ఓ అద్భుత breathless గానా (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

16-adbhutam

తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ:

దాదాపు 20 ఏళ్ళ క్రితం సంగతి. ప్రముఖ తమిళ కవీ, సినీ గేయ రచయితా, వైరముత్తుగారు ఒక శుభ కార్యం  ముగించుకుని స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నారు. సభలో ఇవ్వబడిన జ్ఞాపికను(gift) విప్పి చూస్తున్నాడు ఒక స్నేహితుడు. అది ఒక వెండి దీపస్తంభం. మంచి వెండా కాదా అని రుద్ది పరిక్షించాడు ఇంకొక స్నేహితుడు. దీపాన్ని ఎక్కువ రుద్దకండి; భూతం వస్తుందేమో!’ అని చమత్కారం చేశారు వైరముత్తు గారు! ఒకవేళ భూతం వస్తే ఎవరెవరు ఏమేమి అడుగుతారని ఒక తీయని కల్పన మొదలయి ఎవరికి కావలసింది వారు అడిగారు. చివరిగా ప్రశ్న వైరముత్తు గారికి వచ్చింది. కారు ఆపండి అన్నారు. చింతమాను నీడ. కాయితం అందుకోండి అన్నారు. కాయితం లేదు. ఆహ్వాన లేఖలో ఒక తెల్లటి భాగములో రాయడం మొదలుపెట్టారు వైరముత్తు గారు –

సత్తంగళ్ ఇల్లాద తనిమై కేట్పేన్ – శబ్దాలు లేని ఏకాంతం అడుగుతాను

ఇలా ప్రవాహంలా దాదాపు ఒక 50 వాక్యాలు రాశారు! ఆశువుగా ఒక చక్కని కవిత పూర్తయ్యింది. ఆ కవిత నచ్చి తమిళ సినిమా “అమర్కలం” (అజిత్, షాలినీ) లో వాడుకుంటానంటే కొన్ని మార్పులు చేసి ఇచ్చారు. ఈ సినిమాయే తెలుగులో డబ్ అయ్యి “అద్భుతం” అనే పేరుతో వచ్చింది (చిత్రంగా ఈ సినిమా రీమేక్ అయ్యి “లీలా మహల్ సెంటర్” (ఆర్యన్ రాజేష్, సదా) పేరుతో మళ్ళీ వచ్చింది కూడా). బాల్యం రేపిన గాయాల వల్ల ఒక రౌడీగా మారిన హీరో తను జీవితంలో ఏవేవి కావాలని కోరుకున్నాడో తెలుపుతూ ఆవేదనతో, ఆవేశంతో ఈ పాట పాడతాడు. రమణీ భరద్వాజ్ సంగీతంలో ఇదో చక్కని breathless song. బాలు గారు ఎంతో బాగా పాడారు. ఈ పాటని మీరు ఇక్కడ వినొచ్చు/చూడచ్చు

తెలుగులో ఈ పాటని వేటూరి అనుసృజించారు (అనుసృజించడం అంటే ఏంటి అని అడుగుతారా? అంటే, రొటీన్‌గా inspire అయ్యి ఇంగ్లీష్ ఆల్బం పాటల్ని పొట్లం కట్టి తెలుగు సినిమాల్లో వడ్డించే మ్యూజిక్ డైరక్టర్లా కాకుండా, నిజ్జంగా inspire అయ్యి, తనలోని క్రియేటివిటీని ఫైర్ చేసి కొంతైనా కొత్తగా చెయ్యడం!). కొన్ని వైరముత్తు భావాలనే రాసినా, తనదైన వాణిని వినిపించారు. వేటూరి రాసిన కొన్ని డబ్బింగ్ పాటల్లా ఈ పాట కృతకంగా ఉండదు. అచ్చమైన తెలుగు కవితలా ఆకట్టుకుంటుంది. అంతగా ఎవరికీ తెలియని ఈ పాట గురించి తెలపడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

“సినిమా పాటల్లో సాహిత్యమా? నో నో, అలా జరగడానికి వీల్లేదు!” అని నమ్మే వారిలో మీరూ ఒకరు అయితే ఈ వ్యాసం మీకు నచ్చదు! “సినిమా పాట విని సాహిత్యాన్ని నేను అర్థంచేసుకోలేనా, మళ్ళీ నీ బోడి విశ్లేషణ ఎందుకు?” అని మీరు అనుకుంటే, “కంగ్రాట్స్! మీరు ఈ వ్యాసం చదవక్కరలేదు!”.  ఈ రెండూ కాని వారైతే ఈ వ్యాసం మీకు ఉపయోగపడొచ్చు. చదివి చూడండి!

