మణిశర్మ మేజిక్ తో మెరిసిన “రావోయి చందమామ” సినిమాలో పాటలన్నీ వినసొంపుగా ఉంటాయి. ఈ పాటల్లో నాకు బాగా నచ్చిన పాట సినిమా పతాక సన్నివేశంలో వచ్చే “ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి” అన్నది. ఈ పాటకి వేటూరి సాహిత్యాన్ని ఎంతో ఆర్ద్రంగా పాడిన బాలూ పెద్ద ఎసెట్. వేటూరి సాహిత్యంలో లోతుని బాలూ తన గొంతులో పలికించిన తీరు ఈ పాట విన్నప్పుడల్లా నన్ను కదిలిస్తుంది. ఈ పాట సాహిత్యంలో నాకు నచ్చిన విషయాలు కొన్ని పంచుకుంటాను.
వేటూరి పాటల్లో ఒక sub-text ఉంటుంది. అది ఎప్పుడూ సినిమా సందర్భాన్ని సూచించేది అవుతుంది. దీన్ని పట్టుకుంటే సాహిత్యాన్ని ఇంకా బాగా ఆస్వాదించగలం. ఇది హీరో, హీరోయిన్ పెళ్లికి పాడే పాట. ఇద్దరూ అనుకోకుండా ప్రేమలో పడతారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగదు.
పల్లవిలో చూపించినది పెళ్లికి సమాయత్తమవుతున్న మనసు గురించి, ఆ మనసు కంటున్న కలల గురించి. మనసుకి వసంతం వచ్చి, పట్టలేని ఆనందం కలిగినప్పుడు, రోజంతా తీరికలేకుండా ఉండి ఈ ఊహలన్నీ నెమరు వేసుకునేది ఎప్పుడు? రాత్రి! అందుకే “వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు, కన్నులు కలువల్లో సరిగమల పరాగాలు”! ఈ కలలన్నీ ప్రస్తావించడం, అంతకు ముందు వారిద్దరూ ఇవి కలిసి కన్నవే అని గుర్తుచెయ్యడం కూడా. ఇది పాట మొత్తమూ ఉండే underlying theme.
“ఒక్కసారి వస్తాయి తియ్యని క్షణాలెన్నో, ఒక్కటవ్వమంటాయి తీరని రుణాలే!” అన్నది అప్పటి వరకూ జరిగిన సినిమా కథకి summary. అప్పటికే ఇద్దరికీ ప్రేమికులు ఉన్నారు, అయినా మళ్లీ వీరిద్దరినీ ప్రేమలో పడేసిన రుణం ఏమిటి? క్రూజ్ లో వారు గడిపిన తియ్యని క్షణాలు, ఆ ఆనందం, ఆ ఉత్సాహం అంతా “ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో, పల్లవించె నా గీతం పలకరించె సంగీతం” వంటి లైన్లలో కనిపిస్తుంది. ఈ లైన్లకి “నీ పెళ్లి నాకు ఆనందం కలిగిస్తోంది, మీ బంధం చక్కగా ఉండాలి” అని పైకి కనిపించే అర్థం ఒకటే తీసుకుంటే పాటలో లోతు తెలీదు. చివర్లో “శుభలేఖనుకో నా గీతం” అనడం బ్యూటిఫుల్. మనసంతా బాధ ఉన్నా ఈ పెళ్లి నీకు శుభం కలగించాలి అన్న ఆకాంక్ష ఒకటైతే, ఇంకా నేను నీ వాడినే, మన పెళ్లికి నా ఆహ్వానం అందుకో అన్న సూచన ఇంకోటి.
రెండో చరణం నాకు మొత్తం పాటలో బాగా ఇష్టం. పెళ్లికూతురుగా ఆమె దేవతలా కనిపిస్తుంటే అతని ప్రాణమంతా ఆమెకి దీవెనయ్యింది అనడం నాకు గొప్పగా అనిపిస్తుంది. అలా అని మనసులో బాధ లేకపోలేదు. అందుకే “మౌనమాయె నా భావం, రాగమాయె నీ కోసం”. చివర్లో గొప్ప ముగింపు – “వేణువైన నాలో ఆలాపనయిన గానం, ఆశీస్సనుకో అనురాగం!” “I became an empty flute!” – అది అతని మనస్థితి, ఒక శూన్యం. ఆ శున్యంలో తోడుగా ఉన్నది ఆమెపై ఉన్న ప్రేమ. అదే ఆలాపనై పైకి పొంగుతున్న గానం. నాలో ఈ ప్రేమంతా నీకు ఒక ఆశీస్సుగా మార్చి నేను ఒంటిగా మిగులుతున్నాను అన్నది very touching లైన్. ఈ లైన్ బాలూ ఎంత గొప్పగా పాడాడో!
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు వచ్చే వేళలో! కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు శుభమంగళ వాద్యలొచ్చే వేళలో! ||ఝుమ్మని ఝుమ్మని|| 1.ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో పల్లవించె నా గీతం పలకరించె సంగీతం! ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశంలో తరుముకొచ్చె ఉల్లాసం, తలను వంచె కైలాసం! ఒక్కసారి వస్తయ్, తియ్యని క్షణాలెన్నో ఒక్కటవ్వమంటయ్ తీరని రుణాలే! శుభలేఖనుకో నా గీతం! ||ఝుమ్మని ఝుమ్మని|| 2. నీ పాదాలకు పారాణద్దిన ఈ పేరంటంలో దేవతాయె నీ రూపం దీవెనాయె నా ప్రాణం! వయ్యారాలను ఉయ్యాలూపిన ఈ వైభోగంలో మౌనమాయె నా భావం రాగమాయె నీకోసం! మూడుముళ్ళ బంధం ఏడు జన్మలనుబంధం వేణువైన నాలో ఆలాపనయిన గానం ఆశీస్సనుకో అనురాగం! ॥ఝుమ్మని ఝుమ్మని॥