ప్రేమించిన అమ్మాయి కోపం కూడా అందమే! అసలు అలా అనిపిస్తేనే ప్రేమని సినిమా కవులు ఎన్నడో తేల్చేశారు! కాబట్టి అమ్మాయి రూపం చూసినా, కోపం చూసినా, తాపమే అబ్బాయికి!
విజయా గార్డెన్స్ లో ఒక చెట్టు కింద కూర్చుని వేటూరి చాలా పాటలు రాశారుట. ఆ చెట్టుకి “వేటూరి పాటల చెట్టు” అని పేరు వచ్చింది. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. అయితే వేటూరి తన హృదయాన్ని ప్రేమనే మహావృక్షంగా మార్చి ఎన్నో తీయని పాటల పండ్లను పంచడం మనకు బాగా తెలిసిన విషయం. ఆ పళ్ళలో అతి మధురమైన ఫలాలను వేటూరి తనకి అత్యంత ఆప్తుడైన జంధ్యాల కోసం దాచి ఉంచారేమో అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమగీతాలు అపురూపమైనవి.
దాదాపు జంధ్యాల ప్రతి సినిమాలోనూ ప్రేమపై ఓ పాట ఉంటుంది, ఆ ప్రేమ పాటలు ఎక్కువ వేటూరి రాసినవే. “ప్రేమ అనే రెండు అక్షరాల మాటను నిర్వచించడానికి ప్రపంచభాషలన్నింటిలోనూ ఉన్న వేలాది అక్షరాలు కూడా చాలవు అని జంధ్యాల తరచు అంటుండేవారు. అందుకే ఆ ప్రేమకీర్తనగా నా చేత దాదాపు పది పాటలు రాయించాడు ఆయన. ప్రకృతి ఒళ్ళో తలదాచుకున్న పసితనం ఆయనిది.” అని వేటూరి జంధ్యావందనం పేరిట జంధ్యాలకి సమర్పించిన అక్షర నీరాజనంలో పేర్కొన్నారు.
“చినుకులా రాలి” (నాలుగు స్థంభాలాట), “నేను నీకై పుట్టానని” (చంటబ్బాయి), “లిపిలేని కంటిబాస” (శ్రీవారికి ప్రేమలేఖ), “ఈ తూరుపు ఆ పశ్చిమం” (పడమటి సంధ్యారాగం) – ఇలాంటి ప్రేమ పాటలన్నీ ఎవరు మరిచిపోగలరు? అయితే కొన్ని పాటలు సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన తగినంత ఆదరణకి నోచుకోలేదు అనిపిస్తుంది. “బాబాయ్ హోటల్” చిత్రంలో “ప్రేమచెట్టు పూసినట్టు” అనే పాట అలాంటిదే. ఆ పాటని ఆస్వాదించి జంధ్యాలకి, వేటూరికి మళ్ళీ ఓ నమస్కారం సమర్పించుకుందాం!
“బాబాయ్ హోటల్” చిత్రానికి సంగీతం సమకూర్చినది “మాధవపెద్ది సురేశ్” గారు. ఆయన చక్కటి బాణీలు కట్టిన ఈ చిత్రంలోని పాటలు సినిమా ఫ్లాప్ అవ్వడం వలన ఎవరికీ పెద్దగా తెలియకుండా పోయాయి. ఈ పాటల్లో ఎన్నదగిన పాట “ప్రేమచెట్టు పూసినట్టు” అన్న ప్రేమ గీతం. సినిమాలో ఓ యువజంట (జంధ్యాల ఇద్దరు కొత్త ముఖాలను ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు) ప్రేమలో పడ్డప్పుడు వచ్చే పాట ఇది. వేటూరి ఎంత ముద్దుగా రాశారో పల్లవి చూస్తేనే తెలిసిపోతుంది!
పల్లవి:
అమ్మాయి: ప్రేమచెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాటన!
అబ్బాయి: పాణిపట్టు – పానిపట్టు సాగినట్టు జంఝాటన!
అమ్మాయి: ఎద బాలశిక్షై తొలిప్రేమ భాష నేర్పె!
అబ్బాయి: తెలుగక్షరాల తలకట్టు తాళమేసె!
అమ్మాయి: చూపు చెదిరె!
అబ్బాయి: పెదవులదిరె! అరెరె అరెరె!
అద్భుతమైన పల్లవి!
