“అమావాస్య చంద్రుడు” చిత్రానికి ఇళయరాజా అద్భుతంగా స్వరపరిచిన “సుందరమో సుమధురమో” అనే సుమధుర గీతానికి సుందరమైన పద భావాలను పొదిగిన కవి వేటూరి “సుందర” రామ్మూర్తి. ఈ చిత్ర కథ ఉదాత్తమైనది. స్వతంత్రంగా జీవించే ఒక అంధ వయలనిస్ట్ (కమల్ హాసన్), అతని మనసులోని వెలుగును దర్శించి అతన్ని అభిమానించిన చిత్రకారిణి అయిన ఓ అమ్మాయి (మాధవి), వీరిద్దరి అపురూప ప్రణయం ఈ చిత్రం. ఆ అమ్మాయి అతనికి తన ప్రేమని వెల్లడించిన తరువాత, ఆ ఇద్దరూ ప్రేమికులై గడుపుతున్న ఘడియలని దృశ్యంలో చూపిస్తున్నప్పుడు వచ్చే నేపథ్య గీతం ఈ పాట.
ఈ పాటకి సాకీలో “బ్లైండ్ స్కూల్” పిల్లలు పాడే గీతం వస్తుంది. దర్శకుడు సింగీతం – “అంధబాలలు తమ స్కూల్లో రోజూ పాడే పాట, వారు తమ వైకల్యానికి కుంగిపోకుండా తమ జీవితంలో పలికించుకున్న సంగీతమే ఈ గీతం” అని చెప్పి ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ వినిపించారుట. వేటూరి ట్యూన్ విని వాళ్ళున్న గది కిటీకీ దగ్గరకి వెళ్ళి బయటకి చూస్తూ పాట గురించి ఆలోచించారుట. ఓ ఐదు నిమిషాలు తరువాత “రాసుకోండి” అన్నారుట! “అప్పుడే చెప్పేస్తారా!” అని అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతూ వేటూరి చెప్పగా రాసుకున్న సాకీ ఇది –
సాకీ:
సరిగమపదని సప్తస్వరాలు మీకు!
అవి ఏడు రంగుల ఇంధ్రధనుస్సులు మాకు!!
మనసే ఒక మార్గము
మమతే ఒక దీపము
ఆ వెలుగే మాకు దైవము
“మీకు (కళ్ళున్న వాళ్ళకి) సంగీతమంటే మధురంగా వినిపించే సప్తస్వరాల విన్యాసం మాత్రమే! మాకు సంగీతం అంటే మా అంధకారంలో మెరిసే ఏడు రంగుల ఇంద్రధనుస్సు! మా వెలుగురేఖ! మా జీవితం! ఆ సంగీతం తోడుగా, మా మనసే మార్గంగా, ప్రేమే దీపంగా, ఆ దీపపు కాంతులలోనే దైవాన్ని దర్శిస్తూ సాగే జీవనం మాది!” అయిదే నిమిషాల్లో ఇంత అద్భుతమైన భావాన్ని ట్యూన్‌లో పలికించిన జీనియస్ వేటూరి! మొదటి రెండు లైన్లలోని భావానికి స్తంభీభూతుణ్ణి అయ్యానని చెప్పుకున్నారు సింగీతం!
