కవి జనమంతా దేన్ని ఆశ్రయించి తమ మధుర కవితల్ని వెదజల్లుతూ వచ్చారో, ఏ చెట్టు నీడన, ఏ కొమ్మ చాటున వాళ్లు తమ కవితాలాపన చేసి రసిక లోకాన్ని మైమరిపించారో, రసజ్ఞలోకాన్ని కూడా మైమరపింపజేసి, చిరకాలం జ్ఞాపకం ఉండేలా తమ తమ కవితా వైభవాన్ని చాటారో ఆ సినీ కామధేనువు, కళా కల్పతరువును ఆశ్రయించి ఆ చెట్టు నీడలో కాలక్షేపం చేస్తున్న నాబోటివాడు చెబుతున్న మాటలివి.
తెలుగు సినీవనంలో కవితా వసంతోత్సవాలు జరిగినప్పటికీ స్వర్ణయుగాన్ని ఒకసారి అవలోకిస్తే మనస్సు కొంత ఊరట చెందుతుంది. మొట్టమొదటి పాట రాసిన చందాల కేశవదాసు నాటకరంగంలో పాట రాస్తూ పేరు పొందారు. అలా వచ్చినవారే పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి. బలిజేపల్లి ఆ రోజుల్లో నాటకాలకు రాసిన ‘మాయామేయజగంబె నిత్యమని సంభావించి’ వంటి పద్యాలు తిరుపతి వేంకట కవుల పద్యాలతో పోటీ పడ్డాయి. ఆయన సినీ రంగానికి వచ్చి వాహినీ స్టూడియోలో మట్టినేల మీద కూర్చొని పాట డిక్టేట్ చేస్తుంటే వ్రాయసగాళ్లు రాసుకోవడం జరిగేది. అలా కె.వి.రెడ్డిగారు రాసుకుంటుంటే స్వయంగా చూశాను నేను.
ఆ రోజుల్లో దైతా గోపాలంగారు పాటలు రాసే తీరు దగ్గరనుండి పరికించే అవకాశం కలిగింది. నాదముని స్ట్రీట్‌లో ఉండేవారాయన. ఆయనదొక గురుకులం. నటనలో, కవితా, కథారచనలో, గానంలో, దర్శకత్వంలో, నటీనటులకు శిక్షణ ఇవ్వడంలో ఆయన అందెవేసిన చెయ్యిగా పేరు గడించారు. నమ్మాళ్వార్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ సినిమాకు అర్ధరాత్రిపూట ‘కనుగొనవే మానిని ఘనాఘనశ్యాము కళ్యాణ రాముని’ అనే పాట రాస్తుంటే (అప్పటికే వృద్ధాప్యం వచ్చేసిందాయనకు. ఉబ్బసంతో బాధపడేవారు) పక్కనే ఉన్నాను.
‘మనసిజ శతకోటి సుందరుడే, మన సీతకితడే తగిన వరుడే’ అని చెలికత్తెలు పాడే సన్నివేశానికి రాసిన పాట అది. ‘ఒహో బంగరు చిలక.. నీకెందుకె అలుక.. చూడవు మాటాడవు మోమాటమా’ ఇలా ఎన్నో పాటలు రాశారాయన. ప్రౌఢమైన, సుగమమైన సాహిత్యాన్ని సన్నివేశాన్ని బట్టి రాసే విషయజ్ఞానానికి నాలో నారులుగా పోశారు దైతా గోపాలంగారు. తర్వాత తర్వాత కవులు సంగీతం నుంచి వేరుపడ్డారు. మాటల కవులు, పాటల కవులు అని మళ్లీ విభజన వచ్చింది. ఇచ్చిన ట్యూనుకు సరిపడా పాట కవి రాయలేకపోతే సంగీత దర్శకులు సర్దుకున్న రోజులూ నాకు తెలుసు. సంగీతం బొత్తిగా తెలియకపోయినా మంచి ఆలోచన చేసే కవులు వచ్చారు. వాళ్లని ‘థాట్ పొయెట్స్’ అని పిలిచేవారు. సంగీత దర్శకుడు సాయపడితేగాని పాట కుదరని సందర్భాలూ నాకు తెలుసు.