“గుంజాటన”, “జంఝాటన! ” లాంటి పదాలని ఎవరండీ తెలుగు పాటల్లోకి లాక్కొస్తారు? అమ్మాయిలో ప్రేమచెట్టు పూసిందిట. ఇది ప్రేమకి అంకురం. ప్రేమో కాదో తెలియని స్థితి. కాయ కాయడం అన్నది ప్రేమే అని ఖాయం చేసుకునే రుజువు! కానీ ఆ ప్రేమని అబ్బాయికి ఎలా చెప్పాలో తెలియని ఊగిసలాట (గుంజాటన). ఇదీ అమ్మాయి పరిస్థితి. ఇక అబ్బాయి సంగతి చూస్తే అతనూ ఇలాగే ఉన్నాడు. “పాణిపట్టు” అంటే అమ్మాయి చేయి (పాణి) పట్టుకోవడం. అంటే చెలిమిని ఆహ్వానించడం. పెళ్ళిగా స్థిరమైన బంధంగా మిగలడం అన్న ధ్వనీ ఉంది.
కానీ మనసులో మాట అమ్మాయికి చెప్పాలంటే అదో “పానిపట్” యుద్దమే! ఈ “ప్రియమైన తగువు” (జంఝాటన) తీరేది కాదు! పాణిపట్టు – పానిపట్టు ఇలా ఏ సంబంధమూ లేని పదాలని ముద్దుగా కలపడం వేటూరికే తెలిసిన విద్య! ఇలా పదప్రయోగాలతో సరికొత్తగా వాక్యాలను నిర్మించి, అతి తక్కువ పదాలలో ఎంతో భావాన్ని ఇమడ్చడం వేటూరి శైలి. అందుకే వేటూరి పాటల పొట్లం విప్పుకున్న వాళ్ళకే మిఠాయి దక్కుతుంది!
సరే!
ఈ గుంజాటన దాటి ప్రేమని తెలుపుకున్నాక, ఆ ప్రేమని మనసుతీరా వ్యక్తపరుచుకుందామంటే ప్రేమ గురించి ఏమీ తెలీదే! అప్పుడు మనసే బాలశిక్షై తొలి ప్రేమ భాష నేర్పిందిట! వీళ్ళిద్దరి ప్రేమనూ చూసి పరవశించి తెలుగక్షరాలు తమ తలకట్టుతో తాళమేశాయట (తలకట్టుని చూస్తే చేతి వేలులా ఉండదూ!). ఏం ఊహ! అసలు ఈ ప్రేమజంట మధ్య తెలుగెందుకొచ్చిందీ అంటే అది వేటూరికి తెలుగుపై ఉన్న ప్రేమ, జంధ్యాల సినిమాల్లో తెలుగుదనానికి కట్టిన పట్టం. “శ్రీ అనే తెలుగుక్షరంలా నీవు నిలుచుంటే, క్రావడల్లే నీదు వెలుగుల ప్రమిదనై ఉంటా!” అన్న అద్భుతమైన భావంతో తెలుగుని తలుచుకుని, “శ్రీ” అక్షరాన్ని వేటూరి ఊహించిన పాటా జంధ్యాల చిత్రంలోదే (చంటబ్బాయిలో “నేనునీకైపుట్టానని“ పాట) అని ఇక్కడ గుర్తుచేసుకోవాలి.
ఇలా జంధ్యాలా వేటూరి కలిసినప్పుడల్లా తెలుగు గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది!
చరణం 1:
అబ్బాయి: కులుకో అది అలకో ఉసిగొలిపేవెందుకో?
అమ్మాయి: ఎన్నో వగలెన్నో విరబూసె మోజులో!
అబ్బాయి: చినుకో అది వణుకో కనులదిరేనెందుకో?
అమ్మాయి: అంతా పులకింతే పువ్వయ్యే మొగ్గలు!
అబ్బాయి: నండూరివారి పాటలా నా పిల్ల ఎంకి నవ్వింది మల్లెతోటలా!
అమ్మాయి: కనకాభిషేకమాయెరా నాయుడుబావ కన్నెత్తి నువ్వు చూడగా!
అబ్బాయి: గుండెలదిరె, గుట్టు చెదిరె, అరెరె అరెరె!
