దీపాల పండుగ ..
అలాంటి ఇలాంటిది కాదు గొప్ప దీపాల పండుగ
అక్షరాలకు ఆయువు పోసే దీపాల పండుగ
………………………………..
వేదం లాంటి వాక్యం
వేదమంటి గోదారి లాంటి వాక్యం
ఎవరు రాయగలరు నీతోడు ..
అమ్మ తోడు అయ్యతోడు
………………………………..
రాముడు గొప్పవాడు ఆయనకి ప్రతిగానో ప్రతినిధిగానో
ఈ సుందర రాముడ్ని ఇచ్చాడు
అదిగో చుక్కనడుగు దిక్కునడుగు
……………………………………..
నాటకాల జగతిలో ఒకడిని మించిన ఒకడు పుట్టుకువస్తున్నాడు. కానీ నిన్ను మిం చినవాడు రాడు రాలేడు. అరే బాబూ! ఆ ఆమనికి మరో మారు కబురంపండి. ఆయన స్వరపరిచిన కొమ్మకొమ్మకో సన్నాయిని తిరిగి ఇమ్మని చెప్పండి. చెప్పండ్రా చెప్పండి.. వందేమాతరం గురించి వంగా భూతలం గురించి ఆయన కన్నా గొప్పగా చెప్పేవాడు లేడని. తెలుగు, తమిళం ఎలా జతగట్టాయో చెప్పగల సమర్థు డు లేడని! ఔను! ఏం రాసినా ఆయన గొప్పవాడు. ఏం రాయకున్నా గొప్పవాడు. జన్మ తార గురించి/ఆత్మ నిగ్రహం గురించి/ జపమంత్రం గురించి / శుభయోగం గురించి ఇంకా ఎన్నింటి గురించో ఆయన మాత్రమే చెప్పగలడు.
……………………………………..
సాటి మనిషిని పరమాత్మ అంటాడు
కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి అంటాడు
చిగురాకుల సందడే సన్నాయి అంటాడు
గొప్పవాడు .. ఏం అన్నా చెల్లుతుంది
సూరీడల్లే సూదిగుచ్చే సుప్రభాతం అతడు
మౌన రాగం అతడు.. రాజిల్లు స్వరమితడు
……………………………………..
వేగం ఉన్నచోట వాదం
వాదం ఉన్నచోట గొప్ప పఠిమ
ఇవన్నీ ఎవరికి సొంతం
వరముల చిలక స్వరముల కరముల చిలక కలదానా అన్న ఆయనకా
……………………………………..
రెండు తీరాలు
గోదారి తీరం చెంత ఏం రాసినా చెల్లు
అలానే ఆ నల్లనయ్య గురించి ఆ నల్లని నీళ్లు సాక్షిగా ఏం చెప్పినా చెల్లు
ఆయన సరస్వతి పుంభావ సరస్వతి. వేణువై మనం వేడుకోవాలే కాని
కరిగి కాసిన్ని కీర్తనలు రాసి ఊరడించగలడు
ఏడేడు లోకాలనూ శాసించగలడు. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మ్రోవినీ తాకితే గేయాలు.
……………………………………..
పండిత కుటుంబ నేపథ్యం. మల్లాది వారి సాహచర్యం. ఇవి చాలవు! సినిమా పాటకో కావ్య గౌరవం ఇచ్చిన ఆయన్ని ప్రతిరోజూ స్మరించుకోవాలి.ఆ అద్వైత సిద్ధిని ప్రతిరోజూ పొందగోరాలి. ఆయనొక్కడే! నమ్మిన నా మంత్రాలయం అనగలడు.. ఆయనొక్కడే.. భామాటకి..పామాటకి మధ్య తేడాచెప్పగలడు. ఆధునిక వాగ్గేయ ఝరిని కురిపించగలడు. రాలి పూయే పూల రాగాలను ఏర్చి కూర్చి పాటగా మలచగల సమర్థుడు. ఈ గురు పూజోత్సవ వేళ ఆయనను తల్చుకోవడం ఓ మహత్ భాగ్యం అని భావి స్తూ..
————————————————————-
రత్నకిశోర్ శంభుమహంతి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం