పాటల పొద్దు వాలిపోయింది

మే 22న అనగా రేపు వేటూరి వర్ధంతి సందర్భంగా చిన్న స్మృత్యంజలి.

 

ఒక శకం ముగిసింది…

కోమల గీతాల కవి కోయిల… ఎద లోయలో శాశ్వతంగా నిదరోయింది.
కూచిపూడి నడకనీ, కూనలమ్మ కులుకునీ శ్రుతి కలిపి…విశ్వనాథ పలుకునీ విరుల తేనె చిలుకునీ కలగలిపి… కిన్నెరసాని చేత వెన్నెల పైట వేయించిన కలం… రాలిపోయిన పువ్వులో మౌనరాగమై… వాలిపోయిన పొద్దులో వివర్ణమై… హంసల దీవిలో కృష్ణమ్మలా అనంతసాగరంలో లీనమైపోయింది.

కవితా సరస్వతి పద రాజీవాన్ని చేరు నిర్వాణసోపానాలను అధిరోహిస్తూ… తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయింది. వేటూరి శకం ముగిసిన మమతలు వేయిగ పెనవేసిన ఆ తీయని గీతాంజలి మల్లెలైపూస్తూనే ఉంటుంది. వెన్నెలై కాస్తూనే ఉంటుంది.

వేల పాటల తేనె వూట… కొత్త పుంతలు తొక్కిన తెలుగు పాట – వేటూరి సుందరరామమూర్తి సినిమా పాట! అంగారాన్నీ, శృంగారాన్నీ అలవోకగా కురిపించగల కలం వేటూరిది. తెలుగు సినీ గీతానికొస్తే సీనియర్‌ సముద్రాల, పింగళి, మల్లాది నుంచి ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, సినారెల వరకూ ఒక్కొక్కరిదీ ఒక్కొక్కొ ప్రత్యేక బాణీ అయితే ఆ మహామహుల బాణీల బాణాలను తన తూణీరంలో ఇముడ్చుకున్న పాట యోధుడు మన సుందరరాముడు. తలచూసే ముగ్గు బుట్ట తలపు మాత్రం భావాల పుట్ట. పద్నాలుగు సార్లు నంది పురస్కారాలు అందుకొని తెలుగు పాటకు నందీశ్వరుడయ్యారు.

వేటూరి కలంలోని పాటల పరవళ్లకు దూకుతున్న జలపాతం జంకుతుంది. వెండి తెర ఆకాశాన్ని ఆ కలం తన సిరాతో నీలంగా అలికి, భావాల వానవిల్లును పరిచింది. ఆ కలం రాయని పాట లేదు. ఆ కలాన్ని పాడని గళం లేదు. తెలుగు సినిమా పాటను చంకనెత్తుకుని చందమామను, చక్కిలిగింతల చెక్కిలి భామను, చండ్ర నిప్పుల ఉద్యమాలను, సంకీర్తనల సంగతులనూ పరిచయం చేసి తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించింది.

నిజానికి వేటూరి సుందరరామమూర్తి తెలుగు చిత్రసీమలోకి సినిమా పాట పరిస్థితి విచిత్రంగా ఉంది. సినిమా పాటా అంటూ జాలిపడే పరిస్థితి. ఆయన తొలి పాటకు కలం విదిలుస్తూనే కావ్యగౌరవం కల్పించే యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘భారతనారీ చరితము…’ అనే ‘ఓ సీత కథ’లోని ఆయన తొలి పాట నిజంగా పాటేనా?.. పాటంటే పాట కాదు… అది హరి కథ. కానీ ఆ రచనకు సినిమా పరిశ్రమ వాహ్‌! అని పులకించింది. నాటి నుంచి ఎన్టీ రామారావు, కె.విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు లాంటి సినీ ప్రముఖులు ఇచ్చిన ప్రోత్సాహంతో వడివడిగా అడుగులు వేశారు. ‘ఓ సీత కథ’ తరవాత సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతామాలక్ష్మి, అడవి రాముడు, యమగోల లాంటి చిత్రాలతో యావత్‌ తెలుగు చిత్రసీమనీ తన వైపు తిప్పుకొన్నారు.