ఇచ్చిన ట్యూన్‌కి భావాన్ని చక్కగా రాయడం గొప్ప విషయం. అలా రాసిన వారిలో సముద్రాల రాఘవాచారి గారు ప్రప్రథములు. పూర్వకవులలో అన్ని విధాలా అగ్రజులాయన. నేనొక సందర్భంలో ఆయనను అడిగాను ‘వైన్ అండ్ ఉమన్’కు తెలుగేమిటని.‘ఏముందిరా మదిర, మదవతి’ అన్నారు. ఏదడిగినా టక్కున ప్రతిస్పందించే ప్రతిభ ఆయనలో ఉండేది. విశ్వనాథ సత్యనారాయణగారిని ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి వెళితే – ‘ప్రశ్నలు నువ్వడుగుతావా… ప్రశ్నలూ నేనే వేసి సమాధానాలూ నన్నే చెప్పమంటావా?’’ అన్నారు. సముద్రాలలో కూడా ఇదే ధోరణి. తగిన సన్నివేశాన్ని ఆయనే వివరించి పాట రాసేవాడు. అలాంటి కవి సముద్రాల. ఆయన తొలి రోజులలో చక్కని పాటలు రాశారు. చిలిపి చిలిపిగా ఉండే దుష్ట సమాసాలు వాడేవారు. అవి నాకు చాలా ఇష్టంగా ఉండేవి.
ఆ రోజులలో వేదాంత వధువు, హృదయ విహార లాంటి సమాసాలతో పాటు మా వదిన, సుకుమారి వదిన, మంగళకర వదిన లాంటివి కూడా ప్రయోగించిన ఘనత సముద్రాల రాఘవాచారిగారికే దక్కుతుంది. ఆయన ఎంతో చక్కని పాటలు రాశారు. ‘ధరణికి గిరి భారమా… గిరికి తరువు భారమా… తరువుకు కాయ భారమా.. కనిపెంచే తల్లికి పిల్ల భారమా’ లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రాశారు. ఒక మహా పండితుడు ఏదైనా పాటరాస్తే అతని అంతస్థును తెలిపే పట్లు కొన్ని ఉంటాయి. సముద్రాల రాసిన పాటలనే తీసుకుంటే ‘కనులకు దోచీ చేతికందని ఎండమావులున్నై, సోయగముండీ సుఖము నోచనీ బ్రతుకులున్నవీ కొన్ని’ (బాటసారి) అనేవి ఆయన కవితా వైభవాన్ని పట్టిస్తాయి. ‘సోయగం’ అనే మాట అక్కడ ఉపయోగించడం ఆచార్యులవారికీ, ఆ అంతస్థుల పండితులకీ సాధ్యం. ప్రజలకు సముద్రాల గారి సినిమా సాహిత్యమే తెలుసు.
ఆయన సినిమా కథలు, పాటలు, మాట సాహిత్యం అపారమైన సముద్రం లాంటిది. సముద్రాల వారి పాటలు ఉప్పగా ఉంటాయని ఓ కవి చమత్కరించినట్టు గుర్తు. విస్తీర్ణం ఎక్కువైనకొద్దీ ఏదైనా పలుచబడుతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడ్డట్టు. కమర్షియల్‌గా స్థిరపడి పుంఖానుపుంఖంగా సవ్యసాచిలా ఆయన మాటలు, పాటలు రాస్తుండేవారు. తర్వాత ఆయన కుమారులు సముద్రాల రామానుజాచార్య వచ్చి చేరారు. ఇద్దరూ కలిసి సినీ సాహిత్యానికి ఆధ్యక్షం వహిస్తూ వచ్చారు. ఇక తెలుగు సినిమా సాహిత్యంలో పింగళి నాగేంద్రరావుగారిది ఒక విశిష్టమైన అధ్యాయం. ఉటోపియాలోంచి, ఫాంటసీలోంచి అనేక కేరక్టర్స్, వాటి స్వరూప స్వభావాలు వేషభాషలు, కంఠస్వరం దగ్గర నుంచి అన్నింటినీ ఆకళింపు చేసుకుని సృష్టించిన మహా రచయిత పింగళి. మంత్రపుష్పంలో సుస్వరంగా పలికే వేద మంత్రాలను తిరగరాసి మాంత్రికుడితో పింగళిగారు ఒక చిత్రమైన భాషగా పలికించారు. హాం ఫట్, అలం అలం, హై హై నాయికా ఇలాంటి కొత్త మాటలెన్నో సృష్టించారు. మాటలు, పాటలకు సంబంధించి పింగళిని ఒక మహాశిల్పిగా చెప్పవచ్చు.
