స్వరబ్రహ్మ రాగవిష్ణు గురుర్దేవో మహదేవన్ (వేటూరి)

20130314_Mahadevan

 

నా తొలిపాటకు సరిగమలు దిద్దింది – పెండ్యాల గారు. సిరికాకొలను చిన్నదిఅనే రేడియో నాటిక అది (1969). నా తొలి సినిమా పాటకు స్వరాలు దిద్దింది మామగారు శ్రీ కె.వి. మహదేవన్. ఓ సీత కథచిత్రంలో భారతనారీ చరితముఅనే మకుటంతో సాగే హరికథ అది (1972).

 

ఆ సుముహూర్తమెటువంటిదో  అది 25 వసంతాల పాటు పుష్పించి ఫలించింది. ఆయనతోను, ఆయన మానసపుత్రుడు శ్రీ పుగళేందితోను నా అనుబంధాన్ని జీవితంలో మరపురాని మధుర ఘట్టంగా నిలిపింది. ఆదుర్తి ఆత్రేయ మహదేవన్ కలిసి ఒక స్వర్ణయుగం. అటు తర్వాత విశ్వనాధ్ మహదేవన్ ల  యుగంలో నా పేరుకు కాస్త చోటు దొరికిందంటే అది నా పూర్వ పుణ్యం.

 

తెలుగు సినిమాకు సంగీత భిక్ష పెట్టిన మహనీయులలో అగ్రగణ్యుడు ‘స్వరబ్రహ్మ’ శ్రీ కె.వి. మహదేవన్. సినీ గీతంలో సాహిత్యాన్ని మన్నన చేసి మర్యాద నిలిపిన సంగీత దర్శకుడు ఆయన. తెలుగుతనానికి, తెలుగు గాన సంప్రదాయానికి ప్రతీక మహదేవన్ పాట. ఆయన దగ్గర ట్యూన్లు ఉండేవి కావు. రాసిన పాటను బట్టి ట్యూన్ ఏర్పడుతుందని ఆయన సిద్ధాంతం. ఆయన కట్టిన బాణీలన్నీ ‘స్టాకు’ లోంచి తీసినవి కావు. ప్రతి ట్యూనూ రాసిన పాటను బట్టి పుట్టినదే.

 

నావరకు నాకు మామతో వున్న బంధం సినీ పరిశ్రమలో మా మా పాత్రలకు పరిమితమైనది కాదు. గురు శిష్య సంబంధం.

 

మహదేవన్ తెలుగు సినిమా సంగీత సామ్రాజ్యాన్ని మూడు దశాబ్దాల పైబడి మహారాజులా పాలించారు. అయినా కర్తృత్వాహంకారం లేని కర్మయోగి., మితభాషి – మౌని. ఆయన స్వరబ్రహ్మ. నాద తనువు అయిన శివావతారం ఆయనది. తెలుగు పాటకోసం ఆయన పుట్టాడని పూర్వతరానికి చెందిన చిత్ర నిర్మాతల, దర్శకుల, ప్రేక్షకుల ప్రగాఢ విశ్వాసం. ఆయనకు జన్మనిచ్చింది తమిళ కేరళ సరిహద్దు ప్రాంతం. ఆయన జన్మనిచ్చినది  ఈనాటి తెలుగు సినిమా పాటకి మాతృక అయిన ఆనాటి పాటకీ….ఏనాటికైనా పాటగా నిలిచే పదాల మూటకీ… భావాల తోటకీ …! ‘ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ నైనా ట్యూన్ చేయగలడు మామ!’ అన్నది ఆనాటి చిత్రలోకోక్తి. అతిశయోక్తి మాత్రం కాదు.

 

ఆయన ఏనాడూ ట్యూన్ ఇచ్చి ఎరుగడు. అప్పటికే ముందు ట్యూన్ ఇచ్చే సంప్రదాయం హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు, తమిళ భాషల్లో ఆ మాటకొస్తే రంగస్థలం మీదే వాడుకలో వుండేది. నేను ఆయనకు రాసిన దాదాపు 50 చిత్రాలలో ఏనాడూ ట్యూన్ ఇచ్చి ఎరుగని సంగీత సముద్రుడు. అట్లాంటిక్ ఓషన్ లా ఆయన సంగీతలోకంలో కర్నాటిక్ ఓషన్. ఘజల్ తో జానపదాన్ని జోడించడంలో మెహదీహసన్ ప్లస్ శంకర్ జైకిషన్!

 

నా తొలిపాట ట్యూన్ చేసిననాడే ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో తెలిసింది. అప్పటికి నాకు సినీ భాష అంతగా పట్టుబడలేదు. సంస్కృత సమాస భూయిష్టంగా నా రచన.

 

భారతనారీ చరితము మధుర కథా భరితము

పావన గుణ విస్ఫురితము పతిసుతానుమతము సతము 

శీలజ్జోత్స్నా పులకిత హేలా శారద రాత్రము 

అతిపవిత్ర మఘలవిత్రమీధరిత్రి కనవరతము 

 

అంటూ సాగింది. దానిని అవలీలగా సంగీతీకరించిన క్షణాలు నేను మరచి పోలేను. హరికథ అంటే ఏదో పురాణగాధ ఆధారంగా సాగే సంగీత సాహితీ రచన. ఇక్కడ అటువంటిదేమీ లేదు. స్త్రీ గొప్పతనం భారత స్త్రీ యొక్క విశిష్టత, పవిత్రత ఇందులో వస్తువు. సాంఘిక చిత్రం (ఓ సీత కథ) లో రాయాలి. దానికి భాషేమిటి? నోరు తిరిగినా చెవిలోకి ఎక్కినా అర్థం కాదే …..!  అయినా ఆ రచనకు అంగీకరించిన దర్శకుడి ధైర్యం ఎంత గొప్పది….! మామ ఆ రచనని కాంభోజి, కేదారం మొదలైన రాగాలలో పదిహేను నిముషాలలో స్వరబద్ధం చేసిన తొలి అనుభవం మరువలేను. ఈ పాటను శ్రీమతి పి.లీల గానం చేశారు. ఈనాటికీ అది చెవులకి చెందినట్లు వినిపిస్తూ వుంటుంది.

K_V_Mahadevan

అటు తర్వాత ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో అన్ని పాటలూ నేను రాయడం, ఆయన స్వరపరచడం ఎన్నెన్నో మధురానుభూతులను కలిగించింది. త్యాగరాజస్వామి వారి ‘మనోధర్మ సంగీతం’ రేఖా మాత్రంగా అనుభవంలోకి తెచ్చిన స్వరసిద్ధుడు మామ!

మహదేవన్ గారి స్వరూపం, స్వభావం, వస్త్రధారణ, విభూతి కుంకుమలతో బ్రహ్మలోకం నుంచి దిగివచ్చిన నాదయోగిలా వచ్చి ఆయన కూర్చునే తీరు అసదృశం. తుంబుర నారదుల  వలె  ఆయన, పుగళేందీ రాగానే ఏ సినిమా ఆఫీసులొనైనా సరే ఒక పవిత్ర గీతావరణం ఏర్పడేది.

 

దర్శకుడు చెప్పే సన్నివేశం వళ్ళంతా చెవులు చేసుకుని వినడం, ముందు పెట్టిన పాటను ముఖ్యంగా పల్లవిని కళ్ళతో చదివి మనసుతో అనువదించుకుని బుద్ధితో రంగరించి సంగీతంతో పల్లవింపజేసి సన్నివేశానికి ‘ఇదేపాట’ అన్న రీతిలో వినిపించడం జరిగేది. ఆ  పాట పల్లవి వినగానే అందరికీ ప్రత్యామ్నాయం అడిగే దమ్ము ఉండేది కాదు. ఈ స్థాయి నేనెరిగినంతలో మహదేవన్ కే సొంతం.

 

ఆదిశంకరులకు పద్మపాదుడు, కాలిదాసుకు మల్లినాథసూరి, జాన్సన్ కు బాస్వెల్ వలె మహదేవన్ గారికి దొరికినవారు పుగళేంది. ఆయన మలయాళంలో మంచి కథకుడు. కవి. పాతికేళ్ళ పరిచయంతో ఆయన తెలుగులో కూడా కొన్ని కవితా ఖండికలు రాశారు. కొన్నిటిని నేను పత్రికలలో ప్రకటించడమూ జరిగింది. ‘నాకు చనుబాలు కావాలి’ అనే ఆయన కవితకు బహుళ ప్రశంసలు వచ్చాయి.