ఆ కలానికి ఎన్ని పాళీలో…

వేటూరి పాటల తీరుని పరిశీలించినవాళ్లు ఆయన కలానికి ఎన్ని పాళీలో అనుకోవల్సిందే! శంకరా నాద శరీరా…, ‘శివ శివ శంకర’, ‘ఝుమ్మంది నాదం’, ‘ఏ కులమూ నీదంటే…’ లాంటి సాహితీ విలువలతో అలరారే గీతాలూ ఆ కలం నుంచి వచ్చినవే. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’, ‘ఆకుచాటు పిందె తడిసె…’ లాంటి అల్లరి, శృంగార గీతాలూ ఆ కలమే రాసింది. వేటూరి పాటను ఎంతగా పొగిడినవాళ్లు ఉన్నారో… విమర్శలు గుప్పించినవాళ్లూ ఉన్నారు. బూతు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఓ సినిమాలో ఆయన రాసిన పాటలో ఒక చోట ‘జాకెట్లో జాబిల్లి…’ అని ఉంటుంది. దీనిపై వేటూరి ఘాటుగా వివరణ ఇచ్చారు ”నేను రాసింది ‘చీకట్లో జాబిల్లి…’ ఓ కొంటె సహాయ దర్శకుడు చీకట్లోని జాకెట్లో అని మార్చాడు. వేటూరి బూతే రాయాలి అనుకొంటే జాకెట్లో రెండు… అని రాయగలడు”.
ఏ తరానికైనా…

విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావుల తరవాత ఎక్కువగా ఆయన జంధ్యాల లాంటి దర్శకులతో కలిసిపోయారు. ఆయన కేవలం కొందరితోనే అని కాకుండా అన్ని వయసులవాళ్లతోనూ, అందరు నిర్మాతలతోనూ కలుపుగోలుగా ఉండేవారు. వేటూరికి సహాయకుడిగా కీరవాణి కొన్నాళ్లు సహాయకుడిగా ఉన్నారు. ఇటీవల రెండు వందల చిత్రాలు పూర్తయిన సమయంలో నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు కీరవాణి ”రెండు వందల సినిమాలు పూర్తయ్యాయి అనే మాట గుర్తుకొస్తే వేటూరిగారిచ్చిన రెండు వందల రూపాయలు గుర్తుకొస్తున్నాయి. నేను ఆయన దగ్గర ఉన్న సమయంలో ఖర్చులకు అప్పుడప్పుడూ రెండు వందలు ఇస్తుండేవారు” అన్నారు. స్వరకర్త కల్యాణి మాలిక్‌ మాటల్లోనే చెప్పాలంటే ”వేటూరిగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు”. అందుకే నవతరం దర్శకులకీ ఆయన ప్రీతిపాత్రమైన గేయ రచయిత. ప్రముఖ దర్శకులు మణిరత్నం తన ప్రతి చిత్రానికీ వేటూరితోనే పాటలు రాయించుకొనేవారు. గుణశేఖర్‌, శేఖర్‌ కమ్ముల తదితర దర్శకులు ఆయన గురువుతో సమానం.

 

వేగం ఆయనకే సొంతం

గీత రచయితలు పాట కోసం రోజుల తరబడి సమయం తీసుకొంటారనే అపప్రథ ఉంది. ముఖ్యంగా ఆత్రేయ లాంటివాళ్లని ఉదాహరణలుగా చెబుతారు. వేటూరి అందుకు భిన్నంగా వేగంగా పాటను రాసి ఇవ్వడం ఆయనకే చెల్లు. శంకరాభరణంలోని పాటల్ని ఎవరూ మరచిపోలేరు. అందులో పాటలు తక్కువ సమయంలోనే రాసి ఇచ్చారు.

