మరపురాని మధురమూర్తి (వేటూరి)

29-01-2014 బుధవారం నాడు “వేటూరి” జయంతి.ఆ సందర్భంగా వారు గురుతుల్యులుగా భావించే మల్లాది వారి గురించి వేటూరి గారు వ్రాసిన వ్యాసం మీకోసం.

——————————————————————————–

Malladi Ramakrishna Sastri garu

 

అది చెన్నైనగరం – అందులో చెందెలుగు సాహితీ కళాసాగరం. ఆ సాగరంలో ఒక జన ద్వీపం. అందు వివిధ తరులతాఫల పుష్ప సంతానంతో విరిసే పానుగల్లు ఉద్యానవనం. దాని ఎదుట ప్రకాశం రోడ్డు నాగేశ్వరరావు రోడ్లను కలుపుతూ ఒక సువిశాల వీధి. అది ప్రముఖంగా వినువీధి. దాని మధ్యలో ఒక పేవుమెంటు. అక్కడ ప్రతి సాయంత్రం సమావేశమయ్యేది ఒక పార్లమెంటు. అయితే అది శాసనసభ కాదు. అదొక అభినవ వాగనుశాసన. ఆ సభాధ్యక్షులు శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారు.

అటూ ఇటూ రాదారిగా పోదారిగా సాగే శకటాల చక్రసంగీతం ఎవరి చెవికీ ఎక్కేది కాదు. నలుగురైదుగురితో మొదలై నలుబది ఏబది మంది వరకూ ఎదిగిపోయేది ఆ సభ. శ్రోతలు పృఛ్ఛకులుగా మారిన కొద్దీ మరింత అనర్గళంగా సాగేది సభ. ఐతరేయ బ్రాహ్మణం నుంచీ అభ్యుదయ కవిత్వం వరకూ హోమర్ నుంచి టి.ఎస్. ఎలియట్ వరకూ కవిబ్రహ్మ మొదలు కరుణశ్రీ వరకూ, ఆనందుడి నుంచి పద్మపాదుడి వరకూ సభాధ్యక్షులు ప్రసంగిస్తుంటే తన్మయత్వంతో తడిసిపోయేవారు శ్రోతలు. అవసరాన్ని బట్టి ప్రతిమాటలోనూ ఓ ములుకో, చెళుకో దాగి ఉండేది.

 

మహాత్మాగాంధీని చూస్తే నాకు ఏ మహావీరుడో, నాయకుడో కనిపించడు. నన్ను ప్రేమతో ముద్దాడి మురిపాల్లో ముంచెత్తిన మా నాయనమ్మో, మేనత్తో గుర్తొస్తారు. ఆయన సత్యాగ్రహాలు, నిరశనదీక్షలు ముసలివాళ్ల అలకల్ని, అఘాయిత్యాల్ని గుర్తు చేస్తాయి. అందులో ఉన్న ప్రఛ్ఛన్న విప్లవం గుర్తించేందుకు తెల్లవాళ్ళకు చాలాటైం పట్టింది. ఇదొక శాస్త్రీయ సూక్తి.

 

ముంచుకొచ్చిన మృత్యువుతోనే ముచ్చట్లాడిన జాణ ఆయన. రెండు రోజుల కోమా నుంచి తేరుకుంటూనే “నేను మొహం కడుక్కుని కాఫీ తాగి రెండు రోజులయిందటగా”- అని నవ్వి, నవ్విస్తూ మళ్ళీ కోమాలోకి వెళ్ళి తిరిగిరాని గంధర్వులు శాస్త్రిగారు.

 

పూర్వకవులు రాసిందంతా కవిత్వమని, ఇప్పటి వాళ్ళది చప్పటిదనీ ఆయన పెదవి విరిచిన పాపాన ఏనాడూ పోలేదు. గుంటూరులో నవ్యసాహితికి నాంది పలికిన నవమిచిలుక “శిష్ట్లా” ని గురించి విరించి అన్నంతగా చెప్పిన మానవం ఆయనది.

 

చిన్నవాళ్లను చూస్తే చిరునవ్వుతో సిగరెట్టు ఇచ్చి వెలిగించమనే ఆయన పెద్దరికం చెబితే అర్ధం కాదు. ఆగర్భ శ్రీమంతుడై పుట్టలేదు గాని ఆశ్రితజన పారిజాతం ఆయన. తెలుగులో ఆయన స్థానం నా దృష్టిలో ఆంధ్ర సారస్వతంలో థామస్ హార్డీకున్న స్థానం వంటిది. టెస్ ఆఫ్  ది జాబర్‍వెల్స్ ఆయన అభిమాన నవల. ఆంధ్రవారపత్రికలో రాసిన ఖామోష్ అనే ఆయన కథ అచ్చులో అరపేజీ కూడా రాలేదు. కానీ దాని ఆయుష్షు మాత్రం అనంతం. టెస్‍వంటి కన్నెపిల్లలకు పరిష్కారం చూపడం హార్డీ వద్దనుకున్నాడో, లేదనుకున్నాడో, ముడతలు పడి ముదివగ్గయిన ముదిత టెస్ అనే ప్రశ్నకు జవాబయింది ఈ కథలో.

 

కవిగా, సినీకవిగా ఆయన రాసిన పాటలు పాటలీపుత్రులకు బాలశిక్షలు, చిగురాకులలో చిలకమ్మలు, మరుమల్లెలలో మావయ్యలు మల్లాదివారి సాహితీ మర్యాద నెరిగిన సరసులు, మననం చేసుకునే మంత్రాక్షరాలు. సినీ గేయానికి శక్తి పెంచి భావనావధులకు భాషా పరిమితులు తుడిచిపెట్టిన లేఖిని అది. నడచి మౌనంగా వెళ్ళే జవ్వనిని “గమనీ” అనడం కన్నా పరిచయరహితుడు మరేమనగలడు? సుధవోల్సుహాసినీ మధువోల్విలాసినీ శబ్దాలు తెలుగును మంత్రించిన సంగీత బీజాక్షరాలు. వంగ వంగడపు వన్నెలు దిద్దుకున్న బంగాళీ రసగుల్లలు. వాటంచూడడాలు వడుపు చేయడాలు కొమ్మలు వంచడాలు తెలుగింటి ఒడియాల కరకరతో శ్రుతిముఖాలకే విందులయ్యే అలతి ప్రయోగాలు. మళ్ళీ పరుండేవు లేరా ఈ జాను తెలుగు జాణతనం ఆయనకే చెల్లింది.

 

తిక్కన గారు వ్యాసులంతటివారు. తెలుగు వ్యాసులే కదా వారు. వారి తండ్రిగారు అపర పరాశరులు కాకుండా ఉంటారా? గుంటూరు సీమలో ఏ గుమ్మనో కంట జూచి జంటకలిపే ఉంటారు. మత్స్యగంధీ పరాశరీయం పురాణ గౌరవం పొందినప్పుడు ఇదీ- కథాగౌరవం కనీసం పొందాలికదా! అందుకే కొమ్మన్నగారి రెమ్మను వంచి ఎవరూ కిమ్మనలేని కమ్మని కథ రాసారు మల్లాది వారు!

 

ఓసారి అడిగితే అన్నారు. “భారతం రాసే వాళ్ల వరసలంతే లేవయ్యా. కామ సోమయాజులు – శృంగార పీఠాధిపతులు – వావి వరసల తావినెరిగిన సరసులు _ సుగృహీతనామ ధేయులు వారే పురుషులు అని. వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి అంటే నీకు కూలంకషంగా అర్ధమైనట్టు లేదు.”

 

కృష్ణాతీరే _ అనే కథలో వైదిక శిఖామణుల ఇంటి భాగోతాలు వారి అణుకువలో కామవర్ధిని రాగాలు, ఛాందసయోగాలు అక్షర శిల్పాలుగా చెక్కి ఆశ్చర్యం కలిగించారు శాస్త్రిగారు. కథా వాఙ్ఞ్మయానికి జానుతెనుగు పునుగు జవ్వాదులు పూసి పులకింపచేసిన మల్లాది వారు మరుపురాని మధురహృదయులు. ఆ చేతికి ఎముకగానీ, చూపుకు వెనుకగానీ లేవు. తాంబూలారుణ మందహాస  మందారులు వారు. కొంచెం గూనిగా ఒంగినట్టు ఉన్నా దేనికీ లొంగినట్లు ఆయన చరిత్ర చెప్పదు. విశాలఫాలం. ప్రఛ్ఛన్న ఫాలాక్షుడైన నరపరమేశ్వరుడాయన. నామటుకునాకు “ఆ ఫాలలోచన శ్శూలి ద్విబాహుపరోహరిః” ఈ శాస్త్రిగారికి సరిపోతుందేమో అనిపిస్తుంది.

 

ఆకుపచ్చలు ఆరని అక్షర తోరణాలు వారి రచనలు. గరుడపచ్చమాలలు అల్లినట్లుండే హస్తాక్షరి. ఒకసారి పాట రాస్తే సవరణ ఉండదు. కొట్టివేత ఎరుగని దిట్టతనం ఎగదట్టిన తెలుగుతనం ఆయనది. ఒకసారి ఆ  పాట అర్ధం కాకపోతే నీ చూపు మార్చుకో, తెలుగు నేర్చుకో, అంతేగాని ఆ పాటను మార్చమనకు. అది మారదు – అని చెప్పిన నిరంకుశుడు.

 

ఆయన మనస్సులో థామస్ హార్డీతోపాటు చోటు చేసుకున్న మహాకవి జాన్‍కీట్సు “ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్”. అదే “అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం” అనే పాట వింటే ప్రణయోపాసనలో సంధ్యావందన మనిపిస్తుంది. అదే నిజం తెలుస్తుంది శాస్త్రిగారి గీతాలలో.

