ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి. తుది/తుద లానే “తుదలు” అనే ఏకవచన రూపం కూడా ప్రయోగంలో ఉండి ఉండాలి – “తుదలు” అన్న పదాన్ని ఏకవచన రూపంలో అన్నమయ్య వాడడం కనిపిస్తోంది కానీ నిఘంటువుల్లో ఈ పదం లేదు. “వెదకిన నిదియే వేదార్థము, మొదలు తుదలు హరి మూలము” అన్న అన్నమయ్య పల్లవిలో “మొదలూ తుదా హరిమూలమే!” అంటూ తుదలు ని ఏకవచనంగా ప్రయోగించడం గమనార్హం (మొదలుతుదలు అన్నది ద్వంద్వం అని కొందరు వాదించారు కాని అప్పుడు బహువచన రూపం రావాలి – “మొదలుతుదలు హరిమూలంబులు”). అన్నమయ్య కాక తెలుగు సాహిత్యంలో “తుదలు” కి ఏకవచన ప్రయోగం ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉంటే వేటూరి తప్పుపట్టడానికి ఏమి లేదు. అలా కాక “తుదలు” బహువచనమే, ఏకవచన ప్రయోగం లేదు, అన్నమయ్య కూడా అలా వాడలేదు అని ఎవరైనా నిరూపిస్తే, అప్పుడు వేటూరి తప్పు చేశారనే అనాలి. అందుకు ఆయన్ని మనం విమర్శించొచ్చు. వ్యాకరణ విరుద్ధంగా వేటూరి చేసిన అనేక ప్రయోగాల్లో ఇదీ ఒకటి అనుకోవాలి. కిరణ్ ఈ ప్రయోగాన్ని విమర్శిస్తూ – “మొదలో చివరో అనొచ్చు. కానీ శబ్దాలంకారం ఉండదు. అందుకే శబ్దమనే పళ్ళ మధ్య అర్థమనే పూలని నలిపేస్తారు వేటూరి అని నేనంటూ ఉంటాను!” అన్నాడు. కానీ ఇక్కడ అర్థం సుస్పష్టమే, ప్రయోగమే తప్పు. అర్థాన్ని స్ఫురింపజేస్తే చాలనుకుని, శబ్దాన్ని వ్యాకరణ నియమాలకి విరుద్ధంగా కూడా పాటల్లో ప్రయోగించడం వేటూరికి ఉన్న అలవాటు అన్నది సరైన విమర్శ అని నేననుకుంటాను. వేటూరి తీసుకునే ఈ “చొరవ” ని విమర్శించడం సబబే!
“మొదటి లైనులో తొలిప్రాణం, మూడో లైనులో కడప్రాణం పదాలను గమనిస్తే, రెండో లైనులోని చితిమంటలును మానసికంగా కాక భౌతికంగానే పరిగణించాలి” అని యశ్వంత్ పేర్కొన్నాడు. ఈ పరంగా చూస్తే తమిళంలో లానే తెలుగులోనూ అబ్బాయి “నువ్వు రాకుంటే ఆత్మహత్య తప్పుదు” అని బెదిరిస్తున్నాడనే అన్నాడనుకోవాలి. అందరికీ ముందు తోచే అన్వయం ఇదే అయినా, పైన నేను వివరించినట్టు నా అన్వయం ఇది కాదు. “నువ్వు చితిమంటలు రేపుతున్నావు” అంటే “నువ్వు నన్ను చంపుతున్నావు” అనే, “నేను ఆత్మహత్య చేసుకుంటాను” అని కాదు కదా!