సాకీ తర్వాత వచ్చే పాటలో ఆ ఇద్దరి ప్రేమికుల ప్రణయాన్ని అందమైన పదాల్లో వర్ణించారు వేటూరి. ఈ పాట పల్లవికీ ఒక కథ ఉంది (ఆ కథని వేటూరి మాటల్లో ఇక్కడ చదవొచ్చు). ఇళయరాజాతో ఇదే వేటూరికి మొదటి పరిచయం. ఇళయరాజా వేటూరిని ఏదో విసుక్కోవడంతో పాటల సిట్టింగ్ అపశ్రుతితో మొదలైంది! వేటూరి లేచి వెళ్ళిపోబోయారుట. వేటూరికి సింగీతం మొదలైన వాళ్ళు సర్ది చెప్పారుట. ఇళయరాజా కూడా “సారీ” చెప్పి ట్యూన్ వినిపించాట్ట. ఆ ట్యూన్ మాధుర్యానికి వేటూరి ఉప్పొంగి, ముందు జరిగిన గొడవని ఇట్టే మరిచిపోయారు! ఇంతలో వేటూరికి ఇళయరాజా “తమిళ రచయిత (వైరముత్తు) ఇలా ట్యూన్ ఇస్తే అలా పాట రాయడం అయిపోయింది. తెలుగు పాటకి ఎంత టైం పడుతుందో ఏమో!” అనడం గుర్తొచ్చింది! వేటూరి ఏం తక్కువ! వెంటనే “రాసుకోండి” అని ఆశువుగా పల్లవి చెప్పారు వేటూరి. “అప్పుడేనా!” అని ఇళయరాజా ఆశ్చర్యపోతూ, ట్యూన్‌లో సాహిత్యాన్ని పాడి చూసి, ట్యూన్‌కి పదాలు అద్భుతంగా కుదరడంతో ఉప్పొంగి “ఆహా! అద్భుతం! ఎంత అందమైన తెలుగో!” అని మెచ్చుకున్నారుట (ఈ పాటని అర్థం పట్టించుకోకుండా శబ్ద సౌందర్యాన్నీ, ట్యూన్‌నీ ఆస్వాదిస్తూ విని చూడండి. వేటూరి స్వర-పద మైత్రిని ఎంత గొప్పగా సాధించారో అర్థమౌతుంది. ఇళయరాజా పొంగిపోవడంలో ఆశ్చర్యం లేదు!). విసుక్కున్న వాళ్ళ చేతే వీరతాళ్ళు వేయించుకోవడం వేటూరి ఘనత!
పల్లవి:
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో
ఈ ప్రణయం అందమైనది (సుందరం), తీయనైనది (సుమధురం), చల్లనిది (శీతలం). ఇక్కడ వేటూరి “చందురుడందిన చందన శీతలం” అన్నారు. ఇది “చందురుడలదిన చందన శీతలం” (చందమామ పూసిన చందనం యొక్క చల్లదనం) కావొచ్చని కొందరి భావన. నా దృష్టిలో వేటూరి భావం – “చంద్రుణ్ణి పొందగా కలిగిన చందనపు చల్లదనం” అని. అంత చల్లనిదీ, చల్లని మనసులదీ ఈ ప్రేమ అనడం. ఈ ప్రణయం అపురూపమైనది కనుక దాన్ని చందమామని పొందడంతో పోల్చడం. నాయకుడు గుడ్డివాడు కనుక చందమామని చూడలేడు. అందుకే చందమామే ప్రేయసి రూపంలో చల్లగా దిగివచ్చింది అని కూడా సినిమా కథ పరంగా అనుకోవచ్చు.
ఇంకా ఈ ప్రేమ ఎలా ఉందంటే చందన వృక్షాల (మలయజ) నుంచి వీస్తున్న గాలి (మారుత) తుంపరలా (శీకరము) హాయిగా ఉందట. మన్మధుడు (మనసిజ) వేసిన అనురాగ బంధం (రాగ వశీకరం) ఇది! ప్రణయానుబంధాలతో శృంగార భావాలతో అల్లుకునే ఆ గాఢానుభూతి వశీకరణం కాక మరేమిటి?
చరణం 1:
ఆనందాలే భోగాలైతే, హంసానందీ రాగాలైతే
నవవసంత గానాలేవో సాగేనులే
సురవీణా నాదాలెన్నో మోగేనులే
ఆనందాలు భోగాలు అవ్వడం ఏమిటి? ఆ ప్రేమికులు ఆనందం అనే భోగంలో ఉన్నారనడం! The pleasure of happiness! చక్కని ప్రయోగమిది. రెండు కాంట్రాస్టింగ్ పదాలని తీసుకుని ఒక సరికొత్త భావాన్ని, అందమైన ఎక్స్ప్రెషన్‌ని వేటూరి సాధించారు.
ఆనందమే భోగమై, హంసానందీ రాగమైంది అని ఎందుకు అనాలి? ఈ పాట హంసానందీ రాగంలో ఉందా? కాదు, వసంత రాగంలో ఉందని ఈ వ్యాసం ద్వారా తెలుస్తోంది (సాగర సంగమం చిత్రంలోని “వేదం అణువణువున నాదం” పాట హంసానందీ రాగం, వేటూరి ఆ పాట సాహిత్యంలో ఆ రాగాన్ని ప్రస్తావించారు కూడా). మరి ఎందుకు వాడినట్టు? హంసానందీ రాగ లక్షణాన్ని ఈ ప్రేమికుల అనుభూతికి అన్వయిస్తున్నట్టు తోస్తోంది. అయితే హంసానందీ రాగ లక్షణం ఏమిటి? నెట్ లో వెతికి చదివితే (ఈ వ్యాసం చూడండి) ఈ రాగం గురించి కొంత సమాచారం దొరికింది –
Hamsanandi is a raga that instantly sets off a meditative and intense mood. This raga gives rise to the emotion of yearning and fervent appeal!
హంసానందీ హృదయపు లోతులను చూపెట్టే రాగం. అందుకే శోకం బాగా పలుకుతుంది, అయితే ఈ రాగం శోకానికే పరిమితం కాదు. ఈ ప్రేమికుల ఆనందం కేవలం ప్రణయపు తొలిరోజుల్లో ఉండే మోహావేశం కాదనీ, వారి ప్రేమ నిజమైనదనీ, లోతైనదనీ చెప్పడానికీ, వారి ప్రణయభావ తీవ్రతని సూచించడానికీ వేటూరి వారి ఆనందానికి హంసానందీ రాగపరిమళాలు అద్దినట్టు అనుకోవాలి. సంగీతం తెలిసిన వాళ్ళు ఇంకా వివరిస్తే బావుంటుంది.
ఇలా హంసానందీ ఆనంద ఆలాపనల్లో ఆ ప్రేమికుల మానసాలు ఉప్పొంగుతుంటే రోజులన్నీ నవవసంత రాగాలతో, సురవీణా నాదాలతో నిండినట్టు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో
మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలో!
లోకం మునుపు లేని కొత్త అందాలు సంతరించుకోవడం, కాలం ఎన్నడూ వినని రహస్యాలని చెవుల్లో గుసగుసలాడం వంటి అందమైన అనుభూతులన్నీ ప్రేమలో పడ్డవాళ్ళందరికీ అనుభవమే కదా! ఆ తీయని అనుభూతినే వేటూరి ఇక్కడ వర్ణిస్తున్నారు. “వేకువలో వెన్నెలలో” అనడంలో వేకువనీ వెన్నెలనీ విడివిడిగా ప్రస్తావించడంతో పాటూ, వేకువ నుంచి వెన్నెల వరకూ (రోజంతా) అన్న సూచనా ఉంది. “చుక్కలు చూడని కోనలు” అంటే “ఏ చుక్కలూ చూడలేని ఆ ప్రేమికుల హృదయపు కోనలు” అనీ కావొచ్చు, “లోకానికి అందకుండా వలపు కౌగిళ్ళ పొదరిళ్ళలో దాగిన ప్రేమికులూ” కావొచ్చు. ambiguity (బహుళార్థకత్వం) అనే కవితా ప్రక్రియని అత్యంత విరివిగా, సమర్థవంతంగా వాడుకున్న కవి వేటూరి (ఇది అస్పష్టత కాదు! కవి ఇస్మాయిల్ గారు ambiguity గురించి గొప్పగా వివరించారు. ఈ వ్యాసం చూడండి). అందుకే వేటూరి పాటలు ఎవరి అనుభవాలని బట్టి వారికి వారి వారి సొంతమైన అర్థంలో వినిపిస్తాయి! అదో సొగసు!
ఇలా వేకువలోనూ, వెన్నెలలోనూ, చుక్కలు చూడని కోనలలోనూ “వేణు గీతికలు” వినిపిస్తున్నాయట (“గీతకలో” అంటే “ఎన్ని గీతికలో కదా” అన్న అర్థంలో వాడారు. గీతిక-లో అని అసంపూర్తిగా వదిలెయ్యడం కాదు). పైగా ఆ గీతికలు కోయిల ఊదిన వేణువు నుంచి వచ్చినవట! ఆ ప్రేమికుల మనసే కదా ఈ కోయిల! పైగా ఆ కోయిల మావిడి కొమ్మలలో హాయిగా ఊగుతూ ఉన్నదట. ఎంత అందమైన పదచిత్రం! అత్యంత మధురమైన ప్రేమ భావాన్ని ఇంతకన్నా లలితంగా చెప్పడం సాధ్యం కాదేమో!
చరణం 2:
అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే
కౌగిట్లో సంగమమేదో సాగేనులే
ఇక్కడ “అందం” అంటే బాహ్యమైన అందం మాత్రమే కాదు. మనసుల్లో పురివిప్పే స్వచ్చమైన ప్రేమకి ఉండే అందం అది. “అందాలు అన్నీ” అనడంలో అలాంటి ప్రేమ కలిగినప్పుడు మనసంతా, తనువంతా, లోకమంతా పరుచుకున్న అందాలు అని. అలాగే “బంధాలు అన్నీ” అంటే కౌగిళ్ళలో ఒదిగే బంధమూ, గాఢమైన హృదయానుబంధమే కాక ఆ బంధంలో ఉండే అన్ని అనుభూతులూ – నవ్వులూ, కన్నీళ్ళూ, కోపాలూ, తాపాలూ అన్నీ!
ఇలా బంధాలన్నీ అందంగా పెనవేసుకున్న వేళల్లో, ఒకరిని చూసి ఒకరు కరిగే ప్రణయంలో, వారి కళ్ళల్లో తిరిగే కంటినీటి తడి ఏదైతే ఉందో అది గంగా యమునలు అంత పవిత్రమైనదే అవుతుంది. వారి కౌగిలి హృదయ సంగమమై, ఆ కౌగిలిలో ప్రణయసాగర సంగమమే సాగుతుంది! శృంగార రసాన్ని పలికిస్తూనే ఎంతో ఉదాత్తంగా చేసిన వర్ణన ఇది!
కోరికలే శారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరులో!
శృంగార భావాలు (కోరికలు) గోరువంక పిట్టలై (శారికలు) చేసిన పులకింతల సందడిలో మల్లెపూల పందిళ్ళు వెలిశాయట (పాటలో “పందిరిలో” అని వినిపిస్తోంది. కానీ నాకు తోచిన “ఎన్ని పందిళ్ళో కదా” అన్న అన్వయం ప్రకారం అది “పందిరులో” అయ్యుండాలి)! ఆ మల్లెపూల పరిమళంలో (మల్లెల తావుల) మృదువైన మురళీ (పిల్లనగ్రోవి) గీతికలు వినిపిస్తున్నాయి. మెల్లగా ఆ ప్రేమికులని పిలుస్తున్నాయి. ఆ రాగం వారికే వినబడేది! ఈ ప్రణయం అందరికీ అందనిది!
ఇళయరాజా తన స్వర ప్రస్థానాలతో, అద్భుతమైన ఆలాపనలతో ఈ పాటని పలికిస్తే, ఆ సంగీతపు తోటలో ఎంతో అందమైన పదభావ కుసుమాలని తన కవిత్వంతో పూయించారు వేటూరి. అందుకే ఈ పాట వినడం చాలా అందమైన అనుభూతిని కలిగిస్తుంది. పాటను పదే పదే వినాలనిపిస్తుంది. ఇళయరాజా-వేటూరి కాంబినేషన్‌కి కోటి దండాలు!
———————————
ఫణీంద్ర గారు వ్రాసిన అసలు వ్యాసం ఈ కింద లింక్ లో చూడచ్చు