ఉగ్రవాదం! నరమేధం! ఉన్మాదం! (వేటూరి పాట)

వేటూరి ఉగ్రవాదంపై రాసిన ఒక చక్కని పాట ఈ మధ్య విన్నాను. 1999 లో వచ్చిన “మదరిండియా” అనే సినిమా లోనిదిట ఈ పాట. కీరవాణి మంచి ట్యూన్ ఇచ్చారు. పాడిన బాలూ సాహిత్యాన్ని ఎంత ఎలివేట్ చేశారన్నది పాట వింటే అర్థమవుతుంది. బాలూ లాంటి ఒక సింగర్ లేకపోవడం ఎంత లోటో లిరిసిస్టులకి బాగా తెలుస్తుంది.  

ఈ పాటలో “అజ్ఞానం” అన్న పదాన్ని “యజ్ఞానం” అని మార్చి జరుగుతున్న మారణహోమాన్ని “కబేళాల పందిరిలో కపాలాల కళ్యాణం” అంటూ వర్ణించడం వేటూరిలోని మహాకవిని చూపించే వాక్యం. అలాగే “పూలతోటగుండెలో వల్లకాటి మంటలా?” అన్నపుడు గుండె ద్రవిస్తుంది. పాటలో వేటూరి మార్కు ప్రయోగాలూ ఉన్నాయి – కలియుగాన్ని బలియుగం అనడం, “జణగణ వధా భారతం” అనడం,  “మరో ప్రపంచం” అంటూ శ్రీశ్రీ కోరుకున్న అభ్యుదయ సమాజాన్ని స్మరించడం, “నరలోకపు నరకలోక నరబాంబులు” అనడం, “ఓ మానవుడా నువ్వు కోరుకున్న నవరాజ్యం వచ్చేదా సచ్చేదా?” అని అర్థం స్ఫురింపజేస్తూనే “వచ్చే దానవ రాజ్యం” అంటూ రాక్షస రాజ్యం వచ్చింది అన్న అర్థాన్ని చెప్పడం, ఇలా ఎన్నో! 

ఇది వినదగ్గ పాట, వేటూరి మంచి పాటల లిస్టులో ఉండదగ్గ పాట.

పల్లవి:

ఉగ్రవాదం! నరమేధం! ఉన్మాదం!
రక్తజ్వలా రణరంగం 
చావూ బ్రతుకుల చదరంగం
ఆగేదెనాడో మనుజ మారణం    
“బలియుగాల” నరమృగాల దారుణం 
అంతులేని ఆగిపోని రక్తదాహం, మృత్యువిలాసం!

|| ఉగ్రవాదం ||

చరణం 1:

విదేశీయ రాక్షసాల రక్తదాహమే సరిహద్దులు దాటేనా?
రత్నగర్భకోశమే రుద్రభూమి అయ్యేనా?
వ్యధాపూరితం, జనగణ వధా భారతం!
ఇదా మనం సాధించిన “మరో ప్రపంచం”? 
గుళ్ళు పేల్చి, ఇళ్లు కాల్చి, ఎముకల సమిధల్ని వ్రేల్చి
సాధించిందేముంది ఈ  “యజ్ఞానం”!
కబేళాల పందిరిలో కపాలాల కళ్యాణం!!
 
|| ఉగ్రవాదం ||

చరణం 2:

నరలోకపు నరకలోక నరబాంబుల కధలో మార్పనేది రాదా?
పూలతోటగుండెలో వల్లకాటి మంటలా?
రాక్షస తక్షక భక్షక రాజరికాన
మానవేతిహాసమంతా మరణముద్రలాయెనా!
వచ్చేదా నవ (వచ్చే దానవ) రాజ్యం సచ్చే మానవుడా 
ఇచ్చే కానుకలన్నీ ఆక్రందనలా? 

|| ఉగ్రవాదం ||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top