 

పాటల రచయితగా నా ఎదుగుదలకు పునాదులు వేసిన గురువులలో ఒకరు మహదేవన్. స్వరబద్ధం కావలసిన పాటకు మాటల పొందిక ఎలా వుండాలి, దానికి గల గణితమేమిటి, సమం, అసమం అంటే ఏమిటి వగైరాలు అప్పటికే నాకు కొంత తెలిసినా, స్వరపదసంధానం సాధించడానికి ఏ మెలకువలు కావాలి, భావాలను ఎలా పలికించుకోవాలి అనేవి ఆయన స్వరరచన చేసే విధానం చూసి నేను నేర్చుకున్నాను. రాగానికి కటువుగా తగిలే పదాలను అప్పటికప్పుడు మార్చుకుంటూ నా గీతరచనలో నేను తొలిపాఠాలు ఆయన దగ్గరే దిద్దుకున్నాను. ఈ మాట చెప్పడానికి నాకు చాలా గర్వంగా వుంటుంది. ఆదిశంకరులు గురువుకు ‘అధిగత తత్త్వః’ అనే నిర్వచనం ఇచ్చారు. మహదేవన్ నాకు అటువంటి గురువు. ‘సిరిసిరిమువ్వ’ పాటల రచనలో ఆయన నా వెన్నంటివుండి చక్కని భావ ప్రకటన, భాషాలాలిత్యం వచ్చిన చోట బొటనవేలు చూపి ‘విజయోస్తు’ అని మౌనంగా చిరునవ్వుతో ఆశీర్వదించిన సందర్భాలెన్నో.

SSM1

గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది 

గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువౌతుంది 

 

అనే పల్లవి రాసిన క్షణంలో

 

ఝుమ్మంది నాదం సై అంది పాదం 

తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల 

 

 

అని రాసినపుడు

 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ 

అందరికీ అందనిదీ పూచిన కొమ్మ 

 

అనే పాట రాసినప్పుడు ఆయన మౌనాశీరక్షతలకు నేను నోచుకున్నాను.

 

‘ప్రేమబంధం’ చిత్రంలో – మామతో ఇది నా మూడవ చిత్రం – ఒక ముఖ్య సన్నివేశానికి నేను పాట రాయడం, దర్శకుడు విశ్వనాథ్ గారు ఒకే చేయడం జరిగిపోయింది – పల్లవి మామ ముందు పెట్టారు.

 

చేరేదెటకో తెలిసి – చేరువకాలేమని తెలిసి – చెరిసగమైనా మెందుకో తెలిసి‘ – ఇదీ ఆ పల్లవి. నిజానికి ఈ పల్లవి ఇప్పుడు చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది. మొదటి పంక్తికి రెండవ దానికి తాళం ఎలా సరిపెట్టడం! మాత్రల ప్రకారం కూడా బేసి సంఖ్య వస్తున్నది. ఎలా పాటగా పాడడం, ఒకసారి నిగూఢంగా నావంక చూశాడు మామ-అప్పు (పుగళేంది) నవ్వుకున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. కొంచెం భయపడ్డాను. దర్శకులూ అక్కడే వున్నారు. నోట ‘ట్యూన్’ రావడం లేదు. ‘ఏమైనా మార్చాలా?’ అన్నాను ధైర్యం తెచ్చుకుని. ‘వద్దులే…ఇటు చూడు’ అని ఆ మహా మేధావి రెండవ లైనులో ‘తెలిసి’ అన్న పదాన్ని మరో రెండుసార్లు అని పల్లవి ముగించారు. అందరి ముఖాలు వికసించాయి. ‘తెలిసీ, తెలిసి తెలిసీ’ అనేసరికి పాటలో భావానికి ప్రాణమొచ్చింది. సన్నివేశ సాహిత్యానికి రూపకల్పన జరిగింది. పాట రాయడంతో పాటు పాటకు బాణీ కట్టడంతోను, పాడించడంతోను ప్రాణ ప్రతిష్ఠ చేయడంలో మహదేవన్ గారి తర్వాత ఆ స్థాయిలో కనిపించేది శ్రీ రమేష్ నాయుడు ఒక్కరే!

 

ట్యూన్అనేది ఒకటి ఉండదని, ఉన్నా అది రచనకు ప్రతిబంధకమనీ, కవి రాసిన దాన్ని బట్టి సన్నివేశానికి వున్న అవసరాన్ని బట్టి ట్యూన్వస్తుందని మహదేవన్ అనేకసార్లు చెప్పేవారు. మామ చెప్పింది కరెక్ట్అనేవారు రమేష్ నాయుడుగారు.

 

వాణిజ్యపరమైన భారీ చిత్రాలకు సైతం మామ తీసుకునే జాగ్రత్తలు ఆశ్చర్యకరంగా వుండేవి. కదిలేది కదిలించేదీ అయిన ట్యూన్ కట్టేవారు మామ.

