తెలుగు సినీగేయ చరిత్రలో తేనెపాటల పూదారి వేటూరి. ‘మేలుకుంటే పాట ఏలుకుంటే పాట, అలలు కదిలా పాటే ఆకు మెదలినా పాటే… కలలు చెదిరినా పాటే ‘ అని ఆయనే అన్నట్లు ఆయన రాయని పాటా లేదూ… రాయలేని పాట లేదు!
అన్ని రకాల పాటలని అవలీలగా రాయగల ఏకైక తెలుగు సినీ కవి వేటూరి. ప్రాచీన కవుల సంప్రదాయాన్ని, పాశ్చాత్య కవుల ప్రయోగాలని మేళవించి సాహిత్య సంపదకు తనకు శ్రుతపూర్వకంగా వచ్చిన అపారమైన సంగీత పరిజ్ఞానాన్ని జోడించి స్వరపదమైత్రి మీద అవగాహనతో ఆపాతమధురమైన సినిగేయాలు రాసారు వేటూరి.
‘జేసినయది జపమున్ మఱి
వేసిన యది గాలమనుట వృధ గాకుండన్’ అన్న విజయవిలాసంలోని మాటను “జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగతపం ‘ అనే మాస్ పాటలో వాడారు.చేమకూర వేంకట కవి యొక్క చమక్కులన్నీ వేటూరి గారి కలంలో ఉన్నాయనడానికి ఇదో చిన్న ఉదాహరణ. ఈ కళ్ళకున్న ‘ఆకళ్ళలోన’ అందాల ‘విందమ్మ’ నువ్వువాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే ‘విందమ్మ’ నవ్వు(ఆకలికి బహువచనం… ఆకళ్ళు, మరో పదం ఆ కళ్ళు. విందు, వినదమ్మ.. )
ఈడొచ్చి నీకోసం ఈడుంది రమ్మంటే(ఈడు, ఈడ ఉంది=ఈడుంది)కౌగిళ్ళలో నన్ను కూడు.. ఆకళ్ళకుంటాది కూడు(కూడు.. కూడిక, తిండి రెండు అర్ధాలు)చూడటానికి ఇదో మాస్ పాటలా అనిపించినా అన్నీ శబ్ధాలంకారాల నిక్షిప్తాలు.
“రతికిన్, భారతికిన్ వినోద కథలం బ్రాగల్భ్యముం జూపి, త
త్పతులం గూరిచి, మాట వాసి గను పెద్దల్ గారె మీవార’ … చేమకూర వేంకట కవి
‘భారతభారతి పద సన్నిధిలో … నా రతి నీవని వలపుల హారతి’ … వేటూరి.
“నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగా మువ్వాగోపాలుని రాధికా” ఈ పదంలో మాత్రం నాకు గిరికాదేవిని వర్ణించిన తీరు గుర్తొస్తుంది. నందితిమ్మన తన పరిజాతపహరణం లో “అన్ని పూల మీదా తిరిగే తుమ్మెద తన మీద వాలటం లేదని సంపెంగి పువ్వు బాధపడి, బ్రహ్మ కోసం తపస్సు చేసిందిట. అప్పుడు బ్రహ్మ సంపెంగి పువ్వును గిరికా దేవి ముక్కుగా చేశాడుట (అంటే ఆవిడ ముక్కు సంపెంగి పువ్వు, కళ్ళు తుమ్మెదలు). అంతే కాదు ముఖము చంద్రబింబం అయ్యిందిట, పాపం నక్షత్రాలు తమ విభుణ్ణి ఇమ్మని ఆ గిరికా దేవి కాలి మీద పడ్డారుట (కాలి గోళ్ళు నక్షత్రాలలా మెరుస్తున్నాయని కవి భావం). ఇలాంటి పోలిక ఈ రోజుల్లో ఏ పద్య రూపలో చెబితే అర్ధం చేసుకొనే వారు తక్కువే, కాబట్టీ అందరికీ అర్ధమయ్యేటట్టు వేటూరి గారు ఈ పాటలో వర్ణించారు. (వయ్యారి గోదారమ్మ).
