ఎవరికెవరు ఈలోకంలో …

కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో..
కానీ ఆ కడలి కలిసేది ఎందులో
…”

అన్నీ సవ్యంగా ఉన్నన్నాళ్లూ బంధాలు, బంధుత్వాలూ బహు గొప్పగా ఉంటాయి. ఏదన్నా తేడా జరిగినప్పుడే, మనవాళ్ళు ఎవరు, కానివాళ్ళు ఎవరన్న ప్రశ్నా, ఆ వెంటే జవాబూ వస్తాయి. ‘సిరిసిరిమువ్వ’ (1976) సినిమాలో కథానాయికకి ఇలాంటి పరిస్థితే వచ్చింది. సవతితల్లి పెంపకంలో పెరిగిన ఆమెకి తన తండ్రి జీవించి ఉన్నంతకాలమూ కూడూ, గూడూ దొరికాయి. ఆయన హఠాన్మరణంతో ఆమె దాదాపుగా రోడ్డున పడింది.

ఎక్కడా ఆశ్రయం దొరకని పరిస్థితుల్లో, ఆమెని పట్నం తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు కథానాయకుడు. నిజానికి అతడికి, ఆమెకి ఎలాంటి బంధుత్వం లేదు. మనసునిండా ఆమె మీద ప్రేమని నింపుకున్నా, పైకి చెప్పే ధైర్యం లేనివాడతను. కేవలం అతని వెనుకే, ఎప్పుడూ చూడని ఊరికి వెళ్లి, జీవితాన్ని కొనసాగించాలి. ఈ సన్నివేశంలో నాయిక స్థితికి అద్దం పట్టేలా తేలికైన మాటలతో బరువైన పాట రాశారు వేటూరి.

https://www.youtube.com/watch?v=SVYHa3-2bm0&feature=emb_logo

ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక..
ఏదారెటు పోతుందో ఎవరినీ అడుగక
..”

ఇదో మాయా ప్రపంచం. ఇక్కడ ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికీ తెలీదు. ఇవాళ్టి బంధుత్వాలు, రేపటికి శత్రుత్వాలు కావొచ్చు. అప్పటివరకూ ఎవరో తెలియని వాళ్ళతో కొత్త బంధుత్వం చిగురించనూ వచ్చు. ఏ బంధం ఎటువైపుకి దారితీస్తుండన్నది ఎవరినీ అడగకూడని ప్రశ్న. అడిగినా, ఎవరు మాత్రం జవాబు చెప్పగలరు?

జోర్సే బార్సే కోరంగి రేవుకే..
కోటిపల్లి రేవుకే
..”

పడవ ప్రయాణం నేపధ్యంగా సాగుతున్న పాట కాబట్టి, మధ్యలో పడవ నడిపేవారి పదాన్ని చేర్చారిక్కడ. శ్రమని మర్చిపోయేందుకు వారు పాడుకునే పాటల్లో అనేక రసాలు వినిపిస్తాయి, వారి మనఃస్థితిని, చేస్తున్న ప్రయత్నాలన్నీ అనుసరించి. కోరంగి, కోటిపల్లి రెండూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ రేవులు. వారి రాగంలో ఈ రేవుల పేర్లు రావడం సహజమే.

వాన కురిసి కలిసేదీ వాగులో..
వాగు వంక కలిసేదీ నదిలో
..

కదిలి కదిలి నదులన్నీ కలిసేదీ కడలిలో..
కానీ ఆ కడలి కలిసేదీ ఎందులో
..”

కొండకోనల్లో కురిసే వాన వాగులుగాను, వంకలుగానూ మారి నదుల్లో కలుస్తుంది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. మరి ఆ సముద్రం ఎందులో కలవాలి? కష్టాల బరువుని తనవాళ్ళతో పంచుకుని తేలికపడతారు చాలామంది. ఆ వినేవాళ్ళకీ ఉంటాయి కష్టాలు. వాళ్ళు వాటిని మరెవరితోనో పంచుకుని తేలికవుతారు. అందరి కష్టాలూ విని, తన కష్టం చెప్పుకునే అవకాశం లేని వాళ్ళకి మరి?

వీళ్ళెవరూ అంటే మొదటగా గుర్తొచ్చేది దేవుడు. కానీ, సినిమా కథ ప్రకారం చూసినప్పుడు మాత్రం కథానాయిక. ఆమె పుట్టు మూగ. వినగలదు, కానీ తిరిగి ఏమీ చెప్పలేదు. కష్టం ఆమెదే. ఊరిని విడిచి ప్రయాణం చేయాల్సిదే ఆమే. కానీ, ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం మాట్లాడలేకపోవడం వల్ల మాత్రమే కాదు, ఏమీ మాట్లాడే పరిస్థితి లేకపోవడం వల్ల కూడా. ఈ సందర్భానికి ఇంతకు మించిన పాట రాయడం అసాధ్యం అనిపించేలా రాయడమే వేటూరి ప్రత్యేకత.

కెవి మహదేవన్ స్వరకల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషాద గంభీరంగా ఆలపించారీ గీతాన్ని. ఈ తరహా పాటలకి ‘జేసుదాసు పాటలు’ అని పేరొస్తున్న సమయంలో తనకి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు బాలూ. కె. విశ్వనాధ్ దర్శకత్వంలో జయప్రద, చంద్రమోహన్ అభినయించారు. కళాత్మక చిత్రాల నిర్మాత ‘పూర్ణోదయా’ నాగేశ్వర రావు నిర్మించారీ సినిమాని.

నెమలికన్ను మురళి గారికి ధన్యవాదాలతో వేటూరి.ఇన్ టీం

అసలు పోస్ట్ ఈ కింద లింక్ లో చూడవచ్చు

http://nemalikannu.blogspot.com/2019/01/blog-post_30.html

2 thoughts on “ఎవరికెవరు ఈలోకంలో …”

  1. Siri Siri Muvva Film was produced people from west godavari dist, mr yedidada nageswara rao was production executive for that film, hope you will correct it, veturi ravi prakash

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top