 

Adaviramudu-NTR-jayaprada-telugu cinema songs lyrics.1సత్య చిత్ర సంస్థ నిర్మించిన ‘అడవిరాముడు’ నా మొదటి కమర్షియల్ పాటల రచనకు శ్రీకారం చుట్టిన చిత్రం. దర్శకుడు శ్రీరాఘవేంద్రరావు. ఎన్.టి.ఆర్., జయసుధ, జయప్రద నటించిన ఈ చిత్రం చరిత్రను సృష్టించి బాక్సాఫీస్ బద్దలు గొట్టింది. మహదేవన్ సంగీతంలో రాసిన ప్రతిపాటా సూపర్ హిట్ అయింది. అందులో రాసిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాట ఆ రోజుల్లో (1976) కోటిరూపాయల పాట అనే పేరు తెచ్చుకుంది. వాడవాడలా మోగిపోయింది.  ఆ పాటల కంపోజింగు జరుగుతున్న సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలు నేను ఎన్నటికీ మరువలేనివి.

 

ఎన్నాళ్ళకెన్నాళ్ళ కెన్నాళ్ళకు 

ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్ళకు

 

ఇది మొదటి పాట. నేను యధేచ్ఛగా రాసిన ఈ పాటను తాళాల వైవిధ్యంతో, జానపద మధురిమలతో ఆ మహానుభావుడు ఎంత అద్భుతంగా స్వరపరిచాడో తలుచుకుంటే ఒళ్ళు పరవశిస్తుంది. దానికి తగ్గట్టు చిత్రీకరణలో సొగసులు ఎన్నెన్నో! అటు తర్వాత రాసిన పాట.

 

అమ్మతోడు అబ్బతోడు నీతోడు నాతోడు 

అన్నటికీ నువ్వే నాతోడు

 

చిలిపితనం చిదిపి గీతంగా మలిచారు మామ –

 

కృషి వుంటే మనుషులు ఋషులౌతారు 

మహాపురుషులౌతారు 

తరతరాలకీ తరగని వెలుగవుతారు 

ఇలవేలుపులౌతారు

 

మహదేవన్ ఈ పాట స్వరీకరించిన తర్వాత దీనికొక తాళం వున్నట్టు అనిపించింది గానీ, అంతకుముందు అది నిజంగా ఉపన్యాసమే! ఆంధ్రపత్రిక ఎడిటోరియల్లే! దాన్ని అలా ఆపోశనం పట్టడం ఆ అగస్త్యుడికే చెల్లింది. వేడివేడి పాటల్లో వెలుగు బాటలాంటిదీ పాట. పదుగురు మెచ్చిన పాట – సాహిత్యానికి ఊపిరి పోసిన సంగీతానికి కర్త మహదేవన్. తరువాత నాలుగవ పాట రానే వచ్చింది.

 

ఆరేసుకోబోయి పారేసుకున్నాను

కోకెత్తుకెల్లింది కొండగాలి-నువ్వు 

కొంటెచూపు చూస్తేనే చలి చలి

 

అంతకుపూర్వం ఎన్నడో వచ్చిన ‘అరెరె ఎట్టాగో వుంటాది ఓలమ్మీ‘ అనే పాట రీతిలోనే ‘అరెరె ఆరేసుకోబోయి‘  అనే పద్ధతిలో పాట చేస్తే బాగుంటుందేమో అన్నారు నిర్మాత నెక్కంటి సత్యనారాయణగారు. ‘అలా చేయకూడదు-అరెరెరెలని చివరికి పెట్టి చెయ్యాలి’ అని కచ్చితంగా చెప్పారు మహదేవన్. చెబుతూనే ఇప్పుడు మనం వింటున్న పద్ధతిలో ట్యూన్ చేసి పాడారు. మొత్తం అందరూ ‘ఓకే’ అనేశారు.

 

అయితే ఈ నాలుగోపాట రాసి తనముందు పెట్టినప్పటినుంచీ ‘మామ’ మళ్ళీ నేను భయపడేటట్లు చూపు విసరడం మొదలు పెట్టారు. ‘ఆయనా చెప్పడు, నాకా తెలీదు అడగడానికి భయం’ ఇదీ పరిస్థితి. ఎవరూ లేకుండా చూసి పై పాట  కంపోజింగు అవ్వగానే ‘ఇది ఎన్నో పాట!’ అని మామ నన్ను అడిగారు. ‘నాలుగోది…ఇంకా రెండు వున్నాయి’ అన్నాను. ‘ఇంకా రెండేగా వున్నది?’ అని మళ్ళీ అడిగారు. అవునన్నాను. కానీ ఏదో కొత్తగా వుంది ఆయన కంఠస్వరం  – నిశితంగా వుంది చూపు-అర్థం కాకపోగా ‘ప్రేమబంధం’ నాటి పరిస్థితి మళ్ళీ ఎదురైంది. మళ్ళీ ఆ మర్నాడే కంపోజింగు. ‘అడవిరాముడు’ పాటల కంపోజింగు మొత్తం ఏడురోజుల లోపల పూర్తి కావడం విశేషం.

 

యథాప్రకారం మళ్ళీ అందరూ కొలువుతీరారు. దర్శకుడు సన్నివేశం చెప్పి దానిని ఆయన తీయదలుచుకున్న పద్ధతి, తనకి ఎలా కావాలీ అనే విషయాలు వివరించి పాట కాగితం మామకి అందించారు. ఆ పల్లవి చూస్తూనే ఒక దృక్బాణం నాపై సంధించారు మామ! నా పై ప్రాణం పైనే రెక్కలు కట్టుకుని సిద్ధంగా వుంది ఎగరడానికి! ఆ మూగబాధ ఏం చెప్పను-

 

కోకిలమ్మ పెళ్ళికి కోనంత పందిరి 

చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి

 

http://www.youtube.com/watch?v=aadpF-6hH_M

అనే పల్లవి. దర్శకుడు చాలా మురిపెంగా తీయదలచుకున్న పాట అది. ఆయనకీ ముద్దొచ్చిన పల్లవి యిది. సాహిత్యం చూసి కొంత మామ చూపు చల్లబడింది. తనలో తానే నవ్వుకున్నారు చాలాసేపు. ఆ నవ్వుకు వంత పాడారు పుగళేంది. ఎందుకు నవ్వుకుంటున్నారో ఎవరికీ తెలీదు. నన్ను గురించే అని నాకు మాత్రం తెలుసు. ఏం తెలుసో, ఎంత తెలుసో, ఎన్నాళ్ళనుంచీ తెలుసో ఆఖరికి తబలా మైఖేల్ కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు నవ్వినా నవ్వు నాలుగందాల స్వీటు అన్నట్టు తను కూడా నవ్వి రాఘవేంద్రరావు పక్క గదిలోకి వెళ్ళారు. గదిలో మామ, అప్పు, మైఖేల్, నేనూ తప్ప ఎవరూ లేరు. అప్పుడు మామ నన్ను దగ్గరకు రమ్మని పిలిచి ‘జ్ఞానస్థుడివే. అన్ని పాటలూ ఒకే తాళంలో  రాస్తావేరా? అన్నీ త్రిశ్రంలోనే రాస్తే ఏం చెయ్యనురా…ఆరు పాటల్లో అయిదు ఒకే తాళంలో వున్నాయి. ఆరో పాటైనా చతురస్రంలో  రాయరా’ అన్నాడు.

 

పై ప్రాణం పైనే పోయింది. గాభారాపడ్డాను. మళ్ళీ ఆయనే ‘ఫరవాలేదు. ఇప్పటివరకూ ఇబ్బంది ఏమీ లేదు. అయిదోపాట చాలా బాగుంది. అయిదు పాటలూ సాహిత్యంలో సంగీతంలో ఎలా వున్నదీ మనకే తెలుసు. ఆరో పాట మాత్రం నేను చెప్పింది మరిచిపోకు’ అన్నాడు. ధైర్యం చెప్పాడు. ఎవ్వరూ గదిలో లేని సమయంలో చెప్పడం తండ్రిప్రేమను తలపించింది. ఆ పాట ఎంత అద్భుతంగా మామ చేశాడో, దర్శకుడు తీశాడో అందరికి తెలిసిన విషయమే.

 

ఇక ఆరవపాట క్లైమాక్సు పాట. దర్శకుడు పాటను చూసి ‘ఓకే’ చేసిన తర్వాత ‘మామ’ దగ్గర పెట్టారు. అదో హడావుడీ, హంగామా, మారువేషాలు వగైరాలతో సాగే పాట. సన్నివేశం చెప్పి పనిమీద దర్శకుడు వెళ్ళిపోయాడు. పాట చూస్తూనే మామ కోపంగా ‘ఏం రాశావు చదువు’ అన్నాడు. ‘చూడరా చూడరా సులేమాను మియ్యా‘ అని చదివాను. ఇది ఏం తాళం అన్నాడు. నాకు నేనో ట్యూన్ అనుకుని రాశానేమో చతురస్రంలో రాశాను అన్నాను. తను పాడి వినిపించి ఇది చతురస్రమా అన్నాడు. కాదన్నాను. ఆయనకు నవ్వు వచ్చింది. ‘తాళం మార్చి రాయి’ అన్నాడు. వెంటనే ఎలా మార్చాలో తెలియలేదు. మారిస్తే దర్శకుడు ఏమంటాడో అంతకన్నా తెలియదు. మింగుడుపడని పరిస్థితి. మామ ఇదంతా గమనించి ‘ఇంకా రెండు ‘చూడరా‘లు తగిలించు. సరిపోతుంది’ అన్నాడు.

 

చూడర చూడర చూడర చూడర ఒక చూపూ సులేమాన్ మియా‘ అని తిరిగి రాశాను. అప్పుడది అవలీలగా చతురస్రంలో వచ్చింది. అందరూ విని ఊగిపోయారు. అలా ముగిసింది ‘అడవిరాముడు’ సంగీతోపాఖ్యానం.

 

సినీకవిగా అప్పుడే కళ్ళు తెరుస్తున్న చిన్నవాడిని తల్లిలా కడుపులో పెట్టుకుని, తండ్రిలా కాపాడిన ఉత్తమ కళా సంప్రదాయానికి చెందిన మహావ్యక్తి మహదేవన్.

 

మహదేవన్ గారి వేషధారణ శుచికీ, నిష్కళంకత్వానికి ప్రతీకగా వుండేది. ఇస్త్రీ చేసిన మడత నలగని బంగారు ఛాయ సిల్కు చొక్కా, తెల్లని జరీపంచె అడ్డకట్టుతో మౌనముద్రతో ఆయన వస్తుంటే మూర్తీభవించిన సంగీతం నడిచి వచ్చినట్లే వుండేది. ఫాలభాగాన విభూతి, తిలకం ఆయన నిష్ఠను వెల్లడించేవి. చక్రవర్తి, సత్యం, రాఘవులు వంటి సంగీత దర్శకులు ఆయన పట్ల ఎంతో గౌరవం తో మెలిగేవారు.

 

అనేక మంది సంగీత దర్శకులు పాట ట్యూన్ చేయవలసి వచ్చినప్పుడు ‘ఇది మామ అయితే ఎలా చేస్తాడు’ అని యోచించి అలా చేసిన సందర్భాలు వున్నాయి. కారంచేడులో ఒకసారి సురేష్ వారి ‘సంఘర్షణ’ చిత్రానికి మామ మోడల్ లో చేయమంటే నా పాట ఒకటి ‘కట్టు జారిపోతావుంది… చీర కట్టు జారిపోతావుంది‘ అలాగే చేశాడు చక్రవర్తి. మామ మీద అందరికీ అటువంటి గురుత్వం వుండేది. అలాగే మామ పద్ధతి అనేది సినీ సంగీతంలో నేపథ్యంగా పలువురు అనుసరించారు. ముఖ్యంగా ‘రిథమ్’ విషయంలో మహదేవన్ గారు ప్రవేశపెట్టిన జానపద ధోరణులు చాలా పాపులర్ అయ్యాయి. ‘మామ మామ మామ‘ అనే పాటతో ఆయన ఈ కొత్త ధోరణులు ప్రవేశపెట్టారు.

 

పాటను స్వరపరిచేటప్పుడు ‘రిథమ్’ను కట్ చేసి రాగంతో తాత్పర్యం చెప్పే సంగీత భాష్యకారుడుగా మహదేవన్ లబ్దప్రతిష్టుడు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ప్రచ్ఛన్న వాగ్గేయకారుడు. సరిగమలు ఆయన మౌనసాహిత్యానికి ‘డుమువులు’. నేనెరిగిన సంగీత దర్శకులు ఎందరో మహానుభావులు- అందులో కొందరికి ఎన్ని వందనాలు చేసినా చాలదు. అటువంటి అనేక వందనాలు చేయించుకోగల మహనీయుడు మహదేవన్. ఆయనకు ముందు తరంలో తెలుగు సినిమా రంగానికి చెందినంత వరకు చిత్తూరు వి.నాగయ్యగారు, ఇంకా పూర్వం దైతా గోపాలం గారు- వీరంతా అనుసరించింది భావ ప్రకటనకు ప్రాణం పోసే మనోధర్మ సంగీత పద్ధతి. ‘ట్యూన్’ లోకి మాటలు కుమ్మరించే పద్ధతి కాదు. అది కృతకమైనదని వీరి నమ్మకం. మనోధర్మం ఏ సన్నివేశానికి ఎలా స్పందిస్తుందో, ఆ ప్రయత్నంగా ఏ రాగ ధోరణితో వెల్లడి కాగలదో అనుభూతి లోతుల నుంచి రంగరించి ‘ట్యూన్’ ఇచ్చిన మహానుభావులూ వున్నారు.