అమ్మాయి పల్లవి:

వైరముత్తు పల్లవి –

ప్రాణమా ప్రాణమా నేడు నీతో కలిసిపోయాను
బంధమా బంధమా నేడు నా ఎల్లలు దాటేశాను
తలపా తలపా నీ మనసులో నిండిపోయాను
కలా కలా నీ కళ్ళలో విలీనమయిపోయాను

వేటూరి పల్లవి –

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకి ఇలకి ఊయలూగింది కంటపడి

అమ్మాయి అబ్బాయిని వెతుక్కుంటూ కోట దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చి అతను కనిపించక నిరాశ చెందుతూ పాడే పల్లవి ఇది. అబ్బాయి పల్లవికి సమాధానంగా వైరముత్తు రాస్తే వేటూరి అదే పాటించారు. మొదటి రెండు వాక్యాల్లో అమ్మాయి – “నేను కలతని విడిచి నీ చెలిగా చెంతకు చేరాను” అంటుంది. తర్వాత – “గతాన్ని విడిచి నా నెలవైన నిన్ను చేరాను” అనడం గమనార్హం. “గతాన్ని విడిచాను” అంటే తన మతాచారాలని, వారిద్దరి మధ్య ఉన్న సాంఘిక దూరాలని, తల్లిదండ్రుల అభ్యంతరాలని ఇవన్నింటినీ దాటి వచ్చాను అని. ఎందుకంటే అతనే, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమే, తన నిజమైన నెలవు అని తెలుసుకుంది కనుక! ఆ అమ్మాయికి అబ్బాయి గురించి పెద్దగా తెలీదు, అతను హిందువు, తనేమో ముస్లిం. అయినా ప్రేమ పుట్టింది! ఈ ప్రేమ కోసం అన్నీ వదులుకుని, ఏమవుతుందో తెలియని భవిష్యత్తు వైపుకి, ఎవరో పూర్తిగా తెలియని అబ్బాయితో వెళ్ళడం ఎంత కష్టం! అందుకే “కలకీ ఇలకీ ఊయలూగాను నీ కళ్ళలో పడి” అంటోంది. ఇక్కడ “కల” ప్రేమ, “ఇల” తానుంటున్న వాస్తవ పరిస్థితులు, “ఊయలూగడం” ఆమెలోని సంఘర్షణ.

ఈ పల్లవిపై కొన్ని విమర్శలు చూద్దాం –

రెండవ, మూడవ లైన్లలో తాను చేరింది చెలుని ఒడి మరియు నిన్ను చేరింది గతము విడి అనడం పునరుక్తి కాదా అని యశ్వంత్ ప్రశ్న. ఎందుకు కాదో పైన చెప్పుకున్నాం. రెండో లైనులో నీ ఒడికి చేరాను అనే అంది. మూడవ లైనులో తన నిశ్చయం చెప్తోంది – తన గతాన్ని దాటేశానని, అతనే నెలవనీ, భవిష్యత్తు అంతా అతనితోనేనని. ఇది పునరుక్తి కాదు.
“కలకీ ఇలకీ ఊయలూగడం” ముందు జరిగి, అబ్బాయిని చేరడం తర్వాత జరిగినప్పుడు, ఆ లైను ఆఖర్న ఎందుకు వచ్చింది అని ఇంకో ప్రశ్న. ఇది పాటల్లో తరచూ జరిగేదే. వాడుకలో కూడా ఇంపాక్ట్ కోసం ఇలాగే అంటాం – ఉదా: “హమ్మయ్య! ఇంటికి చేరాను! బస్ ఎంత రష్ గా ఉందో తెలుసా?” వగైరా!

రెండవ చరణం

వైరముత్తు భావం

ఒక చూపుతోనే ప్రాణం పోసిన పడతి రాకుండ పోతుందా?
ఒక కంటికి కలత వచ్చునపుడు మరో కన్ను నిద్రించగలదా?
నేను నల్ల రాతి బండలెన్నిట్నో చీల్చుకుని వేరులా వచ్చాను – విభుడా నీ ముఖం చూడాలనే
నా కారాగారాలన్నిట్ని తెంచుకుని గాలిలా వచ్చాను సఖుడా నీ గొంతు వినాలనే
అరరే అరరే నేడు కన్నీరూ తియ్యగా ఉందే?