ఆయన ప్రతి డైలాగు ప్రజలలోకి వెళ్లి స్థిరపడింది. జానపద పాటలు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ జానపద మాటలు ఉంటాయని నిరూపించిన మహారచయిత ఆయన. మోసం గురూ, సాహసం శాయరా డింభకా ఇలాంటివి ఎన్నైనా ఉదహరించవచ్చు. పాటల విషయానికి వస్తే పింగళి ఎన్నో చక్కటి సత్యాల్ని, ఎంతో అందంగా తేలికమాటల్లో వెల్లడించేవారు. ఆయన సీదాసాదాగా రాసిన పాటలకూ ఒక పరిమళం ఉండేది. ‘పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచెను… వేదికలెక్కెను వాదము చేసెను… త్యాగమె మేలని బోధలు చేసెను… అయినా మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు’ ఇవి మామూలు మాటలుగానే అనిపిస్తాయి. కానీ సంగీతంలో అద్భుతంగా వస్తాయి.
పింగళి సాహిత్యంలో అనర్ఘమైన రత్నాలెన్నో ఉన్నాయి. శిల్పాలెన్నో ఉన్నాయి. ఆయన శశిరేఖను వర్ణిస్తూ చెలువములన్నీ చిత్ర రచనలే, చలనము లోహో నాట్యములే అంటారు. అందాలు కదిలితే అదే నాట్యం, అదే శృంగారం అనే భావనను చక్కగా చెప్పారు. ‘బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే’ అనే పాట కూడా పింగళి వారి రచనా శైలిని పట్టిచ్చే పాట. కవి ఈ రోజు అత్యాధునికమైన సినిమా రంగం ద్వారా నిర్నామధేయుడు కావడం, నిర్నామ కర్మలాచరించడం, బాధగా అనిపిస్తుంది. ఆంక్షలు, ఆధిపత్యాలు, అక్రమ క్రమీకరణాలు, శూన్యంలో పాట రాయడం ఏమీ ఉండదు. సందర్భమూ ఉండదు. ఓ కథంటూ ఉంటే సందర్భముంటుంది. కథకే గతిలేనప్పుడు ఇంకా సన్నివేశం ఎక్కడుంటుంది? సన్నివేశం లేందే పాట ఎక్కడుంటుంది? ఒకవేళ సన్నివేశం లేకుండానే రాసే గీత అకవిత్వం కాక ఏమవుతుంది? ఇదంతా ఇప్పటి గోడు.
‘‘మళ్లీ పరుండేవు లేరా…’’
పూజ్యులు, గురుతుల్యులు అయిన మల్లాది రామకృష్ణ్ణశాస్త్రిగారు మహా కథకులు. మహా పండితులు. ఇలా మహా మహా అనడంలో ఉద్దేశం మహా అనే మాటకు సరిపోయే అతికొద్ది ముఖ్యులలో ఆయన ఒకరు అని నా అభిప్రాయం. అచ్చతెనుగు నుడికారానికి గుడి కట్టిన వారాయన. జాను తెనుగు, తేనె తెనుగు, తేట తెనుగు ఆయన గడించిన సంపదలు, పంచిపెట్టిన ఐశ్వర్యాలు. వారి శిష్యరికం చేసే మహద్భాగ్యం నాకు మద్రాసులో కొన్నాళ్లపాటు కలిగింది. పనగల్ పార్కు ఎదురుగా ఉండే పేవ్‌మెంట్ పార్లమెంట్‌లోనూ, ఇతర చోట్లలోనూ వారి సాన్నిద్ధ్య భాగ్యం కలిగింది. ఆంధ్రపత్రికలో పని చేసే రోజులలో వారి దగ్గరకు వెళ్లి కూర్చోవడం నాకు అలవాటు. ఆయన మాట్లాడినప్పుడల్లా మహత్తరమైన ఎన్నో విషయాలు తెలుసుకునేవాణ్ణి. దరిజేరిన ప్రతిసారీ ఎన్నో జీవన సత్యాల్ని అలవోకగా బోధించిన మహా గురువు. పాటలలో ఆయన నుడికారాన్ని ఇట్టే చెప్పేయవచ్చు.
‘తెల్లవారవచ్చె తెలియక నా స్వామి మళ్లి పరుండేవు లేరా మళ్లీ పరుండేవు లేరా…’
వంటి శబ్దాలు ప్రయోగించారు. తెలుగు పాట ఎలా రాయాలో ముందు తరాలవారికి తెలిసేలా నిర్దేశకత్వం నెరిపారాయన.
– వేటూరి
సాక్షి పత్రిక సౌజన్యంతో…