 

అన్నీ అన్ని అనుభవాలుగా మధుర స్మృతులుగా మిగిలే మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో ‘శంకరాభరణం’ పాటల కపోజింగు మరపురాని మరో మధురానుభూతి.

sankarabharanam-original

కపోజింగు ప్రారంభమైన రోజున దర్శకుడు విశ్వనాథ్ గారు నన్నూ, మహదేవన్ గార్ని చూసి ‘నా కథలో హీరో అరవై ఏళ్ళ వృద్ధుడు. గ్లామరేమాత్రం లేనివాడు. గ్లామరస్ హీరోయిన్ లేదు. డ్యూయెట్లు, ఫైట్లు అసలే లేవు. నాకున్నదల్లా మీరిద్దరే. మిమ్మల్ని చూసి నేను ఈ ధైర్యం చేస్తున్నాను.’ అంటూ దేవుడిపటం దగ్గర వున్న కొబ్బరికాయలు మా చేతికిచ్చి, అక్కడే వున్న మాటల రచయిత జంధ్యాల గారికి మరోకాయ ఇచ్చారు. మా చేతనే పూజ చేయించారు. ‘వాతాపి గణపతిం భజే’ అయిన తర్వాత తొలి సన్నివేశం, కథ పూర్తిగా చెప్పారు.

 

ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము‘ అనే పల్లవి అనుకోకుండా నాకు రావడమూ దానిని మామ వెంటనే వాగ్గేయ పద్ధతిలో శంకరాభరణ రాగంలో స్వరపరచటమూ జరిగాయి.

 

గంటన్నర లోపల రెండు చరణాలతో సహా పాట రాయడము, స్వరాలు  సమకూర్చడమూ కూడా జరిగిపోయింది. ముహూర్తబలం అంటే ఇదే కదా! శంకరాభరణానికి సంబంధించిన పనులన్నీ అలాగే నిరాఘాటంగా జరిగిపోయాయి.

 

సామజ వరగమనా‘ అనే త్యాగరాజ కీర్తనతో సాగే యుగళ గీతానికి నేను రాసిన చరణాలు మహదేవన్ ఎంత మధురంగా, శ్రావ్యం గా, భావస్ఫోరకం గా లలిత సంగీతధోరణిలో మూలరాగానికి (హిందోళం) తగినట్లుగా స్వరపరిచిందీ అందరికీ తెలుసు. అలాగే ‘శంకరా నాద శరీరా పరా‘ అనే పాటని, ‘దొరకునా ఇటువంటి సేవ‘ అనే పతాక సన్నివేశపు గీతాన్ని స్వరపదాల అద్వైతాన్ని చాటే విధంగా ఆయన తీర్చిదిద్దాడు.

 

ఆ పాట రాసినప్పుడు నేను అనారోగ్యంగా ఉన్నాను. అతికష్టం మీద రికార్డింగు జరుగుతున్న విజయాగార్డెన్సు పాత థియేటరుకు వెళ్లాను. అక్కడ ఏదో పనిమీద వచ్చిన ఆత్రేయగారు కనిపించారు. నన్ను చూడగానే ‘ఇదేమిటయ్యా! ప్రాణాలు తీసే అను పల్లవి రాశావు. ఎంత పాడేవాడికైనా ఊపిరందక ప్రాణాలు పోవాల్సిందే’ అన్నారు. ‘అయితే నా శ్రమ ఫలించింది. సన్నివేశమే అది’ అన్నాను.

 

దొరకునా ఇటువంటి సేవ 

నీ పదరాజీవముల జేరు నిర్వాణ సోపాన 

మధిరోహణము సేయుత్రోవ 

దొరకునా ఇటువంటి సేవ‘ అన్నది త్యాగరాజస్వామి కీర్తన. అది బిలహరి రాగంలో వుంది. కానీ దీనిని మహదేవన్ కళ్యాణి  రాగంలో సన్నివేశానికి సరితూగే విధంగా చేశారు.

 

సప్తపది, శుభోదయం, సీతామాలక్ష్మి ఇలా ఎన్నో చిత్రాలు మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రోజుల్లో సంగీతానికి కొత్త కోణాలు ఆవిష్కరించి, లేత వయసులనీ, తేనె మనసులనీ పలికించిన రాగాలతో ‘జేగంటలు’ చిత్రం రావడం జరిగింది.

 

ఇది ఆమని సాగే చైత్రరథం 

ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం

మరోలోకమున మనోవేగమున 

పరుగులు తీసే మనోరథం

 

వందనాలు, వందనాలు 

వలపుల హరిచందనాలు 

వెన్నెలలో వేచి వేచి 

వెచ్చనైన నా స్వామికి

 

తెలుసులే తెలుసులే 

నీకు తెలుసో లేదోగాని 

నాకు తెలుసులే

 

వంటి పాటలు ఎందరికో హృదయాలకు దగ్గరి చెరగని ముద్రలు వేశాయి. చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కాకపోవడంతో ‘మాస్’ పరంగా పాపులర్ కాలేదు. స్థాయి గల ప్రేక్షక శ్రోతలకు మాత్రం అవి నేటికీ నిత్యగానాలే.

