వెలుగులిచ్చే కిరణం నిట్టనిలువున చీల్చుకువస్తున్న తరుణం..మమత నిండిన మనసు ప్రేమ పంచిన వైనం..ఆయన గీతంతోనే సొంతం.ఒక గీతం తెలియని ఆవేదన.. ఒక గీతం తెలుసుకున్న వేదన.. వ్యక్తీకరించి.. ఊగించి.. తూగించి..శాసించేసింది.ఒక గీతం కమ్మని కవిత్వం.. ఒక గీతం నును వెచ్చని సమీరం.. వెరసి వేటూరి సాహిత్యం.తెలుగు – తమిళ సంస్కృతుల సమ్మిళితం ఒక గీతం.జీవన వేదం.జీవిత సారం.. ఆ గీతం.. అందుకే సుందరరాముడు గొప్పవాడయ్యాడు.. అందుకనే అయ్యాడు ఆ..రాముడు మహనీయుడు.
ఔను! సౌందర్య సహిత వాక్యం.. ఆలోచనాత్మక ప్రవాహం..తులనాత్మక అధ్యయనం వెరసి వేటూరి గీతం.పాటొక్కటే.. రసాత్మక భావాలెన్నో.. పాటొక్కటే..కదిలించే అభివ్యక్తులెన్నో.. పాటొక్కటే.. భావాత్మక.. రసాత్మక అనుభవాలెన్నో.. అందుకే అది ఒక కల్పన.. అది నా కల్పన అని ప్రకటించుకున్నాడు.ఒక ఉదయంలో.. ఒక హృదయంలో వేచి ఉన్నాడు. కొలువు న్నాడు, వరమిచ్చాడు, వెలుగులీనాడు, కాంతి పంచాడు, కరుణ పెంచాడు, సినీ వ్యాలీలో వెలుగు వేకువ తీసుకువచ్చాడు, చీకటి వాంగ్మయం లేదన్నాడిక్కడ.
ఆయన రాస్తే పాటకో..గౌరవం.. అనుపమానం.. ఆ.. గైర్వాణి స్వరం..ఆ.. జ్ఞాన పీఠం.. ప్రాతఃస్మరణం.మళ్లీ చెబుతున్నా వింటే తెలియని ఆవేదన.. లేదు ఆయనే అన్నట్లు తెలుసుకున్నవేదన.ఆయనే అన్నట్లు సూరీడల్లే సూది గుచ్చేసుప్రభాతమది.ఊసులాడే జాబిలమ్మది.ఎవరు నేర్పారు ఈ నడక.. ఎక్కడిదీ ఏటికొప్పాక.. ఆ.. నడక.. అరవిచ్చేటి అభేరి రాగం ఎలా అయ్యిందని.. ప్రియ జనులారా! ఇమ్మనరే ఈ లాలికి స్వరమూ.. ఇహమూ..పరమూ..
వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా…
ఔను! భాష పలుకును పలు విధమ్ముల.. ఔను! భాష ఇచ్చోటే పలుకును పలు రిధమ్ముల..ఔను! కొమ్మల తాకిన ఆమనికే కోయిల పుట్టును.. తుంబుర నాదానికే స్వరాలు వర్షించును.పదాలిచట మోకరిల్లును. ఔను! ఇచటే నమ్మిన ప్రతి మదీ మంత్రాలయమే! ఇది కల్పన కాదు వాస్తవం. ప్రభువుని..విభువునినమ్ముకున్నవారికి.. నమ్మకమే జీవితం అనుకు న్నవారికి..మళ్లీ ఏమన్నాడు.. నమ్మనివారికి ఇది తాపత్రయమే! ఇంతకు మించి భావ / భౌతిక వాద సంవాదాలను వేరెవ్వరు సమన్వయం చేయగలరు? పాటకో మకుటం.. పద్యమల్లే.. మళ్లీ వినండి నమ్మిన నా మది మంత్రాలయమే పాటను.. ఆ మకుటాన్ని ఒక్కసారి నాతో పాటు స్మరించుకోండి. ఏమన్నాడు.. తుంగా జలాల సేవ.. తులసీ దళాల పూజ అందుకో.. అని.. రాఘవేంద్రుడు ఎచట ఉంటాడు తుంగ భద్రాద్రి చెంత అందుకే తుంగా జలాల సేవ అన్నాడు..వెనువెంటే..తులసీ దళాల పూజ..అన్నాడు.. ఔను! పవిత్ర దళ ప్రియుడు ఆ..దళపతి అందుకే అలా అన్నాడు. ఎంత గొప్ప మకుటం. ఎంత గొప్ప అనుభవం. నమామి వేటూరి, స్మరామి వేటూరి అంటే ఇదే! కచ్ఛితంగా ఇదే!
నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
నీ భజనే మా బ్రతుకైపోనీవా
పదాల వాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
ఒక్కసారి ఈ వాక్యాలు చదివి మీలో ఉన్న దురాశకో / మీలో ఉన్న పటు నిరాశకో దూరం జరిగి మరొక్క మారు తెలుగు జాతీయ కవి వేటూరి అని సగర్వంగా చాటండి. ఆయనే అన్నట్లు.. మిగిలిన కథలో.. పగిలిన ఎదలో.. కవితలెందుకని మీకు మీరే ప్రశ్నించుకుని మనసు తేలిక చేసుకుని.. ఆ..ఉదయానికీ.. ఉషస్సుకీ..ప్రణమిల్లండి. ఇప్పుడంటే రెండు తెలుగు రాష్ట్రాలు. అప్పుడో తెలుగు – తమిళం మిళితమైన సంస్కృతికి ఆనవాళ్లు మనవారి ప్రతిభావ్యుత్పత్తులు, శౌర్య ప్రపత్తులు. అందుకే ఆయన రాశారు..
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో..
కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో..
తెలుగూ..తమిళం జతకట్టేనేన్నడో మీనాక్షి
మనసూ..మనసూ..ఒకటైన జంటకీ నీ సాక్షి అని..
మళ్లీ అనండి ఆయన సాహిత్యం మకుటాయమానమని.. ఆయన పదం అజరామరమని.. సుందరరామా! నీకు నమస్సు.ఏం చేసినా జీవితమనే నది జీవంతం కావాలన్నదే కవి గారి ఆశ. ఏం చేసినా తెలుగు తేజస్సు శోభిల్లాలన్నదే కవి గారి ఆశ. ఏం ప్రశ్నించినా మనసు – మమత ఒక్కటై సాగిపోవాలన్నదే ఆయన అభిలాష. అందుకే ఇలా అంటారు.. కాదు ఇలా.. ఒదిగిపోతారు.. కాదు ఇచ్చోటనే మన మనసు వాకిట ఎదిగివస్తారు.. త్వమేవాహమ్ అంటారు, అహం విడువమని బోధిస్తారు. ఎలా అంటే? ఇదిగిదిగో ఇలా..
“తార..తారకీ నడుమ ఆకాశం ఎందుకో.. /పాట..పాటకి నడుమ ఆవేశం ఎందుకో..మనిషి..మనిషికీ మధ్య మనసనేది ఎందుకో.. /మనసే..గుడిగా..మనిషికి ముడిగా..
మమత ఎందుకో..మమత ఎందుకో..”
ఇంతకుమించి మనసును మమతతో ముడివేసేదెవ్వడని? మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నోత్తరం సంధించేదెవ్వడని? అందుకే.. సుందర రామ చరితం.. అనంతం..అమేయం.. రాయినైనా కాకపోతిని అని చింతించే కన్నా.. ఆ..పాటల పల్లకికి బోయిలైపోదాం.అందుకనే ఈవేళ ఇలా ప్రార్థిద్దాం ఈ స్వరం వేయి వసంతాల.. నందనవనాల వర్థిల్లమని..నమామి వేటూరి.. స్మరామి వేటూరి..గురువర్యా! నీవే అన్నట్లు..గుర్తు.. వెలుగు చూపరా.. వెతలు తీర్చరా..! సదా! నీ జ్ఞాపకాల వాకిట ..
‘రత్నకిశోర్ శంభుమహంతి’ గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీమ్