గోదావరి పొంగింది – వేటూరి

gOdaari pongindi movie songs3

 

గోదావరి పొంగింది, ఈ చిత్రం 15-08-1991 తేదీన విడుదలైంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ గోపాల్ రాజ్ ఫిలింస్. దర్శక నిర్మాత సీగంపట్టి రాజగోపాల్, సంగీతం కె.వి.మహదేవన్, నటీనటులు విమల్‌రాజ్ (భవాని బాబు), ఉష, వందన, ఒరివెళ్ళ కృష్ణారావు. ఈ చిత్రంలో 8 పాటలున్నాయ్, అన్నీ వేటూరి గారే రాసారు. పాటల భావాలు గోదావరి ఔన్నత్యాలకు కలిపి రాసారు. ప్రతీ పాటలోనూ గోదావరి అన్న పదం ఉంటుంది, సినిమాలో ప్రతి పాటలో గోదావరి కనిపిస్తుంటుంది, గోదావరిపై ఆయనకున్న మక్కువ అన్ని పాటల్లోనూ తెలుస్తుంది.

 

 

 

  1. ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది, ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తోంది – సుశీల గారు పాడిన ఈ పాటకు ఆవిడకు 1989 లో నంది అవార్డు వచ్చింది.
  2. పుష్కరాలు వస్తాయి గోదావరికి, పులకింతలొచ్చాయి అమ్మాయికి – వాణీజయరాం పాడిన ఈ పాటలో యుక్త వయస్సు వచ్చిన అమ్మాయి భావాలన్నీ గోదావరికి ముడిపెట్టి రాసారు. వాణీజయరాం పాడిన తెలుగు పాటల్లో ఒక హిట్ సాంగ్ గా ఈ పాట పేరొందింది.
  3. చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది – ఈ పాటను బాలు ఆలపించారు, గోదావరి పుట్టుకని తనదైన శైలిలో వర్ణించారు వేటూరి. తెలుగులో మనకున్న వేల పాటల్లో గోదావరి పుట్టుపూర్వోత్తరాలు పాటగా వ్రాసింది వేటూరి ఒక్కరే. ఈ పాట టైటిల్స్ లో బేక్‌గ్రౌండ్ సాంగ్ గా వస్తుంది.
  4. ఒక గాంధీ,ఒక జీసస్,ఒక గౌతమబుద్ధుడు కులంలేని మానవుల మతంలేని మహాత్ములు – కులాంతర వివాహాలకు ఒక సందేశంగా ఈ పాటను రాసారు, బాలూ ఆవేశంగా ఈ పాటను ఆలపించారు.
  5. గోదారొడ్డున మామిడితోట పెళ్ళికి విడిదంట, కోనసీమ కోకిల పాట సన్నాయేనంట – ఈ పాటను బాలు,సుశీల ఆలపించారు.కోనసీమ పెళ్ళిళ్ళను గుర్తుచేస్తూ పెళ్ళిని వివరిస్తూ వ్రాసిన ఈ పాటమధ్యలో ‘సత్యం శివం సుందరం-నిత్యం మనం ఒక్కరం’ అనే పదాలు, అల్లుడి కాళ్ళు కడిగింది అత్తగా తల్లి గోదారమ్మ ‘ అన్న పదాలు ఆయన రచనా పఠిమకు నిదర్శనాలు

6.పడమటింట దీపం పెట్టి పాపికొండలా పావడగట్టి గోదారి ఏమన్నదీ – ఈ పాట బాలు సుశీల ఆలపించారు,ఈ పాటలో ‘గోదారి ఏమన్నది ‘ అన్న పదం 10సార్లు ఉంటుంది. హీరో హీరోయిన్లు చమత్కారంగా ఒకరినొకరు గోదారిని సాక్ష్యంగా ఉంచేలా ఈ పదాలు కూర్చి రాసారు వేటూరి. గుర్తింపు లభించని వేటూరి గీతాలలో ఒక చక్కటి ఆణిముత్యం ఈ పాట. ఈ పాటకు మహదేవన్ తనదైన శైలిలో ఫాస్ట్ బీట్ అందించారు. ఈ పాటలు వినే శ్రోత మహదేవన్ సంగీతానికి కాళ్ళు గానీ చేతులు కానీ లయబధ్దంగా స్పందించకపోతే ‘చెవిటాయన పెళ్ళికి నత్తాయన గాన కచేరీ’ చేస్తుండగా విన్నట్టు పాటను ఏదోలా వినేయడమే అవుతుంది.

  1. పాడిపంట చల్లంగుండాలి (బుర్రకధ) – ఈ బుర్రకధను ముమ్మిడివరం విజయలక్ష్మి బృందం పాడారు.
  2. ఎర్రని బొమ్మా ఎవరమ్మా – ఈ పాటను బి.వసంత పాడారు.

కులమతాల నేపధ్యంలో జరిగే ప్రేమకధ ఆ రోజుల్లో సరిగ్గా ప్రేక్షకాదరణకు పొందలేదు. 2 రోజులే ఈ చిత్రం ఆడింది, అందుకే మంచి పాటలున్నా శ్రోతల ఆదరణకు నోచుకోలేదు, పైగా ఈ చిత్రం లోని పాటలు 1985 లో గ్రామ్‌ఫోన్ రికార్డులుగా విడుదలయ్యాయి. చిత్రం 1991 లో విడుదలయింది, కానీ సుశీలకి 1989 లో నంది అవార్డు ఇచ్చారు. వేటూరి ప్రతిభకు అవార్డు రాకపోడం ఆరోజుల్లో చర్చనీయాంశమైంది. తెరమరుగైన ఈ చిత్రంలోని ఆణిముత్యాల్లాంటి పాటలు వింటేనేగాని విషయం అర్ధం కాదు. 1985 లో ఈ చిత్రంలోని పాటలను రెండు గ్రామ్ ఫోన్ రికార్డ్ ప్లేట్లు గానూ, ఒక ఎల్.పి రికార్డ్ ప్లేటు గానూ, 1991 లో ఎ.వి.ఎం ఆడియో కంపెనీ ఆడియో కేసెట్ గానూ విడుదల చేసాయి. అయితే ఎల్.పి రికార్డు నించి సేకరించిన పాటలని వినండి, ఎందుకంటే ఆ రోజుల్లో ‘ప్రతీకారం’ (శోభన్‌బాబు) చిత్రంలోని పాటల రికార్డింగ్ ను  చక్రవర్తి డిజిటలైజ్ చెయ్యడం మొదలుపెట్టి జస్టిస్ చౌదరి చిత్రంతో మ్యూజిక్ రెండు చానల్ లో డివైడ్ అవ్వగలిగేలా చేసారు. గోదావరి పొంగింది చిత్రంలోని పాటలను మహదేవన్ మొదటిసారి డిజిటలైజ్ మొదలుపెట్టి నారి నారి మురారి చిత్రంతో రెండు చానల్ లో డివైడ్ అయ్యేలా చేసి విజయం సాధించారు. గోదావరి పొంగింది చిత్రాన్ని డిజిటలైజ్ చేసిన ఎల్.పి ని తర్వాత విడుదల చేసారు. చాలామందికి ఈ విషయం తెలియదు, రెండు ఇ.పి లకే పెద్దగా ప్రాచుర్యం లేకపోడంతో తర్వాత ఎల్.పి ని ఎవరూ సేకరించలేదు.

ఫ్రెండ్స్, పాట వినడం ఒక కళ, అందుకే మంచి క్వాలిటితో ఉన్న ఆ పాటలను సేకరించి వినండి. ఈ చిత్ర నిర్మాత దర్శకుడు సీగంపట్టి రాజగోపాల్ ఈ చిత్రానికి పబ్లిసిటీకి ప్రత్యేకంగా గోదావరిమాత ఆర్టును అద్భుతంగా గీయించారు.

ఈ చిత్రనటుడు భవానీబాబు తదుపరి నిర్మాతగా మారి 2011 లో వారి అబ్బాయితో తమిళంలో సినిమాలు తియ్యడం మొదలుపెట్టారు.గోదావరి పొంగింది చిత్రంలోని పాటను సంగీత దర్శకుడు కోటి తో రీ-రికార్డింగ్ చేయించి ఒక సినిమాలో వాడుకున్నారు.

తెరమరుగైన కొన్ని మంచి విషయాలను మీతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ విశేషాలు మీకోసం.

ఇట్లు – గోలి సాయిబాబు

ఈ సినిమాలోని పాటలు కింద ఆడియో(యూట్యూబ్)లో వినవచ్చు.

————————————————————————-

గోలి సాయిబాబు గారికి, వేటూరి రవిప్రకాష్ గారికీ ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top