 

చిలిపి తెలుగుతనపు చిలకపాటలకు మహదేవన్ చేసిన బాణీలు అనుభవజ్ఞులకు సమ్మోహనాస్త్రాలు. ‘బులెట్’ చిత్రంలో (బాపు – రమణ) నేను రాసిన

 

రాధ కృష్ణుడికి ఏమిస్తుందో 

ఇస్తావా మరి 

సీతకు రాముడు ఏమవుతాడో 

అవుతావా మరి 

ముందివ్వు మరి 

ముందవ్వు మరి

 

అనే పాటకు చక్కిలిగింతలే సరిగమలుగా ‘ట్యూన్’ చేశారు మామ. అలాగే ‘సిరిసిరిమువ్వ’లో ‘గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే‘ వంటి పాటలు తెలుగు జాణతనంతో జానపదంతో పలకరిస్తాయి.

 

మహదేవన్ జీవిత సోపానం అధిరోహించడానికి పడ్డ శ్రమ ఒక జీవిత కాలాన్ని కూలి అడిగింది. ఆయనలో నిండారి నిగూఢమైన సంగీత శాస్త్రజ్ఞానానికి వెల్లడి లేక, అది వెల్లువలై తనలోనే సుడులు తిరుగుతున్నా మౌనిగానే వుండిపోయాడు. హెచ్.ఎం.వి. వారి పుణ్యమా అని అనుకోకుండా సుముహూర్తం వచ్చింది. నాటి నుంచీ ఆయన పాటగా, తెలుగు పాటగా పునర్జన్మ ఎత్తాడు. ‘తన గీతి అరవజాతిని పాటకులనుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి‘ అన్న రాయప్రోలు వారి మాటను నిలబెట్టింది మామ జీవితం.

 

సాహిత్యం రెండవదని, సంగీతమే ప్రధానమనే అహంకారపు అంధత్వం కమ్మిన ఏకాక్షులు, భావబధిరులు మహదేవన్ కాలం నాటికి లేరు. రాజన్-నాగేంద్ర వంటి వారు ట్యూన్లు మాత్రమే ఇచ్చినా వాటిలో వున్న మనోధర్మం సాహిత్యానికి ఊపిరి పోసేది. అలాగే ఇళయరాజా, ఎం.ఎస్.విశ్వనాథన్ వంటి వారు కూడా. వారిలో ప్రతి ఒక్కరూ సవ్యసాచి. సగమెరుకలవారు వారిలో లేరు.

 

గ్రూపురాజకీయాలు, ముఠా వాణిజ్యాలు లేని పుణ్యకాలంలో పుట్టిన మహా సంగీత దర్శకులు మహదేవన్ వంటి మహనీయులు. అవే వుంటే ఆయన తెలుగులో ఇన్ని చిత్రాలకు సంగీతం ఇవ్వగలిగి వుండేవాడే కాదు.

 

పాటలే పచ్చ తోరణాలుగా పాటలీపుత్రంలో గోరింటాకు నోరింటాకుగా నోరు పండించిన రోజుల్లో కొమ్మకొమ్మకో సన్నాయి-కోటి రాగాలు వున్నాయిఅనే పాట ఎందరి హృదయాలనో దోచుకుంది. ఆ పాట రచన నాది… స్వరరచన శ్రీ కె.వి.మహదేవన్. ఈ పాట స్వరబద్ధం చేసిన మహదేవన్ ను అదే శీర్షికతో స్మరించడం కేవలం రాగాతాళీయం.

 

మహదేవన్ మధురస్మృతికి నా గీతాంజలి.

——————————————————

“కొమ్మ కొమ్మకో సన్నాయి” లోని ఈ వ్యాసాన్ని ప్రచురించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు వేటూరి గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

వ్యాసం టైప్ చేసి పంపిన లలిత(అమెరికా) గారికి ధన్యవాదాలు వేటూరి.ఇన్

You May Also Like

One thought on “స్వరబ్రహ్మ రాగవిష్ణు గురుర్దేవో మహదేవన్ (వేటూరి)

  1. కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకం కోసం ఎప్పణ్నుంచో వెతుకుతున్నాను. ఏ షాపులోనూ లభించడం లేదు. దయచేసి ఎవరికన్నా ఆ వివరాలు తెలిస్తే నాకు తెలియజేయగలరు.
    మీ పరవస్తు నాగసాయి సూరి ( శ్రీగార్గేయ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.