ప్రేమించిన అమ్మాయి కోపం కూడా అందమే! అసలు అలా అనిపిస్తేనే ప్రేమని సినిమా కవులు ఎన్నడో తేల్చేశారు! కాబట్టి అమ్మాయి రూపం చూసినా, కోపం చూసినా, తాపమే అబ్బాయికి! “ఇలా నన్ను ఉసిగొల్పడం న్యాయమా?” అని అడిగితే “నీ పైన ప్రేమ మోజు కలిగాక నాలో ఈ హొయలన్నీ పుట్టుకొచ్చాయి! నేనేం చేసేది!” అని గడుసు జవాబిస్తుంది అమ్మాయి. “నీ కనులు అదురుతున్నాయి, అది అలజడి వలన కలిగిన వణుకా లేక సిగ్గుల చినుకా?” అని అడిగితే – “ఇదంతా ఎదలో మొగ్గతొడిగిన వలపు, పువ్వుగా పూసిన పులకింతే!” అని జవాబు. ఇందులో మనసులో మాట చెప్పలేక సిగ్గుపడడం లేదు, చెప్తూ సిగ్గుపడడమే! అదో అందం! ఇలా మనసు విప్పి నువ్వు ఎంకివి, నేను నాయుడు బావని అని గర్వంగా చెప్పుకున్న తెలుగుజంట ఇది! ఎంకి నవ్వులో మల్లెతోటలూ, నాయుడి చూపులో కనకాభిషేకాలూ మననూ తాకి మురిపిస్తాయి!
చరణం 2:
అమ్మాయి: అడిగే సగమడిగే మొగమాటాలేమిటో?
అబ్బాయి: ఏవో రుచులేవో అడగాలా మాటతో!
అమ్మాయి: చిలిపి శ్రుతికలిపే చిరుగీతాలెందుకో?
అబ్బాయి: భామా, తొలిప్రేమా పలికేదే పాటలో!
అమ్మాయి: విశ్వనాథవారి పాటలా కిన్నెరసాని పొంగింది పొందు పేరిట!
అబ్బాయి: వెండిమెట్ల మీద వెన్నెల ఊరేగి వచ్చి చేరింది కన్నె కౌగిట!
అమ్మాయి: చక్కదనమే రెక్కవిసిరే, అరెరె అరెరె!
అమ్మాయి తనలో భావాలని పూర్తిగా చెప్పలేక, సగంలోనే ఆగిపోతే, ఆ మొహమాటం మోహనం! ఈ అడగని మాట వెనుక మర్మాన్ని గ్రహించి మెసలే పురుషుడు కదా ధన్యుడు! మొన్నటి దాకా కుదురుగా ఉన్న మనసు ఇప్పుడిలా ప్రియుడితో శ్రుతి కలిపి, చిలిపిగీతాలు పాడుకోవడం ఏంటీ అంటే, తొలిప్రేమ పాటలోనే పలుకుతుందీ అని జవాబు! ఇక్కడ పాట సంకోచం లేని మనసుకి సంకేతం, వెల్లువలా పొంగే వయసు యొక్క సంగీతం. ఈ ప్రేమ జోరులో కిన్నెరసాని విశ్వనాథ వారి పాటలా ఉప్పొంగుతుంది! ఈ ప్రేమ హాయిలో వెన్నెలంతా వెండి మెట్ల మీద దిగి వచ్చి కౌగిట్లో వాలుతుంది! అందుకే కదూ అందరూ ప్రేమలో పడేదీ, పడాలనుకునేదీ! చక్కదనం రెక్క విసిరినప్పుడు ఎగిరి గాల్లో తేలాలని ఎవరికుండదు?
పాటలో అనేక భావాల షేడ్స్ ని పొదగడం వేటూరి శైలి. అందుకే వేటూరి పాటని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుని ఆస్వాదించొచ్చు. ఈ పాటలోనూ ఆ లక్షణం కొంత ఉంది. వ్యక్తీకరణలో నవ్యత, అక్షర రమ్యత ఈ పాటకు అందాలు. ఈ పాటని జంధ్యాల తనదైన శైలిలో సాహిత్యానికి అనుగుణంగా చిత్రీకరించారు (పాణిపట్టు అన్నప్పుడు అబ్బాయి అమ్మాయి చెయ్యి పట్టుకోవడం వగైరా). కొత్త అమ్మాయి ఉత్సాహంగా నాట్యం చేసి ముచ్చట కలిగిస్తే, కొత్త అబ్బాయి మటుకు మొహమాటంగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తాడు. ఈ అబ్బాయిలెప్పుడూ ఇంతే!
సారంగ పత్రిక వారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం