మంచు దుప్పటి కప్పుకున్న నేల..ఆమనిని మోసుకొచ్చే తెలితెమ్మెర..నిట్టనిలువుగా విచ్చుకున్న కిరణం.. దివి నుంచి దిగివచ్చిన వసంతం .. వీటన్నింటినీ నేపథ్యంగా రాసుకొచ్చిన కవిత్వం గీతాంజలి గీతం. ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరమంత్రోచ్ఛారణ చేశారు. సుందర రాముడు స్వరానికి పదం జేశాడు. మొత్తంగా ఆ పాటల వయస్సు 25ఏళ్ళ పైచిలుకు, యశస్సు నూరేళ్లు. కవి గాయక నవ వైతాళికా నీకు సాహో..!
సినిమాను సినిమాగా..పాటను పాటగా పరిగణిస్తే.. ఓ గేయం ఎంత కాలం వర్థిల్లగలుగుతుంది. ఈ రోజుల్లో సినిమా ఆడినంత కాలం. మరి!ఆ రోజుల్లో మణిరత్నం లాంటి దర్శక దిగ్గజాల నిర్దేశకత్వంలో పీసీ శ్రీరామ్ లాంటి ఛాయా మాంత్రికుడి మాయాజాలంలో తెరకెక్కిన పాట..కాలానికి అతీతం.. కాలధర్మానికీ అతీతం. శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే అది ప్రేమానికి అంకితం. అన్నట్లు ఓ సారి సంభాషిద్దాం ఆమని పాడవేతో.. ఎన్నాళ్లైంది మెలోడీని అంత మార్థవంగా విని..ఎన్నాళ్లైంది కోయిల కూజితాన్ని అంత శ్రుతి శుభకంగా విని..
ఔను! ఇళయరాజా తోడుంటే బాలుడు తప్పులు కూడా మనకు ఒప్పుల కొండొకచో..గకారాలు కూడా గమకాలే వేటూరి కలం(గళం) ఇంట జాలువారితే..
ఇవాళ కొన్ని పాటలు వింటుంటే సుందరరాముడు ఎంత గొప్పవాడో అనిపిస్తుంది.తార తారకు మధ్య ఆకాశం ఎందుకు? మనిషి మనిషికి మధ్య మనసు ఎందుకని ప్రశ్నిస్తారు..కల్పన చిత్రంలో.. అంతేనా మరోచోట మరో సిన్మాలో ఇలా అంటారు ఒకే మనిషి నివసించే భువన భవనం ప్రేమ అని.. ఇలా రాయగలగడం ఒక్క ఆయనకే చెల్లు. మళ్లీ వచ్చేద్దాం “ఆమని”లోకి..మంచు తాకి కోయిల, మౌనమైన వేళిలా..అని చెబుతూనే.. శుకపికాది రవాల సౌందర్యాన్ని ఆవిష్కరిస్తారు.ఆ..మధూదయానికి మరొక్క వందనం. ఎందరెందరు వచ్చినా అతడు గతించి పోని గాధే! వయస్సులో వసంతం ఉషస్సుని జ్వలింపజేస్తే..మనసుల్లో మరీచిక నిరాశలు రచించి..అతడిని ఉన్నచోట ఉండనీయలే! అంతటి పటు నిరాశ లోనూ అంతటి పెల్లుబికిన గాఢతలోనూ అతడు ఓ కొత్తదీపాన్ని వెతుకుతున్నాడేమో! అందాక గతించి పోని గాధ తనదని..తరాల నా కథ.. స్వరాల సంపదని భాసించాడు. అందుకనో / మరెందుకనో స్వరాలు మరింత సొబగులు అద్దుకుంటూ నడకలో ఒరవడి పెంచాక మరో ప్రపంచం మరింత చేరువవుతుంది. ఉగాది వేళ నివాళి కోరుతోంది. అటువంటి ప్రకృతికి ప్రతికృతికి వందనం. ఏమని చెప్పాలి వేటూరి భావ కవితా సౌరభం గురించి.. ఎంతని చెప్పాలి అభ్యుదయ వీచికల గురించి..
ఔను! అతడు పడనీరా విరిగి ఆకశం..విడిపోనీ భూమి ఈ క్షణం అని అన్నాడంటే జగడ జగడం ఆడేస్తున్నాడన్నమాటే! ఆడేదే వలపు నర్తనం.. పాడేదే చిలిపి కీర్తనం అని ఎలుగెత్తాడంటే సయ్యాటకు సిద్ధమని సందేశిస్తున్నట్టే! ఓ యువతా! నిన్నంటే నిండుసున్నరా రానే రాదు..నేడేరే నీకు నేస్తము రానేరాదు..అని పిలుపునిచ్చే వేళ అదేమనకు ఢమరుకం. ఊపిరితో నిప్పుల ఉప్పెల చిమ్మించినా..ఊహలలో కత్తుల వంతెన నిర్మించినా అది వేటూరికే సాధ్యం. అందుకే ఆ..పాటసారి అభివ్యక్తే నిలువెత్తు నిభిడాశ్చర్యానికి సంకేతం. ఆయన వాగ్గేయం లక్షణ లక్షితం. ఆ..జల్లంత కవ్వింతకు..ఒళ్లంత తుళ్లింతకు..థ్రిల్లింతకు సాహోరే..ఆయన పాటలు సందెలో రంగులే జవ్వని నుదుటిపై తిలకం దిద్దుతాయ్. వానదేవుడే కళ్లాపి జల్లగా..వాయుదేవుడే ముగ్గేసి వెళ్లగా..నీలికొండ ఊసులన్నీ ఒక్కొక్కటిగా వెల్లడవుతాయ్. ఏదేమైనా కలికి సొగసు..ఉలికి పడిన వేళ ఎండల్లో వెన్నెలొస్తుంది. కోనమ్మ మెచ్చుతుంది. “నందికొండ”వాగు ఉరవడి పెంచుతుంది.నయన శ్రుతులకు / హృదయ లయలకు నమోనమో అంటుంది.సూరీడే ఒదిగి..ఒదిగి..జాబిల్లి ఒడిని అడిగే వేళ ప్రణయ గీతితో ప్రణమిల్లుతుంది. ఇరుసందెలు కదలాడే ఎదలయల ఒడిలో లాలి పాడుతుంది.సెలయేరుల అలపాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నెలకు మనవి చేస్తుంది. నా ప్రేయసి నిదురోతోంది, సడి చేయొద్దని..సవ్వడి పెంచొద్దని..ప్రియ మిత్రమా! నీ మాటల్లోనే.. వీడుకోలిదే..వేడుకోలిదే.. వెళ్లిపోకు నేస్తమా..ప్రాణమైన బంధమా..
కొన్ని ట్రాక్లు అంతే! అవి రికార్డులు సృష్టిస్తాయ్. రాబోవు తరంలో ఎందరెందరు వచ్చినా అవి చెదిరిపోవు. చెరిగిపోవు. కాలగతిలో ఎన్నో మార్పులు రావచ్చు. కానీ ఆనాటి మధూదయం..ఎన్నటికీ పదిలం.
అనండిక! నమామి వేటూరి.. స్మరామి వేటూరి అని..
(గీతాంజలి సినిమా విడుదలై పాతికేళ్లు దాటిన సందర్భంగా..)
‘రత్నకిశోర్ శంభుమహంతి’ గారికి ధన్యవాదాలతో “వేటూరి.ఇన్” టీమ్