“పడమట సంధ్యారాగం

కుడి ఎడమల కుసుమ పరాగం

ఒడిలో చెలి మోహనరాగం

జీవితమే మధురానురాగం

ఇక జీవితం ఎలాంటిది ? అందులో యవ్వనం ఏపాటిది అంటే

పడిలేచే కడలి తరంగం

ఒడిలో జడిసిన సారంగం

సుడిగాలిలో ఎగిరే పతంగం

జీవితమే ఒక నాటకరంగం”

ఇలా సూత్రీకరించిన గీతాచార్యుడి తెలుగు సినీలోకంలో మరొకరు లేరు.

“చందమామా మసకేసిపోయె

ముందుగా కబురేలోయ్

లాయిరీ నడిసంద్రములోనా

లంగరుతో పనిలేదోయ్” – అన్నా

కొండలే రగిలే వడగాలి

నీ సిగలో పూవేలోయ్” – అన్నా

“సుడిలోదూకి ఎదురీదక

మునకే సుఖమనుకోవోయ్” – అన్నా

తన దేవదాసు నోట ఈ పాట పాడించిన శాస్త్రిగారిని చూసి శరత్‍చంద్రుడు “అన్నన్నా” అనుకుని ఉంటాడు. “చిగిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు – చినదానిమీద మనసు”; “నల్లానల్లని బుచ్చినీడలు తెల్లా తెల్లని బుల్లి ఎండలు” శాస్త్రిగారి కవితలో పొగడలేని సాహితీ సౌరభాల పొగడదండలు.

 

ఆయన కన్నుమూసిన  నాడు తెలుగు తెల్లబోయింది. సినీరంగం చీకటి గుయ్యారమైంది. సరసం చచ్చిపోయింది. కోకిల కాకిలా వేపకాయలు తిని వెర్రిగా ఏడ్చింది. కవుల రూపున కవిత పేరునా కదిలే రససమాధులు మాత్రం కదులుతూ మిగిలిపోయాయి. విరజానది కావేరిగా ఆత్రేయ కన్నీరుగా మారి మరుభూమికి చేరింది. “నారీనారీ నడుమ మురారీ హరికీ హరికీ నడుమ వయ్యారీ” అన్నంతటి లీలాశుకుడు కాలంచేస్తే అంతకన్న ఏం జరుగుతుంది?

 

సినిమాకోసం కలం పట్టిన తొలిదశలో నాకు స్ఫూర్తినిచ్చిన తొట్టతొలి సినిమా కవి మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. ఆయన అచ్చతెలుగు, నేటి తెలుగు, నోటి తెలుగు, తేట తెలుగు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగువారి జీవన శైలిని ప్రతిబింబించిన పా(బా)ట ఆయనది. అచ్చ తెనుగుని వుపయోగించడంలో ఉన్న సొగసేమిటో ఆయన పాటల్లోనే కనిపించేది. ఉదాహరణగా చిన్నమాట! “మది శారదా దేవి మందిరమే…కుదురైన నీ మోమున కొలిచే వారి మది శారదాదేవి మందిరమే” (జయభేరి) అంటూ భావాన్ని ఎలా కుదురుగా వాడాలో నేర్పిన సుకవి శాస్త్రిగారు. ఆది మధ్యాంత్య  ప్రాసల్ని పాటలో పొదగడంలో ఆయన పాళీ, మేం నిచ్చెనలెక్కడానికి ఉపయోగించుకున్న వైకుంఠ “పాళి”!

Malladi-1మహావ్యక్తికి చావులేదు

మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు చనిపోలేదు.

వారి సాహిత్యం చిరంజీవి

వారి సాహిత్యం అనంతం.

చావుకే చావు వారి మధుర స్మృతి

ఇంతకన్న వారు లేని లోపాన్ని వర్ణించడం చేతకాదు.

కప్పిపుచ్చుకొనడమూ కలిసిరాదు.

ఆమని పోయిన తర్వాత కోయిల గతేమిటి?

వారు వెళ్ళిపోయిన తర్వాత వారి మిత్రుల గతి అది.

అంతకన్న చెప్పడం కష్టం

ఇంతకుమించి చెప్పడం ఇష్టం లేదు.

నదులెన్ని కలసినా క్షార సముద్రం క్షీరం కాదు.

మల్లాది వారిని చప్పరించినా మరణం మధురం కాలేదు. అదే చివరకు తేలింది

ఆయన మధురిమను ఇక్కడే వదిలేసి వెళ్ళారు.

చావులో చేదును స్వాహచేసి స్వాదువుగా చేయాలని వెళ్ళారు.

అందుకే మృత్యుదేవత ముందుకొస్తే నవ్వమన్నారు. ముంచుకొస్తే నవ్వి చూపించారు.

అదీ నవ్వింది. వారూ నవ్వారు. నవ్వులేకమైనాయి.

వారు లేకుండా పోయారు, వారి నవ్వు మిగిలింది. నవ్వు వారిని మిగిల్చింది.

ఇంతకూ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు ఆరని చిరునవ్వు.

అది పునః పునర్నవం వారు నిత్య నూతనులు.

వారి స్మృతి నవనాభ్యుదయం.

———————————————

కొత్తావకాయ గారికీ,బ్లాగర్ శ్రీలలిత గారికీ కృతజ్ఞతలతో వేటూరి.ఇన్ టీం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.