వేటూరి సుందరరామ్మూర్తి
జననం:29 జనవరి 1936
మరణం : 22 మే 2010
పది నిమిషాల్లో పాట రాసేసి పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా చేయగల సినీకవి వేటూరి సుందరరామ్మూర్తి.
వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు, దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశాడు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత కొన్ని వేల పాటలను రాశాడు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నాడు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.] మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాశాడు. 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటు తో మరణించాడు.
వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు.. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశాడు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాడు
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం… ఇలా ఎన్నో సినిమాలు…ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే… అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన…, నాదవినోదము…
తెలుగు పాటను వండటంలో ఆయన చేయితిరిగిన వంటవాడు. అందులో షడ్రుచులు మనసారా ఆస్వాదిస్తుంటే జీవితంలో అన్నిదశలూ గుర్తొస్తాయి. బాల్యం, యవ్వనం, ప్రేమ, విరహం, బంధం, సాన్నిహిత్యం, సరసం, శృంగారం, వైరాగ్యం, సంప్రదాయం, భక్తి.. ఒక్కటేమిటి వేటూరి సృష్టించిన సినీ సాహిత్య విశ్వంలో పాటల పాలపుంతలకు లెక్కేలేదు.
ఆయన అన్నివయసుల్లోనూ బహుముఖీన శైలుల్లో పాటలు రాశారు. తకిట తథిమి, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, ఈ దుర్యోధన దుశ్శాసన, నిన్నటిదాకా శిలనైనా, ఆమనీ పాడవే, చినుకులా రాలి, శుభలేఖ రాసుకున్నా, నీమీద నాకు యిదమ్మో, అందంగా లేనా అసలేం బాలేనా వంటి భిన్నభావాలను పలికించారు.
‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు పొందిన జాతీయ అవార్డును తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వడం లేదని వెనక్కివ్వబోయిన భాషాభిమానం ఆయనది. వేటూరి పయనం పాత్రికేయం నుంచి ‘పాట’కీయం వరకు సాగింది. పాటకు లేని మరణం ఆయన కీర్తికి ఉంటుందా?
సేవ అంతర్జాల పత్రిక సౌజన్యంతో