పల్లవి:
ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలి .. ఈ.. ఈ…
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి.. చలి చలి ఆఁహ్… చలి చలి
పారేసుకోవాలనారేసుకున్నావు.. అరె అరె అరె అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలి .. ఈ.. ఈ..
నాకు ఉడుకెత్తి పోతోంది.. హరి హరి.. హరి హరి.. హరి హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె అరె అరె అరె
చరణం 1:
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ
నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల
నీ చూపు సోకాలి…
నా ఊపిరాడాలి…
నీ చూపు సోకాలి
నా ఊపిరాడాలి
నీ జంట నా తీపి చలి మంట కావాలి
నీ వింత కవ్వింతకే కాగిపోవాలి
నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నాకు ఉడుకెత్తి పోతోంది హరి హరి హరి హరి.. హరి హరి
చరణం 2:
నీ ఒంపులో సొంపులే హరివిల్లు..
నీ చూపులో రాపులే విరిజల్లు
నీ రాక నా వలపు ఏరువాక..
నిను తాక నీలిమబ్బు నా కోక…
నే రేగిపోవాలి
నేనూగిపోవాలి
నే రేగిపోవాలి
నేనూగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి..
ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె.. ఆఁ అరె ఆఁ అరె ఆఁ అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..
నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి..హా.. చలి చలి..హా.. చలి చలి
పారేసుకోవాలనారేసుకున్నావు అరె..ఆ.. అరె..ఆ.. అరె..ఆ.. అరె
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ..
నాకు ఉడుకెత్తి పోతోంది.. హరి హరి.. హరి హరి.. హరి హరి
లాలాల లాలాలలలలలలల.. లాలాల లాలాలలలలలలల..
**************************************************
వేటూరి గారి మీద చర్చలో “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” పాట ప్రస్తావన వచ్చింది. మాస్ పాట కాబట్టి పాట చెత్త అనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఈ పాటలోని ఒక విశిష్టత ఎక్కడో చదివిన ఙ్ఞాపకం (దాన్నే ఈ వ్యాఖ్యలో ముందుగా ప్రస్తావించాను). ఇంతకు మించి ఈ పాటలో విశేషాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు, మాస్ పాట అని మనసులో ముద్రపడటంవల్లో, మరే కారణంవల్లో.
విమర్శకునికి కృతఙ్ఞతలు. లేకపోతే ఈ పాటలోని కొన్ని మంచి విషయాలను ఎప్పటికీ గుర్తించకపోదును. ఈ వ్యాఖ్య “ఈ పాట చెత్త” అనే వాదానికి ప్రతివాదనేమీ కాదు. తరచి చూస్తే చెత్త అనుకునే పాటల్లో కూడా ఆశ్చర్యంగొలిపే విశేషాలు ఉంటాయి అనే నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం మాత్రమే.
ఈ పాట పల్లవి సీస పద్య పాదంతో మొదలవుతుంది.
త త త త
UUI UUI UUI UUI
ఆరేసు కోబోయి పారేసు కున్నాను
త త హ హ
UUI UUI UI UI
కోకెత్తు కెళ్ళింది కొండ గాలి
త త త త
UUI UUI UUI UUI
పారేసు కోవాల నారేసు కున్నావు
త సల హ హ
UUI IIUI UI UI
నీ ఎత్తు తెలిపింది కొండ గాలి
ఆరు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలే కాకుండా యతి, ప్రాసయతి కుదిరిన సీస పద్య పాదం ఈ పల్లవి. పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ (ఆ) మూడవ గణం మొదటి అక్షరానికీ (పా లోని ఆ కి) యతి చెల్లింది. ప్రాస యతి (రే) కూడా చెల్లింది. సామాన్యుడు నిత్య వ్యవహారంలో వాడే జాణ తెలుగు పదాలతో ఛందోబద్ధమైన సీస పద్య పాదాన్ని మలచడం ఒక విశేషం అయితే, తెలుగు సినిమా, పాట జీవించి ఉన్నంత కాలం నిలిచి ఉండే ఒక మాస్ పాట పల్లవిని సాంప్రదాయక సీస పద్య పాదంతో మొదలు పెట్టడం మరో విశేషం.