మీరు: అయినా పైత్యం కాకపోతే ఒక సినిమా పాట గురించి ఈ వ్యాసాలేంటయ్యా? అలా వచ్చి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోయే పాటలో సంగతులూ అవీ తెలుసుకోవాలని ఎవరికి కుతూహలంఉంటుంది?

నేను: మరుగైపోయిన పాటల్ని కొంతైనా వెలికి తీద్దామని ఏదో నాకు తోచిన ప్రయత్నం. మీబోటి వారు ఒకరిద్దరు ఉన్నా చాలు నాకు. ఇప్పుడు పాట చూద్దాం.

 

నిత్యం ఏకాంత క్షణమే అడిగా

యుద్ధం లేనట్టి లోకం అడిగా

రక్తతరంగ ప్రవాహం అడిగా

ఉదయం లాంటి హృదయం అడిగా

అనుబంధాలకు ఆయుస్సడిగా

ఆనందాశ్రులకు ఆశ్శీస్సడిగా

మదినొప్పించని మాటను అడిగా

ఎదమెప్పించే యవ్వనమడిగా

 

మీరు: “ఆగాగు, ఆ మాత్రం తెలుగు మాకూ వచ్చు! నిత్యం అంటే ఎల్లపుడూ, ఏకాంతం అంటే solitude, నిత్యం ఏకాంత క్షణం అంటే, ఎప్పుడూ ఒకణ్ణే ప్రశాంతంగా ఉండాలనా? అలా అయితే మరి ఫేస్బుక్ ఎందుకు, సెల్ ఫోన్ ఎందుకు, సినిమాలెందుకు?

 

నేను: దీనికి ఫిలసాఫికల్ గా అర్థం చెప్పుకోవచ్చు కానీ, చెప్పి మీకు బోర్ కొట్టించను. “శబ్దం లేని ఏకాంతం అడిగా” అన్నది తమిళ భావం. అది తెలుగులో ఇలా అయ్యింది అని మాత్రం అంటాను.

మీరు: “సరే! తర్వాత లైన్లు చూద్దాం. “రక్త తరంగ ప్రవాహం అడిగా” అంటాడేంటయ్యా కవి? యుద్ధం వద్దంటూ వెంటనే “రక్తమే కెరటాలుగా గల ప్రవాహం అడిగాను” అనడం ఏంటి? సినిమా హీరో ఏమన్నా అపరిచితుడు టైపు స్ప్లిట్ పర్సనాలిటీ కేసా?

నేను: “ఉరకలేసే రక్తం కావాలి” అన్న తమిళ భావం తెలుగులో కొంచెం కవిత్వం ఎక్కువై ఇలా అయ్యింది!

మీరు: ఈ పాట సాహిత్యం గొప్పగా ఉందన్నావ్, ఇదేనా? మొదట్లోనే ఇన్ని అపార్థాలు ఉంటే ఇక కాపురం ఎలా నిలుస్తుంది? సారీ..ఈ గీతికా గోపురం ఎలా నిలుస్తుంది?

నేను: ఆడవాళ్ళకు తొందరా, మగవాళ్ళకి హర్రీ ఉండకూడదన్నారు పెద్దలు. ఓపిక పట్టండి సార్, ముందుంది భావాల పండగ! “అనుబంధాలకి ఆయుష్షూ, ఆనంద భాష్పాలకి ఆశీస్సు అడిగాను” అంటూ తమిళంలో లేని భావాన్ని వేటూరి ఎంతో అద్భుతంగా పలికించారో కాస్త గమనించండి.

పిడుగులు రాల్చని మేఘం అడిగా

జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా

వరించు తరించు వలపే అడిగా

ప్రాణతుల్యమౌ బంధం అడిగా

పచ్చికలో మంచు ముత్యాలడిగా

పువ్వుల ఒడిలో పడకే అడిగా

తనువోదార్చే ఓ కునుకడిగా

తలనే నిమిరే వేళ్ళను అడిగా

 

మీరు: ఇవి హాయిగా అర్థమౌతున్నాయ్! బావున్నాయ్. ఇంతకీ ఈ భావాలు తమిళమా, తెలుగా?

నేను: ఇవన్నీ దాదాపు తమిళ భావాలే. అయితే వేటూరి తనదైన సుగంధం అద్దారు. తమిళంలోని “ఉరుములు లేని మేఘం” బదులుగా “పిడుగులు రాల్చని మేఘం” అన్నారు. అలాగే “వరించు తరించు వలపు”, “మంచు ముత్యాలు” ఇవన్నీ వేటూరి తెలుగింపులు! “తలనే నిమిరే వేళ్ళని అడిగా” అన్న తమిళ భావం నాకు చాలా నచ్చింది.

 

మీరు:అవును. “తలనే నిమిరే వేళ్ళని అడిగా” అదుర్స్. వైరముత్తుకి వెయ్యండి వీరతాళ్ళు!

 

నెమలి ఆటకు పదమే అడిగా

కోయిల పాటకు పల్లవి అడిగా

నదిలో గుక్కెడు నీళ్ళే అడిగా

మదిలో జానెడు చోటే అడిగా

మచ్చంటు లేని జాబిలినడిగా

నక్షత్రకాంతి నట్టింటడిగా

దుఃఖం వధించు అస్త్రం అడిగా

అస్త్రం ఫలించు యోగం అడిగా

 

మీరు: అడక్కపోయినా ఎలాగూ ఏదో వివరణ ఇస్తావ్‌గా! కానీ!

 

నేను: తమిళ భావం “కోయిల పాటను అడిగాను” అనే. నెమలి గురించి ప్రస్తావన లేదు. అలాగే మిగతా భావాలు కూడా వేరుగా ఉన్నాయ్. కాబట్టి ఈ లైన్లు అన్నీ వేటూరి కవిత్వమనే చెప్పాలి.  ట్యూన్లో వింటే ఎంత అద్భుతమైన పదాలు వేటూరి పొదిగారో తెలిసి మనసు స్పందించిపోతుంది. “గుక్కెడు నీళ్ళు, జానెడు చోటు” అని డైమెన్షన్స్ ప్రస్తావిస్తూ చెప్పడం effective గా అనిపించింది నాకు. అలాగే “నట్టింట్లో నక్షత్ర కాంతి కావాలి” అనడం ఎంత బాగుందో! దుఖం వధించే అస్త్రం, ఆ అస్త్రం ఫలించే యోగం రెండూ కావాలనడం వేటూరిజం!

 

మీరు: అవును వేటూరి మురిపించాడు!

 

చీకటి ఊడ్చే చీపురునడిగా

పూలకు నూరెళ్ళామని అడిగా

మానవజాతికి ఒక నీతడిగా

వెతలరాత్రికే వేకువనడిగా

ఒకటే వర్ణం సబబని అడిగా

ఒక అనురాగం ఒడిలో అడిగా

వాలని పొద్దున నెలవంకడిగా

ప్రాణముండగా స్వర్గం అడిగా

 

మీరు: చీపురు గురించి రాయడం ఏంటి, చీప్‌గా?

 

నేను: అలాగా? నాకు చాలా నచ్చింది. చీకటిని చీపురుతో విసురుగా ఊడ్చేస్తున్నట్టు ఊహించుకోండి. ఈ imagery అద్భుతంగా అనిపించింది నాకు. ఇది తమిళంలో లేని వేటూరి ప్రయోగం.

 

మీరు: నీ టేస్టు తగలడా! సరే! lets agree to disagree!. మిగతా వాక్యాలు బాగున్నాయ్!

 

నేను: “మనుషులందరికీ ఒకే మనసు అడిగా” అన్న తమిళ భావం “మానవ జాతికి ఒక నీతడిగా” అంటూ కొంత వేరుగా తెలుగులో గుబాళిస్తుంది. “వెతల రాత్రికి” అన్నది వేటూరి ప్రయోగమే. తమిళంలో “ప్రపంచం అంతా ఒకే తీరుగా వర్షం కావాలి” అని ఉన్న భావాన్ని వదిలేసి “ఒకటే వర్ణం సబబని అడిగా” అంటూ కొంత సామాజిక స్పృహ ఉండే భావం రాశారు వేటూరి. “ఆకాశం మొత్తం వెన్నెల అడిగా” అన్న తమిళ భావాన్ని “వాలని పొద్దున నెలవంక అడిగా” అని చాలా అందంగా రాయడం వేటూరి ప్రతిభే!

 

న్యాయం ధర్మం ఇలలో అడిగా

ఎద రగిలించే కవితే అడిగా

కన్నీరెరుగని కన్నే అడిగా

క్షామం నశించు కాలం అడిగా

చుక్కలు దాటే స్వతంత్రమడిగా

దిక్కులు దాటే విహంగమడిగా

తొలకరి మెరుపుల నిలకడనడిగా

ఎండమావిలో ఏరును అడిగా

 

మీరు: ఇవి బానే ఉన్నాయ్!

 

నేను: నాకు బానే కాదు. బాగున్నాయ్! మొదటి రెండు వాక్యాలు దాదాపు తమిళ భావాలే. మిగతావి వేటూరి భావాలు. “చుక్కలు దాటే స్వతంత్రం అడిగా, దిక్కులు దాటే విహంగం అడిగా” అన్న వాక్యాలు చాలా నచ్చాయ్ నాకు. విహంగం అంటే పక్షి అని అర్థమున్నా, ఇక్కడ స్వేచ్ఛకి సంకేతంగా వాడారని భావించొచ్చు.

 

మూగపాటకొక చరణం అడిగా

మౌనభాష వ్యాకరణం అడిగా

నమ్మిచెడని ఓ స్నేహం అడిగా

శాంతిని పెంచే సంపదనడిగా

వస్తే వెళ్ళని వసంతమడిగా

ఏడేడు జన్మాలకొక తోడడిగా

ఏనాడు వాడని చిరునవ్వడిగా

ముసిరే మంచుల ముత్యాలడిగా

 

మీరు:మొదటి రెండు వాక్యాలూ అదిరాయ్.

 

నేను: అవును! అవి వేటూరి సొంత భావాలు. తర్వాత రెండు వాక్యాలు తమిళ భావాలే అయినా, మిగతా వాక్యాలు వేటూరివే. “మంచు ముత్యాలు కావాలి” అని మళ్ళీ ఇక్కడ అడగడం గమనించాలి. అంతక ముందు “పచ్చికలో మంచు ముత్యాలు” ఆల్రెడీ అడిగాడు! ఈ పాటలో ఇలాటి రిపీట్ అయ్యిన భావాలు కొన్ని మనం చూస్తాం!

 

ముసిముసినవ్వుల ముగ్గులు అడిగా

ఆశల మెరుపుల జగమే అడిగా

అంధకారమా పొమ్మని అడిగా

అందరి ఎదలో హరివిల్లడిగా

మరుగైపోని మమతను అడిగా

కరువైపోని సమతను అడిగా

 

మీరు: ఈ లైన్లు బానే ఉన్నాయ్. కానీ అంత విశేషం ఏమీ ఉన్నట్టు లేదు.

 

నేను: అంత లేకపోయినా కొంత విశేషం ఉంది! ఈ భావాలన్నీ వేటూరివే! ఈ పాటలో ఇప్పటి దాకా కనిపించని thought continuity కొంత ఇక్కడ కనిపిస్తుంది. కవి ఒక కొత్త ప్రపంచం కోరుతున్నాడు ఇక్కడ. నవ్వులతో, ఆశల మెరుపులతో, అందరి మనసుల హరివిల్లులతో నిండిన జగం అది. మమత అంటే “నాది (మమ)” అనుకునే భావన. సమత అంటే “అందరూ సమానమే” అనే భావన. ఈ రెండూ అవసరమే. “మరుగు” అన్న పదానికి రెండు అర్థాలున్నాయ్ – కనిపించకుండా పోవడం (తెర మరుగయ్యాడు), మోహంలో పడడం (అతను మందు మరిగాడు). కాబట్టి “మరుగైపోని మమత” అంటే ఒక “వ్యసనంలా మమకారం మారిపోకూడదు” అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఈ మమకారం ముదిరితే, “నేనూ, నా కొడుకూ, నా వాళ్ళే బాగుపడాలి” అన్న స్వార్థం ఎక్కువై అన్యాయం వైపు అధర్మం వైపు మనసు మళ్ళే ప్రమాదం ఉంది. attachment with detachment అన్నది భారతీయ వేదాంత ఉపదేశం.

 

రాయలంటి కవిరాజుని అడిగా

బమ్మెర పోతన భక్తిని అడిగా

భారతి మెచ్చిన తెలుగే అడిగా

పాశుపతాస్త్రం నరుడై అడిగా

మొహన క్రిష్ణుడి మురళే అడిగా

మధుర మీనాక్షి చిలకే అడిగా

 

మీరు: interesting lines!

నేను: basic ఐడియా తమిళం లోదే! రాయల వారినీ, బమ్మెరనీ ప్రస్తావించి వేటూరి తెలుగుదనం అద్దారు ఇక్కడ. తమిళంలో వేరే వారి ప్రస్తావన ఉంది. పోతన భక్తిని ప్రస్తావించడం పోతనపై వేటూరికి ఉన్న భక్తికి నిదర్శనం. ఇక “భారతి మెచ్చిన తెలుగు” అని రాసి వేటూరి చిన్న చమత్కారం చేశారు.  తమిళ భావం – “సుబ్రహ్మణ్య భారతి కవితని అడిగాను” అని. కవి భారతి “సుందర తెలుంగు” అని తెలుగు భాషని పొగిడారు కాబట్టి “భారతి మెచ్చిన తెలుగు” సరిపోతుంది. భారతి అంటే సరస్వతి అని అర్థం తీసుకుంటే “గొప్ప సాహితీ సంపదతో సరస్వతీ కటాక్షమై అలరారుతున్న తెలుగు” అన్న అర్థం వస్తుంది.

వున్నది చెప్పే ధైర్యం అడిగా

ఒడ్డెక్కించే పందెం అడిగా

మల్లెలు పూసే వలపే అడిగా

మంచిని పెంచే మనసే అడిగా

పంజా విసిరే దమ్మే అడిగా

పిడుగుని పట్టే ఒడుపే అడిగా

ద్రోహం అణిచే సత్తానడిగా

చస్తే మిగిలే చరిత్రనడిగా

విధిని జయించే ఓరిమినడిగా

ఓరిమిలో ఒక కూరిమినడిగా

సహనానికి హద్దేదని అడిగా

దహనానికి అంతేదని అడిగా

కాలం వేగం కాళ్ళకు అడిగా

చిన్నా చితకా జగడాలడిగా

తియ్యగ ఉండే గాయం అడిగా

గాయానికి ఒక గేయం అడిగా

పొద్దే వాలని ప్రాయం అడిగా

 

మీరు: ఒడ్డెక్కించే పందెం అంటే ఏంటి? ఇదో తమిళ భావమా?

నేను: ఈ భావాలు చాలా వరకూ వేటూరివే. “ఒడ్డెక్కించే పందెం” అనడంలో కవి అంతరార్థం ‘పందెంలో ఓడిపోకుండా ఉండేట్టుచూడు’ అనే అర్ధం చూసుకోవచ్చు మిగతావి తేలికగా అర్థమౌతాయ్.

మీరు: ఓరిమి, కూరిమి అని వాడాడు. ప్రాస కోసమా?

నేను: ప్రాస కోసమే అనుకోలేం. విధిని జయించడానికి సహనంతో పాటూ మనని అర్థం చేసుకునే ఒక నేస్తం కూడా కావాలి. ఈ విషయం చాలా మందికి అనుభవమే. దీనినే “విధిని జయించే ఓరిమి, ఓరిమిలో కూరిమి” అడిగా అని అందంగా రాశారు.

మీరు: “సహనానికి హద్దేదని అడిగా, దహనానికి అంతేదని అడిగా”  అన్న వాక్యాలు variety గా ఉన్నాయ్. వీటికి ఎలా అర్థం చెప్పుకోవాలి? తరచుగా మనం చూసే హింసా, బస్సులు తగలబెట్టడం వీటి గురించి రాశాడా?

నేను: ఆ వాక్యాలు మణిపూసలు. ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయ్. మీరు చెప్పిన “సామాజిక వ్యాఖ్య” కూడా సరిపోతుంది.  ఎన్నో సార్లు మనం చుట్టూ ఉన్న అసమానతలు, అన్యాయాలూ, మారణహోమాలు చూసి “ఇక చాలు. ఏదైనా చెయ్యాలి” అనుకుంటాం. ఎంత వరకూ సహనం ఉండాలి, ఎప్పుడు సహనం చాలించాలి అని తేల్చుకోవడం కొంత కష్టమే! మిగతా లైన్లలో కాలం వేగం కాళ్ళకి అడిగా, పొద్దే వాలని ప్రాయం లాటి చక్కటి expressions వేటూరి ఇచ్చారు, భావాలు తమిళమే అయినా.

ఒడిలో శిశువై చనుబాలడిగా

కంటికి రెప్పగ తల్లిని అడిగా

ఐదో ఏట బడినే అడిగా

ఆరో వేలుగ పెన్నే అడిగా

ఖరీదు కట్టని కరుణే అడిగా

ఎన్నని అడగను దొరకనివీ

ఎంతని అడగను జరగనివీ

ఎవ్వరినడగను నా గతిని

కళ్ళకు లక్ష్యం కలలంటూ

కాళ్ళకు గమ్యం కాడంటూ

భగవధ్గీత వాక్యం వింటూ

మరణం మరణం శరణం అడిగా

 

మీరు: ఆరో వేలుగ pen అడగడం కొంచెం odd గా ఉందోయ్!

నేను: ఈ వాక్యాల్లో మూల భావం వైరముత్తుదే అయినా, వేటూరి expressions చాలా మార్చారు. తమిళంలో “పాకే వయసులో తల్లిపాలు, గంతులేసే వయసులో బొమ్మలు, ఐదో ఏట పుస్తకం” కావాలి అని ఉంది. ఆరో వేలుగా pen కావాలి అన్న వైరముత్తు భావం innovative గా ఉంది. ఐతే మొత్తం తెలుగు పదాలతో నిండిన పాటలో ఇలా english పదం రావడం కొంచెం oddగా అనిపించింది నాక్కూడా.

మీరు: కాళ్ళకి గమ్యం కాడంటూ అంటే ఏమిటి అర్థం? కాదంటూ అనాలేమో?

నేను: “కాడు” అంటే శ్మశానం. కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాడంటూ అనడంలో  “ఎన్నో కలలు కన్నాను, కానీ అవేవి తీరకుండానే పోతాను” అన్న నైరాశ్యం కనిపిస్తుంది. పైగా దీన్ని భగవద్గీతా వాక్యం అంటాడు! మరి భగవద్గీతలో ఈ నైరాశ్యం ఉందా? లేదు. మరి ఈ వాక్యాలని ఎలా అర్థం చేసుకోవాలి? కిటుకు interpretation లో ఉంది.  “జగమే మాయ, బ్రతుకే మాయ” అన్న వాక్యాల్లో కూడా నైరాశ్యం లేదు. కానీ దేవదాసు తెలిసో (తెలిస్తే వ్యంగ్యంగా) తెలియకో (తెలియకపోతే అజ్ఞానంతో) అలా పాడ్డం ద్వారా తన బాధనీ, నిరాశనీ వ్యక్తం చేస్తాడు. భగవద్గీతలో చెప్పినది ఏమిటంటే – “చావు తప్పదు. భయపడకు. నిరాశ పడకు. కార్యోన్ముఖుడివి అవ్వు. పరిపూర్ణత్వాన్ని పొందు” అని. ఇందులో negativity లేదు. ఈ భావాన్నే పాటలో హీరో ఇంకోలా వ్యాఖ్యానిస్తాడు.

మీరు: బాగుందోయ్! మంచి పాటని పరిచయం చేశావ్. థాంక్స్!

నేను: నాకెందుకు, రాసిన కవికి చెప్పండి థాంక్స్!!

(2009 లో నవతరంగంలో రెండు భాగాలుగా (భాగం 1, భాగం 2) ప్రచురించిన వ్యాసాన్ని చిన్న మార్పులతో ఇప్పుడు మళ్ళీ ప్రచురిస్తున్నాను. తమిళ పాట అర్థాన్నీ, పూర్వోత్తరాలని చెప్పి, ఈ వ్యాసం రాయడంలో ఎంతో సహకరించిన మిత్రుడుఅవినేని భాస్కర్కి ప్రత్యేక కృతజ్ఞతలు. తమిళ గీతాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్‌లోఇక్కడచదవొచ్చు)

http://janinthesky.wordpress.com/2012/03/25/satham-illatha-thanimai-kaetten/

———————————————

ఫణీంద్ర గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

2 thoughts on “ఓ అద్భుత breathless గానా (కె.ఎస్.ఎం.ఫణీంద్ర)

  1. you had done a wonderful job keep doing may be some people those who still like our telugu literature will definitely follow you and i like it very much and do some other veturi animutyalu also

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.