అమ్మాయి అబ్బాయిని వెతుకుతూ, అతన్ని చూసి, అతని దగ్గరకి పరిగెత్తుకుంటూ పాడే లైన్లు ఇవి. మొదటి రెండు లైన్లకీ యశ్వంత్ చేసిన అన్వయం బావుంది –

మొదటి లైనుకి – “ఒక చూపు చూస్తే జీవమిచ్చిన ఆడతనం రాకుండా పోతుందా” అని కూడా అర్థం వస్తుంది. భావానికి వస్తే, అమ్మాయి తనలో ఉన్న సహజమైన స్త్రీ లక్షణం (మనసులోని భావాలను బయటపెట్టలేని తనం)ని గురించి చెప్పడం. రెండో లైనుని గమనిస్తే, దాంతో ఒక పొంతన కూడా కుదురుతుంది. సిగ్గు, జంకు వల్ల భావాలను బయటపెట్టలేకపోవడం అమ్మాయి సహజ లక్షణం. కానీ నువ్వు బాధపడుతుంటే నేను సంతోషంగా ఉండలేను అని వస్తుంది. అంటే, అమ్మాయి తన జంకు వదిలి వచ్చినట్టు. మొదటి చరణం అమ్మాయి తన దగ్గరకి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పిన అబ్బాయికి సమాధానం ఇక్కడ చెబుతోంది అమ్మాయి.

“నల్లరాతి బండలు” దాటుకు రావడాన్ని యశ్వంత్ ఇస్లాం పరంగా అన్వయించాడు, దానిపైన కింద చర్చించాను. నా కారాగారాలన్నిట్ని తెంచుకుని గాలిలా వచ్చాను సఖుడా నీ గొంతు వినాలనే అన్నప్పుడు గాలిలా వచ్చానుకి గొంతు వినడంకి ఉన్న శాస్త్రీయ సంబంధాన్ని కవి అందంగా పొందుపరిచాడు అన్న యశ్వంత్ పరిశీలన బావుంది.

వేటూరి చరణం –

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే!
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లే వచ్చా నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనే కలిసె