పాట అనేది శబ్దానికి సంబంధించినది కాబట్టి పాటలో/సంగీతంలో శబ్దాలంకారాలు ముఖ్యం. ఈ శబ్దాలంకారాల వల్ల పాటకి శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం అబ్బి భావయుక్తంగా, లయబద్ధంగా, వినసొంపుగా ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసిన వారు కాబట్టే వేటూరి గారు తమ రచనల్లో శబ్దాలంకారాలకి ప్రాముఖ్యత ఇచ్చి సినీ సాహిత్యానికి అర్థ పరంగానూ, శబ్ద పరంగానూ కొత్త సొబగులద్దారు. ఈ పాటలో కూడా ఆది అంత్యప్రాసలు, శబ్దాలంకారాలు, శ్లేష, వర్ణనల్లో కొత్తదనం, పదప్రాసలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వేటూరి గారికి తెలుగు భాషపై, పదాలపై ఉన్న పట్టుని కూడా ఈ పాటలో మనం చూడవచ్చు.
పాట మొదట్లోనే వేటూరి గారు తెలుగు పదాలపై తనకున్న పట్టును చూపెట్టారు. “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” – పారేసుకోవడంలో ఆరేసుకోవడం ఇమడటం వల్ల (ప + ఆరేసుకున్నాను) కోకను ఆరేసుకోబోయి పారేసుకోవడమున్నూ, అలా పారేసుకోవడంలో (పరువాల్ని) ఆరేసుకోవడమున్నూ చూపెట్టారు. ఇదే విషయం చరణంలో చెలి గొంతుకలో ప్రతిబింబితమౌతుంది (‘నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ’). “పారేసుకోవాలనారేసుకున్నావు”లో కూడా ఇదే అర్థం కనిపిస్తుంది.
పల్లవిలోనే ఒకే పదం మీద శ్లేషను, యమకాలంకార ప్రయోగాన్ని చేశారు. క్రింద వివరించినట్లుగా “ఎత్తు” అనే పదాన్ని వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు అర్థాలతోనూ, ఒకే ప్రదేశంలో భిన్న అర్థాలతోనూ వాడారు.
కోకెత్తుకెళ్ళింది కొండగాలి
– కొండగాలి కోకను ఎత్తుకెళ్ళింది (తీసుకెళ్ళటం / సంగ్రహించడం)
నీ ఎత్తు తెలిపింది కొండగాలి
– నీ ఎత్తు (కలగడం, పుట్టడం) తెలిపింది – నీలో కలిగింది/పుట్టింది (కోరిక) కొండగాలి నాకు తెలిపింది
– నీ ఎత్తు (ఉపాయం, ప్రయత్నం) తెలిపింది – కోక పారేసుకోవడం వెనుక ఉన్న ప్రియురాలి ఉపాయం కొండగాలి తెలిపింది.
నాకు ఉడుకెత్తిపోతోంది
– ప్రియురాలి కోరిక లేదా ఉపాయం తెలియడం వల్ల నాలో ఉడుకు పెరిగిపోతోంది
అలాగే పల్లవి లోనూ, చరణాల్లోనూ వృత్యానుప్రాస విరివిగా వాడారు.
ఈ పాటలో ఆది అంత్యప్రాసలకు, పదప్రాసలకు కొదువ లేదు. చరణాల్లో మొదటినుండి చివరి వరకూ (దాదాపుగా) “న”కారాన్ని ఆదిప్రాసగా, “ల”కారాన్ని అంత్యప్రాసగా వాడారు (ఇదే పాట నిర్మాతకి “లకారాలు” (లక్షలు) కురిపించిందనుకోండి. అది వేరే విషయం).
ఈ పాటలో ప్రాస పదాలు విరివిగా వాడడం వల్ల, అక్షర పునరుక్తి ప్రయోగం వల్ల (వృత్యానుప్రాస వల్ల) పాటకి లయబద్ధమైన శబ్ద శౌందర్యం చేకూరి చెవులకింపుగా ఉంటుంది. పాట మొదటినుండి చివరి వరకు దాదాపుగా ప్రతి పాదంలోనూ ఈ శబ్ద సౌందర్యాన్ని మనం గమనించవచ్చు.