అన్నమయ్య, శంకరాచార్య : ‘శ్రీ హస్త కమల మధుపము’ అన్న పదాన్ని వింటే అటు అన్నమయ్య’ బ్రహ్మ కడిగిన పాదము’ గుర్తు వచ్చినా, ‘పులకభూషణమాశ్రయంతీభృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్’ అని ఇటు శంకరాచార్య కనకధార గుర్తు వచ్చినా. ‘పద్మ ఊరూ పద్మాక్షి పద్మసంభవే’అని మనసులో మెదిలినా ఆయనకు శిరస్సు వంచి నమస్కరించకుండా ఉండలేము.
శ్రీనాథుడు : శ్రీనాథుడి సీసమే వేటూరి స్ఫూర్తి ఏమో!, ఆయన సససోక్తి, ప్రౌడోక్తి మేళవించి రాసిన హరవిలాసం ‘కిరాతార్జునీయం’ గా మలిచారు వేటూరి.
‘వికటపాటల జటామకుటికా భారంబు కఱకైన జుంజుఱు నెఱులు గాక ‘
‘నెలవంక తలపాగ నెమలియీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి పారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా’
శివుని ఎర్రని జటాజూటం కిరాతకుని ఎర్రని జుట్టుగా, అతని తలపైన ఉన్న చందమామ కిరాతకుని నెత్తిన చుట్టపీకగా, ఫాలనేత్రాలు బొట్టుగా, సర్పాలు పూసలదండగా, పార్వతి చెంచితై అతనిని అనుసరించిందని హరవిలాసంలో ముఫ్పై పద్యాలలో ఉంటే వేటూరి గారు అదే సంవాదాన్ని ముఫ్పై పంక్తులలో చెప్పారు.
దేవులపల్లి : భావుకతలో దేవులపల్లి తరవాత వేటూరనే చెప్పచ్చు. ప్రకృతి ఆరాధకులు ఇద్దరూ.
‘ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని.. విని.. విని..
ఏదీ ఆ యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక.. ఏదీ విరహ గోపిక?’ అని కృష్ణ ఛాయలు దేవులపల్లి వెతికితే…
‘బృందావని ఉంది…
యమునా నది ఉంది…
మధురాపురి ఉంది… కాళింది ఉంది
లేని వాడొక్కడే… శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన… కల్యాణ మూర్తి’ అని ఆయన దారిలో ఆయన ఆ కృష్ణుడిని వెతికారు.
విశ్వనాథ సత్యనారాయణ : విశ్వనాథ వారి ప్రియ శిష్యుడవడంతో కావ్యాలు ఎలా రాయాలో ఆయన దగ్గరుండీ నేర్పడమో ఏమో ఆయన ప్రభావం శిష్యుడైన వేటూరి గారి మీద చాలా ఉంది. వేసవిలో అగ్నిపత్రాలు రాసి విరహిని నిట్టూర్పులా కొంత సాగి ( చైత్రము కు సుమాంజలి), అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే(నిరంతరము వసంతములే) పాటలలో అగ్నిపత్రాలు అన్న పద ప్రాయోగం విశ్వనాథ వారి ఋతుసమ్హారము లో ‘ఆకాశమును భూమి, యగ్నిపత్రము వ్రాసికొన్నట్లు సుడిగాలి మన్ను రేగె గ్రీష్మానిలుఁడు వేయిఱెక్కలతో సాఁగినట్టులు’ గుర్తు చేస్తుంది. అంతేనా? రావయ్య ఓ పూలరాజా రావయ్య ఓ అందగాడా కోకిలమ్మకు నీవు, నీకూ కోకిలా తగునూ..” అని విశ్వనాథ వారు ‘కోకిలమ్మ పెళ్లి'(గేయ కావ్యం) లో రాస్తే అదే కోకిలమ్మకు తనదైన పద్దతిలో ‘వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి’ వర్ణించి విశ్వనాథ వారు గర్వపడే తెలుగుతనాన్ని నింపి, అద్భుతమయిన పాటని సృష్టించారు.