రెండో చరణంలో కూడా వేటూరి తమిళ భావాలనే అనుసృజించారు. ప్రేమ తనకీ “తొలిప్రాణం” అని చెప్పడం ద్వారా అబ్బాయి ప్రేమని అంగీకరిస్తున్నట్టు తెలిపింది. పైగా ఈ ప్రేమ “ఒకనాటిది” అంది. అంటే ఇప్పటిది కాదు ఎప్పటిదో! ఈ జన్మది కాదు, ఏ జన్మదో బంధమది! ఒక్క చూపుతో ఈ జన్మలో ముడిపడింది. ఇంతటి గొప్ప ప్రేమ ఎప్పటికీ మాసేది కాదు అంటోంది. అంటే నేను నీతో వచ్చేస్తున్నాను అని చెప్పకనే చెప్పడం. తర్వాత – “నా రాక కోసం ఎదురుచూస్తూ ఎంత శోకంలో ఉన్నావో కదా, నేనూ నిన్ను తలచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాను!” అన్న అర్థంలో చెప్పిన “ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా” అన్న వాక్యం నాకు చాలా నచ్చుతుంది. ఇది “ఒక కన్ను బాధతో మూల్గుతూ ఉంటే ఇంకో కన్ను హాయిగా నిదరోదు కదా” అన్న తమిళ భావమే అయినా తెలుగులోనే ఎక్కువ కవిత్వం ఉందనిపిస్తుంది. ఇలాంటి చోట్లే అనువాద కవిగా వేటూరి గొప్పతనం కనిపిస్తుంది అని నా అభిప్రాయం. ఇలా మొదటి రెండు వాక్యాలతో అబ్బాయి సందేహాలని, కలతని తీర్చి ఊరట కలిగిస్తుంది. తర్వాత రెండు వాక్యాలు అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయి కౌగిలిని జేరుతూ పాడినవి. నేను నీ వేణుగానం విని పురివిప్పి, పరుగెత్తి గాలల్లే వచ్చాను అనడంలో అమ్మాయి మనసులో ప్రస్ఫుటమైన (పురివిప్పి) ప్రేమనూ, ఎంతో ఆత్రంగా, తొందరతో అతనిని చేరడాన్ని చెప్పారు. ఆ అమ్మాయి “పరువాల పరదాలు తొలగించుకుని వచ్చాను” అంటుంది. అంటే యువ ప్రేమికులపై సమాజం పెట్టిన కట్టుబాట్లని దాటుకుని వచ్చానని. దీనిని ముందు ఫ్రేమ్ లో సింబాలికల్ గా దర్శకుడు ముస్లిం యువతి అయిన ఆ అమ్మాయి తన ప్రియుణ్ణి చేరడానికి అడ్డుపడుతున్న బుర్ఖాని తీసిపారెయ్యడం ద్వారా సూచిస్తాడు కూడా. ఇలా “పరువాల పరదాలు” అంటూ ఇస్లామ్ ని “వేణు గానం” అంటూ హిందూయిజం ని వేటూరి సూచించడం గమనార్హం. తర్వాత కవిగా వేటూరిని పట్టిచ్చే ప్రయోగం “కన్నీటి ముడుపు” అన్నది. అంటే “కన్నీరే మూటగా కట్టిన కానుక”. తన కోసం కన్నీరు మున్నీరై రోదిస్తున్న అబ్బాయిని చూసి గుండె ద్రవించిన ఆ కన్నెమనసుకి అతనొక కన్నీటిమూటగా కనిపించి “అయ్యో నిన్నిలా చూడాల్సి వచ్చిందే!” అని బాధపడింది. అతన్ని చూసిన ఆనందం ఒకపక్క, అతని స్థితి చూసి కలిగిన బాధ ఒకపక్క. అందుకే అది “కన్నీరే మూటగా కట్టిన కానుక”. అయితే ఇద్దరూ చూసుకున్నాక, అమ్మాయి అతని కౌగిలిలోకి చేరుకున్నాక, అదే కన్నీటిలో తేనె కలిసి అవి ఆనందభాష్పాలయ్యాయి. ప్రేమకు కన్నీటిని మించిన ఆస్తి ఏముంది?