ఉదాహరణకి
“ఆరేసుకోబోయి పారేసుకున్నాను” – ఆరేసు, పారేసు ప్రాస, అక్షరాల పునరావృత్తం
“కోకెత్తుకెళ్ళింది కొండగాలి” – క, ల అక్షరాలు పునరావృత్తం
“కొంటెచూపు చూస్తేనే చలి చలి” – చ అక్షర పునరావృత్తం
“నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ” – న, ల అక్షరాలు పునరావృత్తం
“నా పాట ఈ పూట నీ పైటల” – పాట, పూట, పైటల ప్రాస, ప, ట అక్షరాలు పునరావృత్తం
“జంట మంట”, “వింత కవ్వింత”, “కాగిపోవాలి దాగిపోవాలి”, “ఒంపులు సొంపులు”, “చూపు రాపు”, “హరివిల్లు విరిజల్లు”, “రాక తాక కోక”, “చెలరేగి ఊరేగి”, “రేగిపోవాలి ఊగిపోవాలి”, “పాట బాట” మొదలైన అందమైన పదప్రాసలున్నాయి.
పాట, పూట, పైటల ప్రాసని ఒకసారి చూడండి. ఇందులో వేటూరి గారు పదాలతో చేసే గమ్మత్తు కనిపిస్తుంది. అన్ని పదాలు “ప”, “ట” లతో కూడుకున్నవి ఒక గమ్మత్తయితే, ఈ పదాలలో అచ్చులు వరుసక్రమంలో రావడం రెండో గమ్మత్తు. ఆ (పాట), ఊ (పూట), ఐ (పైట) లు క్రమంలో రావడం. పదాలతో గమ్మత్తులు చేసి శ్రోతలను మత్తులో ముంచేయడం వేటూరి గారి ట్రేడ్ మార్క్ కదా మరి.
“నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ తొలిపొంగుల”
ఇందులో నాకు రెండు అర్థాలు కనిపించాయి.
– పారేసుకున్న కోక కొండగాలి ఎత్తుకెల్లి పోయింది. అమ్మాయి పరువపు తొలిపొంగులని దాచుకోవడానికి పైట లేదు. పాటని ఈ పూట పైటలా చేసుకొని నీ పరువపు తొలిపొంగులను దాచుకొమ్మనే చిలిపితనం.
– నీ పైటలో పరువపు తొలిపొంగులను దాచుకున్నట్లుగా, నా పాటలో నీ వలపు తొలిపొంగులను దాచుకొమ్మనే హుందాతనం.
ఒకటి పైటలో దాచుకోవడం, ఇంకొకటి పాటలో దాచుకోవడం. ఒకటి పరువపు తొలిపొంగులను దాచుకోవటం, మరొకటి వలపు తొలిపొంగులను దాచుకోవడం.
మాస్ పాట కాబట్టి అందరికీ సులువుగా అర్థమయ్యేలా సరళమైన దేశ్యపదాలతో సాహిత్యాన్ని అందించారు. దిత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అతి తక్కువగా వాడి పాడుకోవడానికి సులువుగా ఉండేలా పాటని రాశారు. “ఆరేసుకోవటం”, “పారేసుకోవటం”, “కోక”, “పైట”, “కాగిపోవటం”, “రాపులు”, “ఏరువాక” మొదలైన దేశ్య పదాలు వాడి పాట సామాన్యులకి కూడా అర్థమయ్యి చేరువయ్యేలా చేశారు. అంతే కాక చరణాల్లో ముందు పాదంలోని పదాలు తర్వాతి పాదంలోని పదాలతో ప్రాసలో ఉండటం వల్ల, గణాలతో సరిపోలుతుండటం వల్ల పాట లయబద్ధంగా ఉండి పాడుకోవటానికి సులువుగా అనిపిస్తుంది.
చూపులో రాపులు, తీపి చలి మంట, జోడు పులకింతలు వంటి వర్ణనా ప్రయోగాలు అద్భుతంగా ఉన్నాయి.
పాటని తొలిపొంగుల దాచే పైటలా మలిచే చిలిపితనమూ, అదే పాటని పూబాటగా చేసే హుందాతనమూ ఒక్క వేటూరి గారిలోనే కనపడతాయి. అదే వేటూరి గారి ప్రత్యేకత, గొప్పతనము.
శాంతారామ్ మడక గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం
గాలికి ఎగిరిన కోకమీద రంగులు పారేసుకున్న చిన్నదాని మేని హంగులను మేళవించి పదాలను అధరాలకు ఆధారంగా చేసి రసధారలు కురిపించారు. చాటు మాటు అందాలను కాటు వేసిన వేటురిగారి కవిత ఒక సౌందర్య లహరి, వినే శ్రోతల మనసులు లాహిరిలో విహరిస్తాయి. మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెపుడు కలిసిపోతదనే చందాన చందనం ఆరినకొద్ది గుబాళింపు అధికంగావ్యాప్తి చెందే రీతిలో ఆయనొక మృతసంజీవి.