వేణువై వచ్చాను (2 వ భాగం) వేటూరి-విశ్వనాథ్

అనగల రాగమయి తొలుత వీనులలరించి

అనలేని రాగమయి  మరలా వినిపించి  మరులే కురిపించి

 

బహుశా మరే పద్య పాదం కానీ పాట చరణం కానీ   సప్తపది సినిమాకి వ్రాసిన  పై పదాల కన్నా  శ్రీ వేటూరి సామర్ధ్యాన్ని  చక్కగా చెప్పలేదు.  సాధారణ పదాలకి గంభీరత కల్పించి లోతైన అర్ధం చూప గలిగారు. మధ్యాహ్న వేళ స్వచ్చమైన, నిర్మలమైన సరస్సు జలాల ని చూసి  లోతు ఎలా కనిపెట్ట లేమో, శ్రీ వేటూరి సాహిత్యం లో పదాల అమరిక  లోని సొగసు ను అర్ధం చేసుకోవడం కూడా అంతే కష్టం. ముఖ్యం గా విభిన్న సందర్భాలలో ఆయన వ్రాసిన పాటలు చాందసులకు ఆశ్చర్యము కొండొకచో  నైరాశ్యం కూడా కలిగించవచ్చు. శ్రీ విశ్వనాద్ లాంటి సిద్ధహస్తుల ప్రోత్సాహం తో శ్రీ వేటూరి కలం కదం తొక్కి అద్భుత సాహిత్య సృష్టి చేసింది.

పలకమన్న పలకదీ పంచదార చిలక

కులుకే సింగారమైన కొనసిగ్గుల మొలక

ఎద కన్నా లోతుగా పదిలంగా దాచుకో

నిదురించే పెదవిలో పదముంది పాడుకో  //అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ //

 

శ్రీ విశ్వనాద్  తన సినిమాలలో, సాంఘికమైనా ,పౌరాణికమైనా,  నీతిని ప్రభోదించే వైనా, నైతిక విలువలు చూపెట్టే వైనా,  కల్పన  చేసిన  అనేక గొప్ప సన్నివేశాలలో సామాన్య ప్రతిభ కలిగిన రచయిత ఎవరైనా తను వ్రాసే పాటలలో, తన ప్రతిభను, భాష మీద పట్టు, సాధికారత ను  ప్రదర్శించేందుకు  సంక్లిష్టమైన, గంభీరమైన పదాలు,  నిఘూఢమైన భావజాలం ఉపయోగిస్తారు. కానీ శ్రీ వేటూరి,  జటిలమైన వన్ని సరళంగా నే మొదలవుతాయనే లోకోక్తి ననుసరించి,   సరళమైన, నిరాడంబరమైన  పద్ధతినే ఎంచుకున్నారు. సరళంగా వ్రాయడం జటిలంగా వ్రాయడం కన్నా రెండు రెట్లు ఎక్కువ కష్టం. సన్నివేశం ఎంత క్లిష్టమైనా ఉదాహరణకు అంటరాని తనం, సంగీత పరమార్ధం, జీవన విధానం,  ఏదైనా కానీ శ్రీ వేటూరి సరళంగా వ్రాసిన గీతాలు పండిత పామరులను ఒకే విధం గా ఆకట్టుకున్నాయి.

ఏ కులము నీదంటే గోకులము నవ్విందీ

మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

 

ఎవరికెవరు ఈ లోకం లో ఎవరికి  ఎరుక

ఏదారెటు పోతుందో ఎవరినీ అడగక

 

అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము

సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణమూ

 

తత్వ శోధనకు సహజంగానే అనువైన సన్నివేశాలే కాక, శ్రీ విశ్వనాద్ కి అతి సున్నితమైన అంశాలను కూడా సాహిత్య పరంగా చిత్రీకరించడంలో అభిరుచి ఎక్కువ. ఇటువంటి సందర్భాలలో శ్రీ వేటూరి తన పద కౌశలం తో సన్నివేశానికి కొత్త  అందం తెచ్చేటట్టు  వ్యక్తీకరించారు.

 

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా

రాతిరేల కంట నిదుర రాదమ్మ

హిమమే కురిసే చందమామ కౌగిట

సుమమే విరిసే వెన్నలమ్మ వాకిట

 

మన్ను తిన్న చిన్న వాడే మిన్ను కన్న వన్నె కాడే

రాసలీల లాడినాడే రాయబారమేగినాడే

 

మధుర లాలసల మధుప లాలనల

పెదవిలోని మధువులు వ్రతము బూని దరికి చేరగా

 

ఏ మంచి  వచన/ పద్య /పాటల  రచయిత ఐనా  నిరంతరం, చాలా ఎక్కువుగా చదువుతూ ఉండాలి. అల్లా చదివినందు వల్ల అతను తన భాషా  కౌశలాన్ని, సందర్భోచితంగా పద ప్రయోగాలు చేయడం లో కుశలత ను, భావాల కనుగుణంగా పదాలను వాడుకునే ప్రక్రియను   అభివృద్ధి చేసుకో గలుగుతాడు. ఏ భాష లో నైనా తన ఆవిర్భావం నుంచి విస్తృతంగా అభివృద్ధి చెందిన దశల దాకా, ఎంతోమంది గొప్ప రచయితలు ఒకే సన్నివేశాన్ని అనేక రకాలుగా వర్ణించారు. ఎవరూ ఎవరినీ అనుకరించలేదు, అనుసరించలేదు. పాత పద్ధతులకి మెరుగులు దిద్దారు. కొంతమంది ప్రతిభా శాలులు కొత్త రీతులు అన్వేషించారు.  పాతదైనా ఆధునికమైన దైనా సాహిత్యం తో పరిచయం పెంచుకుంటే రచయిత లోని కల్పనా శక్తి, సృజన ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో పాటలలో బరువైన,గంభీరమైన , అర్ధవంతమైన మాటలు ఉన్నత భావాలు పలికించడానికి, వాడవలసి ఉంటుంది.  పండితుడైన కవి వీటిని సులభంగా వ్రాయగలడు. శ్రీ వేటూరి ప్రతిభకి తార్కాణం గా చెప్పుకోదగ్గవి,

“దొరకునా ఇటువంటి సేవా”  పాటలో త్యాగరాజ కృతి ఎక్కడ అంతమై వేటూరి గీతం ఎక్కడ మొదలైందో చెప్పడం కష్టం.

“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ” లో ఆది శంకరాచార్య సౌదర్యలహరి స్పష్టంగా గోచరిస్తూనే ఉంటుంది.

అన్నమాచార్య  ‘వేదాంత చింతన’ లోని పోకడులు  “నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన”   పాటలో  కనిపిస్తూనే ఉంటాయి.

 

శ్రీ విశ్వనాద్ చిత్రాలలో ఆణి ముత్యాలుగా పరిగణించ బడేపాటలు, పూర్వ కవులకు సాటిగా, దీటుగా శ్రీ వేటూరి వ్రాయగలగడానికి శ్రీ విశ్వనాద్ సృష్టించిన సన్నివేశాలు ఉత్ప్రేరకాలుగా పనిచేసి ఉంటాయనడం లో సందేహం లేదు. కాల పరీక్షకు నిలిచిన వెనక తరం పాటలతో పాటు వేటూరి వారి పాటలు కూడా ముందు తరాల వారు ఆదరంతో స్మరించుకుంటారు, పాడుకుంటారు.

————————————-

కంచిభొట్ల శ్రీనివాస్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసానికి బులుసు సుబ్రహ్మణ్యం గారి స్వేచ్చానువాదం

కంచిభొట్ల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published.