ఈ చరణంపై యశ్వంత్ చేసిన కొన్ని విమర్శలు –

“ఒకనాటి అని భూతకాల ప్రస్తావన ఎందుకో తెలియదు. ఒకవేళ తొలిప్రాణమైన ఒకనాటి అని కలిపి చూస్తే అమ్మాయి జననం దగ్గరి నుండి ప్రస్తావించుకుంటూ రావాలి. దానికర్థం తల్లిదండ్రులను కాదని రాలేని స్థితిగా తీసుకోవాలి.” – “ఒకనాటి” అంటే “ఎప్పటిదో ఒక రోజుది” అన్న అర్థంలో కాక “ఒకప్పుడు ఎప్పుడో ఉన్నది, ఇప్పుడు లేనిది” అన్న అర్థంలో యశ్వంత్ తీసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది!
“రెండో లైను తమిళంలోనే అందంగా ఉంటుంది. తెలుగులో వాడిన పదాలు ఎందుకో ఎబ్బెట్టుగా అనిపిస్తాయి నాకు.” – నాకు పాట మొత్తంలో బాగా నచ్చే “ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా” అన్న లైనే యశ్వంత్ కి ఎబ్బెట్టుగా అనిపించడం చూస్తే ఇష్టం (taste) అన్నది మనిషికీ మనిషికీ ఎంత మారుతుందో కదా అనిపిస్తుంది! దీనికి ఆర్గ్యుమెంట్ లేదు. ఎవరి ఇష్టాయిష్టాలు వారికి ఉంటాయి, ఉండాలి కూడా!
బొంబాయి సినిమాలో ముఖ్యమైన అంశం హిందూ-ముస్లిం మతాల మధ్యనున్న సంఘర్షణ. దాన్ని ప్రస్తావిస్తూ నేను నల్ల రాతి బండలెన్నిట్నో చీల్చుకుని వేరులా వచ్చాను – విభుడా నీ ముఖం చాడాలనే అనే లైను వ్రాశారు వైరముత్తు. నల్లరాతి బండలు ముస్లిమ్ మతంలో ఆడవారు నల్లటి బురఖాలను గురించి ప్రస్తావిస్తాయి. ఆ మతంలో వాటిలోంచి పరపురుషుడిని చూడడం నిషిద్ధం. అంతటి కట్టుబాట్లను సైతం దాటుకొని తన ప్రియుడి చూడడానికి వచ్చింది అమ్మాయి. మీరు విజువల్ ని గమనిస్తే రెండో చరణం మొదలయ్యే ముందు హీరోయిన్ తన బుర్ఖాను వదిలేసి వస్తుంది. ఇదే ప్రస్తావన వేటూరి నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయనే అంటూ చేశారు. పరువాల పరదాలు అనే ప్రయోగం ఇక్కడ ఏమాత్రం అతకదు. ఎందుకంటే, నల్లరాతి బండలు (మతపరమైన అడ్డంకులు) abstractగా కథను ప్రస్తావిస్తే, పరువాల పరదాలు (అందాన్ని దాచే పరదా) నేరుగా సందర్భంతో సంబంధంలేని physical అంశాన్ని చెబుతుంది (బహుశా ఇస్లాం మతంలో బురఖాను ధరించడానికి కారణం అదే అయ్యుండొచ్చు. కానీ ఎమోషనల్ ప్రస్తావన చేసుంటే బాగుండేది అనిపించింది)” – “పరువాల పరదాలు” అన్నది శృంగార పరమైన ప్రయోగంగా యశ్వంత్ అర్థం చేసుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది. “పరువము” (youth) అన్నప్పుడు అది ఒంపుసొంపుల ప్రస్తావనగా ఇక్కడ అన్వయించుకోవడం ఒప్పదు. పైన చెప్పుకున్నట్టు “పరువాల పరదాలు” అన్నది ఎమోషనల్ ప్రయోగమే! ఇంకో విషయం – “నల్లరాతి బండలు” అన్న తమిళ వాడుక “నల్లటి బురఖాల” గురించే అయితే బురఖాలో ఉన్న స్త్రీలని బండలతో లేదా బురఖాని బండతో పోల్చి చిన్న చూపు చూసినట్టు అవుతుంది. అలా చెయ్యడం ఏ ముస్లిమూ హర్షించరు. కాబట్టి ఇది వైరముత్తు ఇస్లాం సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ చేసిన ప్రయోగం కాదని నాకనిపిస్తుంది. “బండల మధ్య పుట్టిన చిగురు” అన్నది మృతప్రాయమైన సామాజిక అడ్డంకులు దాటుకుని పుట్టిన సజీవమైన ప్రేమకి సంకేతంగానే తీసుకోవాలి!
కన్నీటి ముడుపుకి కూడా సందర్భంతో సంబంధం లేదనిపిస్తుంది. ఎందుకంటే, ఆమె రాక అతడికి, ఆమెకి శోకాన్ని తగ్గించేదే తప్ప పెంచేది కాదు. తెలుగు వెర్షన్ నాకు నచ్చకపోవడానికి ఇది రెండో కారణం – “కన్నీటి ముడుపు” అనడం శోకతప్తమైన ప్రేమికుల ప్రస్తావనే కానీ ఆ శోకం పెరుగుతుంది అన్న సూచన ఏమీ లేదు. పాటలోనే కన్నీళ్ళు తీపిగా మారాయి అంటారు కదా! అలాగే ఆమె రాక వల్ల, ఆమెని చూసి అతను ఇలా అయ్యాడు అనీ అర్థం కాదు. ఆమెని చూడక ముందు అతను పడ్డ శోకం అతన్ని చూసిన వెంటనే ఆమెకి తెలిసి అన్న మాట ఇది. ఒక తల్లి ఎన్నాళ్ళ తరువాతో ఓ బిడ్డని చూసి ఆనందిస్తూ – “ఏంట్రా ఇలా చిక్కిపోయావు?” అని ఓ బాధా పడుతుంది. ఇదీ అలాటిదే!