పాట ఎలా ఉండాలి?
పాట ఎలా ఉండాలనే విషయంలో వేటూరి ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చేవారు. ”పాటంటే మాటలు కాదు. నేను విశృంఖల పద ప్రయోగం చేసినా అది పాటకు తగిన విషయం లేనప్పుడు, శబ్దాశ్రయం, వస్తువాశ్రయం లేనప్పుడు, భావ ప్రగల్భానికి అవకాశం లేనప్పుడు మాత్రమే పదాలతో ఆడుకున్నాను. ఒక శూన్యాన్ని దాటవలసి వచ్చినప్పుడు శబ్ద సేతువుల్ని నిర్మించుకున్నాను. అదే విధంగా చాలా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు శబ్దాలయాలు కట్టి అందులో ప్రతిమలుగా ఆ సన్నివేశ శిల్పాల్ని ప్రతిష్టించాను. ప్రతి పదానికీ సన్నివేశాన్ని మోసే శక్తి ఉండాలి. ప్రతి అక్షరాన్నీ తన గవాక్షంలోంచి అనంత విశ్వాన్ని దర్శించగలిగే బీజ శక్తి ఉండాలి” అన్నారు.

—————————————–

మన మధ్య వేటూరి లేని ఈ రోజు తెలుగు పాట ఎక్కడ అని అడక్కండి.ఎక్కడో ఒకచోట పదం,మాట చొరబడలేని చోట ఒక్కర్తే కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది.ఈ కష్టమంతా కరిగిపోయేదాకా ఈ చేదు జ్ఞాపకం చెరిగిపోయేదాకా ఏడవనివ్వండి.ఎన్ని కన్నీళ్ళు ఖర్చు చేస్తే వేటూరి లేరనే బాధ తీరుతుంది?తన పదాలతో పెంచి,పరుగులెట్టించి పరవళ్ళు తొక్కించిన తన తోటమాలి ఇక్కడ లేడని రాడని తెలిసీ పాట మాత్రం ఎలా తట్టుకుంటుంది.ఇక తెలుగు పాటకు కొత్త రాగాలు లేవు,వర్ణాలు రావు,అందుకే భోరున ఏడవనివ్వండి.ఓ గోదారి పుట్టేలా,కృష్ణమ్మకు కన్నుకుట్టేలా…

——————————————

నారాయణ రావుగారికీ, ఈనాడు వారికీ కృతజ్ఞతలతో వేటూరి.ఇన్

C.N.Rao గారి అసలు పోస్ట్ ఈ కింద లింక్ లో చూడవచ్చు.

http://wowmusings.blogspot.in/2010/06/blog-post_04.html

 

You May Also Like

3 thoughts on “పాటల పొద్దు వాలిపోయింది

 1. ఈ రోజుని తలుచుకోగానే దుఖం పొంగి పొర్లుతూ ఉంటుంది. అశ్రు ధారలో..కూడా వారి పాట పరిమళిస్తూ ఉంటుంది. వారి పాటని అభిమానించడమే..వారి పాటని పరిచయం చేస్తూ..భావ పరిమళాలను అందరికి పంచడమే మన అందరి ముందు ఉన్న కర్తవ్యం.మళ్ళీ వేటూరి జన్మిస్తే తప్ప అలాటి సాహిత్యం రాదు.
  ఓ..కవి కుల తిలకా ! నీకు నీరాజనాలు తప్ప ఏమివ్వగలం!?
  నీ పాటలో పరవశిస్తూ సాగడం తప్ప ఏమి కాగలం..?
  వేటూరి ఇన్ నిర్వహిస్తూ.. నిత్యం వారిని ప్రాతఃస్మరణీయం గా ఉంచుతున్న.. పప్పు శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.

 2. Aksharalanu adiganu Veturi garini emani varninchamantaru ani,
  “mamalani anadhalu chesi vellipoyadu ayana pai memu aligamu” ani annai

 3. తెలుగు మాట , పాట ఉన్నంత వరకూ వేటూరి తెలుగు వారి గుండెల్లో జీవిస్తూనే ఉంటారు ..

  ఈ వెబ్సైటు ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు .. అభినందనలు

Leave a Reply

Your email address will not be published.