ఓం నమశివాయ ఓం నమశివాయ
చంద్ర కళాధర సహృదయా…చంద్ర కళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయలయనిలయా.
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాహారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి
ఋత్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా
సిరివెన్నెల
ఓం నమో నమో నమశ్శివాయ
మంగళ ప్రదాయ గోపురంగతే నమశ్శివాయ
గంగయాతరింగితోత్తమాంగతే నమశ్శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమశ్శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమశ్శివాయ
నయనతేజమే “న” కారమై
మనోనిశ్చయం “మ”కారమై
శ్వాసచలనమే “శి”కారమై
వాంచితార్థమే “వ”కారమై
యోచన సకలము “య”కారమై
నాదం “న”కారం, మంత్రం “మ”కారం
స్తోత్రం “శి”కారం, వేదం “వ”కారం
యజ్ఞం “య”కారం, ఓం నమఃశివాయ
సినిమా సాహిత్య సరస్వతికి ఇద్దరు రెండు కళ్ళలాంటివాళ్ళే అయినా ఎవరి ప్రత్యేకత వారిదే అయినా,ఇదిగో ఇక్కడే మనం ఈ ఇద్దరి మధ్యనా వస్తు ప్రధానమయిన సున్నితమయిన తేడా గమనించవచ్చు. వేటూరి వస్తువుని బాహ్యంగా స్పృశించి హావభావాల్ని ఆకళింపు చేసుకుంటే,సిరివెన్నెల ఆ వస్తువులోకి పరకాయప్రవేశం చేసి ఆ వస్తువు యొక్క స్వభావాన్ని గ్రహిస్తాడు. వేటూరి వస్తువుయొక్క బాహ్య పరివర్తాన్నీ వృత్తాన్ని ఆవహిస్తే సిరివెన్నెల వస్తువుయొక్క మూలాల్లోకి చొచ్చుకుపోయి విశదీకరిస్తాడు.వస్తుపరమయిన ప్రాధాన్యత మారదు కానీ మనసుకి హత్తుకునేలా ఉంటాయి ఇద్దరి సాహిత్య వైశిష్ట్యాలూ ప్రత్యేకించి విశ్వనాథ్ చిత్రాల విషయానికొస్తే ఆ పాత్రల ఔచిత్యాలూ, సున్నితత్వం, సహజత్వమూ.
——————————————–
ఝణన ఝణన నాదంలో
ఝళిపించిన పాదం లో
జగము జలదరిస్తుంది
పెదవి పలకరిస్తుంది
గజ్జ ఘల్లు మంటుంటే
గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే
కవిత వెల్లువౌతుంది
అని వేటూరి వ్రాస్తే………………
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు
మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లని
చల్లని చిరుజల్లు
వెల్లువొచ్చి సాగని
తొలకరి అల్లర్లూ
పల్లవించనీ నేలకు
పచ్చని పరవళ్ళు
అంటూ సిరివెన్నెల వ్రాస్తాడు
పైన ఉదహరించిన వస్తువు గురించే తీసుకుంటే సందర్భానికి కల అవధుల్ని అతిక్రమించకుండా అలాగని పూర్తిగా సన్నివేశానికి కట్టుబడిపోకుండా కవికున్న స్వేచ్చాపరిధిలో ఎలా వివరిస్తాడో గమనించండి. ఆ అందెల సవ్వడికీ,లయవిన్యాసానికీ ప్రకృతీ బాహ్యప్రపంచమూ స్పందిచే తీరునీ వేటూరి స్పృశిస్తే, సిరివెన్నెల ఇంకా సున్నింతంగా ఆ సవ్వడికి ప్రపంచమూ ప్రకృతీ మొత్తం ఉప్పొంగిపోయి పరవశించిపోతూ పరవళ్ళు తొక్కుతోందంటాడు.
వాహ్ వేటూరీ….వహ్వా సిరివెన్నెలా
————————————-
కంచిభొట్ల శ్రీనివాస్ గారి మూలానికి కొంత నా కలనేత
క్రమంగా ఆముదపు చెట్టు మహావృక్షం అన్న సామెతను నిజం చేసుకుంటున్నాం అన్నమాట.
సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, ఆరుద్ర, దేవులపల్లి, కొసరాజు వంటి మహామహులతో పోల్చటానికి ఆట్టే తూగని వారిని కూడా మనం పుంభావసరస్వతులుగా ఊహించుకొని మురిసిపోతున్నట్లు అనిపిస్తోంది.
శ్యామలరావ్ గారూ నమస్తే.
ఈ వ్యాసం లో ఎక్కడా మీరుదహరించి పెద్దలను కించపరిచినట్టుగా లేదే,మరి మీరు ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు.ఒక బిడ్డ గొప్పవాడయ్యాడూ అంటే అది ఆ బిడ్డ తల్లితండ్రులదీ,గురువుల గొప్పతనమే అయ్యుంటుంది కదా ఖచ్చితంగా.అటువంటప్పుడు వేటూరీ,సిరివెన్నెలా ఇద్దరూ కూడా మీరు చెప్పిన పెద్దలని గురుతుల్యులుగానే భావించారన్నవిషయం మీరెక్కడా గమనించలేదా?ఘంటసాల గాన గంధర్వుడన్నది జగమెరిగిన సత్యం అంతమాత్రం చేత బాలూ ఆముదం వృక్షం అనేస్తామా?ఎవరి గొప్పతనం వారిది,ఎవరి ఒరవడి వారిది.(సముద్రాల వారు గొప్పవారే అయినా మాల్లాది వారి రచనల్ని ఎక్కువగా వాడుకున్నారన్న అపవాదు మీకెక్కడా కనిపించలేదా మరి,అంతమాత్రం చేత ఆయన గొప్పవారు కాకుండా పోతారా).ఇక్కడ ఒకరి గొప్ప ఇంకొకరి తక్కువ ప్రసక్తి లేదండి విద్వత్తు ఎక్కడున్నా గౌరవించడం,ఆదరించడమే మన సాంప్రదాయం.ఇటువంటి వివాదాస్పద చర్చలు ఈ సైట్ ప్రధానోద్దేశ్యం కాదండి గమనించగలరు.
మీకు ఈ వ్యాసానికి కి పెట్టిన పేరు పై ఏమన్నా అభ్యంతరాలుండి మార్పులు సూచిస్తే బాగుండేది.