సముద్రాల సీనియర్ : “యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమా” అని ఒక్క వాక్యంలో హిమలయాల గొప్పదనాన్ని చెప్పారు సముద్రాల సీనియర్ వేటూరి గారు “ఖుషి కృషి సంగమించే చోట” అని అమెరికాని వర్ణించారు. .
మల్లాది : ‘లలిత భావ నిలయ’ పాటలో మూడు చరణాలలో ముగురమ్మలని వర్ణిస్తూ రాసారు. ‘అఖిలాండేశ్వరి చాముడేశ్వరి’ పాటలో వేటూరి కూడా అలాగే ముగురమ్మలను వర్ణించారు. మల్లాది వారే సినీ గేయాలలో ఒక పురుషుడిని ‘నెరజాణ’ అని సంభోదించడం ప్రాయోగిస్తే, వేటూరి గారు కూడా తరువాతి కాలంలో ‘జాణవులే నెరజానవులే’ అన్న పాటలో కథానాయకుడిని సంభోధించారు.
ఆత్రేయ గారి శిష్యులవడం చేత మనసుకి సంబంధించిన పాటలు ఆత్రేయ అంతటి కవిగా వేటూరి ఖ్యాతి గాంచారు. గురువు మెచ్చిన శిష్యుడైనారు.
శ్రీశ్రీ విప్లవాత్మక పాటలకి ప్రసిద్ధి, వేటూరి రాసిన ‘దుర్యోధన దుశ్శాసన’ పాట ఎన్నో విప్లావాత్మక పాటలకి సరిసమానం. అది పాట అనడం కన్నా ఒక కావ్యం అనొచ్చు.
ఆరుద్ర కూనలమ్మ అన్న పదప్రయోగం లా ‘కన్నె బంగారు’ అని వాడారు వేటూరి. అసలు ఎవరైన ప్రేమలేఖ రాసినప్పుడు ‘శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా’ అని సంభోధిస్తూ రాస్తారా? అలా అంత హుందాగా రాయాలనిపించడం కవికే చెల్లింది.
వేటురి గారి పాటల్లో రాగాల విహారాలు ఉన్నాయి
శంకారభరణం– ఓంకార నాదానుసంధానమౌ గానమే
ఆనందభైరవి- పిలిచిన మురళికి పలికిన మువ్వకి
నీలాంబరి, తోడి – శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా,
మోహన- ఎదలో మోహన లాహిరి
హిందోళం- అందం హిందోళం
ఆభేరి- అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే
దేవగాంధారి – క్షీరసాగర శయన దేవగాంధారిలో…
భూపాళం- తొలి పొద్దులో సిందూరం.. మలి పొద్దులో భూపాళం
ఆయన పాటల్లో వీణ, వేణువు, మురళీ, సన్నాయి, మృదగం, గిటారులున్నాయి. బంతిలాంటి బత్తాయిలు ఉన్నాయి, వడ్లమూడి నారింజలు, బంగిన పల్లి మావిడి పళ్ళు, యాపిల్లు, ద్రాక్షలూ ఉన్నాయి. మల్లెపూలు, గులాబీలు, ఎరుపెక్కిన చామంతులు,సన్నాయిలాంటి పున్నాగాలు, బూజంబంతులు, మందారాలు, కలువలు, కళారాలు, పద్మాలు, సన్నజాజులు, విరజాజులు, బంతి పూల గుబాళింపులు ఉన్నాయి. అన్నమయ్య, క్షేత్రయ్య, తాగయ్య, రామదాస కీర్తనలే కాదు జయదేవుడి అష్టపదులూ ఉన్నాయి. కోకిలలు, నెమళ్ళు, శుకాలు, పికాలు, మీనాక్షి చిలకలూ ఉన్నాయి. ‘కాశీ దోచిన దొంగ ఈశుడేనని’ అపవాదు వేసే సత్తా కూడా ఆయనకే ఉంది. కాశీ, కన్యాకుమారి, కంచి, మధుర, కలకత్తా మొదలైన ఊర్లతో పాటు ఆకాశ దేశాలు ఉన్నాయి.
పంచమి, నవమి, దశమి, విదియా, తదియా, పున్నమి, మొదలైన తిథులూ ఉన్నాయి. సామెతలు , జాతీయాలూ ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు, అయ్యప్పా ఉన్నారు.
ఎంకి, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కిన్నెరసాని, స్వాధీనపతిక, వాసకసజ్జిక, విరహోత్కంఠిత, విప్రలబ్ధ, ఖండిత , కలహాంతరిత, ప్రోషితభర్తృక, అభిసారికలూ ఉన్నారు. గోదావరి, కృష్ణ, కావేరి, యమున, గంగా, గంగోత్రి, పెన్నమ్మ మొదలైన జీవనదులు ఆయన పాటల్లో జాలువారుతూ ఉన్నాయి. మరచిపోయిన “అలు అరు ఇణి ” తెలుగింటి మూలాములల నుండి ధైర్యంగా వచ్చి మనతో ఆడుకుంటాయి. ఆలటవెలదిగా, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల, శార్ధులం, ఆది ప్రాస, మధ్యప్రాస, అంత్యప్రాసలు, విశేష ప్రాసలు, సంధులు, సమాసాలు, యమకాలంకారాలు, ముక్తపదగ్రస్తాలంకారాలు నిండుగా తెలుగు భాషకి అలకరించి ఉన్నాయి వేటూరి పాటల్లో.
వేటూరి గారి రచనలలో ఆత్మ గంధం, తేనె ఎక్కిళ్ళు, సంపంగి ధూపాలు, చలివేణువులు, చలి నిట్టూర్పులు, రాలుపూల తేనియ, రాతిపూల తుమ్మెద, మధుహింసా, తేనెవెన్నెల, బుగ్గపండు, మందారధూళి, మౌన వీణ, ప్రేమాసనం మొదలైన వినూత్న పదాలు తెలుగు పాటకు పరిచయం చేశారు.
ఎన్ని గ్రంథాలు, పురాణాలు చదివి ఆకలింపు చేసుకుంటే ఇంత మంది కవుల యొక్క నాడి తెలుసుకొని వాళ్ళని అవపోసనపట్టి ఉంటారు? ఎంత ధారణా శక్తి ఉంటే మళ్ళీ వాటిని పునరోక్తి చేస్తారు? ‘కాదేది కవితకనర్హం’ శ్రీశ్రీగారు అన్నట్టు వేటూరి రాయని రాయలేని పాట లేదు. వేటూరిచ్ఛిష్టం ఈ సినిమా పాట సాహిత్యం… అదే ప్రసాదంగా భావి కవులకు దక్కింది.
అటు ప్రాచీన కవుల నుంచి, ఆధునిక కవుల వరకు అందరిని తన కలంలో ఇమడ్చుకున్న ఏకైక కవి వేటూరి. ఆయన పాటలో లేని రసాలు లేవు, ఎన్నో పేజీలలో వర్ణించే విషయాన్ని ఒక వాక్యంలో చెప్పగల దిట్ట(గోదావరి ఏడుపాయలుగా విడిపోయి సాగరంలో కలిసినదనటానికి ‘సప్తఋషులు సాగనంప సాగరాన మెట్టి’ అని రాసారు). ఆయన పాటల్లో ఆయన విశ్వరూపం తెలుస్తుంది. ప్రాచీన కవులకు ప్రతీక, అధునిక కవులకు అమరకోశం, నవీన కవులకు దిక్సూచి… ఒక్క మాటలో చెప్పాలంటే సినీ సంగీత జలధి ఆయన ఇరు తరాల కవులకు సాహిత్య వారధి. ఆ విరాట్ వేటూరికి జయంతి శుభాకాంక్షలు.