పాట చివరి పంక్తులు

వైరముత్తు భావం –

అతడు:
ప్రాణమా ప్రాణమా వచ్చి నాలో కలిసిపో
ప్రాణమా ప్రాణమా నన్ను నీలో కలిపేసుకో
ఆమె:
వర్షంలా వర్షంలా వచ్చి మట్టిలో పడిపోయాను
మనసు కోరినట్టు నీ తనువులో ప్రాణమయ్యాను.

వేటూరి వాక్యాలు –

మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది
ఉరికే చిలకే వచ్చి వాలింది కలతవిడి
నెలవే తెలిపె నిన్ను చేరింది గతము విడి

తమిళ పల్లవిలో కుదిరిన పొయిటిక్ స్త్రెంత్ చివర్లో కూడా కనిపిస్తుంది. తెలుగులో అది కుదరలేదు కనుక వేటూరి రెండు వాక్యాల్లో ఈ ప్రేమ కథనీ, సినిమా కథనీ కూడా సమగ్రంగా చెప్తూ పాటకి ముగింపు పలికారు. ఆ రెండు మనసుల్లో విరిసినది గాఢమైన ప్రేమ (మోహం). లోకం అది మైకం అనుకోవచ్చు గాక! వారిద్దరి మధ్య ఉన్న సాంఘిక, మతాచారాల పరమైన దూరాలని చెరిపే తెగువని ఇచ్చినది వారి మధ్య ఏర్పడిన అనుబంధమే, అది తాత్కాలిక వ్యామోహపాశం కాదు.

మొత్తంగా చూస్తే ఒక్క పల్లవీ, చివరలో ఓ రెండు వాక్యాలు తప్ప మిగతా పాటంతా తమిళ గీతానికి అనుసృజనే చేశారు వేటూరి. తమిళ పాటకి అందం కవితాత్మకమైన పల్లవి. తెలుగులో అంత అందమైన పల్లవి కుదరకున్నా వేటూరి చక్కని పల్లవినే రాశారని చెప్పాలి. అనుసృజనలో నాయకుని వ్యక్తిత్వపోషణలోనూ, సినిమా కథని సూచించడంలో తనదైన ప్రతిభనూ వేటూరి చూపారు. అలాగే కొన్ని విమర్శలకు దారితీసే ప్రయోగాలనూ చేశారు. ఈ పాట గొప్ప సాహిత్యం కాకపోవచ్చు, కొన్ని లోపాలు ఉండి ఉండొచ్చు, అందరినీ మెప్పించకపోవచ్చు. కానీ లోతైన ఆలోచనతో రాసిన సాహిత్యమే, ఏదో “కెలికి పడేసిన” పాట కాదు. నాకీ పాట సాహిత్యం (తమిళంలో వైరముత్తు భావాలతో కూడా కలిపి) గొప్పగా ఇష్టం కాకపోయినా బాగానే అనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప అనువాదగీతాలూ వేటూరి ఖాతాలో ఉన్నాయి. తనదైన శైలితో, తనదైన అందంతో, తనవైన లోపాలతో వేటూరి అనువాదాలు చేశారు. ఆయన అనువాదగీతాలు తీసిపారెయ్యదగ్గవేమీ కాదు, వాటిలో మామూలు పాటలతో పాటూ, మహత్తరమైన గీతాలూ ఉన్నాయి అని నాకనిపిస్తుంది. మనసు పెట్టి వింటే ఎన్నో వేటూరి అనువాద గీతాలూ మురిపిస్తాయి. విమర్శల బాణాలు ఎక్కుపెట్టి సంధిస్తూ ఉంటే ఆ వేటలో పాట సౌందర్యం మరుగౌతుంది!

1 thought on ““ఉరికే చిలకా” – (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top